ముంబై: మహారాష్ట్రలో శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు ప్రభుత్వ ఏర్పాటు కోసం కనీస ఉమ్మడి ప్రణాళికపై దృష్టి పెట్టాయి. అదేక్రమంలో పదవుల పంపకాలపైనా జోరుగా చర్చలు జరుపుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు విషయమై ఎన్సీపీ-కాంగ్రెస్‌తో అధికారికంగా చర్చలు ప్రారంభమయ్యాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మీడియాతో తెలిపారు. ఆయన బుధవారం ముంబైలోని ట్రైడెంట్ హోటల్‌లో కాంగ్రెస్-ఎన్సీపీ కోఆర్డినేషన్ కమిటీ నేతలతో సమావేశమై.. చర్చించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి కీలకాంశాలపై ఈ భేటీలో చర్చ జరిగినట్టు తెలుస్తోంది. పదవుల పంపకాలపై భేదాభిప్రాయాలు, సంకీర్ణ ప్రభుత్వపు ఉమ్మడి విధానంపై మంతనాలు జరిపినట్టు సమాచారం. ఈ భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఉద్ధవ్ ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్సీపీ, కాంగ్రెస్‌తో చర్చలు అధికారికంగా ప్రారంభమయ్యాయని ఆయన వెల్లడించారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి త్వరలోనే ఓ నిర్ణయాన్ని వెలువరిస్తామని ఆయన తెలిపారు. మహారాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటు కోసం కొంత సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
సీఎం పదవిపై తర్జనభర్జన
ముఖ్యమంత్రి పదవి కోసమే శివసేన బీజేపీతో కొట్లాడి.. కాషాయ కూటమి నుంచి వైదొలిగింది. ఇప్పుడు అనూహ్యంగా తనకు బద్ధశత్రువలైన కాంగ్రెస్-ఎన్సీపీలతో శివసేన చేతులు కలుపుతోంది. ముఖ్యమంత్రి పదవి విషయంలో ఎన్సీపీ కూడా పట్టుదలతో ఉన్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరి రెండున్నరేళ్లు పంచాలని ఎన్సీపీ డిమాండ్ చేస్తోందని, ఈ డిమాండ్‌పైనే చర్చల్లో పీటముడి ఏర్పడే అవకాశముందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. మరోవైపు శివసేన మాత్రం సీఎం పదవి తమదేనని ధీమా వ్యక్తం చేస్తోంది. సేన సీనియర్ నేత సంజయ్ రౌత్ కూడా సీఎం పదవి తమ పార్టీ నేతే చేపడతారని ధీమా వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సీఎం పదవి పంపకానికి శివసేన సిద్ధపడుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.
చదవండి: సీఎం పదవి మాదే: సంజయ్ రౌత్
Comments
Please login to add a commentAdd a comment