
కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశామన్నారు అమిత్ షా.
సాంగ్లీ/షోలాపూర్: జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేయడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శరద్ పవార్ తమవైఖరిని స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, హోం మంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు. ప్రధాని మోదీ ఆర్టికల్ 370 రద్దు చేసి దేశాన్ని ఒక్కతాటి కిందకు తెచ్చారని గురువారం మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో కొనియాడారు. కశ్మీర్‌లో ఒక్క బుల్లెట్ కూడా పేల్చకుండా కశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేశామన్నారు. ఆర్టికల్ 370 రద్దుపై రాహుల్, పవార్ అసత్య ప్రచారం చేస్తూ ఓటు బ్యాంకు రాజకీయాలు పాల్పడుతున్నారని విమర్శించారు.
‘ఇండియాలో కశ్మీర్ అంతర్భాగం కావాలని దేశమంతా కోరుకుంటుంటే మీరు ఎందుకు వ్యతిరేకిస్తున్నారని అడుతున్నాను. ఎందుకంటే ఓట్ల కోసం మీరు రాజకీయాలు చేస్తున్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా?’ అని అమిత్ షా ప్రశ్నించారు. తమకు పార్టీ ప్రయోజనాల కంటే దేశమే ముఖ్యమని అన్నారు. 1971 యుద్ధంలో పాకిస్తాన్‌పై మనదేశం విజయం సాధించినప్పుడు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీని ముందుగా అటల్‌బిహారి వాజపేయి అభినందించారని గుర్తు చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ దేశం కోసం అధికార పక్షాన్ని అభినందించామన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్, ఎన్సీపీలు.. ఆర్టికల్ 370 రద్దు, సర్జికల్ స్ట్రైక్స్, బాలకోట్ వైమానిక దాడులను గుడ్డిగా వ్యతిరేకిస్తున్నాయని మండిపడ్డారు. (చదవండి: 2024 నాటికి వారిని దేశం నుంచి పంపిస్తాం)