
న్యూఢిల్లీ: అనూహ్య పరిణామాల మధ్య మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ రాజీనామా చేయడంతో సుప్రీంకోర్టు తీర్పు అమలయ్యే పరిస్థితి లేదు కానీ ప్రజాస్వామ్య విలువలపైనా, సుపరిపాలన పొందాలన్న పౌరహక్కుల పైనా అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలే చేసింది. అసెంబ్లీలో బలనిరూపణకు ఫడ్నవీస్ సర్కార్‌కు ఒక్కరోజు గడువు మాత్రమే ఇచ్చింది. విశ్వాస పరీక్ష ఆలస్యం చేస్తే ఎమ్మెల్యేల బేరసారాలకు అవకాశం ఉంటుందని కోర్టు పేర్కొంది.
బలపరీక్షలో పారదర్శకత కోసం రహస్య బ్యాలెట్ కాకుండా మొత్తం లైవ్ టెలికాస్ట్ చేయాలని జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నెల రోజులైపోయినా ఇంకా ప్రభుత్వంపై స్పష్టత లేనందున ప్రజాస్వామ్య విలువల్ని కాపాడాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని తెలిపింది.