సాక్షి, న్యూఢిల్లీ: ఎన్నికలకు ముందు మిత్రపక్షంగా ఉండి కలిసి పోటీ చేసిన శివసేన.. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత చివరి నిమిషంలో ప్లేట్ ఫిరాయించిందని బీజేపీ ఆరోపించింది. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపిస్తూ.. శివసేన తీరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. శివసేన తీరుతో మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని, అనంతర పరిణామాల్లో ఒక పవార్ బీజేపీతో ఉండగా.. మరొక పవార్ శివసేనతో ఉన్నారని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న శివసేన కూటమే పార్టీ ఫిరాయింపుల్ని ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. ఎమ్మెల్యేల మద్దతు లేఖలపై గవర్నర్‌ను అనుమానించాల్సిన అవసరం లేదని, దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్ కలిసి సమావేశమైన తర్వాతే గవర్నర్‌కు లేఖ ఇచ్చారని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరించారని చెప్పారు.
చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా సుప్రీంకోర్టు జోక్యం చేసుకొని.. ఫడ్నవిస్‌కు 170 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందా? అంటూ ప్రశ్నించింది. దీనికి రోహత్గి స్పందిస్తూ.. అసెంబ్లీలో బలపరీక్షకు బీజేపీ సిద్ధంగా ఉందని తెలిపారు. ఫడ్నవిస్ ప్రభుత్వానికి పూర్తి మెజారిటీ ఉందని తెలిపారు. ఈ విషయంలో గవర్నర్ విచణతోనే నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. ఈ సందర్భంగా కర్ణాటకలో యెడియూరప్ప సర్కారు ఏర్పాటు వ్యవహారం ప్రస్తావనకు వచ్చింది. ఎప్పటిలోగా అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలో సుప్రీంకోర్టు చెప్పజాలదని రోహత్గి వాదించారు.
చదవండి: వెంటనే బలపరీక్ష జరగాలి?
ఎన్సీపీ రెబల్ నేత అజిత్ పవార్ తరఫు లాయర్ మణిందర్ సింగ్ వాదనలు వినిపిస్తూ.. తమదే అసలైన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అని చెప్పుకొచ్చారు. ఎన్సీఎల్పీ నాయకుడిగా తమ పార్టీకి చెందిన 54మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను గవర్నర్‌కు ఇచ్చానని తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే బీజేపీకి మద్దతిస్తూ గవర్నర్‌కు లేఖ ఇచ్చానని సుప్రీంకోర్టుకు తెలిపారు. తమ పార్టీలో అంతర్గత భేదాభిప్రాయాలు ఉన్నాయని, వాటిని పార్టీలోనే పరిష్కరించుకుంటామని, వెంటనే ఈ పిటిషన్‌పై విచారణ నిలిపివేయాలని అజిత్ లాయర్ న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment