
ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే (29) ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇటీవల ప్రధానంగా ఆకర్షించిన పత్రికా శీర్షికల్లో ఒకటి. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండడం వల్ల కూడా ఆయన ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షకుడిగా నిలబడ్డారు. ఠాక్రే ఇంటి పేరు కారణంగా ఆయనకు పరిచయం అక్కర్లేదు.
బాల్ ఠాక్రే 53 ఏళ్ల క్రితం శివసేనను ముంబైలో ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అది కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో మంచి పట్టును సాధించింది. థాకరే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో దింపడం ద్వారా రాజకీయ చక్రం తిప్పగలిగారు. బీజేపీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేన బాగా దెబ్బతిన్నది. తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో, శివసేన పార్టీలో ఎక్కువ మంది నాయకులు 65 ఏళ్లకు పైబడిన వారవడంతో, యువకులను ఆకర్షించడం కోసం 29 ఏళ్లకే ఆదిత్య ఠాక్రేను రంగంలోకి దింపింది.
ఇక ఆదిత్య ఠాక్రే విజయం తథ్యమని తెలుస్తోంది. ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు మినహా అనేక సార్లు వర్లి నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్‌సీపీ తమ అభ్యర్థిగా బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు సురేశ్ మానేను నిలబెట్టారు. స్థానిక నియోజక వర్గంలో ఆయన పేరు ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సచిన్ అహిర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనపై శివసేన అభ్యర్థి సునీల్ షిండే పోటీ చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరిన సచిన్ అహిర్, ఠాక్రేకు మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే విజయం ఖాయమని తెలుస్తోంది. (చదవండి: ఆదిత్యకు కలిసొచ్చేవి ఇవే...)