తల్లిదండ్రుల సమక్షంలో నామినేషన్ పత్రాలను అందజేస్తున్న ఆదిత్య ఠాక్రే
చంద్రయాన్ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ మా సూర్యయాన్ (ఆదిత్య అంటే సూర్యుడు) కచ్చితంగా మంత్రాలయ ఆరో అంతస్తులో (మహారాష్ట్ర సీఎం కార్యాలయం) స్మూత్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఇప్పడు శివసేనలో ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట ఇది.
శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు కంచుకోటైన దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో ఆయననే భవిష్య సీఎంగా కీర్తిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కనుసన్నలతోనే ప్రభుత్వాలను శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆదిత్యను బరిలోకి దింపుతోంది.
► సేన ట్రంప్ కార్డు
ఉద్ధవ్ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ ఎల్‌ఎల్‌బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత. ఆదిత్య రాసిన కవిత్వం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో . ఉమ్మీద్ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని సమకూర్చడానికి వ్యూహాలు రచించారు.
నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాల ని ప్రతిపాదనలు చేశారు. అవి సాకారం కానప్పటికీ మార్పు కోసం అంటూ నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వొర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
► శివసేనకు పూర్వవైభవం వస్తుందా?
కొన్నేళ్ల క్రితం వరకు బీజేపీ, శివసేన కూటమిలో సేనదే పై చేయిగా ఉండేది. బాల్ ఠాక్రే జీవించినంత కాలం ఒక పెద్దన్న పాత్రనే పోషించారు. ఎన్నోసార్లు ఆయన బీజేపీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. కమలదళాన్ని కమ్లి అని స్త్రీలింగాన్ని గుర్తుకు తెచ్చే పేరుతో పిలుస్తూ ‘ఆమెను బయటకు పొమ్మని తలుపు చూపించినా కిటికీలోంచే నా వైపే చూస్తూ ఉంటుంది’అని వ్యాఖ్యానించేవారు. కానీ బీజేపీ లో మోదీ, అమిత్ షా హవా పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను కూడా మోదీ, షా ద్వయం తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అం దుకే కూటమిలో పై చేయి సాధించడమే కాదు, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న ఈ యువసేనాని అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమేమీ కాదు కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదిత్య ఉదయం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి.
ఆదిత్య ఠాక్రే ఆస్తులు 16 కోట్లు
వర్లి నుంచి నామినేషన్ దాఖలు
ముంబై: ఠాక్రే వంశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అ«ధినేత కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబైలోని వర్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తండ్రి ఉద్ధవ్ ఠాక్రే, తల్లి రష్మి తన వెంట రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు తాత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు.
ఆదిత్య ఠాక్రే దాఖలు చేసిన అఫడివిట్ ప్రకారం ఆయనకున్న ఆస్తుల విలువ రూ. 16.5 కోట్లు. అందులో చరాస్తులు రూ.11.38 కోట్లని, స్థిరాస్తులు రూ. 4.67 కోట్లుగా చూపించారు. అందులో రూ.10.36కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉంటే, ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దీని ధరని రూ. 6.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక ఆదిత్యకు రూ. 64.65 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. 29 ఏళ్ల వయసున్న ఆదిత్య బీఏ ఎల్‌ఎల్‌బీ చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు.
Comments
Please login to add a commentAdd a comment