Worli
-
వెన్నుపోటుదారులకు బుద్ధి చెప్పండి
ముంబై: దివంగత శివసేన అధినేత బాల్ ఠాక్రేకు ఏక్నాథ్ శిందే, ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు అజిత్ పవార్, కాంగ్రెస్ నేత రాహుల్ గాందీకి మిలింద్ దేవ్రా వెన్నుపోటు పొడిచారని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఈ ముగ్గురు మోసగాళ్లకు మహారాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అక్కడి తెలుగు ప్రజలు తమ ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్పీ)ల మహావికాస్ ఆఘాడీ (ఎంవీఏ)కూటమిని గెలిపించాలని కోరారు. రేవంత్ బుధవారం సాయంత్రం ముంబైలో తెలుగు ప్రజలు నివసించే వర్లీ, ధారావి, సైన్ కోలివాడల్లో ఎంవీఏ అభ్యర్థులకు మద్దతుగా బహిరంగ సభలు, రోడ్‌షోల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అధికార మహాయుతి కూటమిపై విమర్శలు గుప్పించారు. ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు ఆదిత్య ఠాక్రేను వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి, నిజామాబాద్ కోడలైన వర్షా గైక్వాడ్‌ను ధారావి నుంచి భారీ మెజారీ్టతో గెలిపించాలని కోరారు. ఇక్కడి తెలుగు ప్రజల సమస్యలన్నింటినీ ఎంవీఏ ప్రభుత్వం పరిష్కరించేలా తాను హామీగా ఉంటానని తెలిపారు. కాగా వర్లీ బీడీడీ చాల్స్‌లో నివసించే స్థానిక తెలంగాణ ప్రజలు రేవంత్‌రెడ్డి రోడ్డు షోకు బ్రహ్మరథం పట్టారు. దీంతో రేవంత్‌రెడ్డి కూడా తాను ముంబైలో కాకుండా నిజామాబాద్, కరీంనగర్లో ఉన్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. రోడ్డు షోకు ముందు రేవంత్‌రెడ్డి వర్లీ బీడీడీ చాల్స్‌లోని శ్రీ వేంకటేశ్వర (బాలాజీ) స్వామి ఆలయాన్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు తెలంగాణ ప్రజలు వారి సమస్యలు తెలుపుతూ వినతిపత్రాలు సమరి్పంచారు. -
సేన vs సేన.. ఆదిత్య ఠాక్రేపై మిలింద్ దేవ్రా పోటీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. గెలుపుపై అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలతో ఎన్నికల వేడిని పెంచాయి. ముంబైలోని వర్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.తాజాగా ఆదిత్య ఠాక్రేకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మిలింద్ దేవ్రాను బరిలో దించాలని సీఎం ఏక్నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్ దేవ్రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన సందీప్ దేశ్‌పాండేతో కూడా వర్లీ నుంచి తలపడనున్నారు.కాగా ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది. -
దేశంలోనే ఖరీదైన పెంట్ హౌస్
ముంబై: దేశంలోనే అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను వెల్స్పన్ గ్రూప్ చైర్మన్ బీకే గోయెంకా ఇటీవలే కొనుగోలు చేశారు. ముంబైలోని వర్లీ ప్రాంతం అన్నీబీసెంట్ రోడ్డులో ఉన్న లగ్జరీ టవర్లలో త్రీసిక్స్టీ వెస్ట్ ఒకటి. ఇందులోని పెంట్‌హౌస్ ఖరీదు రూ.240 కోట్లు. టవర్ 63, 64, 65 ఫోర్లలోని 30 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ పెంట్ హౌస్ కొనుగోలుకు సంబంధించిన వ్యవహారాలను గత బుధవారం బీకే గోయెంకా పూర్తి చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం తెలిపింది. దేశంలో ఇప్పటి వరకు ఇదే అత్యంత ఖరీదైన అపార్ట్‌మెంటని పేర్కొంది. దీనిని ఆనుకునే ఉన్న మరో పెంట్‌హౌస్‌ను కూడా నిర్మాణ సంస్థ యజమాని వికాస్ ఒబెరాయ్ రూ.240 కోట్లు పెట్టి కొన్నట్లు ఆ కథనంలో వివరించింది. -
కలలో రాజకుమారి
తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్ వాక్‌ను చూసి తానొక మోడల్ని, డాన్సర్‌ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం. మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్‌డే పార్టీల్లో ‘జోకర్’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్లో ఎవరో యూ ట్యూబ్‌లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్‌వాక్ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్ కూడా అవ్వాలని. ఆ కలకు తోడు హాలీవుడ్ నటుడు రాబర్ట్ హాఫ్‌మేన్ ఒక మ్యూజిక్ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్‌తో అతణ్ణి కలిసింది. హాఫ్‌మేన్ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్మేన్కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్స్టాగ్రామ్ పేజీ ఓపెన్ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్గా మారారు. డాక్యుమెంటరీ డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్ జస్గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్ పిల్లల మీద ‘లివ్ యువర్ ఫెయిరీటేల్’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్ 16) మలీషా అఫీషియల్ యూట్యూబ్ చానెల్లో విడుదల చేశారు. మలీషా గ్లామర్ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్‌ది బెస్ట్ మలీషా. కవర్ గర్ల్ అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్ మేగజీన్’ మలీషాను అక్టోబర్ 2020న కవర్ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్ ఫ్రమ్ ది స్లమ్’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్ మేగజీన్ కోసం ఆ ఫొటోషూట్ నిర్వహించిన జంట షేన్–ఫాల్గుణి పీకాక్‌లు మలీషాతో ఫొటోషూట్ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్‌లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు. – సాక్షి ఫ్యామిలీ -
పెద్దాయన మనవడికి తిరుగులేదా?
సాక్షి, న్యూఢిల్లీ : శివసేన వ్యవస్థాపక నాయకుడు బాల్ ఠాక్రే మనవడు ఆదిత్య ఠాక్రే (29) ముంబైలోని వర్లీ అసెంబ్లీ నియోజక వర్గం నుంచి పోటీ చేయడం ఇటీవల ప్రధానంగా ఆకర్షించిన పత్రికా శీర్షికల్లో ఒకటి. ఠాక్రే కుటుంబం నుంచి నేరుగా ఎన్నికల్లో పోటీ చేస్తున్న మొదటి వ్యక్తి కావడమే కాకుండా పిన్న వయస్సులో పోటీ చేస్తుండడం వల్ల కూడా ఆయన ఈ ఎన్నికల్లో ప్రధాన ఆకర్షకుడిగా నిలబడ్డారు. ఠాక్రే ఇంటి పేరు కారణంగా ఆయనకు పరిచయం అక్కర్లేదు. బాల్ ఠాక్రే 53 ఏళ్ల క్రితం శివసేనను ముంబైలో ఏర్పాటు చేసిన అనతికాలంలోనే అది కొంకణ్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు విస్తరించి ప్రజల్లో మంచి పట్టును సాధించింది. థాకరే ఎన్నికల్లో స్వయంగా పోటీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీ తరఫున అభ్యర్థులను ఎన్నికల్లో దింపడం ద్వారా రాజకీయ చక్రం తిప్పగలిగారు. బీజేపీతో 25 ఏళ్ల అనుబంధాన్ని తెంపేసుకొని 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం ద్వారా శివసేన బాగా దెబ్బతిన్నది. తిరిగి రాజకీయంగా మంచి పట్టు సాధించాలనే లక్ష్యంతో, శివసేన పార్టీలో ఎక్కువ మంది నాయకులు 65 ఏళ్లకు పైబడిన వారవడంతో, యువకులను ఆకర్షించడం కోసం 29 ఏళ్లకే ఆదిత్య ఠాక్రేను రంగంలోకి దింపింది. ఇక ఆదిత్య ఠాక్రే విజయం తథ్యమని తెలుస్తోంది. ఠాక్రే కుటుంబం పట్ల ఉన్న గౌరవమే కాకుండా ఆయన సరైన ప్రత్యర్థి లేకపోవడం వల్ల ఆయన విజయం సునాయాసమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఒకటి, రెండు సార్లు మినహా అనేక సార్లు వర్లి నియోజక వర్గం నుంచి శివసేన అభ్యర్థులే విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పోటీ చేస్తున్న ప్రధాన ప్రతిపక్షమైన ఎన్సీపీ తమ అభ్యర్థిగా బహుజన రిపబ్లిక్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు సురేశ్ మానేను నిలబెట్టారు. స్థానిక నియోజక వర్గంలో ఆయన పేరు ప్రజలకు పెద్దగా పరిచయం కూడా లేదు. 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థిగా పోటీ చేసిన సచిన్ అహిర్ ఇక్కడి నుంచి విజయం సాధించారు. ఆ తర్వాత 2014 ఎన్నికల్లో ఆయనపై శివసేన అభ్యర్థి సునీల్ షిండే పోటీ చేశారు. ఆ తర్వాత శివసేనలో చేరిన సచిన్ అహిర్, ఠాక్రేకు మద్దతుగా ఎన్నికల బరి నుంచి తప్పుకున్నారు. ఈ నేపథ్యంలో ఠాక్రే విజయం ఖాయమని తెలుస్తోంది. (చదవండి: ఆదిత్యకు కలిసొచ్చేవి ఇవే...) -
వర్లిలో కుమార సంభవమే!
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ దక్షిణ ముంబైలో అందరి దృష్టి వర్లి నియోజకవర్గంపై పడింది. ఠాక్రే వంశం నుంచి తొలిసారిగా ప్రత్యక్షంగా ఎన్నికల బరిలో యువ సేనాని ఆదిత్య ఠాక్రే దిగడంతో ఈ సీటుపై చర్చ సాగుతోంది. ఆయన గెలుపుపై కాకుండా మెజార్టీ ఎంత వస్తుందన్న దానిపై చర్చ సాగుతోంది. వర్లి ఎప్పట్నుంచో శివసేనకు కంచుకోట. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేకు ఈ నియోజకవర్గంపై మంచి పట్టు ఉంది. బీజేపీ–సేన కూటమి గెలిస్తే ఆదిత్య ఉప ముఖ్యమంత్రి అవుతారన్న ప్రచారం కొనసాగుతోంది. ఇక ఆదిత్యపై పోటీకి దిగిన ఎన్సీపీ అభ్యర్థి సురేశ్ మానె దళిత నాయకుడు. ఆయన స్థానిక నేత. పక్కా లోకల్ అన్న ప్రచారంతోనే ఆదిత్యకు పోటీ ఇవ్వడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వర్లి ఒక మినీ మహారాష్ట్ర ఈ నియోజకవర్గం మినీ మహారాష్ట్రను తలపిస్తుంది. ఒకప్పుడు వస్త్ర పరిశ్రమకు పెట్టింది పేరైన వర్లి గత కొద్ది ఏళ్లలో రూపురేఖలు మారాయి. ఆకాశహర్మ్యాలు, అధునాతన వాణిజ్య భవనాలు వచ్చాయి. వాటి పక్కనే మురికివాడల్లో ప్రజలూ ఉన్నారు. చాల్స్ (ఇరుకు గదులుండే నాలుగైదు అంతస్తుల భవంతులు)లో ఉద్యోగులు ఉన్నారు. భిన్న కులాలు, మతాలు, విభిన్న భాషలు ఇలా ఈ ఒక్క నియోజకవర్గం మహారాష్ట్రకు నమూనాలా ఉంటుంది. మరాఠీ, గుజరాతీ, పంజాబీ, తెలుగు వారితోపాటు ఉర్దూ మాట్లాడే ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఇలా భిన్న తరహా ఓటర్లను ఆకర్షించడం సులభమేమీ కాదు. దానికి తగ్గట్టుగానే ఆదిత్య ప్రచారంలో ముందున్నారు. ‘సలాం వర్లి’ అంటూ వివిధ ప్రాంతీయ భాషల్లో భారీ కటౌట్లు ఉంచి మరాఠీయేతరుల్ని ఆకట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరే కాలనీలో వందల భారీ వృక్షాల నరికివేత, ముంబై నైట్ లైఫ్ అంశాలను పదే పదే ప్రస్తావిస్తున్నారు. మరోవైపు, ఆద్యితకు బాలీవుడ్ హీరో సంజయ్‌దత్ మద్దతుపలికారు. ఆదిత్యకు కలిసొచ్చేవి ► బాల్ ఠాక్రే వారసత్వం ► సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ యువ ఓటర్లను ఆకట్టుకునే వ్యూహం ► ముంబై లైఫ్ వంటి అంశాల ప్రస్తావన ► అభివృద్ధి మంత్రం సురేశ్ మానెకు అనుకూలమివీ.. ► దళిత కార్డు ► లోకల్ ఇమేజ్ ► ఇంటింటికీ తిరగుతూ ప్రజలతో అనుసంధానం ► వివిధ భాషల వారిని ఆకట్టుకునే ప్రయత్నాలు గతంలో ఫలితాలు ఇలా.. ► 1990 నుంచి ఎన్నికల ఫలితాలను చూస్తే సేన ఒక్కసారి మాత్రమే ఓటమి పాలైంది. ► 1990 నుంచి 2004 ఎన్నికల వరకు శివసేన నుంచి దత్తాజీ తనవాందే ఈ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు. ► 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి సచిన్ ఆహిర్ గెలుపొందారు. రాజ్ ఠాక్రేకు చెందిన ఎంఎన్ఎస్ ఓట్లు భారీగా చీల్చడంతో ఎన్సీపీ అభ్యర్థికి లాభం చేకూరింది. ► 2014లో శివసేన అభ్యర్థి సునీల్ షిండే గెలుపొందారు. -
శివసేనకు పూర్వవైభవం వస్తుందా?
చంద్రయాన్ విజయవంతం కాలేకపోవచ్చు. కానీ మా సూర్యయాన్ (ఆదిత్య అంటే సూర్యుడు) కచ్చితంగా మంత్రాలయ ఆరో అంతస్తులో (మహారాష్ట్ర సీఎం కార్యాలయం) స్మూత్‌గా ల్యాండింగ్ అవుతుంది. ఇప్పడు శివసేనలో ముక్తకంఠంగా వినిపిస్తున్న మాట ఇది. శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే మనవడు 29 ఏళ్ల వయసున్న ఆదిత్య ఠాక్రే ఈ సారి శివసేనకు కంచుకోటైన దక్షిణ ముంబైలోని వర్లి నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో దిగడంతో ఆయననే భవిష్య సీఎంగా కీర్తిస్తూ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటివరకు ఠాక్రే కుటుంబంలో ఎవరూ ఎన్నికల్లో పోటీ చేయకపోయినా అధికారాన్ని గుప్పిట్లో పెట్టుకున్నారు. తమ కనుసన్నలతోనే ప్రభుత్వాలను శాసించారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి సత్తా చాటలేకపోయిన శివసేన ఈ సారి అధికారాన్ని చేజిక్కించుకోవడానికే ఆదిత్యను బరిలోకి దింపుతోంది. ► సేన ట్రంప్ కార్డు ఉద్ధవ్ ఠాక్రే, రష్మి ఠాక్రే దంపతులకు ఆదిత్య 1990లో జన్మించారు. ముంబైలో బీఏ ఎల్ఎల్బీ చేశారు. స్వతహాగా కవి, రచయిత. ఆదిత్య రాసిన కవిత్వం మై థాట్స్ ఇన్ వైట్ అండ్ బ్లాక్ పేరుతో పుస్తకంగా వచ్చింది. తాను రాసిన ప్రైవేటు గీతాలతో . ఉమ్మీద్ అనే ఆల్బమ్‌ని తీసుకువచ్చారు. ఇవన్నీ ప్రజల్లోకి బాగా వెళ్లి ఆయన పేరు మారుమోగిపోయింది. 2010లో యువజన విభాగం చీఫ్‌గా రాజకీయాల్లో అడుగుపెట్టిన ఆదిత్య శివసేనపై తన ముద్ర వేయడానికి మొదట్నుంచి ప్రయత్నిస్తూనే ఉన్నారు. సంప్రదాయ శివసేన భావాలను వదిలించుకొని ఆధునిక హంగుల్ని సమకూర్చడానికి వ్యూహాలు రచించారు. నగరాల్లో యువతను ఆకర్షించడమే ప్రధాన లక్ష్యంగా పావులు కదిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గత ఏడాది ముంబైలో నైట్ లైఫ్‌ను తిరిగి తీసుకురావాలని ముఖ్యమంత్రి ఫడ్నవీస్‌కు లేఖ రాసి వార్తల్లోకెక్కారు. మాల్స్, రెస్టారెంట్లు రాత్రంతా తెరిచి ఉంచాల ని ప్రతిపాదనలు చేశారు. అవి సాకారం కానప్పటికీ మార్పు కోసం అంటూ నినదిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు నడిపారు. వొర్లి నియోజకవర్గంలో ఎంతో కాలంగా సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ తదితర సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉంటూ యువతరాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ► శివసేనకు పూర్వవైభవం వస్తుందా? కొన్నేళ్ల క్రితం వరకు బీజేపీ, శివసేన కూటమిలో సేనదే పై చేయిగా ఉండేది. బాల్ ఠాక్రే జీవించినంత కాలం ఒక పెద్దన్న పాత్రనే పోషించారు. ఎన్నోసార్లు ఆయన బీజేపీపై అవమానకర వ్యాఖ్యలు చేశారు. కమలదళాన్ని కమ్లి అని స్త్రీలింగాన్ని గుర్తుకు తెచ్చే పేరుతో పిలుస్తూ ‘ఆమెను బయటకు పొమ్మని తలుపు చూపించినా కిటికీలోంచే నా వైపే చూస్తూ ఉంటుంది’అని వ్యాఖ్యానించేవారు. కానీ బీజేపీ లో మోదీ, అమిత్ షా హవా పెరిగాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. మహారాష్ట్ర రాజకీయాలను కూడా మోదీ, షా ద్వయం తమ గుప్పిట్లో పెట్టుకోవడం మొదలు పెట్టారు. అం దుకే కూటమిలో పై చేయి సాధించడమే కాదు, పూర్వ వైభవాన్ని తీసుకురావడానికే శక్తివంచన లేకుండా శ్రమిస్తున్న ఈ యువసేనాని అసెంబ్లీకి ఎన్నిక కావడం కష్టమేమీ కాదు కానీ మహారాష్ట్ర రాజకీయాల్లో ఆదిత్య ఉదయం ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో వేచి చూడాలి. ఆదిత్య ఠాక్రే ఆస్తులు 16 కోట్లు వర్లి నుంచి నామినేషన్ దాఖలు ముంబై: ఠాక్రే వంశం నుంచి మొట్టమొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న శివసేన అ«ధినేత కుమారుడు ఆదిత్య ఠాక్రే దక్షిణ ముంబైలోని వర్లి శాసనసభ నియోజకవర్గం నుంచి గురువారం నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. తండ్రి ఉద్ధవ్ ఠాక్రే, తల్లి రష్మి తన వెంట రాగా ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. నామినేషన్ వేయడానికి ముందు తాత శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రే విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ఆదిత్య ఠాక్రే దాఖలు చేసిన అఫడివిట్ ప్రకారం ఆయనకున్న ఆస్తుల విలువ రూ. 16.5 కోట్లు. అందులో చరాస్తులు రూ.11.38 కోట్లని, స్థిరాస్తులు రూ. 4.67 కోట్లుగా చూపించారు. అందులో రూ.10.36కోట్లు బ్యాంకు డిపాజిట్లు ఉంటే, ఒక బీఎండబ్ల్యూ కారు కూడా ఉంది. దీని ధరని రూ. 6.5 లక్షలుగా పేర్కొన్నారు. ఇక ఆదిత్యకు రూ. 64.65 లక్షల విలువైన బంగారం, ఆభరణాలు ఇతర విలువైన వస్తువులు ఉన్నాయి. 29 ఏళ్ల వయసున్న ఆదిత్య బీఏ ఎల్ఎల్బీ చేశారు. ఆయనపై ఎలాంటి క్రిమినల్ కేసులు లేవు. -
శివసేన ఎత్తుగడ ఫలించేనా?
ముంబై: ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రే గెలుపు కోసం మరాఠి టాగ్‌ను శివసేన పార్టీ పక్కన పెట్టినట్టుగా కన్పిస్తోంది. వర్లీ నియోజకవర్గంలో ఆదిత్య ఠాక్రే ఫొటోలతో వెలిసిన పోస్టర్లు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. మహరాష్ట్రీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన శివసేన తాజా శాసనసభ ఎన్నికల్లో వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తిగా నిలిచిన ఆయన విజయం కోసం మరాఠి మంత్రాన్ని పక్కనపెట్టారు. అన్ని ప్రాంతాల వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వర్లీ నియోజకవర్గం అంతటా వివిధ భాషల్లో తన ఫొటోలతో పోస్టర్లు పెట్టించారు. ఇంగ్లీషు, హిందీ, గుజరాతితో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ పోస్టర్లు ఉండడం విశేషం. హలో వర్లీ అని ఇంగ్లీషులో, సలామ్ వర్లీ అంటూ ఉర్దూలో రాయించారు. నమస్తే వర్లీ అంటూ తెలుగు పోస్టర్లు కూడా ఉన్నాయి. అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకోవాలన్న సందేశమిచ్చేలా పోస్టర్లు పెట్టడాన్ని శివసేనలో చాలా మంది నాయకులు సమర్థిస్తున్నారు. అయితే మరాఠి వర్గం నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఈసారి ఎన్నికల్లో ఒక్క మరాఠి ఓట్లపైనే ఆధారపడకూడదని, మిగతా వర్గాల ఓట్లను కూడా దక్కించుకుంటేనే ఆదిత్య ఠాక్రేను భారీ ఆధిక్యంతో గెలిపించుకోగలమని శివసేన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శివసేన కొత్త వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది. శివసేనకు సీట్లు ఎన్ని? శివసేన మిత్రపక్షం బీజేపీ ఇప్పటికే 125 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తమకు 124 స్థానాలు ఖరారైనట్టు శివసేన ప్రకటించుకుంది. అభ్యర్థుల పేర్లు లేకుండా తాము పోటీ చేసే నియోజకవర్గాలను మంగళవారం ప్రకటించింది. అయితే మరో రెండు సీట్ల కోసం బీజేపీతో ఉద్ధవ్ ఠాక్రే చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. డోంబివ్లీ వెస్ట్, ముంబైదేవి స్థానాలు కూడా తమకు ఇవ్వాలని శివసేన కోరుతున్నట్టు సమాచారం. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయిందని, మరో మాటకు తావు లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. తమకు ఇచ్చిన సీట్లతోనే శివసేన సరిపెట్టుకుంటుందో, లేదో చూడాలి. (చదవండి: మహా పోరు ఆసక్తికరం) -
రగడ రేపిన హీరో బర్త్ డే పార్టీ
ముంబై: బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ బర్త్ డే పార్టీ వివాదానికి దారి తీసింది. బర్త్ డే పార్టీ బ్యాష్ అంటే సందడే సందడి. విందులు, వినోదాలు మామూలే. అయితే 42వ పుట్టిన రోజు వేడుకలు మాత్రం హృతిక్ రోషన్ కు చేదు అనుభవాన్ని మిగిల్చింది. ముంబైలోని ప్రముఖ హోటల్ లో పెద్ద ఎత్తున నిర్వహించిన పార్టీ విమర్శలకు తావిచ్చింది. పరిమితికి మించి ఆడియో సౌండ్ పెట్టి హోరెత్తించడం, మర్నాడు తెల్లవారే వరకూ గలాటా సృష్టించడంతో రగడ జరిగింది. హోరెత్తిన మ్యూజిక్ శబ్దాలతో విసుగెత్తిగిన అష్రఫ్ ఖాన్ అనే స్థానికుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయినా పోలీసులు పట్టించుకోలేదు. యథావిధిగా విపరీతమైన శబ్దాలతో, మ్యూజిక్ తో పార్టీ కొనసాగింది. దీంతో చిర్రెత్తిన అతడు మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రాత్రి పదిగంటల తరువాత అనుమతి లేకుండా ఇలాంటి పార్టీలు నిర్వహించడం నేరమంటూ వాదించాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగక తప్పలేదు. సదరు హోటెల్ యజమానికి పాతిక వేల జరిమానా విధించారు. హృతిక్ 42వ పుట్టిన రోజు వేడుకలు ముంబై నగరంలోని ఫోర్ సీజన్స్ హోటెల్ లో శనివారం ఘనంగా జరిగాయి. 34 వ అంతస్తులోని అట్టహాసంగా నిర్వహించిన ఈ పార్టీకి అనేకమంది బాలీవుడ్ ప్రముఖులు, ఇతర అతిధులు హాజరయ్యారు. బాలీవుడ్ స్టార్లు ఈ బర్తడే బాష్ లో సందడి చేశారు. సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, దీపికా పడుకోన్, అమీషా పటేల్, ప్రీతిజింటా, శిల్పాశెట్టి తదితర నటీనటులు సెల్పీలతో హల్చల్ ఇంకా కరణ్ జోహార్, వివేక్ ఒబెరాయ్ ఇలా పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ విందుకు విచ్చేశారు. దీంతో హోటెల్ ముందు లెక్కకు మించి వాహనాలను పార్క్ చేయడం ట్రాఫిక్ జామ్‌కు దారితీసింది. దీనికితోడు అర్థరాత్రి మొదలైన పార్టీ మరునాడు 3.30 దాకా జోరుగా సాగడంతో వివాదం రాజుకుంది. అటు పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహారించారన్న ఆరోపణలను వర్లి పోలీస్ స్టేషన్ ఉన్నతాధికారి ఖండించారు. ఫిర్యాదు రాకముందే ఒకసారి హోటెల్ యజమానిని హెచ్చరించి, 12,500 రూ. జరిమానా విధించామని తెలిపారు. ఫిర్యాదు అందిన పిదప మరోసారి దాడిచేసి, మరో 12,500 రూ. జరిమానా విధించామన్నారు. మరోవైపు ఈ వివాదంపై స్పందించడానికి హీరో ప్రతినిధి నిరాకరించాడు. అయితే ఎవరో కిట్టని వారే ఈ ఫిర్యాదు చేశారని ఆరోపించాడు.