కలలో రాజకుమారి | Sakshi Special Story About Princess of the Slum Maleesha Kharwa | Sakshi
Sakshi News home page

కలలో రాజకుమారి

Published Sun, Apr 18 2021 12:30 AM | Last Updated on Wed, Mar 2 2022 7:06 PM

Sakshi Special Story About Princess of the Slum Maleesha Kharwa

మలీషా ఖర్వా

తానొక రాజ కుమారిగా మారినట్టు కల కనే హక్కు ప్రతి అమ్మాయికీ ఉంటుంది. అయితే ఆ కల అందరికీ నిజం కాదు. నిజం కాదని అందరికీ తెలుసు. కాని కొందరు కలను నిజం చేసుకుంటారు. ముంబై వర్లీ సమీపంలో మురికివాడలో నివసించే 13 ఏళ్ల మలీషా ఖర్వా యూ ట్యూబ్‌లో ప్రియాంకా చోప్రా ర్యాంప్‌ వాక్‌ను చూసి తానొక మోడల్‌ని, డాన్సర్‌ని కావాలనుకుంది. అయితే ఆమె చాలా గట్టిగా అనుకుంది. విశ్వమంతా కుట్ర చేసి మరీ ఆమె కలను నిజం చేశాయి. ఇటీవల ఆమెపై నిర్మించిన డాక్యుమెంటరీ ‘లివ్‌ యువర్‌ ఫెయిరీటేల్‌’ విడుదలైన సందర్భంగా మలీషా పరిచయం.

మలీషా ఖ్వారా వాళ్ల నాన్న చిన్న పిల్లల బర్త్‌డే పార్టీల్లో ‘జోకర్‌’ వేషం వేసుకుని వినోదం అందించి ఆ వచ్చే కొద్దిపాటి డబ్బుతో బతుకుతుంటాడు. ముంబైలో మురికివాడలో బతకడమే ఒక పెద్ద యుద్ధం అతనికి. అతని కుమార్తె 13 ఏళ్ల మలీషా మాత్రం ఆ జీవితంతో రాజీ పడదల్చుకోలేదు. ఒకసారి ఫోన్‌లో ఎవరో యూ ట్యూబ్‌లో ఆ అమ్మాయికి ప్రియాంకా చోప్రా ర్యాంప్‌వాక్‌ చూపించారు. ‘ఇలా నడవాలంటే ఏం చేయాలి’ అని అడిగింది మలీషా. ‘మోడల్‌ అవ్వాలి’ అని చెప్పారు ఎవరో. అప్పుడే నిశ్చయించుకుంది మోడల్‌ అవ్వాలని. ఆ తర్వాత డాన్సర్‌ కూడా అవ్వాలని.

ఆ కలకు తోడు
హాలీవుడ్‌ నటుడు రాబర్ట్‌ హాఫ్‌మేన్‌ ఒక మ్యూజిక్‌ వీడియో కోసం ఇండియా వచ్చి అందులో నటించడానికి కావలిసిన అమ్మాయి కోసం ముంబై మురికివాడల్లో తిరగసాగాడు. అప్పుడే మలీషా మరో కజిన్‌తో అతణ్ణి కలిసింది. హాఫ్‌మేన్‌ మలీషాను గమనించాడు కాని ఇంకా చిన్నపిల్ల... వీడియోకు పనికి రాదని అనుకున్నాడు. కాని మాటల్లో ‘నువ్వేం అవుదామనుకుంటున్నావు’ అని అడిగితే ‘నేను మోడల్‌ అవుదామనుకుంటున్నాను’ అని చాలా ఆత్మవిశ్వాసంతో మలీషా చెప్పిన తీరు హాఫ్‌మేన్‌కు నచ్చింది. ‘అయితే నీకు సాయం చేస్తాను. నీ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓపెన్‌ చేస్తాను’ అని ఆమె పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓపెన్‌ చేశాడు. మలీషా ఫొటోలు అందులో పోస్ట్‌ చేశాడు. ఆ ఫొటోలలో మలీషా ముగ్ధత్వాన్ని, రూపాన్ని, నవ్వును ఇష్టపడిన నెటిజన్లు అతి త్వరలోనే దాదాపు లక్షన్నర ఫాలోయెర్స్‌గా మారారు.

డాక్యుమెంటరీ
డాక్యుమెంటరీ ఫిల్మ్‌మేకర్స్‌ జస్‌గురు, అర్సలా ఖురేషి కలిసి మలీషా మరో నలుగురు స్లమ్‌ పిల్లల మీద ‘లివ్‌ యువర్‌ ఫెయిరీటేల్‌’ డాక్యుమెంటరీ తీశారు. అనుకున్నది సాధించడానికి స్లమ్స్, పేదరికం, పరిమితులు అడ్డం కావని ఈ డాక్యుమెంటరీ చెబుతుంది. దీనిని మొన్న (ఏప్రిల్‌ 16) మలీషా అఫీషియల్‌ యూట్యూబ్‌ చానెల్‌లో విడుదల చేశారు.
మలీషా గ్లామర్‌ రంగంలో భవిష్యత్తులో ఎన్నో వండర్స్‌ చేయనుంది. మనం వాటిని చూడనున్నాం. ఆల్‌ది బెస్ట్‌ మలీషా.

కవర్‌ గర్ల్‌
అంతర్జాతీయ పత్రిక ‘పీకాక్‌ మేగజీన్‌’ మలీషాను అక్టోబర్‌ 2020న కవర్‌ పేజీ మీద వేసి ‘ద ప్రిన్సెస్‌ ఫ్రమ్‌ ది స్లమ్‌’ పేరుతో లోకానికి పరిచయం చేశాక మలీషాకు ఫొటోషూట్‌ల గిరాకీ అమాంతం పెరిగింది. పీకాక్‌ మేగజీన్‌ కోసం ఆ ఫొటోషూట్‌ నిర్వహించిన జంట షేన్‌–ఫాల్గుణి పీకాక్‌లు మలీషాతో ఫొటోషూట్‌ అనుభవాలను చెప్తూ ‘ఫొటోషూట్‌ వరకూ మలీషా ఎంత ఆంబీషియసో వింటూ వచ్చాం. కాని ఫొటోషూట్‌లో ఆ అమ్మాయి అంకితభావం చూశాక పెద్ద పెద్ద కలలు కనే యోగ్యత ఉందని అనుకున్నాం. ఆ అమ్మాయి చాలా శ్రద్ధగా పని చేసింది’ అన్నారు.

– సాక్షి ఫ్యామిలీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement