ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో అన్ని పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. గెలుపుపై అటు మహాయుతి, ఇటు మహా వికాస్ అఘాడీ కూటములు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భాగస్వామ్య పార్టీలతో సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార పర్వాలతో ఎన్నికల వేడిని పెంచాయి. ముంబైలోని వర్లీ నుంచి మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే తనయుడు ఆదిత్య థాక్రే పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా ఆదిత్య ఠాక్రేకు వ్యతిరేకంగా మాజీ ఎంపీ మిలింద్ దేవ్‌రాను బరిలో దించాలని సీఎం ఏక్‌నాథ్ షిండే వర్గం శివసేన పార్టీ నిర్ణయించింది. ఉద్ధవ్ థాకరే వర్గం శివసేన పార్టీ అభ్యర్థిగా ఆదిత్య థాకరే నామినేషన్ దాఖలు చేసిన మరుసటి రోజే ఏక్‌నాథ్ షిండే పార్టీ ఈ నిర్ణయం తీసుకుంది. మిలింద్ దేవ్‌రా దక్షిణ ముంబై నుంచి ఇప్పటికే మూడు పర్యాయాలు ఎంపీగా గెలిచారు. ప్రస్తుతం ఆయన రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. రాజ్ ఠాక్రేకు చెందిన మహారాష్ట్ర నవనిర్మాణ సేనకు చెందిన సందీప్ దేశ్‌పాండేతో కూడా వర్లీ నుంచి తలపడనున్నారు.
కాగా ఆదిత్య థాకరే గురువారం వర్లి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసారి కూడా వర్లి ప్రజలు కచ్చితంగా తననే గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో మొత్తం 288 స్థానాలకు నవంబర్ 20న పోలింగ్ జరగనుంది. నవంబర్ 23న ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు. ఈ ఎన్నికల్లో అధికార మహాయుతి, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీల మధ్యనే ప్రధాన పోటీ ఉండనుంది.
Comments
Please login to add a commentAdd a comment