శివసేన ఎత్తుగడ ఫలించేనా? | Aaditya Thackeray Multilingual Posters Greet Worli People | Sakshi
Sakshi News home page

శివసేన కొత్త వ్యూహం ఫలిస్తుందా?

Published Wed, Oct 2 2019 5:41 PM | Last Updated on Wed, Oct 2 2019 5:53 PM

Aaditya Thackeray Multilingual Posters Greet Worli People - Sakshi

ముంబై: ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగిన ఆదిత్య ఠాక్రే గెలుపు కోసం మరాఠి టాగ్‌ను శివసేన పార్టీ పక్కన పెట్టినట్టుగా కన్పిస్తోంది. వర్లీ నియోజకవర్గంలో ఆదిత్య ఠాక్రే ఫొటోలతో వెలిసిన పోస్టర్లు ఈ వాదనకు బలాన్నిస్తున్నాయి. మహరాష్ట్రీయుల హక్కుల కోసం రాజీలేని పోరాటం చేసిన శివసేన తాజా శాసనసభ ఎన్నికల్లో వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది.

శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే పెద్ద కుమారుడు ఆదిత్య ఠాక్రే వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగారు. ఠాక్రే కుటుంబం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి వ్యక్తిగా నిలిచిన ఆయన విజయం కోసం మరాఠి మంత్రాన్ని పక్కనపెట్టారు. అన్ని ప్రాంతాల వారిని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. ఇందులో భాగంగా వర్లీ నియోజకవర్గం అంతటా వివిధ భాషల్లో తన ఫొటోలతో పోస్టర్లు పెట్టించారు. ఇంగ్లీషు, హిందీ, గుజరాతితో పాటు దక్షిణాది భాషల్లోనూ ఈ పోస్టర్లు ఉండడం విశేషం. హలో వర్లీ అని ఇంగ్లీషులో, సలామ్‌ వర్లీ అంటూ ఉర్దూలో రాయించారు. నమస్తే వర్లీ అంటూ తెలుగు పోస్టర్లు కూడా ఉన్నాయి.

అన్ని ప్రాంతాల వారిని అక్కున చేర్చుకోవాలన్న సందేశమిచ్చేలా పోస్టర్లు పెట్టడాన్ని శివసేనలో చాలా మంది నాయకులు సమర్థిస్తున్నారు. అయితే మరాఠి వర్గం నుంచి కొంత వ్యతిరేకత వ్యక్తమైంది. ఈసారి ఎన్నికల్లో ఒక్క మరాఠి ఓట్లపైనే ఆధారపడకూడదని, మిగతా వర్గాల ఓట్లను కూడా దక్కించుకుంటేనే ఆదిత్య ఠాక్రేను భారీ ఆధిక్యంతో గెలిపించుకోగలమని శివసేన భావిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. శివసేన కొత్త వ్యూహం ఏమేరకు ఫలిస్తుందో ఎన్నికల తర్వాత తెలుస్తుంది.

శివసేనకు సీట్లు ఎన్ని?
శివసేన మిత్రపక్షం బీజేపీ ఇప్పటికే 125 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. తమకు 124 స్థానాలు ఖరారైనట్టు శివసేన ప్రకటించుకుంది. అభ్యర్థుల పేర్లు లేకుండా తాము పోటీ చేసే నియోజకవర్గాలను మంగళవారం ప్రకటించింది. అయితే మరో రెండు సీట్ల కోసం బీజేపీతో ఉద్ధవ్‌ ఠాక్రే చర్చలు జరుపుతున్నారని ప్రచారం జరుగుతోంది. డోంబివ్లీ వెస్ట్‌, ముంబైదేవి స్థానాలు కూడా తమకు ఇవ్వాలని శివసేన కోరుతున్నట్టు సమాచారం. అయితే సీట్ల సర్దుబాటు పూర్తయిందని, మరో మాటకు తావు లేదని బీజేపీ నాయకులు అంటున్నారు. తమకు ఇచ్చిన సీట్లతోనే శివసేన సరిపెట్టుకుంటుందో, లేదో  చూడాలి. (చదవండి: మహా పోరు ఆసక్తికరం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement