సాక్షి, ముంబై: నెలరోజుల నిరీక్షణకు ముగింపు పలుకుతూ మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుతీరబోతుంది. ఈరోజు (గురువారం) సాయంత్ర 6:40 గంటలకు ముఖ్యమంత్రిగా శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఉద్ధవ్ పాటు ఎన్సీపీ, కాంగ్రెస్‌కు చెందిన మరికొంత మంది కీలక నేతలకు కూడా మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. వీరిలో బాలాసాహెబ్ థోరట్, అశోక్ చవాన్, ఎన్సీపీ నేతలు జయంత్ పాటిల్, ఛగన్ భుజ్‌బల్, శివసేన నేతలు సుభాష్ దేశాయ్, ఏక్‌నాథ్ షిండేలు ఉన్నారు. అయితే ఉద్ధవ్ ఠాక్రే కుమారుడు, వర్లీ ఎమ్మెల్యే ఆదిత్యా ఠాక్రే, ఎన్సీపీ సీనియర్ నేత, తిరుగుబాటు నాయకుడు అజిత్ పవార్‌లకు మంత్రివర్గంలో చోటు దక్కుతుందా అనేది చర్చనీయాంశంగా మారింది. బీజేపీ, శివసేన ప్రభుత్వం ఏర్పడితే సీఎం పదవి ఆదిత్యాకు ఇవ్వాలని శివసేన నేతలు ఎన్నికల ముందు నుంచే డిమాండ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, మద్దతుతో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది.
ప్రభుత్వంలోనా.. పార్టీలోనా?
ఆదిత్యా ఠాక్రేకు మంత్రివర్గం చోటు దక్కడం ఖాయమనీ, కీలక శాఖనే అప్పగించే అవకాశం ఉందని సేనలో జోరుగా చర్చసాగుతోంది. ఈ నేపథ్యంలోనే శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదిత్యాను మంత్రివర్గంలోకి తీసుకుంటారా? లేదా అనేది పూర్తిగా ఉద్ధవ్ నిర్ణయమని అన్నారు. ఠాక్రే ఆదిత్యాకు తండ్రి మాత్రమే కాదని, రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కూడా అని వ్యాఖ్యానించారు. దీంతో నూతన ప్రభుత్వంలో ఆదిత్యా స్థానంపై ఆసక్తి నెలకొంది. ఇదిలావుండగా ఇప్పటి వరకు పార్టీ బాధ్యతలు మోసిన ఉద్ధవ్ సీఎం పదవిని చేపట్టబోతుండటంతో, ఆదిత్యా పూర్తిగా పార్టీ కార్యక్రమాలు చూసుకుంటారని సేన వర్గాల సమాచారం. ఎమ్మెల్యేగా తొలిసారి గెలవడం, పదవులు చేపట్టిన అనుభవం లేకపోవడంతో మంత్రివర్గంలో చోటు దక్కకపోచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఉద్ధవ్ ఐదేళ్ల పాటు సీఎం పదవికే పరిమితమై ఉంటారని, పార్టీ బాధ్యతలను ఆదిత్య చూసుకుంటారని ఓ సీనియర్ నేత వెల్లడించారు. పార్టీ వ్యవహారాల్లో చురుకుగా పాల్గొనేలా చేయడం ద్వారా ఆదిత్యాను రాజకీయాల్లో రాటుదేలేలా చేయాలన్నదే శివసేన తాజా ఆలోచనగా చెబుతున్నారు. కొత్త ప్రభుత్వ ప్రమాణస్వీకారానికి హాజరుకావాల్సిందిగా కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను ఆహ్వానించేందుకు స్యయంగా ఆదిత్యను ఉద్ధవ్ పంపడం కూడా ఈ ఆలోచనలో భాగంగానే చెబుతున్నారు. అయితే దీనిపై ఠాక్రేనే తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. (అజిత్ చుట్టూ హైడ్రామా?)
ప్రమాణం చేయటం లేదు: అజిత్
ఇక ఎన్సీపీపై తిరుగుబాటు చేసి బీజేపీతో చెతులు కలిపి విఫలమై, తిరిగి ఎన్సీపీ గూటికి చేరిన అజిత్ పవార్ దారెటనేది ప్రశ్నార్థాకంగా మారింది. గురువారం సాయంత్రం కొత్త ప్రభుత్వం కొలువుతీరుతున్న నేపథ్యంలో డిప్యూటీ సీఎంగా తానే ప్రమాణ స్వీకారం చేస్తున్నానని ఎన్సీపీ నేత జయంత్ పాటిల్ ఇదివరకే ప్రకటించారు. అజిత్‌పై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, తమ అధినేత శరద్ పవార్ ఇష్టానికి వదిలేస్తున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలోనే కొత్త ప్రభుత్వంలో చేరే అంశంపై అజిత్ పవాద్ స్పందించారు. తాను ఎలాంటి పదవులు స్వీకరించడంలేదని, ప్రస్తుతానికి ఎన్సీపీలోనే కొనసాగుతున్నానని స్పష్టం చేశారు. అయితే అసెంబ్లీలో బలపరీక్ష అనంతరం అజిత్‌ను ప్రభుత్వంలోకి తీసుకుంటారనే చర్చ కూడా తెరపైకి వచ్చింది. దీనిపై శరద్ ఎలా వ్యవహరిస్తారనేది ఆసక్తికరంగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment