
సాక్షి ముంబై: ఠాక్రే కుటుంబం నుంచి వారసులు మొదటిసారిగా ఎన్నికల బరిలోకి దిగడంతో ఈసారి ఎన్నికలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఠాక్రే కుటుంబానికి చెందిన మూడోతరం యువసేన అధ్యక్షులు ఆదిత్య ఠాక్రే.. వర్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీకి దిగడం తెల్సిందే. మరోవైపు ఆదిత్య ఠాక్రే తమ్ముడు తేజస్ ఠాక్రే రాజకీయాల్లోకి అరంగేట్రం చేయనున్నట్టు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా ఆదిత్య ఠాక్రే ఎమ్మెల్యేగా విజయం సాధించిన అనంతరం ఆయన స్థానంలో యువసేన అధ్యక్షుని బాధ్యతలను తేజస్ ఠాక్రేకు అప్పగించనున్నట్టు వార్తలు గుప్పుమంటున్నాయి. సంగంనేర్, అహ్మద్‌నగర్‌లలో జరిగిన ఎన్నికల సభల్లో తన తండ్రి ఉద్ధవ్‌తో కలిసి తేజస్ ఠాక్రే పాల్గొన్నారు.
అడవిలోనే ఉంటాడు: ఉద్ధవ్
తన చిన్న కుమారుడి రాజకీయ ప్రవేశంపై వస్తున్న వార్తలను ఉద్ధవ్ ఠాక్రే తోసిపుచ్చారు. ఎన్నికల ర్యాలీలను చూసేందుకు మాత్రమే తేజస్ వచ్చాడని తెలిపారు. ఇంట్లో కంటే అడవిలోనే ఎక్కువగా గడుపుతుంటాడని వెల్లడించారు. తండ్రి, బీజేపీ నాయకులతో కలసి వేదిక పంచుకున్న తేజస్‌కు శివసేన కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ‘ఎవరు వచ్చారు. శివసేన టైగర్ వచ్చాడు’ అంటూ నినాదాలు చేశారు. వన్యప్రాణి, జంతు ప్రేమికుడైన తేజస్.. అరుదైన పాములు, బల్లులు కనుగొనేందుకు పరిశోధనలు చేస్తుంటారు. (చదవండి: శివసేన కొంపముంచిన పొత్తు)
Comments
Please login to add a commentAdd a comment