ధనంజయ్ బోడారే, ఉద్ధవ్ ఠాక్రే
సాక్షి ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయ వాతావరణం వేడేక్కగా మరోవైపు శివసేన కార్పొరేటర్లు ఆ పార్టీకి షాకిచ్చారు. సీట్ల పంపకాల అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కళ్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది శివసేన కార్పొరేటర్లు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామా చేశారు. శివసేన అధ్యక్షులు ఉద్దవ్ ఠాక్రేకు తమ రాజీనామా పత్రాలను పంపించారు.
పొత్తు ముంచేసింది..
అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 21వ తేదీ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంతో రాజకీయ వాతావరణం రాష్ట్రవ్యాప్తంగా వేడెక్కాయి. అన్ని పార్టీలు విజయం కోసం తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఎన్నికలకు మరో 10 రోజులుందనగా కళ్యాణ్–డోంబివలి మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన 26 మంది కార్పొరేటర్లతోపాటు మరో 300 మంది కార్యకర్తలు రాజీనామాలు చేయడం ఒక్కసారిగా రాజకీయంగా దుమారం లేపింది. ఈ సంఘటన శివసేనతోపాటు బీజేపీకి తలనొప్పిగా మారనుంది. థానే జిల్లాలో శివసేనకే పట్టుంది. అయితే కొన్ని ప్రాంతాల్లో బీజేపీ కూడా తమ అభ్యర్థులను బరిలోకి దింపింది.
ఇలాంటి నేపథ్యంలో శివసేనతోపాటు ఆ పార్టీకి మిత్రపక్షమైన బీజేపీకి కూడా ఈ సంఘటన తీవ్ర తలనొప్పిగా మారింది. శివసేన, బీజేపీల కూటమి అభ్యర్థులకు స్థానిక కార్పొరేటర్ల వ్యతిరేకతను ఎదుర్కొవాల్సి రానుంది. ఇదిలా ఉండగా రాజీనామా చేసిన కార్పొరేటర్లు స్థానిక నేత ధనంజయ్ బోడారేకు మద్దతుగా తమ రాజీనామా చేసినట్టు మీడియాకు తెలిపారు. సీట్ల పంపకాల సమయంలో శివసేనకు ఈ సీటు కేటాయించాలని కోరినప్పటికీ కళ్యాణ్ నియోజకవర్గం సీటు బీజేపీ కోటాలోకి వెళ్లింది. తమ అభ్యర్థి గణపత్ గైక్వాడ్‌కు మద్దతు ఇవ్వాలని కార్యకర్తలకు బీజేపీ సూచించడంతోనే నిరసనలు వెలువెత్తుతున్నాయని తెలిసింది. మరోవైపు కాంగ్రెస్, ఎన్సీపీల నుంచి శివసేన, బీజేపీలో చేరిన నాయకులను ఎన్నికల బరిలోకి దింపడంపై కూడా అసంతృప్తి వెల్లువెత్తింది. అనేక మంది అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి కనబరిచారు. అయితే వారందరిని టిక్కెట్ నిరాకరించడంతో వారితోపాటు వారి మద్దతుదారులలో అసంతృప్తి పెరిగింది.
థానేలోనే 211 మంది పోటీ
థానే జిల్లాల్లోని 18 అసెంబ్లీ నియోజకవర్గాలలో మొత్తం 211 మంది పోటీ పడుతున్నారు. ప్రధాన పార్టీలతో సహా చిన్న చిన్న పార్టీలు ఇలా మొత్తం 36 పార్టీలు తమ అభ్యర్థులను థానే జిల్లాలో బరిలోకి దింపాయి. బహుజన్ సమాజ్ పార్టీ అత్యధికంగా 16 మంది అభ్యర్థులను బరిలోకి దింపగా మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్మెన్నెస్), వంచిత్ ఆఘాడిలు 13 మంది చొప్పున అభ్యర్థులను బరిలోకి దింపాయి. ఇక ఎన్సీపీ 10 మందిని, శివసేన, బీజేపీలు తొమ్మిదేసి మంది అభ్యర్థులను బరిలోకి దింపాయి. కాంగ్రెస్ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. వీరిలో 16 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలున్నారు. మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు, తొమ్మిది మంది కార్పొరేటర్లున్నారు.
83 మంది స్వతంత్ర అభ్యర్థులు..
థానే జిల్లాలో ఇండిపెండెంట్లు పెద్ద ఎత్తున బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 83 మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. పలువురు టిక్కెట్ కోసం ప్రయత్నించి భంగపడి బరిలోకి దిగగా మరి కొందరు మాత్రం కావాలనే ఎమ్మెల్యే ఎన్నికల్లో బరిలోకి దిగారు. జిల్లాలోని 18 అసెంబ్లీ నియోకవర్గాల్లో అత్యధికంగా 12 మంది స్వతంత్ర అభ్యర్థులు ఉల్లాస్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉండగా తూర్పు కళ్యాణ్ అసెంబ్లీ నియోజకవర్గంలో 11 మంది అభ్యర్థులు, పశ్చిమ కళ్యాణ్, బేలాపూర్ మొదలగు రెండు అసెంబ్లీలలో తొమ్మిదేసి మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలోకి దిగారు. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థులకు కొంతమేర తలనొప్పిగా మారనుంది. వీరిలో కొందరు పెద్ద ఎత్తున ఓట్లు చీల్చే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment