సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఏర్పడ్డ ప్రతిష్ఠంభనపై తక్షణమే జోక్యం చేసుకోవాలంటూ శివసేన నాయకుడు కిశోర్ తివారీ ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్‌కు లేఖ రాశారు. అంతేకాకుండా సందిగ్ధం తొలిగిపోవాలంటే బీజేపీ అగ్రనేత, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని రంగంలోకి దింపాలని కోరింది. ఆయన వస్తే సంక్షోభం వెంటనే తొలిగిపోతుందని, ప్రభుత్వ ఏర్పాటు సులభం అవుతుందని లేఖలో వివరించారు. ‘‘ఈ సంక్షోభం సమసిపోవాలంటే శివసేనతో చర్చలు జరపడానికి నితిన్ గడ్కరీని రంగంలోకి దించాలి. ఆయన ‘సంకీర్ణ ధర్మా’న్ని పాటించడమే కాకుండా ఈ సంక్షోభానికి రెండు గంటల్లోనే మార్గాన్ని చూపిస్తారు’’ అని లేఖలో పేర్కొన్నారు.
ఫడణ్‌విస్ వ్యక్తిగత శైలిపై అభ్యంతరాలున్నాయని, సీనియర్ అయిన నితిన్ గడ్కరీని స్వరాష్ట్రానికి రప్పిస్తే రాష్ట్రం అద్భుతంగా ప్రగతి చెందుతుందని ఆయన తెలిపారు. కాగా ఫడ్నవిస్ కేంద్ర హోంమత్రి అమిత్‌షాను కలవడం, మరోవైపు సోనియా గాంధీ అధ్యక్షతన ప్రతిపక్షాల సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో కిశోర్ తివారీ లేఖ బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఇదిలావుండగా.. పలువురు బీజేపీ సీనియర్ నేతలు, శ్రేణులు రాష్ట్రంలో రీ-ఎలక్షన్‌కు సిద్ధంగా ఉన్నారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జయ్‌కుమార్ రావల్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment