ముంబై: మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడే అవకాశం కనిపిస్తోంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ)తో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు శివసేన రంగం సిద్ధం చేసింది. ఈ కూటమికి కాంగ్రెస్ పార్టీ బయటి నుంచి మద్దతు ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. ఈ మూడు పార్టీలు కలిస్తే అలవోకగా మ్యాజిక్ ఫిగర్‌ను అధిగమించి.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది. ఈ క్రమంలో శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి.. అత్యంత కీలకమైన ఈ భేటీలో పదవులు పంపకాలపై కూడా చర్చ జరిగినట్టు సమాచారం.
పదవుల పంపకాల్లో భాగంగా శివసేన ముఖ్యమంత్రి పదవిని చేపట్టనుండగా.. ఎన్సీపీకి ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌కి అసెంబ్లీ స్పీకర్ వంటి కీలక పదవులను సేన ఆఫర్ చేసినట్లు రాజకీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక, రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించిన సంగతి తెలిసిందే. సాయంత్రం 5గంటలకు శివసేన నేతలు గవర్నర్‌ను కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరనున్నారు.
ఇక, శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వానికి గట్టి ప్రతిపక్షంగా ముచ్చెమటు పట్టించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో 105 స్థానాలతో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించిన సంగతి తెలిసిందే. అయితే, సీఎం పదవిపై మిత్రపక్షం శివసేనతో రాజీ కుదరకపోవడంతో ప్రతిపక్షంలో ఉండేందుకు బీజేపీ సిద్ధమైంది. రెబల్ ఎమ్మెల్యేలను కూడా తనవైపు తిప్పుకొని.. గట్టి ప్రతిపక్షంగా సేన కూటమిని ఎదుర్కోవాలని బీజేపీ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment