
న్యూఢిల్లీ: అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది.
ప్రాముఖ్యమున్న వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనే దిశగా ఎటువంటి అడుగులు పడలేదని విశారద్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై సత్వరం విచారణ చేపట్టాలన్న ఆయన వినతిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే 10న ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment