న్యూఢిల్లీ: వివాదాస్పద అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీమసీదు స్థల యాజమాన్య హక్కులకు సంబంధించిన కేసు విచారణ సుప్రీంకోర్టులో బుధవారంతో ముగిసింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గత 40 రోజులుగా వరుసగా ఈ కేసులో హిందు, ముస్లిం వర్గాల తరఫు లాయర్లు తమ వాదనలు వినిపించారు. ‘ఇంక చాలు’ అంటూ బుధవారం సాయంత్రం జస్టిస్ గొగొయ్ తుది వాదనలు వినడం ముగించారు. తీర్పును రిజర్వ్‌లో ఉంచారు.
అయితే, రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నవంబర్ 17లోపు ప్రకటించే అవకాశముంది. మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనడంలో హిందూ, ముస్లిం వర్గాలు విఫలమైన నేపథ్యంలో ఈ ఆగస్ట్ 6వ తేదీ నుంచి జస్టిస్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు విచారణ ప్రారంభించిన విషయం తెలిసిందే. 1950లో ఏర్పడినప్పటి నుంచి సుప్రీంకోర్టు చరిత్రలో ఎక్కువ కాలం కొనసాగిన కేసు విచారణల్లో ఇది రెండోది కావడం విశేషం. మొదటి కేసు 1973 నాటి చరిత్రాత్మక కేశవానంద భారతి కేసు. రాజ్యాంగ మౌలిక స్వరూప నిర్ధారణకు సంబంధించిన ఆ కేసు విచారణ 68 రోజులు కొనసాగింది. ఆధార్ రాజ్యాంగబద్ధతకు సంబంధించిన కేసు విచారణ 38 రోజులు జరిగింది.
విచారణ సందర్భంగా హైడ్రామా
విచారణ చివరి రోజు కోర్టులో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చివరి రోజు హిందూ, ముస్లిం వర్గాల తరఫు న్యాయవాదులు ఆవేశంగా తమ వాదనలు వినిపించారు. హిందూ మహాసభ తరఫు వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కోర్టుకు అందించిన రామజన్మభూమి మ్యాప్‌ను కోర్టుహాళ్లోనే ముస్లింల తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది రాజీవ్ ధావన్ చించేయడంతో వాతావరణం కొంత సీరియస్‌గా మారింది. బాబ్రీమసీదు గుమ్మటం(1992లో కూల్చివేతకు గురైన డోమ్) కింది భాగమే నిజానికి రాముడి జన్మస్థలం అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఒక మ్యాప్‌ను, భారతీయ, విదేశీ రచయితలు రాసిన కొన్ని పుస్తకాలను సాక్ష్యాధారాలుగా అఖిల భారత హిందూ మహాసభలోని ఒక వర్గం తరఫు న్యాయవాది వికాస్ సింగ్ ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. వీటినేం చేసుకోవాలంటూ ధర్మాసనాన్ని ప్రశ్నించారు. దానికి జస్టిస్ రంజన్ గొగొయ్.. ‘కావాలనుకుంటే ముక్కలుగా చింపేసుకోవచ్చు’ అని సమాధానమిచ్చారు.
అప్పటికే వికాస్‌సింగ్ వాదనతో తీవ్రంగా విబేధించి ఉన్న ముస్లిం వర్గాల తరఫు లాయర్ రాజీవ్ ధావన్.. సీజేఐ మాటతో.. సీజేఐ అనుమతి తీసుకుని తన దగ్గరున్న ఆ మ్యాప్‌ను అక్కడే ముక్కలుగా చింపేశారు. అయితే, ఆ ఘట్టం అక్కడితో ముగియలేదు. లంచ్ బ్రేక్ తరువాత.. తాను ఆ మ్యాప్‌ను చింపేసిన విషయం వైరల్‌గా మారిందని ధర్మాసనం దృష్టికి రాజీవ్ ధావన్ తీసుకువచ్చారు. ‘నేనే కావాలని ఆ మ్యాప్‌ను చింపేశాననే ప్రచారం జరుగుతోంది’ అని చెప్పారు. ‘మీ అనుమతితోనే నేను ఆ పని చేశానన్న విషయం మీరు స్పష్టం చేయాల్సి ఉంది’ అని సీజేఐని కోరారు. ‘ఆ పేపర్లను చించే ముందు మీ అనుమతి కోరాను. అవసరం లేకపోతే చించేయండి అని మీరు చెప్పారు’ అని సీజేఐకి ధావన్ గుర్తుచేశారు. దానికి సీజేఐ.. ‘మీరు చెప్పేది కరెక్టే.. ప్రధాన న్యాయమూర్తి అనుమతితోనే ఆ మ్యాప్‌ను రాజీవ్ ధావన్ చించేశారనే వివరణ కూడా ప్రచారం కావాలి’ అని స్పష్టం చేశారు.
మరోసారి మధ్యవర్తిత్వ అంశం
చివరి రోజు విచారణ సందర్భంగా.. సమస్య పరిష్కారం కోసం మరోసారి మధ్యవర్తిత్వ అంశాన్ని పరిశీలించాలన్న వాదన కూడా తెరపైకి వచ్చింది. గతంలో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్‌ఎమ్‌ఐ కలీఫుల్లా, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు పండిట్ రవిశంకర్, ప్రముఖ మధ్యవర్తి శ్రీరామ్ పంచు సభ్యులుగా ఉన్న మధ్యవర్తిత్వ కమిటీ అయోధ్య వివాదానికి ఒక సామరస్యపూర్వక పరిష్కారం కోసం విఫలయత్నం చేసింది. ఆ కమిటీ కూడా తమ రిపోర్ట్‌ను బుధవారం సీల్డ్‌కవర్లో కోర్టుకు సమర్పించింది. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పునిచ్చిన అనంతరం.. ఆ తీర్పును నిరసిస్తూ సుప్రీంకోర్టులో 14 వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment