Deepak Gupta
-
న్యాయవ్యవస్థ సమగ్రతే శిరోధార్యం కావాలి
న్యూఢిల్లీ: ఎట్టి పరిస్థితుల్లోనూ న్యాయవ్యవస్థ సమగ్రతకు నష్టం వాటిల్లకుండా చూడాలని సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ దీపక్ గుప్తా వ్యాఖ్యానించారు. ఉష్ట్రపక్షిలా తల దాపెట్టుకుని, న్యాయవ్యవస్థలో అంతా బావుందని అనుకోవడం సరికాదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు ప్రయత్నించాలన్నారు. చుట్టూ ఉన్న సమాజంలో కూడా అంతా బావుందనే ఊహాలోకంలో న్యాయమూర్తులు ఉండకూడదని హితవు పలికారు. మూడేళ్లకు పైగా అత్యున్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా విధులు నిర్వర్తించిన జస్టిస్ గుప్తా బుధవారం పదవీ విరమణ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలోనే తొలిసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన పదవీ విరమణ కార్యక్రమం జరిగింది. లాయర్‌గా, జడ్జిగా 42 ఏళ్లు పూర్తి చేసుకున్నట్లు ఆయన చెప్పారు. లాక్డౌన్ కారణంగా, బార్బర్స్ అందుబాటులో లేకపోవడంతో తన భార్యనే ఈ రోజు తనకు హెయిర్ కట్ చేసిందని తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన జస్టిస్ గుప్తా పలు కీలక తీర్పులిచ్చిన ధర్మాసనాల్లో భాగస్వామిగా ఉన్నారు. మైనర్ భార్యతో శృంగారం, ఆమె అనుమతి ఉన్నా.. రేప్ కిందకే వస్తుందని ఇచ్చిన తీర్పు, జైళ్ల సంస్కరణల తీర్పు, వాయు కాలుష్యంపై ఇచ్చిన తీర్పు మొదలైనవి వాటిలో ఉన్నాయి. -
ప్రజల ప్రాణాలతో చెలగాటమా?
న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడాదికేడాది వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమెందుకని మండిపడింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజల ప్రాణాలు కోల్పోనిస్తారా ? దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకువెళతారా అని జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ దీపక్ గుప్తాలతో కూడిన డివిజన్ బెంచ్ ప్రశ్నించింది. బుధవారం సుప్రీం కోర్టు ఎదుట కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. పంట వ్యర్థాల దహనం ఎందుకు ఆపలేకపోతున్నారు ? పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టడాన్ని నిరోధించడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలం చెందుతోందని ప్రశ్నించింది. పంట వ్యర్థాల్ని తగలబెట్టడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 7 వేల ప్రాంతాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టారని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ఇక అధికారులకు శిక్షపడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది. ‘హరియాణా చర్యలపై కాస్త సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం పంజాబ్ ప్రధాన కార్యదర్శిపై నిప్పులు చెరిగింది. ‘కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతి ఇదా? పంజాబ్‌కి ప్రధాన కార్యదర్శిగా మీరేం చేస్తున్నారు. రైతులు పంట వ్యర్థాల్ని తగులబెట్టకుండా ఆపడం మీ వైఫల్యమే. ఇదే కొనసాగితే అధికారుల్ని సస్పెండ్ చేస్తాం’ అంటూ హెచ్చరించింది. ‘ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని చూసి గర్వపడతామా?’అని సుప్రీం జడ్జీలు నిలదీశారు. చైనా, పాక్ విష వాయువులు లీక్ చేస్తున్నారేమో: బీజేపీ నేత ఆరోపణలు ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనా కారణమని యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్ అగర్వాల్ ఆరోపించారు. పొరుగు దేశాలు మనపై విషవాయువులతో దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బహుశా అది పాక్, చైనాల పని అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్ పంట వ్యర్థాల్ని తగులబెట్టడం వల్లే కాలుష్యం అధ్వాన్నంగా మారిందన్న విమర్శల్ని తప్పు పట్టారు. దేశానికి వెన్నెముకలాంటి రైతుల్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు. రైతులకు క్వింటాల్‌కు 100: సుప్రీం ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్య పరిస్థితికి కారణమైన పక్క రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా, పంజాబ్‌లో గడ్డిని తగులబెట్టని రైతులకు క్వింటాల్‌కు రూ. 100 ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అందుకే రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని సూచించింది. గడ్డిని తగులబెట్టకుండా ఉండేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాలని చెప్పింది. సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాన్ని 3 నెలల్లోగా తీసుకురావాలని హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించింది. -
‘తప్పు తీర్పు ఇచ్చానని ఏ జడ్జీ ఒప్పుకోడు’
న్యూఢిల్లీ: ఏ న్యాయమూర్తి తాను తప్పు తీర్పు ఇచ్చానని ఒప్పుకోరని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. సరైన ఆధారాలు లేకుండా, కేవలం తప్పుడు ఆదేశాలు ఇచ్చారన్న కారణంతో జడ్జీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోలేమంది. ‘న్యాయవ్యవస్థ స్వతంత్రత పవిత్రమైంది.తప్పు చేసినట్లు, అవినీతికి పాల్పడినట్లు, ప్రలోభాలకు గురైనట్లు స్పష్టమైన ఆరోపణలుంటే తప్ప.. తప్పు తీర్పు ఇచ్చారన్న ఒకే కారణంతో క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించరాదు’ అని జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల ధర్మాసనం వ్యాఖ్యానించింది. తనపై క్రమశిక్షణ చర్యలకు ఉపక్రమించడంపై బిహార్‌కు చెందిన ఒక న్యాయాధికారి దాఖలు చేసి పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అప్పటికే హైకోర్టు బెయిల్‌ను నిరాకరించిన విషయాన్ని గుర్తించకుండా.. హత్యారోపణలు ఎదుర్కొంటున్న కొందరికి బెయిల్ మంజూరు చేయడంపై, మరో డ్రగ్ సంబంధిత కేసు విచారణను హడావుడిగా ముగించడంపై ఆ న్యాయాధికారిపై క్రమశిక్షణ చర్యలు ప్రారంభించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అది హిందూ నిర్మాణమే! : అయోధ్య వివాదాస్పద స్థలంలో పురాతత్వ శాఖ(ఏఎస్ఐ) జరిపిన తవ్వకాల్లో వెల్లడైన విషయాలు ఆ స్థలం తమదేనన్న ముస్లింల వాదనను స్పష్టంగా తోసిపుచ్చుతున్నాయని రామ్ లల్లా తరఫు న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ సుప్రీంకోర్టుకు విన్నవించారు. అయోధ్య వివాదాస్పద స్థల యాజమాన్య వ్యాజ్యంపై జస్టిస్ రంజన్ గొగోయి నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు గురువారం వాదనలు కొనసాగాయి. -
అయోధ్యపై సత్వర విచారణ చేపట్టాలి
న్యూఢిల్లీ: అయోధ్య వివాద పరిష్కారం మధ్యవర్తిత్వంతోనూ పరిష్కారమయ్యే సూచనలు కనిపించడం లేదని, వెంటనే ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని పరిష్కారం చూపాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. రామ జన్మభూమి– బాబ్రీ మసీదు వివాదంలో వాస్తవ కక్షిదారుల్లో ఒకరైన గోపాల్ సింగ్ విశారద్ ఈ మేరకు వేసిన పిటిషన్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం స్వీకరించింది. ప్రాముఖ్యమున్న వివాదానికి సామరస్య పూర్వక పరిష్కారం కనుగొనే దిశగా ఎటువంటి అడుగులు పడలేదని విశారద్ తరఫున న్యాయవాది తెలిపారు. ఈ పిటిషన్‌పై సత్వరం విచారణ చేపట్టాలన్న ఆయన వినతిపై ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అయోధ్య సమస్య పరిష్కారానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎఫ్.ఎం.ఐ. కలీఫుల్లా నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీకి ఆగస్టు 15వ తేదీ వరకు గడువు పొడిగిస్తూ సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం మే 10న ఉత్తర్వులిచ్చింది. -
మసీదుల్లోకి మహిళల వ్యాజ్యం కొట్టివేత
న్యూఢిల్లీ: మసీదుల్లోకి మహిళలను అనుమతించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టివేసింది. పబ్లిసిటీ కోసమే ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్న కేరళ హైకోర్టు వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నట్లు తెలిపింది. ‘ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయడానికి అసలు మీరెవరు? ఇది మీపై ఎలా ప్రభావం చూపుతుంది? బాధిత వ్యక్తులను మా ముందుకు తీసుకురండి’అని పిటిషన్‌దారుడితో వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ అనిరుద్ధ బోస్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం ఈ మేరకు వెల్లడించింది. మరోవైపు, ఆర్టికల్ 15 చిత్రంలో కుల విద్వేషాలు, పుకార్లను పెంచే అభ్యంతరకరమైన డైలాగులు ఉన్నందున సీబీఎఫ్సీ(సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) జారీ చేసిన సర్టిఫికెట్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం తోసిపుచ్చింది. -
ఉరిశిక్షపై జడ్జీల భిన్నాభిప్రాయాలు
న్యూఢిల్లీ: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేరాలను నియంత్రించడంలో ఉరిశిక్ష విఫలమైందని ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి అభిప్రాయపడగా, మిగిలిన ఇద్దరు జడ్జీలు అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును సమర్థించారు. ముగ్గురిని హత్య చేసిన ఓ దోషికి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంలో మాత్రం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోసెఫ్ తన అభిప్రాయం తెలుపుతూ ‘అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని 1980లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొన్ని కోర్టులు అనవసరంగా దోషులకు ఉరిశిక్ష వేస్తున్నాయి. శిక్షలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉరిశిక్ష విఫలమైంది. ఉరి శిక్షను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశంలోనే మనం దానిని చూడాల్సిన సమయం వచ్చింది. ఉరిశిక్ష ఉన్నంతకాలం.. ఆ కేసు ఉరిశిక్ష విధించదగ్గంత అత్యంత అరుదైన, హీనమైనదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన భారీ బాధ్యత జడ్జీలపై ఉంటుంది. రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఈ ఉరిశిక్ష హరిస్తుంది. కాబట్టి ఉరిశిక్షను విధించేటప్పుడు జడ్జీలు రాజ్యాంగానికి లోబడి అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. అయితే జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలు జస్టిస్ కురియన్ అభిప్రాయంతో విభేదించారు. 1980లోనే ఓ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించిందనీ, ఐపీసీలో ఉన్న ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించొచ్చని నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనీ, దీన్ని ఇప్పుడు మళ్లీ పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు. -
పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా: సుప్రీం
న్యూఢిల్లీ: పెట్రోలియం కోక్ దిగుమతులపై నిషేధం విషయమై సమయానికి స్పందించకపోవడంతో పెట్రోలియం మంత్రిత్వ శాఖపై సుప్రీంకోర్టు సోమవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘పెట్రోలియం శాఖ వాళ్లు దేవుళ్లా? వాళ్లకిష్టమొచ్చినప్పుడు స్పందిస్తారా? భారత ప్రభుత్వం కన్నా పెద్దదా పెట్రోలియం శాఖ? పనిలేకుండా కూర్చున్న జడ్జీలు వారికి కావాల్సినంత సమయం ఇస్తారని అనుకుంటున్నారా?’ అంటూ జస్టిస్ ఎంబీ లోకూర్, జస్టిస్ దీపక్ గుప్తాలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పెట్రోలియం కోక్ (బొగ్గు ఆకారంలో ఉండే పారిశ్రామిక ఇంధనం) దిగుమతులపై నిషేధానికి సంబంధించి పెట్రోలియం శాఖ తన నివేదికను కేవలం ఆదివారమే తమకు సమర్పించిందని పర్యావరణ, అటవీ శాఖ కోర్టుకు చెప్పడంతో జడ్జీలు కోపోద్రిక్తులయ్యారు. పెట్రోలియం శాఖకు 25 వేల రూపాయల జరిమానా విధించి నాలుగు రోజుల్లో చెల్లించాల్సిందేనని ఆదేశించారు. -
నియామకాల్లో సాంకేతికతకు పెద్దపీట
♦ పీఎస్సీ చైర్మన్ల జాతీయ సదస్సులో యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా పిలుపు ♦ టీఎస్పీఎస్సీ విధానాలు ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమని వ్యాఖ్య ♦ రిక్రూట్మెంట్లలో జవాబుదారీకి ప్రాధాన్యమివ్వాలి: కేటీఆర్ ♦ టీఎస్పీఎస్సీకి స్వయంప్రతిపత్తిపై సీఎంతో మాట్లాడతానని వెల్లడి ♦ ఆన్లైన్ ఓటింగ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని వ్యాఖ్య సాక్షి,హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రిక్రూట్మెంట్ ప్రక్రియలో సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాల కోసం టీఎస్పీఎస్సీ చేపడుతున్న ప్రణాళికలు, అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల పీఎస్సీలకు అనుసరణీయమన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్ల జాతీయ సదస్సును యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తాతో కలసి ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా దీపక్ గుప్తా మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ కొత్తగా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం యూపీఎస్సీని స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, కొన్ని పీఎస్సీలకు చెందిన సభ్యులు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్లు పాల్గొన్నారు. నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పెంచాలి పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ నిరుద్యోగ యువకుల్లో పీఎస్సీలపై నమ్మకాన్ని పెంపొందించాలని మంత్రి కేటీఆర్ వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లకు విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా రిక్రూట్మెంట్ ప్రక్రియలో సాధ్యమైనంత ఎక్కువగా పారదర్శకత, జ వాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు. ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అమలు చేయడంతోపాటు ఆన్లైన్ విధానంలో అభ్యర్థుల నమోదు, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణతో టీఎస్పీఎస్సీ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కొనియాడారు. ఫలితంగా సకాలంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఫలితాలను వెల్లడించడం సులువవుతోందని చెప్పారు. ఉత్తమ సంస్కరణలు అమలు చేసినందుకుగాను టీఎస్పీఎస్సీకి జాతీయ స్థాయిలో అవార్డులు లభించడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పీఎస్సీల చైర్మన్ల సదస్సు నిర్వహించడం ద్వారా టీఎస్పీఎస్సీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. టీఎస్పీఎస్సీ కోరుతున్నట్టుగా.. ఆర్థిక, పరిపాలనఅంశాల్లో స్వయం ప్రతిపత్తి(అటానమీ)ని కల్పించే అంశంపై సీఎంతో చర్చిస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షల నిర్వహణలో ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు తెలంగాణ ఐటీ విభాగం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం టి-హబ్‌లో వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు, స్టార్టప్స్‌తో జరగనున్న సమావేశంలో పీఎస్సీలకు అవసరమైన సాంకేతిక అంశాలను తెలియజేయాలని చైర్మన్లను కేటీఆర్ కోరారు. పీఎస్సీలకు రాజ్యాంగ రక్షణ ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, సభ్యులకు రాజ్యాంగపరమైన రక్షణ, వేతన భత్యాలు, పింఛన్, ఆర్థిక, పరిపాలన అంశాల్లో స్వయం ప్రతిపత్తి, పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంపు.. తదితర అంశాలను చర్చించనున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ పీఎస్సీ చైర్మన్ తోమర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో నూతనంగా నియమితులవుతున్న సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఎస్సీ ప్రణాళికల్లో భాగంగానే ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని, వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యులను ఈ వర్క్‌షాప్‌కు పంపాలని పీఎస్సీ చైర్మన్లకు సూచించారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఎంతో మంది విద్యాధికులైన యువత ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టీఎస్పీఎస్సీ పయనిస్తుందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను ఈ సదస్సు ద్వారా అన్వేషించేందుకు వీలుకలుగుతుందన్నారు. ఆన్లైన్ ఓటింగ్‌ను అందుబాటులోకి తేవాలి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం 45 శాతమే ఓటింగ్ నమోదైందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఆన్లైన్ ఓటింగ్ విధానంపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తే మేలని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్లైన్ ఓటింగ్ విధానంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో ఈ విధానం అమలవుతోందని, దేశంలో అవలంబిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచవచ్చని చెప్పారు. తప్పు చేస్తే భవిష్యత్ తరాలు క్షమించవు: గవర్నర్ ఉద్యోగ నియామకాల్లో చిన్న తప్పు దొర్లినా.. అది అనేక మంది భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పారదర్శకతపై దృష్టి సారించాలన్నారు. గురువారమిక్కడ 18వ జాతీయ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా టీఎస్పీఎస్సీ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎంపిక చేసే అభ్యర్థి ఆ ఉద్యోగానికి తగిన యోగ్యత ఉందా లేదా అనేది నిర్ణయించాలి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రానికి మంచి పేరు రావడం మీ చేతుల్లోనే ఉంది. తప్పులు జరిగితే భవిష్యత్తు తరాలు క్షమించవు..’’ అని అన్నారు. దేశంలోని అన్ని పీఎస్సీలు ఒకే రకమైన ఉద్యోగ నియామక విధానంపై దృష్టి సారించాలన్నారు. కమిషన్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేపట్టాలన్నారు.యూపీఎస్సీ తరహాలో నోటిఫికేషన్ జారీ నుంచి నియామకాల వరకు సమయపాలనను పాటించాలని సూచించారు. ప్రతీ పరీక్ష జరిగిన తర్వాత అందులో జరిగిన తప్పులు, విమర్శలపై పరిశీలించి పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలన్నారు. టీఎస్పీఎస్సీ ప్రవేశపెట్టిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విధానం బాగుందని కొనియాడారు. సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘంటా చక్రపాణి జ్ఞాపికను అందజేశారు. -
ఉమ్మడి లక్ష్యాలకు పీఎస్సీల సదస్సు
♦ హాజరుకానున్న యూపీఎస్సీ, అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు ♦ ఉత్తమ విధానాలు, సంక్షేమ అంశాలపై విస్తృత చర్చలు ♦ ప్రారంభ, ముగింపు కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా సీఎం, గవర్నర్ ♦ విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి సాక్షి, హైదరాబాద్: అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ (పీఎస్సీ)ల ఉమ్మడి లక్ష్యాల (అవకాశాలు, ఆవిష్కరణలు, చేపట్టాల్సిన చర్యల)పై చర్చించేందుకు తమ సంస్థ అధ్వర్యంలో 4, 5 తేదీల్లో హైదరాబాద్‌లో పీఎస్సీల చైర్మన్ల 18వ జాతీయ సదస్సు నిర్వహిస్తున్నట్లు టీఎస్పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా అధ్యక్షతన జరగనున్న ఈ సదస్సుకు అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, కొన్ని రాష్ట్రాలకు చెందిన సభ్యులు హాజరవుతున్నట్లు ఆయన చెప్పారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నిర్వహిస్తున్న తొలి సదస్సుకు సంబంధించిన ఏర్పాట్లు, సదస్సులో చర్చకు రానున్న అంశాల గురించి సోమవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో చక్రపాణి వివరించారు. 1949 నుంచి వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సదస్సుల ద్వారా పీఎస్సీల గత అనుభవాలు, ఉమ్మడి అవసరాలు (కొత్త టెక్నాలజీ, పరీక్షలకు సిలబస్), భవిష్యత్తులో చేపట్టాల్సిన చర్యలపై నిర్ణయాలు తీసుకునేందుకు తాజా సదస్సులో వీలు కలుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కోరిన వెంటనే హైదరాబాద్‌లో సదస్సు నిర్వహణకు యూపీఎస్సీ చైర్మన్ అంగీకరించారన్నారు. ఆయా రాష్ట్రాల పీఎస్సీలు అవలంబిస్తున్న విధానాలతోపాటు కమిషన్ల సభ్యుల సంక్షేమానికి (జీతభత్యాలు, పదవీ విరమణ వయసు..తదితర) సంబంధించిన అంశాలపైనా, రాజ్యాంగబద్ధ సంస్థ అయినప్పటికీ కోర్టుల మాదిరిగా రక్షణ లేదంటూ సభ్యుల్లో నెలకొన్న అభిప్రాయంపైనా చర్చించనున్నట్లు తెలిపారు. ఏర్పాట్లు పూర్తి సదస్సు నిర్వహణకు అన్ని ఏర్పాట్లు (చిలుకూరు సమీపంలోని ప్రగతి రిసార్ట్స్‌లో) చేశామని ఘంటా చక్రపాణి తెలిపారు. 4వ తేదీన ఉదయం 9.30 గంటలకు సీఎం కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై సదస్సును ప్రారంభిస్తారని... అదే రోజు సాయంత్రం 5 గంటలకు జరిగే ముగింపు కార్యక్రమానికి గవర్నర్ నరసింహన్ ముఖ్యఅతిథిగా హాజరవుతారన్నారు. 5వ తేదీన పీఎస్సీలకు సంబంధించిన అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరుగుతాయన్నారు. పోటీ పరీక్షలను మరింత పటిష్టంగా నిర్వహించేందుకు పీఎస్సీల అవసరాలు, ఐటీ నిపుణుల వద్ద ఉన్న అవకాశాలను పర స్పరం తెలుసుకునేందుకు ప్రఖ్యాత ఐటీ సంస్థల ప్రతినిధులతో పీఎస్సీల చైర్మన్లు టి-హబ్‌లో సమావేశం కానున్నట్లు చక్రపాణి తెలిపారు. విలేకరుల సమావేశంలో టీఎస్పీఎస్సీ కార్యదర్శి పార్వతి సుబ్రమణియన్, సభ్యులు విఠల్, మన్మథరెడ్డి, చంద్రావతి, సాయిలు, మతీనుద్దీన్ ఖాద్రీ, విద్యాసాగర్‌రావు, రాజేందర్, రామ్మోహన్‌రెడ్డి, వివేక్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.