నియామకాల్లో సాంకేతికతకు పెద్దపీట | Overriding on recruitment technology ;ktr | Sakshi
Sakshi News home page

నియామకాల్లో సాంకేతికతకు పెద్దపీట

Published Fri, Feb 5 2016 2:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 PM

నియామకాల్లో సాంకేతికతకు పెద్దపీట

నియామకాల్లో సాంకేతికతకు పెద్దపీట

పీఎస్సీ చైర్మన్ల జాతీయ సదస్సులో యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా పిలుపు
టీఎస్‌పీఎస్సీ విధానాలు ఇతర రాష్ట్రాలకు అనుసరణీయమని వ్యాఖ్య
రిక్రూట్‌మెంట్లలో జవాబుదారీకి ప్రాధాన్యమివ్వాలి: కేటీఆర్
టీఎస్‌పీఎస్సీకి స్వయంప్రతిపత్తిపై సీఎంతో మాట్లాడతానని వెల్లడి
ఆన్‌లైన్ ఓటింగ్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలని వ్యాఖ్య

 సాక్షి,హైదరాబాద్: దేశంలోని అన్ని రాష్టాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సాంకేతికతను వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తా అన్నారు. కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో నియామకాల కోసం టీఎస్‌పీఎస్సీ చేపడుతున్న ప్రణాళికలు, అమలు చేస్తున్న విధానాలు ఇతర రాష్ట్రాల పీఎస్సీలకు అనుసరణీయమన్నారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్‌పీఎస్సీ) ఆధ్వర్యంలో గురువారం హైదరాబాద్ శివారులోని ప్రగతి రిసార్ట్స్‌లో ఏర్పాటు చేసిన అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్ల జాతీయ సదస్సును యూపీఎస్సీ చైర్మన్ దీపక్ గుప్తాతో కలసి ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రారంభించారు.

ఈ సందర్భంగా దీపక్ గుప్తా మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో వివిధ రకాల పోటీ పరీక్షలు నిర్వహిస్తున్న యూపీఎస్సీ కొత్తగా సింగిల్ విండో విధానాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు రాజ్యాంగం యూపీఎస్సీని స్వయం ప్రతిపత్తి గల సంస్థగా రూపొందించిందని పేర్కొన్నారు. ఈ సదస్సులో దేశవ్యాప్తంగా 25 రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, కొన్ని పీఎస్సీలకు చెందిన సభ్యులు, ఏపీపీఎస్సీ మాజీ చైర్మన్లు  పాల్గొన్నారు.

 నిరుద్యోగుల్లో నమ్మకాన్ని పెంచాలి
పోటీ పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పాటిస్తూ నిరుద్యోగ యువకుల్లో పీఎస్సీలపై నమ్మకాన్ని పెంపొందించాలని మంత్రి కేటీఆర్ వివిధ రాష్ట్రాల పీఎస్సీ చైర్మన్లకు విజ్ఞప్తి చేశారు. వివిధ దశల్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియలో సాధ్యమైనంత ఎక్కువగా పారదర్శకత, జ వాబుదారీతనానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ నియామక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్‌పీఎస్సీ పలు రాష్ట్రాల్లో అధ్యయనం చేసిందని పేర్కొన్నారు.

ఆయా రాష్ట్రాల్లో అనుసరిస్తున్న ఉత్తమ పద్ధతులను అమలు చేయడంతోపాటు ఆన్‌లైన్ విధానంలో అభ్యర్థుల నమోదు, దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణతో టీఎస్‌పీఎస్సీ సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని కొనియాడారు. ఫలితంగా సకాలంలో పరీక్షలు, ఇంటర్వ్యూలు, ఫలితాలను వెల్లడించడం సులువవుతోందని చెప్పారు. ఉత్తమ సంస్కరణలు అమలు చేసినందుకుగాను టీఎస్‌పీఎస్సీకి జాతీయ స్థాయిలో అవార్డులు లభించడం గర్వకారణమన్నారు. జాతీయ స్థాయి పీఎస్సీల చైర్మన్ల సదస్సు నిర్వహించడం ద్వారా టీఎస్‌పీఎస్సీ మరింత పటిష్టమవుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు.

టీఎస్‌పీఎస్సీ కోరుతున్నట్టుగా.. ఆర్థిక, పరిపాలనఅంశాల్లో స్వయం ప్రతిపత్తి(అటానమీ)ని కల్పించే అంశంపై సీఎంతో చర్చిస్తానని ప్రకటించారు. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పరీక్షల నిర్వహణలో ఎదుర్కొంటున్న సాంకేతిక సవాళ్లకు పరిష్కారాలను అందించేందుకు తెలంగాణ ఐటీ విభాగం సిద్ధంగా ఉందన్నారు. శుక్రవారం టి-హబ్‌లో వివిధ ఐటీ కంపెనీల ప్రతినిధులు, స్టార్టప్స్‌తో జరగనున్న సమావేశంలో పీఎస్సీలకు అవసరమైన సాంకేతిక అంశాలను తెలియజేయాలని చైర్మన్లను కేటీఆర్ కోరారు.

పీఎస్సీలకు రాజ్యాంగ రక్షణ
ఈ సదస్సులో అన్ని రాష్ట్రాల పీఎస్సీల చైర్మన్లు, సభ్యులకు రాజ్యాంగపరమైన రక్షణ, వేతన భత్యాలు, పింఛన్, ఆర్థిక, పరిపాలన అంశాల్లో స్వయం ప్రతిపత్తి, పదవీ విరమణ వయస్సు 62 నుంచి 65కు పెంపు.. తదితర అంశాలను చర్చించనున్నట్లు హిమాచల్‌ప్రదేశ్ పీఎస్సీ చైర్మన్ తోమర్ తెలిపారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లలో నూతనంగా నియమితులవుతున్న సభ్యులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. యూపీఎస్సీ ప్రణాళికల్లో భాగంగానే ఈ నెల 23, 24 తేదీల్లో ఢిల్లీలో వర్క్‌షాప్ నిర్వహిస్తున్నామని, వివిధ రాష్ట్రాలకు చెందిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ల సభ్యులను ఈ వర్క్‌షాప్‌కు పంపాలని పీఎస్సీ చైర్మన్లకు సూచించారు. టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ..  ఎంతో మంది విద్యాధికులైన యువత ఉద్యమ ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. వారి ఆకాంక్షలను నెరవేర్చే దిశగా టీఎస్‌పీఎస్సీ పయనిస్తుందని చెప్పారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కార మార్గాలను ఈ సదస్సు ద్వారా అన్వేషించేందుకు వీలుకలుగుతుందన్నారు.

ఆన్‌లైన్ ఓటింగ్‌ను  అందుబాటులోకి తేవాలి
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కేవలం 45 శాతమే ఓటింగ్ నమోదైందని, రాబోయే సాధారణ ఎన్నికల్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు ఆన్‌లైన్ ఓటింగ్ విధానంపై ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు దృష్టి సారిస్తే మేలని మంత్రి కేటీఆర్ అన్నారు. అయితే ఇది తన వ్యక్తిగత అభిప్రాయమని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆన్‌లైన్ ఓటింగ్ విధానంపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. విదేశాల్లో ఈ విధానం అమలవుతోందని, దేశంలో అవలంబిస్తే పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతాన్ని మరింత పెంచవచ్చని చెప్పారు.

తప్పు చేస్తే భవిష్యత్ తరాలు క్షమించవు: గవర్నర్
ఉద్యోగ నియామకాల్లో చిన్న తప్పు దొర్లినా.. అది అనేక మంది భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని గవర్నర్ నరసింహన్ అన్నారు. పబ్లిక్ సర్వీస్ కమిషన్లు పారదర్శకతపై దృష్టి సారించాలన్నారు. గురువారమిక్కడ 18వ జాతీయ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ల చైర్మన్ల సదస్సులో ఆయన పాల్గొన్నారు. ‘‘ఉద్యోగ నియామకాల్లో ఎలాంటి అక్రమాలు జరగకుండా టీఎస్‌పీఎస్సీ జాగ్రత్తగా చర్యలు తీసుకోవాలి. ఎంపిక చేసే అభ్యర్థి ఆ ఉద్యోగానికి తగిన యోగ్యత ఉందా లేదా అనేది నిర్ణయించాలి. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్రానికి మంచి పేరు రావడం మీ చేతుల్లోనే ఉంది.

తప్పులు జరిగితే భవిష్యత్తు తరాలు క్షమించవు..’’ అని అన్నారు. దేశంలోని అన్ని పీఎస్సీలు ఒకే రకమైన ఉద్యోగ నియామక విధానంపై దృష్టి సారించాలన్నారు. కమిషన్లు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ అవసరాలను దృష్టిలో పెట్టుకొని మార్పులు చేపట్టాలన్నారు.యూపీఎస్‌సీ తరహాలో నోటిఫికేషన్ జారీ నుంచి నియామకాల వరకు సమయపాలనను పాటించాలని సూచించారు. ప్రతీ పరీక్ష జరిగిన తర్వాత అందులో జరిగిన తప్పులు, విమర్శలపై పరిశీలించి పరీక్షా విధానంలో మార్పులు తీసుకురావాలన్నారు. టీఎస్‌పీఎస్సీ ప్రవేశపెట్టిన వన్ టైమ్ రిజిస్ట్రేషన్ విధానం బాగుందని కొనియాడారు. సమావేశం అనంతరం అన్ని రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్లకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఘంటా చక్రపాణి జ్ఞాపికను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement