గురువుల ఎంపికే ఉత్తమం
అభిప్రాయం
నేడు కావాల్సింది భవిష్యత్ సమాజ సృష్టికర్తలను తయారుచేసే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని ఎంపిక అనాలి. దీన్ని గమనించి ప్రభుత్వం ఈ పనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి అప్పగించడం హర్షణీయం.
ప్రజాస్వామిక ప్రభుత్వాలంటే మెజారిటీ ప్రభుత్వాలు కాదు. ఎన్నికల్లో ఒక పార్టీ అధికారానికి వచ్చి బాధ్యతను స్వీకరించి అందరి అభిప్రాయాలను క్రోడీకరించి ప్రజా శ్రేయస్సుకై ఆచరణ యోగ్య మైన పథకాలను రూపొందిం చడం. అదే ప్రగతిశీల శక్తుల, పార్టీల విధి. కాబట్టి ఆచరణ రీత్యా ఏ పథకమైనా ఎంత ప్రధానమో దాన్ని అమలుపరిచే యంత్రాంగం కూడా అంతే ప్రధానం. కనుక పాలనా యంత్రాంగం పని అధికారంలోని పార్టీల ఆలోచనా విధానానికి అద్దం పడుతుంది. ప్రజా నాయకులుగా ఎన్నికైన వ్యక్తులు తమ విధానాల, పథకాల అమలుకై సమర్థులైన మనుషులను ఎన్నుకోవాలి. ఆ ఎన్నికే వారి సంకల్పాన్ని ప్రతిబింబి స్తుంది. కాబట్టి ఉద్యోగులను నియమించే వ్యవస్థకు ప్రాధాన్యం ఉంది.
ఈ శతాబ్దిలో ప్రపంచంలో చాలా చిన్న చిన్న దేశాలేర్పడ్డాయి. అవి పెద్ద దేశాలతో పోటీ పడటమే కాదు, వారు సాధించలేని ప్రగతిని కూడా సాధించాయి. వాటి విజయం వెనుక ఉన్నది వాటి ప్రాధాన్యాలే. విద్యారంగానికి ప్రాధాన్యం ఇచ్చిన దేశాలు ముందంజ వేశాయి. విద్యారంగం కేవలం పాఠశాలల స్థాపనకే పరిమితం కారాదు. బాలలను బాధ్యత కలిగిన ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేవి పాఠశాలలే. విస్త్రుతమౌతోన్న జ్ఞానపరిధికి అనుగుణంగా విద్యార్థులను తయారు చేయడం, అపరిమితమైన జ్ఞానాన్ని విద్యార్థులకు అందుబాటులోకి తేవడం, దాన్ని సమాజానికి అన్వయిం చడం విద్య ముఖ్య లక్షణాలు. విజ్ఞానానికి కొత్త ఊటలు వెతికి ఎప్పటికప్పుడు ప్రవాహంలోకి తేవడం పాఠశాల ఉపాధ్యాయుల పని. అప్పుడే అవి విజయానికి సంకేతం అవుతాయి.
కొత్త రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. విద్య, వైద్య రంగాలపైన ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపగలిగితే అంత కొంగొత్త ప్రగతికి బాటలు పడతాయి. ఈ మధ్య ప్రభుత్వం విద్యారంగంపైన కొంత శ్రద్ధ చూపుతున్నట్టు కనిపిస్తోంది. విద్యాభివృద్ధి అంటే అట్టహాసాల అలం కారం కాదు. కావలసిన ఉపాధ్యాయులను సమకూర్చి తేనే గమ్యానికి చేరగలం. ఉపాధ్యాయుడు గత సమా జాన్ని తిరిగి ముద్ర వేయడం కాదు. మరో కొత్త సమాజా నికి బీజాలు వేయాలి. కొత్త సమస్యలకు పరిష్కారాలు చెప్పగలగాలి. ఆ పని చేసే పుస్తకాలుండవు. ఊహించని సమస్యలను ఎదుర్కునేలా మనుషులను ఎలా ఉపయో గించాలో తెలిసిన తరాన్ని సిద్ధం చేయడమే నేటి ఉపాధ్యాయుడి పని. ఈ బాధ్యతను సామాజిక స్పృహ కలిగిన మనిషే చేయగలడు. జ్ఞానం పరిధులు తెలిసిన వారై ఉండాలి. జ్ఞానం వ్యక్తుల ఎదుగుదలకు గాక, మొత్తం సమాజం ఎదుగుదలకు ఉపయోగపడాలి. కాబట్టి అలాంటి జిజ్ఞాస కలిగిన ఉపాధ్యాయులను నియ మించే వ్యవస్థ, భవిష్యత్తులో రావాల్సిన సమస్యలను ఆకళింపు చేసుకునేదిగా ఉండాలి. శరవేగంతో వస్తున్న ఆవిష్కరణలను జీర్ణం చేసుకొని రాబోయే సమాజాన్ని సృష్టించే ఉపాధ్యాయ వర్గం నియామకాన్ని ప్రభుత్వం ఏవిధంగా నిర్వహిస్తోందో ప్రజలు గమనిస్తూనే ఉంటారు. ఈనాటి వరకు ఉపాధ్యాయుల నియామకాన్ని రిక్రూట్‌మెంట్ అన్నారు. రిక్రూట్‌మెంట్ ద్వారా నీతినిజాయితీలు కలిగిన వ్యక్తులే లభించినా, వారు గత సమాజాన్ని యథాతథంగా ఉంచితే చాలని భావిస్తారు. కానీ నేడు కావాల్సింది భవిష్యత్ సమాజ సృష్టికర్తలను తయారుచేసే ఉపాధ్యాయులు. అటువంటి ఉపాధ్యాయుల నియామకాన్ని సెలక్షన్ అనాలి.
రిక్రూట్ మెంట్‌గా చూడకూడదు. తహసీల్దార్ ఆఫీసుల్లో క్లర్క్‌ల నియామకాన్ని రిక్రూట్‌మెంట్ అనడం సబబుగా ఉంటుంది. దీన్ని గమనించి ఈ పనిని పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి అప్పగించడం హర్షణీయం. ప్రభుత్వ దూర దృష్టికి నేను అభినందిస్తున్నాను. అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్‌లో ఒక ప్రొఫెసర్, విద్యారంగంలో అనుభవ మున్న వ్యక్తి, ఉపాధ్యాయ వృత్తికున్న ప్రాశస్త్యం తెలిసిన మనిషి ఉండటం వల్ల మా ఆశలు ఇనుమడించాయి. అయితే అందుకు తగిన సిబ్బంది కూడా అవసరం. ఉపాధ్యాయుల నియామకం గ్రూప్-2 ఎక్జామినేషన్స్ నిర్వహించినట్టు కాదు. ఉపాధ్యాయ నియామకాలకు పోటీపడే వారందరికీ డిగ్రీలుంటాయి. నైపుణ్యం ఉంటుంది. కానీ నేటి సమాజానికి ఇవి రెండే ప్రామా ణికం కాదు. జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళే పరిశోధనా తత్వం, విద్యార్థులంటే ఆదరణ, వారికి ప్రేరణనిచ్చే, స్నేహమైన వైఖరి ప్రదర్శించే ఉపాధ్యాయులు కావాలి. సృజనాత్మకత కలిగి ఉండి వృత్తి పట్ల అంకితభావం ఉండాలి. దీనివల్ల విద్యార్థుల అంతరాంతరాల్లో ఇమిడి ఉన్న ప్రతిభ బయటకు వస్తుంది. ఇవన్నీ మనుషుల్లో పైకి కనపడని గుణాలు. వీటిని గుర్తించే మనిషి ఎంత అనుభవంతో ఉండాలో పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కి సులభం గానే అర్థం అవుతుందని భావిస్తాను.
మానవ సంపదంతా ప్రైవేటు యాజమాన్యాల దగ్గర పోగుపడుతోంది. అందుకే అక్కడ తయారైన విద్యార్థులకి సైతం ఆ పెట్టుబడిదారీ లక్షణాలే ఒంటబడు తున్నాయి. కానీ మనం విద్యారంగాన్ని ప్రజాపరం చేయాలనుకుంటున్నాం. లాభదృష్టికన్నా ప్రజాహితమే ప్రధానం అనుకున్న తరాన్ని సృష్టించవలసి ఉన్నది. అందుకు కావాల్సిన ఉపాధ్యాయులను ఎన్నుకునే బృహత్తర కార్యక్రమాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం విద్యకు వేరే దశను చూపించాం. ఆ కోణం దారితీసిన చెడ్డ సాంప్రదా యాల దుష్పలితాలను మన తరాలు అనుభవిస్తూనే ఉన్నాయి. చిన్న చిన్న దేశాలు విద్యారంగాన్ని ప్రజల పక్షాన నిలబెట్టి ప్రగతిని సాధించాయి. దానికి కావాల్సిన ఉపాధ్యాయ వర్గాన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎన్నుకుం టుందని ఆశిస్తున్నా. గ్రూప్ 2 పరీక్షలు సమర్థవంతంగా నిర్వహించి ఆదర్శంగా నిలిచిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఈ ఛాలెంజ్‌ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొం టుందని భావిస్తున్నా.
వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త