వాసి గల ఉపాధ్యాయులేరీ?
సందర్భం
ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు డ్రైవింగ్ లైసెన్స్‌లుగా మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వాహనాలను నైపుణ్యంతో నడప గలరని అర్థం కాదు. నిజమైన నైపుణ్యాలుంటేనే మంచి వాహన చోదకుడవుతాడు.
ఇటీవల హైదరాబాద్‌లో జరి గిన జాతీయస్థాయి పబ్లిక్ స్కూల్స్ సదస్సు ఇచ్చిన పిలుపు దేశ భవిష్యత్తుకు మేలు కొలుపు. నాణ్యమైన ఉపాధ్యా యులను తయారుచేయడంపై ప్రభుత్వాలు దృష్టి సారించా లని 77వ ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ కాన్ఫరెన్స్ (ఐపీ ఎస్‌సీ) విజ్ఞప్తి చేసింది. 21వ శతాబ్దంలో విద్యే దేశ భవి ష్యత్తుకు చుక్కాని అని అందరూ గుర్తించడం వాస్తవమే కానీ, ఆ దిశగా గట్టిగా అడుగులు పడకపోవడంతో సదరు పాఠశాలల ప్రధానోపాధ్యాయులే చివరకు ప్రాధే యపడాల్సి వచ్చింది.
దేశం మొత్తం మీద 15 లక్షలకు పైచిలుకు స్కూల్స్ ఉన్నాయి. 38 వేల కళాశాలలు, 760 విశ్వవిద్యాల యాలు, 12 వేల శిక్షణా సంస్థలున్నాయి. పైగా ప్రభు త్వాలు అవసరం ఉన్నప్పుడు ఉపాధ్యాయ, అధ్యాపక నియామకాలు జరుపుతున్నాయి. సమస్యల్లా నాణ్యమైన ఉపాధ్యాయుల విషయంలోనే. ప్రభుత్వ, ప్రైవేట్ రంగా లతో సంబంధం లేకుండా ఐదవ తరగతిలో ఉన్న విద్యార్ధి రెండో తరగతి పుస్తకాన్ని చదవలేకపోవడాన్ని పలు సర్వేలు ఎత్తిచూపాయి. దీనిని బట్టి ఉపాధ్యాయుల బోధన ఏ స్థాయిలో ఉన్నదో స్పష్టం అవుతోంది. గత దశాబ్దికాలంలో ప్రైవేట్ విద్యా రంగంలో మౌలిక వస తులకు కొదవలేదు.
కానీ ఉపాధ్యాయ వర్గంలో విద్యా ప్రమాణాలకు నూతన భవంతులు, సాంకేతిక పరిజ్ఞానం గీటురాయి కాదు. పిల్లలకు చదువు బాగా రావాలంటే మంచి టీచరు ఉండాలని అందరూ అంగీకరిస్తారు. అయితే దీనిని అమలులోకి తీసుకురావడంలో చిత్తశుద్ధి కన్పించదు. ప్రభుత్వాల దృష్టిలో టీచర్ రిక్రూట్‌మెంట్, కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ ఒక్కటే. నిరుద్యోగ లోకంలో అసంతృప్తి ప్రబలినప్పుడు ప్రభుత్వాల వద్ద ఉండే నియా మకాల ఆయుధాలివి. అంతే తప్ప ఉపాధ్యాయ నియా మకాలపై ఏ ప్రభుత్వానికి ప్రత్యేక శ్రద్ధ కన్పించదు.
మంచి విద్యార్థులు తయారు కావాలంటే మంచి ఉపాధ్యాయులను ఎంపిక చేయాలన్న చిత్తశుద్ధి ఉండాలి. విద్యార్థిలోని నిజమైన ప్రతిభను వెలికి తీయాలంటే మెరి కల్లాంటి టీచర్లు ఉండాలి. అసాధారణ తెలివితేటలు గల విద్యార్థులకు ఎవరైనా చదువు చెప్పగలరు. మామూలు విద్యార్థిలో నిద్రాణంగా ఉన్న ప్రతిభను బయటికి తీయా లంటే మంచి ఉపాధ్యాయులు కావాలి. మంచి టీచర్ క్లాస్ చెప్పడంతోనే తన పని అయిపోతుందని భావిం చడు. విద్యార్థిలో నిబిడీకృతమైన ప్రతిభను బయటికి తీసుకు వచ్చేందుకు ఉపాధ్యాయుడు ఎన్నో రూపాలలో వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తాడు. కొన్నిసార్లు విద్యార్థుల ప్రతిభకు పదును పెట్టేందుకు సవాళ్లు విసురు తాడు. ఇన్ని ప్రక్రియల్లో ఆరితేరిన ఉపాధ్యాయులను ఎంపిక చేయడం మాటలు కాదు.
ఉపాధ్యాయ శిక్షణా సంస్థలు ఇచ్చే సర్టిఫికెట్లు వాహ నాలకు ఇచ్చే డ్రైవింగ్ లైసెన్స్‌లుగా మారాయి. డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నంత మాత్రాన ప్రతి ఒక్కరు వాహనాలను నైపుణ్యంతో నడపగలరని అర్థం కాదు. నిజమైన నైపు ణ్యాలుంటేనే మంచి వాహన చోదకుడవుతాడు. అలాగే ఉపాధ్యాయ శిక్షణ సర్టిఫికెట్లు ఉన్న వారిలో అందరికీ తగిన సామర్థ్యం ఉండకపోవచ్చు. ఇందుకు రెండు అంశాలు ముఖ్యం–ఒకటి ఉపాధ్యాయ వృత్తిపై ఆసక్తి, ఈ వృత్తిలో ఇమిడిపోగల వారిని ఎంపిక చేయడం. ఈ ప్రక్రియను శిక్షణా సంస్థలకు పరిమితం చేయకుండా కళాశాలలు, విశ్వవిద్యాలయాల నుంచే మొదలవ్వాలి.
అనుభవజ్ఞులైన ప్రొఫెసర్లు తమ వృత్తిలో ఉపాధ్యాయు లుగా రాణించగలవారిని అక్కడే గుర్తించాలి. వారి ఆసక్తి, వ్యక్తీకరణ, విషయ జ్ఞానంపై అనురక్తి రీత్యా అటువంటి వారిని గుర్తించి ఉపాధ్యాయ శిక్షణకు వెళ్లమని ప్రోత్స హించాలి. ఉపాధ్యాయ ఎంపికలు రేపటి అవసరాలకు అనుగుణంగా జరిగితే ఉపాధ్యాయుడి సేవలు పదికాలా లపాటు ఉపయోగపడ తాయి. అందుకే ఇండియన్ పబ్లిక్ స్కూల్స్ ప్రిన్సిపాల్స్ సమగ్ర ఉపాధ్యాయ శిక్షణ కోసం ఐఐటీ, ఐఐఎం వంటి అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు గల విద్యా సంస్థలను రూపొందించమని కోరింది. పుస్త కాల్లో లేని చదువులను విద్యార్థుల మస్తిష్కాల్లోకి పంప గలిగేవే ఐఐటీలు. భవి ష్యత్ అవసరాలను కూడా అర్థం చేసుకొని బోధన జరిపే అలాంటి వ్యవస్థను ఉపాధ్యా యుల శిక్షణకు నెలకొల్ప మని ప్రిన్సిపాల్స్ అడగడం అంటే అంతటి ప్రాధాన్యాన్ని నొక్కి చెప్పడమే.
విద్యా వ్యవస్థకు ఇంతటి ప్రాధాన్యాన్ని ఇచ్చిన దేశాలు కాలం విసిరే సవాళ్లకు దీటుగా నిలబడుతు న్నాయి.
ఉత్తర కొరియా తన దాయాది దక్షిణ కొరియాను అణ్వస్త్రాలతో భయపెట్టాలని చూస్తే దక్షిణ కొరియా తన విద్యావ్యవస్థే అస్త్రంగా దీటుగా జవాబు చెప్పగలిగింది. యూరప్‌లోని ఆర్థిక వ్యవస్థల పునాదులు కదిలి పేక మేడల్లా కూలిపోతుంటే విద్యా వ్యవస్థ పునాదిగా ఫిన్లాండ్ బలంగా నిలబడగలిగింది. చైనా, జపాన్, దక్షిణ కొరియా దేశాలు మంచి మానవ వనరులను తయారు చేసుకొని అన్ని రంగాలలోను ప్రత్యేకత చూపగలుగుతు న్నాయి. ఇక మనదేశంలో 2013–14 ఆర్థిక సంవత్స రంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.3 లక్షల 25 వేల కోట్లను విద్యారంగంపై ఖర్చుపెట్టిన నేపథ్యంలో మెరుగైన ఉపాధ్యాయులను ఈ వ్యవస్థలోకి తీసుకురాక పోతే ప్రపంచంలో 5వ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవ తరించిన మన సంబరం ఎక్కువ కాలం నిలవదు. ప్రిన్సిపాల్స్ సదస్సు చేసిన విజ్ఞప్తిని ఇప్పుడైనా అంది పుచ్చుకుంటేనే స్వర్ణ భారత్‌ను అందించగలం.
చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త,
శాసనమండలి మాజీ సభ్యులు