ప్రజల ప్రాణాలతో చెలగాటమా? | Supreme Court asks Govt on Delhi air pollution | Sakshi
Sakshi News home page

ప్రజల ప్రాణాలతో చెలగాటమా?

Published Thu, Nov 7 2019 4:23 AM | Last Updated on Thu, Nov 7 2019 4:23 AM

Supreme Court asks Govt on Delhi air pollution - Sakshi

ఢిల్లీలో మాస్క్‌ ధరించి నిరసనలో పాల్గొన్న యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు

న్యూఢిల్లీ: ఢిల్లీలో ఏడాదికేడాది వాయు కాలుష్యం పెరిగిపోతూ ఉండటంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కోట్లాది మంది ప్రాణాలతో చెలగాటమెందుకని మండిపడింది. కాలుష్యాన్ని నియంత్రించాల్సిన బాధ్యత అధికారులదేనని స్పష్టం చేసింది. కాలుష్య కోరల్లో చిక్కుకొని ప్రజల ప్రాణాలు కోల్పోనిస్తారా ? దేశాన్ని వందేళ్లు వెనక్కి తీసుకువెళతారా అని జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ దీపక్‌ గుప్తాలతో కూడిన డివిజన్‌ బెంచ్‌ ప్రశ్నించింది. బుధవారం సుప్రీం కోర్టు ఎదుట కేంద్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఢిల్లీ, పంజాబ్, హరియాణా, యూపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు.  

పంట వ్యర్థాల దహనం ఎందుకు ఆపలేకపోతున్నారు ?
పొరుగు రాష్ట్రాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టడాన్ని నిరోధించడంలో అధికార యంత్రాంగం ఎందుకు విఫలం చెందుతోందని ప్రశ్నించింది. పంట వ్యర్థాల్ని తగలబెట్టడంపై సుప్రీంకోర్టు నిషేధం విధించినప్పటికీ పంజాబ్, హరియాణా ప్రభుత్వాలు సీరియస్‌గా తీసుకోలేదు. ఈ రెండు రాష్ట్రాల్లో మొత్తం 7 వేల ప్రాంతాల్లో పంట వ్యర్థాల్ని తగులబెట్టారని కాలుష్య నియంత్రణ బోర్డు వెల్లడించింది. దీనిపై తీవ్రంగా స్పందించిన సుప్రీం ఇక అధికారులకు శిక్షపడాల్సిన సమయం వచ్చిందని పేర్కొంది.

‘హరియాణా చర్యలపై కాస్త సంతృప్తి వ్యక్తం చేసిన సుప్రీం పంజాబ్‌ ప్రధాన కార్యదర్శిపై నిప్పులు చెరిగింది. ‘కాలుష్యాన్ని నియంత్రించే పద్ధతి ఇదా? పంజాబ్‌కి ప్రధాన కార్యదర్శిగా మీరేం చేస్తున్నారు. రైతులు పంట వ్యర్థాల్ని తగులబెట్టకుండా ఆపడం మీ వైఫల్యమే. ఇదే కొనసాగితే అధికారుల్ని సస్పెండ్‌ చేస్తాం’ అంటూ హెచ్చరించింది. ‘ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. ఇలాంటి పరిస్థితుల్ని చూసి గర్వపడతామా?’అని సుప్రీం జడ్జీలు నిలదీశారు.  

చైనా, పాక్‌ విష వాయువులు లీక్‌ చేస్తున్నారేమో: బీజేపీ నేత ఆరోపణలు
ఢిల్లీ కాలుష్యానికి పాక్, చైనా కారణమని యూపీకి చెందిన బీజేపీ నేత వినీత్‌ అగర్వాల్‌ ఆరోపించారు. పొరుగు దేశాలు మనపై విషవాయువులతో దాడి చేస్తున్నట్టుగా అనిపిస్తోంది. బహుశా అది పాక్, చైనాల పని అని ఆయన ఆరోపించారు. ఢిల్లీ సీఎం కేజ్రివాల్‌ పంట వ్యర్థాల్ని తగులబెట్టడం వల్లే కాలుష్యం అధ్వాన్నంగా మారిందన్న విమర్శల్ని తప్పు పట్టారు. దేశానికి వెన్నెముకలాంటి రైతుల్ని ఎలా నిందిస్తారని ప్రశ్నించారు.

రైతులకు క్వింటాల్‌కు 100: సుప్రీం
ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో నెలకొన్న కాలుష్య పరిస్థితికి కారణమైన పక్క రాష్ట్రాలపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. హరియాణా, పంజాబ్‌లో గడ్డిని తగులబెట్టని రైతులకు క్వింటాల్‌కు రూ. 100 ఇవ్వాల్సిందిగా ధర్మాసనం ఆదేశాలు ఇచ్చింది. వ్యవసాయం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలాంటిదని అందుకే రైతులకు ప్రయోజనకరంగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని  సూచించింది. గడ్డిని తగులబెట్టకుండా ఉండేందుకు ప్రత్యేక యంత్రాలను ఉపయోగించాలని చెప్పింది. సమస్యను ఎదుర్కొనేందుకు ప్రత్యేక పథకాన్ని 3 నెలల్లోగా తీసుకురావాలని హరియాణా, పంజాబ్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ ప్రభుత్వాలకు సూచించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement