న్యూఢిల్లీ: ఉరిశిక్షపై సుప్రీంకోర్టు ధర్మాసనంలోని న్యాయమూర్తులు బుధవారం భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. నేరాలను నియంత్రించడంలో ఉరిశిక్ష విఫలమైందని ధర్మాసనంలోని ఓ న్యాయమూర్తి అభిప్రాయపడగా, మిగిలిన ఇద్దరు జడ్జీలు అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష వేయొచ్చని సుప్రీంకోర్టు గతంలోనే ఇచ్చిన తీర్పును సమర్థించారు. ముగ్గురిని హత్య చేసిన ఓ దోషికి ఛత్తీస్‌గఢ్ హైకోర్టు విధించిన మరణ శిక్షను యావజ్జీవ శిక్షగా మార్చడంలో మాత్రం జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం ఏకాభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ సందర్భంగా ఇచ్చిన తీర్పులో జస్టిస్ జోసెఫ్ తన అభిప్రాయం తెలుపుతూ ‘అత్యంత అరుదైన కేసుల్లోనే మరణ శిక్ష విధించాలని 1980లోనే సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కొన్ని కోర్టులు అనవసరంగా దోషులకు ఉరిశిక్ష వేస్తున్నాయి. శిక్షలకు సంబంధించి రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను సాధించడంలో ఉరిశిక్ష విఫలమైంది. ఉరి శిక్షను ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టారో ఆ ఉద్దేశంలోనే మనం దానిని చూడాల్సిన సమయం వచ్చింది. ఉరిశిక్ష ఉన్నంతకాలం.. ఆ కేసు ఉరిశిక్ష విధించదగ్గంత అత్యంత అరుదైన, హీనమైనదేనా కాదా అన్న విషయాన్ని నిర్ధారించాల్సిన భారీ బాధ్యత జడ్జీలపై ఉంటుంది.
రాజ్యాంగం ఇచ్చిన జీవించే హక్కును ఈ ఉరిశిక్ష హరిస్తుంది. కాబట్టి ఉరిశిక్షను విధించేటప్పుడు జడ్జీలు రాజ్యాంగానికి లోబడి అత్యంత జాగ్రత్తగా, కచ్చితంగా తీర్పు ఇవ్వాల్సి ఉంటుంది’ అని అన్నారు. అయితే జస్టిస్ దీపక్ గుప్తా, జస్టిస్ హేమంత్ గుప్తాలు జస్టిస్ కురియన్ అభిప్రాయంతో విభేదించారు. 1980లోనే ఓ కేసులో ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఉరిశిక్షను సమర్థించిందనీ, ఐపీసీలో ఉన్న ఉరిశిక్ష రాజ్యాంగబద్ధమైనదేనని స్పష్టం చేసిందని వారు పేర్కొన్నారు. అత్యంత అరుదైన కేసుల్లో ఉరిశిక్ష విధించొచ్చని నాడు సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందనీ, దీన్ని ఇప్పుడు మళ్లీ పునఃసమీక్షించాల్సిన అవసరం లేదని వారు అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment