న్యూఢిల్లీ: అయోధ్య కేసును సవాలుగా స్వీకరించి పరిష్కరించానని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తెలిపారు. జస్టిస్ ఫర్ ద జడ్జ్ పేరిట రాసిన ఆత్మకథను ఆయన బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయోధ్య తీర్పు, రాజ్యసభ నామినేషన్, ఎన్‌ఆర్‌సీ, కొలీజియం తదితర పలు అంశాలపై ఇండియా టుడే, ఆజ్‌తక్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. ఆయా అంశాలపై రంజన్ అభిప్రాయాలు ఆయన మాటల్లో..
అయోధ్య తీర్పు: అయోధ్య కేసును నేను వెలికితీయలేదు. నా ముందున్న న్యాయమూర్తి ఒక తేదీని ఈ కేసుకు కేటాయించారు. ఆ తేదీ వచ్చినప్పుడు నేను పదవిలో ఉన్నాను. ఆ సమయంలో తప్పుకొని పోవడం లేదా ధైర్యంగా కేసును పరిష్కరించడమనే ఆప్షన్లు నాముందున్నాయి. నేనే ధైర్యంగా పరిష్కారానికి యత్నించాను.
లైంగిక వేధింపుల ఆరోపణ: నిజానికి ఆ బెంచ్‌పై నేను ఉండకుండా ఉండాల్సింది. కానీ 45ఏళ్లు కష్టపడి సంపాదించిన పేరు ఒక్కరాత్రిలో ధ్వంసమవుతుంటే చూస్తూ ఊరుకోలేం! సీజేఐ కూడా మానవమాత్రుడే! మీడియా మరింత అప్రమత్తతతో ఉండాలనే ఆ బెంచ్ తీర్పునిచ్చింది. కానీ మీడియా మాత్రం సీజేఐ తనకు తాను క్లీన్ చిట్ ఇచ్చుకున్నారని వార్తలు రాసింది. అందుకే ఆ బెంచ్‌లో నేను లేకుండా బాగుండేదని అనుకున్నా.
జడ్జీల మీడియా సమావేశం: పాత్రికేయ సమావేశం నిర్వహించడం నా ఆలోచనే! బహుశా నేను తప్పుగా ఊహించి ఉండవచ్చు. మా నలుగురు న్యాయ మూర్తుల ఆలోచనలను అప్పటి సీజేఐకి అర్థమయ్యేలా చెప్పాలన్న ప్రయత్నం చివరకు విఫలమైంది. అయితే ఇలాంటి మీడియా సమావేశాల్లో అదే మొదటిది, చివరిది కావాలని నా ఆశ.
రాజ్యసభ నామినేషన్: అయోధ్య తీర్పుకు ప్రతిఫలంగా కేంద్రం నాకు రాజ్యసభ సీటిచ్చిందన్న ఆరోపణలన్నీ నిరాధారాలే! రిటైర్డ్ జడ్జీలు గవర్నర్, మానవహక్కుల కమిషన్ చైర్మన్, లాకమిషన్ చైర్మన్ పదవులకు అర్హులు. వీటిని స్వీకరించమనా మీ సూచన? నా నామినేషన్ అధికరణ 80 ప్రకారం జరిగిన అంశం. ఇందులో తప్పేమీ లేదు. రాజ్యసభకు ఎంపికైనప్పటినుంచి ఒక్క పైసా తీసుకోలేదు. స్వంత ఖర్చులతో సభ్యత్వ నిర్వహణ చేస్తున్నాను.
రఫేల్ తీర్పు: రఫేల్ తీర్పు ముందు ప్రధాని సుప్రీంకోర్టుకు రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా వచ్చారు. ఈ సమావేశానికి బిమ్స్‌టెక్ దేశాల ప్రధాన న్యాయమూర్తులను ఆహ్వానించారు. ఆ సమావేశంలో ప్రధానితో సెల్ఫీలకు పోటీపడిన కొందరు జడ్జీలు ఇప్పుడు అదే ప్రధానిపై విమర్శలు గుప్పిస్తూ హడావుడి చేస్తున్నారు.
కొలీజియం: ప్రతి వ్యవస్థలో మంచిచెడులుంటాయి. సీజేఐగా కొలీజియంలో నాకు ఎలాంటి సమస్య ఎదురుకాలేదు. కొలీజియంలో సుదీర్ఘ చర్చల అనంతరం ఏకాభిప్రాయ సాధనకు కృషి చేయడం జరుగుతుంది.
Ranjan Gogoi: అయోధ్య కేసును సవాలుగా స్వీకరించా!
Published Sat, Dec 11 2021 5:32 AM | Last Updated on Sat, Dec 11 2021 8:40 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment