దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు | Rewind 2019 : Sensational Incidents Worldwide | Sakshi
Sakshi News home page

దిశ నుంచి ఢిల్లీ వరకు సంచలనాలు

Published Thu, Dec 26 2019 2:55 PM | Last Updated on Fri, Dec 27 2019 1:48 PM

Rewind 2019 : Sensational Incidents Worldwide - Sakshi

పౌర ఆగ్రహం పొగలు సెగలు కక్కింది. రేపిస్టులపైనా, అక్కరకు రాని చట్టాలపైనా.. పాలకులపైనా, ప్రమాదకరంగా మారిన పర్యావరణంపైనా.. అవినీతి, అసమానతలపైనా... యువతరం పిడికిలి బిగించి కదం తొక్కింది. కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి.. భారత్‌ నుంచి హాంకాంగ్‌ వరకు ఈ ఏడాది నిరసనలు మిన్నంటాయి. అలాగే దేశంలో సార్వత్రిక ఎన్నికలపై చర్చకు తెరలేపుతూ ప్రారంభమైన 2019వ ఏడాది అనేక సంచలన సంఘటనలకూ వేదికగా నిలిచింది. భారత ప్రజానికంతో పాటు ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించిన 2019 లోక్‌సభ ఎన్నికలతో పాటు దశాబ్దాల నుంచి ఎటూ తెగని వివాదంగా మిగిలిపోయిన అయోధ్య రామమందిర స్థల వివాదానికి కూడా ఈ ఏడాదిలో పూర్థిస్థాయి పరిష్కారం దొరికింది. కశ్మీర్‌ అంశంతో పాటు ఎన్‌ఆర్సీ, పౌరసత్వ సవరణ చట్టం వంటి పార్లమెంట్‌ చట్టాలకు 2019 చోటిచ్చింది. నిర్భయ ఉదంతాన్ని మరోసారి జ్ఞాపకం చేసేలా హైదరాబాద్‌లో అత్యంత దారుణంగా జరిగిన దిశ సంఘటన ఈ ఏడాదిలో అత్యంత సంచలనంగా మారింది.

  
కేంద్రంలో రెండోసారి బీజేపీ
ఈ ఏడాది ప్రథమార్థంలో అత్యధికంగా చర్చనీయాంశమైన అంశం సార్వత్రిక ఎన్నికలు. భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలు సైతం భారత్‌  ఎన్నికలను ఆసక్తికరంగా గమనించాయి. మార్చి, ఏప్రిల్‌ మాసాల్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ఫలితాలు మే 23న విడుదల అయ్యాయి. ఈ ఎన్నికల్లో నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతా పార్టీ ఏకంగా 303 సీట్లు తన ఖాతాలో వేసుకుంది. ఎన్డీయే కూటమి మొత్తం 352 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. దీంతో రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టారు. ప్రధాన పత్రిపక్షం కాంగ్రెస్‌ కేవలం 52 స్థానాలకు పరిమితం కాగా.. రెండు సీట్ల తేడాతో ప్రతిపక్ష హోదాకు దూరమయ్యింది. యూపీఏ కూటమికి 91 సీట్లు దక్కగా ఇతరులు 99 స్థానాల్లో విజయం సాధించారు. పార్టీలవారీగా చూస్తే.. డీఎంకే 23, వైఎస్సార్‌సీపీ, టీఎంసీ 22, శివసేన 18, జేడీయూ 16 సీట్లలో విజయం సాధించాయి. ఎస్పీకి 5, బీఎస్పీకి 10 సీట్లు మాత్ర మే దక్కాయి. ఇక సీపీఎం 3, సీపీఐ 2 స్థానాల్లో గెలుపొందాయి.

అయోధ్య.. రాముడిదే
దేశంలో సరికొత్త రాజకీయ చర్చకకు కేంద్రబిందువైన వివాదస్పద అయోధ్య రామమందిర, బాబ్రీ మసీదు స్థలంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సంచలన తీర్పును వెలువరించింది. వివాదాస్పద కట్టడం ఉన్న స్థలం హిందువులదేనని స్పష్టం చేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు చెప్పింది. 2.77 ఎకరాల స్థలం హిందువులకే చెందుతుందని నవంబర్‌ 9న ఇచ్చిన తీర్పులో తేల్చిచెప్పేసింది. వివాదాస్పద స్థలానికి సంబంధించి 3 నెలల్లో కేంద్రం ట్రస్ట్‌ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. మసీదు నిర్మాణానికి అయోధ్యలో సున్నీ వక్ఫ్‌బోర్డుకు 5 ఎకరాల స్థలం కేంద్రం లేదా ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సూచించింది. అయితే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై పలువురు ముస్లిం సంఘాల ప్రతినిధిలు అభ్యంతరం వ్యక్తం చేశారు. కోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం పర్సనల్‌ లాబోర్డుతో సహా, పలువురు సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీజే ఎస్‌ఏ బాబ్డే నేతృత్వంలోని ధార్మాసనం వాటన్నింటినీ కొట్టివేసింది. సుప్రీం తీర్పే అంతిమమైనదని స్పష్టంచేసింది.
 

పుల్వామా ఉగ్రదాడి..
జమ్మూకశ్మీర్‌లో భద్రతాబలగాలకు ఈ ఏడాది గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పుల్వామా జిల్లా అవంతిపొరా పట్టణం సమీపంలోని లెత్‌పొరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి పాల్పడ్డారు. ఓ స్కార్పియో ఎస్‌యూవీలో దాదాపు 350 కేజీల అత్యాధునిక పేలుడు పదార్థాన్ని (ఐఈడీ) నింపుకున్న ఓ ఆత్మాహుతి దళసభ్యుడు జవాన్ల వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకున్నాడు. తన కారుతో కాన్వాయ్‌లోని ఓ బస్ను ఢీకొట్టి తనను తాను పేల్చేసుకున్నాడు. ఫిబ్రవరి 14 న మధ్యాహాం 3.30 గంటలకు జరిగిన ఈ దుర్ఘటనలో 43 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో 20 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. పేలుడు ధాటికి సీఆర్పీఎఫ్‌ జవాన్లు ప్రయాణిస్తున్న ఓ బస్సు తునాతునకలు కాగా, కాన్వాయ్‌లోని పలు వాహనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ ఘటనతో దేశం ఒక్ససారిగా ఉలిక్కిపడింది. జవాన్ల మృతికి కారణమైన పాక్‌కు తగిన బుద్ది చెప్పాలని యావత​ దేశం ముక్త కంఠంతో నినదించింది.  విధుల్లో చేరేందుకు 2,547 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు దాదాపు 78 వాహనాల్లో  శ్రీనగర్‌కు బయలుదేరిన సమయంలో ఈదారుణ ఘటన చోటుచేసుకుంది.

సర్జికల్‌ స్ట్రైక్‌ 2.
ఫిబ్రవరి 14న జరిగిన పుల్వామా ఉగ్రదాడికి భారత్‌ ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత వైమానిక దళాలు మెరుపు దాడులు చేశాయి. భారత నియంత్రణ రేఖ(ఎల్‌ఓసీ) వెంబడి ఉన్న ఉగ్రవాద శిబిరాలపై తెల్లవారు ఫిబ్రవరి 26 తెల్లవారుజామున 3.30 గంటలకు భీకర దాడులు జరిపా​యి. బాలాకోట్, చాకోటి, ముజ‌ఫ‌రాబాద్ ప్రాంతాల్లోని జైషే మహ్మద్ ఉగ్రవాద శిబిరాలకు చెందిన కంట్రోల్ రూంలను వెయ్యి కేజీల బాంబులతో ధ్వంసం చేశాయి. 12 మిరాజ్‌-200 యుద్ధ విమానాలతో ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌.. సర్జికల్‌ స్ట్రైక్‌ 2ను విజయవంతంగా పూర్తి చేసి పుల్వామా ఉగ్రదాడి జవాన్లకు ఘన నివాళులర్పించింది. దీనిపై దేశవ్యాప్తంగా భారత ప్రజలు సంబరాలు జరుపుకున్నారు. అజిత్‌ దోవల్‌కి దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభినందనలు తెలిపారు.  భారత వైమానిక దాడులను ధృవీకరించిన పాక్‌.. ఎలాంటి నష్టం జరగలేదని ప్రకటించింది.

ఎమ్మెల్యేనే ఉన్నావ్‌ దోషి..
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉన్నావ్‌ అత్యాచార కేసులో ఢిల్లీ తీస్‌హజారీ కోర్టు బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌కు జీవితఖైదు శిక్షను విధించింది. తనను కిడ్నాప్‌ చేసి అత్యాచారం చేశారని కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై ఓ మైనర్‌ బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. బాలిక కిడ్నాప్‌.. అత్యాచారం.. బాధితురాలి తండ్రి లాకప్‌ మరణం.. ఆమె ప్రయాణిస్తున్న వాహనానికి ప్రమాదం.. వంటి మలుపులతో ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  ఈ ఏడాది జూలై 28న బాధితురాలు, ఆమె బంధువులు, న్యాయవాది ప్రయాణిస్తున్న కారును ఓ ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాధితురాలు గాయపడగా, ఆమె బంధువులిద్దరూ మరణించారు. న్యాయవాది కూడా తీవ్రంగా గాయపడ్డారు. సుప్రీంకోర్టు జోక్యంతో అన్ని కేసులను లక్నో నుంచి ఆగస్టు 1వ తేదీన ఢిల్లీకి బదిలీ చేశారు.

మహారాష్ట్రలో సరికొత్త చరిత్ర..
దేశంలో సరికొత్త రాజకీయ సమీకరణాలకు మహారాష్ట్ర వేదికగా నిలిచింది. పార్టీలో చీలికలు, గవర్నర్‌ అర్థరాత్రి ప్రకటనలు, తెల్లవారుజామున ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల ప్రమాణస్వీకారాలు, దేశ అత్యున్నత న్యాయస్థానం జోక్యం వంటి ఆసక్తికర పరిణామాలతో మహారాష్ట్ర రాజకీయాలు సంచలనం సృష్టించాయి. బాలీవుడ్‌ సినిమా స్థాయి ట్విస్ట్‌లను ఛేదించుకుంటూ హిందుత్వ పార్టీగా పేరొందిన శివసేన.. లౌకిక భావాజాలం గల కాంగ్రెస్‌, ఎన్సీపీతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ‍ బాధ్యతలు చేపట్టారు. ఠాక్రే కుటుంబం నుంచి సీఎం పీఠం అధిరోహించిన తొలి వ్యక్తిగా ఉద్ధవ్‌ చరిత్ర సృష్టించారు. అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించలేదు. ఎన్నికల ముందు కూటమి కట్టిన బీజేపీ-శివసేన మధ్య పదవుల పంపకాలతో విభేదాలు ఏర్పాడ్డాయి. దీంతో తన దారి తనదంటూ 30 ఏళ్ల మిత్రబంధానికి ముగింపు పలికిన శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ను మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. మహారాష్ట్రలో సరికొత్త రాజకీయ అధ్యాయానికి పునాది వేసింది.
 

కన్నడలో కూలిన కుమార సర్కార్‌..
దేశమంతా ఎంతో ఉ‍త్కంఠరేపిన కర్ణాటక రాజకీయ సంక్షోభం ఈ ఏడాది రాజకీయపరంగా అత్యంత చర్చనీయాశంగా మారింది. అసెంబ్లీ బలపరీక్షలో జేడీఎస్‌- కాంగ్రెస్‌ ప్రభుత్వం ఓటమి పాలవడంతో కుమారస్వామి సర్కార్‌ కుప్పకూలింది. జూలై 23న జరిగిన విశ్వాస పరీక్షలో 15 మంది రెబల్స్‌ ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో కుమారస్వామి ఓటమిపాలైంది. ఓటింగ్‌ జరిగిన సమయంలో సభలో మొత్తం 204 మంది సభ్యులున్నారు. 15 రెబల్స్‌ తిరుగుబాటుతో మైనార్టీలో పడిపోయిన కాంగ్రెస్‌-జేడీఎస్‌ సభ్యుల సంఖ్య 99కి పడిపోయింది. మరోవైపు బీజేపీ సభ్యులు 105 మంది సభకు హాజరయ్యారు. దీంతో 14 నెలల సంకీర్ణ ప్రభుత్వ పాలన ముగిసింది.ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా చక్రంతిప్పన 15 మంది రెబల్స్‌పై స్పీకర్‌ రమేష్‌ కుమార​ అనర్హత వేటు వేయడం సంచలనం సృష్టించింది. అనంతరం గవర్నర్‌ ఆహ్వానం మేరకు బీజేపీ అధ్యక్షుడు బీఎస్‌ యడియూరప్ప కర్ణాటక నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. డిసెంబర్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో సైతం బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగానే ప్రజలు తీర్పును వెలువరించారు. 15 స్థానాలకు ఉప ఎన్నికలు జరగ్గా 12 స్థానాలను అధికార బీజేపీ కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని సుస్థిరపరుచుకుంది.

చంద్రయాన్‌-2 విఫలం
చంద్రుడి భూ ఉపరితలంపై పరిశోధనలు జరిపేందుకు అక్కడికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)  పంపించిన ఉపగ్రహం ‘చంద్రయాన్‌–2’ చివరి నిమిషంలో విఫలమైంది.  జులై 22న జీఎస్‌ఎల్వీ మార్క్ III-M1 వాహక నౌక ద్వారా చంద్రుడిపై పంపారు... తర్వాత దీని కక్ష్యను ఐదుసార్లు పెంచుకుంటూ పోయి 276 x 1,42,975 కిలోమీటర్లకు చేర్చారు. తర్వాత ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విడిపోయింది.. సెప్టెంబరు 7 అర్ధరాత్రి చంద్రుడి ఉపరితలంపై దిగుతూ 500 మీటర్ల దూరంలో ఉండగా ల్యాండర్‌లో సాంకేతిక సమస్య తలెత్తడంతో పూర్తిగా సంబందాలు తెగిపోయాయి. ఈ ప్రాజెక్టు మొత్తానికి రూ.978కోట్లు ఖర్చయింది.

ఆర్టికల్‌ 370.. రద్దు
నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రెండోసారి అధికారం చేపట్టిన 90 రోజుల్లోనే అత్యంత సంచలన, సాహసోపేత నిర్ణయాన్ని తీసుకుంది. దశాబ్దాల సంఘ్‌ పరివార్‌ కలను, ఎన్నికల హామీని నెరవేరుస్తూ, కశ్మీర్‌లో 72 ఏళ్ల నుంచి నలుగుతున్న వేర్పాటువాదం, ఉగ్రవాదం సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులేస్తూ.. జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని కల్పిస్తున్న రాజ్యాంగంలోని 370, 35ఏ అధికరణాలను రద్దు చేసింది. జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను కూడా తొలగిస్తూ, దానిని అసెంబ్లీతో కూడిన కేంద్రపాలిత ప్రాంతంగా మార్చింది. లదాఖ్‌ ప్రాంతాన్ని కూడా జమ్మూ కశ్మీర్‌ నుంచి పూర్తిగా వేరు చేసి, ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది.

పౌరసత్వ ప్రకంపనలు..
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టం, ఎన్‌ఆర్‌సీ దేశ వ్యాప్తంగా నిరసలనకు కేంద్రబిందువుగా నిలిచింది. చట్టానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక చోట్ల నిరసనలు హింసాత్మకంగా మారాయి.. పోలీసుల తూటాలు ఆందోళనకారుల గుండెల్లో దిగాయి. పౌరుల ప్రాణాలు పోయినా.. జనం రోడ్లపైకి వచ్చి నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా దీని ప్రభావం ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌, బిహార్‌లో ఎక్కువగా కనిపించింది. ఆందోళన సందర్భంగా యూపీలో 16 మంది పౌరులు మరణించారు. పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌ నుంచి వలస వచ్చిన హిందువులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు, పార్శీలకు, క్రైస్తవులకు దేశంలో పౌరసత్వం కల్పించడం ఈ చట్టం ముఖ్య సారాంశం.

అస్సాం ఎన్నార్సీ
ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ ప్రకటించిన ఎన్‌ఆర్సీని కేంద్ర ప్రభుత్వం అమలు చేసింది. తొలుత ఈశాన్య రాష్ట్రమైన అస్సాంలో జాతీయ పౌర గుర్తింపు (ఎన్నార్సీ) తుది ముసాయిదాను విడుదల చేసింది. మొత్తం 3.29 కోట్ల దరఖాస్తుదారుల్లో 2,89,83,677 మందిని భారతీయులుగా గుర్తిస్తున్నట్లు వెల్లడించింది. దరఖాస్తుదారుల్లోని 40.07లక్షల మంది తమ అస్సామీ గుర్తింపును చూపించడంలో విఫలమయ్యారని పేర్కొంది. దీంతో తుది ముసాయిదాతో 40 లక్షల మందికి పైగా ప్రజల భవితవ్యం అనిశ్చితిలో పడింది. కాగా దేశ వ్యాప్తంగా కూడా ఎన్నార్సీని అమలు చేస్తామని బీజేపీ పదేపదే ప్రకటిస్తోంది. దీనిపై విపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి.

కాఫీ డే వీజీ సిద్ధార్థ మృతి..
సౌమ్యుడు, వివాదరహితునిగా పేరుపొందిన కేఫె కాఫీ డే (సీసీడీ) అధినేత వీజీ సిద్ధార్థ మరణించారు. నేత్రావతి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. కాఫీ ఎస్టేట్ల సామ్రాజ్యాన్ని విస్తరించి ఆరంగంలో మేటిగా నిలిచారు. జూలై 29న సిద్ధార్థ అదృశ్యమయ్యారు. తాను కొద్దిదూరం నడిచి వస్తానని చెప్పి, డ్రైవర్‌ను బ్రిడ్జి సమీపంలో కారు ఆపమని చెప్పిన తర్వాత ఆయన కనిపించకుండా పోయారు. అరగంట గడిచినా సిద్ధార్థ కారు దగ్గరకు రాకపోవడం, ఫోన్ చేసినా స్పందించకపోవడంతో డ్రైవర్ బెంగళూరులోని ఆయన కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అనంతరం జూలై 31న నదిలో ఆయన మృతదేహాన్ని గుర్తించారు. ఆర్థిక  ఇబ్బందులు కారణంగానే ఆత్మహత్యకు పాల్పడ్డట్లు పోలీసుల విచారణలో తేలింది. 

చిన్మయి శ్రీపాద (మీటూ)
పెద్ద మనుషుల ముసుగులో చలామణీ అవుతున్న వివిధ రంగాలకు చెందిన ‘మగానుభావుల’ నిజ స్వరూపాన్ని.. ‘మీటూ’ ఉద్యమం ద్వారా పలువురు బాధితులు బట్టయలు చేశారు. ఇండియాలో బాలీవుడ్‌ నటితనుశ్రీ దత్తా ప్రారంభించిన ఈ ఉద్యమాన్ని గాయని చిన్మయి దక్షిణాదిన ముందుండి నడిపించారు. 18 ఏళ్ల వయసులో... ప్రముఖ గేయ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించారంటూ ఆమె పలు సంచలన విషయాలు బయటపెట్టారు. చిన్మయి స్ఫూర్తితో మరికొంత మంది కూడా వైరముత్తు వల్ల తాము ఎదుర్కొన్న ఇబ్బందులను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. అయినప్పటికీ సినీ ఇండస్ట్రీ అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు సరికదా... పలువురు ‘ప్రముఖులు’ చిన్మయిపై కక్ష సాధింపు చర్యలకు దిగారు. అంతేకాదు పబ్లిసిటీ కోసమే ఆమె ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్‌ మీడియాలో అసభ్యకర వ్యాఖ్యలతో ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు.

హాంగ్‌.. కాగుతోంది..
ఒక దేశం రెండు వ్యవస్థలు ఉంటే ఎన్ని సమస్యలు ఉత్పన్నమవుతాయో చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈ ఏడాది హాంకాంగ్‌లో ఎగిసిన నిరసనలు. తమ దేశంపై సుదీర్ఘకాలంగా సాగుతున్న చైనా పెత్తనాన్ని హాంకాంగ్‌వాసులు సహించలేకపోతున్నారు. చైనాలో హాంకాంగ్‌ భాగమైనప్పటికీ అక్కడ ప్రజలు తమను చైనీయులు అనడానికి ఎంత మాత్రమూ ఇష్టపడరు. అలాంటిది నేరస్తుల అప్పగింతకు సంబంధించిన ఒక బిల్లుపై వచ్చిన ప్రతిపాదనలతో హాంకాంగ్‌లో నిరసనల అగ్గి రాజుకుంది. ఈ బిల్లుతో హాంకాంగ్‌లో నిందితుల్ని చైనాలో విచారించే అవకాశం కలుగుతుంది. దీంతో రైట్‌ వింగ్‌ యాక్టివిస్టులు భగ్గుమన్నారు. హాంకాంగ్‌ ప్రత్యేక ప్రతిపత్తిని నిర్వీర్యం చేసేలా చైనా ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ రోడ్డెక్కారు. జూన్‌ నుంచి ఆందోళనలతో హోరెత్తిస్తున్నారు. అటు ప్రభుత్వం కూడా పోలీసు బలగాలతో నిరసనలు అణచివేయాలని అనుకుంది కానీ అంతకంతకూ అవి తీవ్రరూపం దాల్చాయి. మొత్తానికి బిల్లుపై చైనా ప్రభుత్వం వెనక్కి తగ్గినా ఆ ఆందోళనలిప్పుడు హాంకాంగ్‌ స్వాతంత్య్ర పోరాటానికి దారి తీశాయి.

అమెజాన్‌ ఆడవుల్లో కార్చిచ్చు
అమెజాన్ అడవుల మంటలపై ప్రపంచస్థాయి ఆగ్రహం..! ప్రపంచంలోని అతిపెద్ద ఉష్ణమండల వర్షారణ్యం అగ్నికి ఆహుతి అవుతుండటంపై ప్రపంచ స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. అమెజాన్ అడవులు కాలిపోతున్నాయనే వార్తలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మొత్తం ఆక్సిజన్ ఉత్పత్తిలో అధిక భాగం అంటే 20 శాతం ఆక్సిజన్ మనకు అమెజాన్ అడవుల నుంచే లభిస్తోంది. అమెజాన్ అడవులు కాలిపోవడం ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంపై కొత్త చర్చకు దారి తీసింది. పర్యావరణవేత్తలు, మేధావులు ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆ క్రమంలో అమెజాన్ అడవుల్లో చెలరేగిన మంటలను ఆర్పేందుకు యుద్ద విమానాలను ఫ్రాన్స్‌ అధికారులు రంగంలోకి దించారు.

శ్రీలంక మారణహోమం
క్రెస్తవులకు ప్రధానమైన ఈస్టర్ పండుగనాడు ద్వీపదేశం శ్రీలంకలో నరహంతకులు మారణహోమం సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోతోపాటు నెగొంబో, బట్టికలోవా పట్టణాల్లో బాంబుల మోత మోగించారు. చర్చిలు, విలాసవంతమైన హోటళ్లు లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. ఏప్రిల్ 21న జరిగిన మొత్తం 8 వరుస పేలుళ్లలో 215మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. మరో 500 మందికిపైగా గాయపడ్డారు. ఈ పేలుళ్లలో మొత్తం 33 మంది విదేశీయులు మరణించగా వారిలో ముగ్గురు భారతీయులు ఉన్నారు. మిగిలిన 21 మంది విదేశీయుల మృతదేహాలను గుర్తించేపనిలో ఉన్నామని శ్రీలంక అధికారులు వెల్లడించారు. ఈస్టర్ సందర్భంగా  చర్చిల్లో సామూహికంగా ప్రార్థనలు చేసుకుంటుండగా ఈ పేలుళ్లు సంభవించాయి. మొత్తం 3 చర్చిలు, మూడు హోటళ్లు, జూ వద్ద, మరో ఇంట్లో దుండగులు పేలుళ్లకు పాల్పడ్డారు. 

దిశా.. తూటా చెప్పిన తీర్పు
రేపిస్టులకు వ్యతిరేకంగా మన తెలుగు గడ్డపై జరిగిన ఉద్యమం యావత్‌ దేశానికి పాకింది. డాక్టర్‌ దిశ అత్యాచారం, హత్య ఈ ఏడాది దేశంలో ప్రకంపనలు రేపింది. నవంబర్‌ 27 రాత్రి షాద్‌నగర్‌లో ఒక అమాయకురాలిపై వలపన్ని టోల్‌ ప్లాజాకు కూతవేటు దూరంలో నలుగురు మృగాళ్లు అత్యాచారం చేయడమే కాకుండా, బతికుండగానే పెట్రోల్‌ పోసి తగులబెట్టడం సామాన్యుల్ని దహించి వేసింది. జనం స్వచ్ఛందంగా రోడ్డెక్కారు. ఢిల్లీ నుంచి గల్లీ వరకు రేపిస్టులకి వ్యతిరేకంగా నిరసనలు మిన్నంటాయి. 2012లో నిర్భయ ఉదంతం తర్వాత అత్యాచారాలకు వ్యతిరేకంగా యువతరం స్వచ్ఛందంగా కదిలిరావడం ఇదే. దిశపై అఘాయిత్యం జరిగి వారం తిరక్కుండానే డిసెంబర్‌ 6న నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. ఎన్‌కౌంటర్‌కు వ్యతిరేకంగా అక్కడక్కడ నిరసన స్వరాలు వినిపించినప్పటికీ సామాన్యులు శభాష్‌ అన్నారు. మన న్యాయవ్యవస్థలో జరిగే జాప్యం పట్ల ప్రజలు ఎంత విసిగిపోయారో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. అమ్మాయిల భద్రత గాల్లో దీపంలా మారడంతో ఆంధ్రప్రదేశ్‌ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి.. అత్యాచార కేసుల్లో సత్వర న్యాయం జరిగేలా దిశ చట్టాన్ని తీసుకువచ్చారు. ఈ చట్టం ప్రకారం అత్యాచారం కేసుల్లో 21 రోజుల్లో విచారణ పూర్తి చేసి దోషులకు శిక్ష విధిస్తారు. 

తహసీల్దార్‌ సజీవ దహనం
రాష్ట్ర రాజధాని శివారులోని రంగారెడ్డి జిల్లా అబ్దుల్లా పూర్‌మెట్‌ తహసీల్దార్‌ చెరుకూరి విజయారెడ్డి ఆమె కార్యాలయంలోనే హత్యకు గురయ్యారు. పట్టాదారు పాసుపుస్తకాల్లో తమకు బదులుగా కౌలుదార్ల పేర్లను చేర్చారన్న కోపంతో కూర సురేశ్‌ అనే రైతు ఆమెపై పెట్రోల్‌ పోసి నిప్పంటించి సజీవ దహనం చేశాడు. తమ కుటుంబాలకు దక్కాల్సిన భూమిని తమకు దక్కకుండా చేస్తున్నారని కక్షగట్టి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తెలంగాణ వ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ ఘటనపై రెవెన్యూ అధికారులు మూడు రోజులపాటు విధుల్లోకి రాకుండా నిరసనలు చేపట్టారు. మంటల్లో తీవ్రంగా గాయ పడిన కారు డ్రైవర్‌ గురునాథ్, అటెండర్‌ చంద్రయ్యలు ఆస్పత్రిలో చికిత్స పొందుతు మృతి చెందారు. రైతు కూర సురేశ్‌ కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు

ఆర్టీసీ సమ్మె..
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోరుతూ.. 2011లో ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సకలజనుల సమ్మె తరువాత మరోసారి అంతటి మహా ఉద్యమాన్ని తెలంగాణ ఆర్టీసీ కార్మికులు చేపట్టారు. స్వరాష్ట్రం ఏర్పడిన తరువాత వారు చేపట్టిన తొలి సమ్మె ఇది. డిమాండ్లను నెరవేర్చాలని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 52 రోజుల పాటు చేపట్టిన ఆర్టీసీ సమ్మె మహా ఉద్యమంగా సాగింది. కార్మికుల డిమాండ్లకు ప్రభుత్వం ఏమాత్రం తగ్గకపోగా, విధుల్లో చేరకపోతే ఉద్యోగాల్లో నుంచి తొలగిస్తామంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన ప్రకంపనలు సృష్టించింది. అంతేకాదు  ఉద్యమం సందర్భంగా దాదాపు 30 మంది కార్మికులు వివిధ రూపాల్లో ప్రాణాలు కోల్పోయారు. దీంతో గత్యంతరం లేక సమ్మెను విరమిస్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. వారి విజ్ఞప్తి మేరకు కార్మికులందరినీ తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకున్నారు. కార్మికుల ఉద్యమం తెలంగాణతో పాటు దేశ వ్యాప్తంగా సంచనంగా మారింది.

ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం..
ఆంధ్రప్రదేశ్‌లో నూతన శకం మొదలైంది. ‍‘ప్రజాసంకల్ప యాత్ర’ సుదీర్ఘ పాదయాత్ర అనంతరం జరిగిన ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకుగాను 151 స్థానాల్లో గెలిచి కొత్త చరిత్రను సృష్టించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. మే 30 గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో గవర్నర్‌ నరసింహన్‌.. వైఎస్‌ జగన్‌తో ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయించారు. సంక్షేమ పథకాలే ప్రధానం ఎజెండాగా ప్రచారం చేసిన వైఎస్‌ జగన్‌.. ఇచ్చిన మాటకు కట్టుబడి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిన ఆరునెల్లలోనే హామీలను అమలు చేస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. చరిత్ర ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఈ ఎన్నికల్లో కేవలం 21 సీట్లకు పరిమితమైంది. అలాగే లోక్‌సభ ఎన్నికల్లో సైతం వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించింది. మొత్తం  25 స్థానాల్లో 22 ఎంపీ సీట్లు కైవలం చేసుకుంది. టీడీపీ మూడు స్థానాలు దక్కించుకుంది.

ఆంధ్రప్రదేశ్‌కి మూడు రాజధానులు
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందేలా అమరావతిలో శాసన రాజధాని(లెజిస్లేటివ్‌ క్యాపిటల్‌), విశాఖలో పరిపాలన రాజధాని (ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌), కర్నూలులో న్యాయ రాజధాని(జ్యుడీషియల్‌ క్యాపిటల్‌) ఏర్పాటు చేయాలని జీఎన్‌ రావు కమిటీ తన నివేదికలో సూచించింది. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధాని, పరిపాలన వికేంద్రీకరణపై ఏర్పాటైన ఈ నిపుణుల కమిటీ డిసెంబర్‌ 20న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి 125 పేజీలతో కూడిన నివేదికను సమర్పించింది. రాష్ట్రంలోని 13 జిల్లాల సమగ్రాభివృద్ధి ప్రతిబింబించేలా నివేదికలో పలు సూచనలు చేసింది. విశాఖపట్నంలో సచివాలయం, సీఎం క్యాంపు కార్యాలయం, హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేయాలని, వేసవిలో అక్కడే అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని పేర్కొంది. అమరావతిలో అసెంబ్లీ, గవర్నర్‌ కార్యాలయం, సీఎం క్యాంపు కార్యాలయం.. కర్నూలులో హైకోర్టు ఉండాలని సూచించింది. వరద ముంపులేని ప్రాంతం రాష్ట్రానికి రాజధానిగా ఉండాలని.. రాజధాని కార్యకలాపాల్ని వికేంద్రీకరించాలని సలహానిచ్చింది. కమిటీ మొత్తం సుమారు 10,600 కిలోమీటర్లు రాష్ట్రమంతా పర్యటించి రాజధాని, అభివృద్ధి అంశాలపై అధ్యయనం చేసింది.

-సురేష్‌ అల్లిక (వెబ్‌డెస్క్‌ ప్రత్యేకం)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement