సాక్షి, సిటీబ్యూరో: వైద్య ఆరోగ్యశాఖను ఈ ఏడాది తీవ్రమైన అనారోగ్యం వెంటాడింది. డెంగీ, స్వైన్‌ఫ్లూ జ్వరాలతో అనేక మంది మృత్యువాతపడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడం, బస్తీల్లో వరదలు పోటెత్తాయి. డెంగీ దోమలు వృద్ధి చెందాయి. ఫలితంగా ఈ ఏడాది ఇప్పటి వరకు అధికారికంగా 4500పైగా డెంగీ జ్వరాలు నమోదు కాగా, వీరిలో 22 మంది వరకు మృత్యువాతపడ్డారు. అనధికారికంగా మృతుల సంఖ్య వందకు పైగా ఉన్నట్లు అంచనా.
జ్వరాలపై హైకోర్టు సీరియస్
డెంగీ జ్వరాలపై చివరకు హైకోర్టు సైతం ప్రభుత్వంపై సీరియస్ కావడంతో అప్రమత్త మైన ప్రభుత్వం ఆగమేఘాల మీద నష్టనివారణ చర్యలు చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉస్మానియా, గాంధీ, ఫీవర్, నిలోఫర్ సహా అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోనూ వైద్యుల సెలవులు రద్దు చేసి, ఆదివారం ఓపీ సర్వీసులు అందజేసింది. పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆస్పత్రులు, బస్తీ దవాఖానాల్లో ఈవినింగ్ ఓపీలను ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో కాలంతో సంబంధం లేకుండా గత పదేళ్ల నుంచి స్వైన్‌ఫ్లూ వీరవిహారం చేస్తూనే ఉంది. ఈ ఏడాది ఇప్పటి వరకు 250పైగా పాజిటివ్ కేసులు నమోదు కాగా, వీరిలో 25 మంది మృత్యువాతపడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి.
నిలోఫర్‌లో క్లినికల్ ట్రయల్స్ దుమారం
నిలోఫర్ కొంత మంది వైద్యులు చిన్నారుల తల్లిదండ్రులకు తెలియకుండా శిశువులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇద్దరు వైద్యుల మధ్య నెలకొన్న వివాదం చివరకు తార స్థాయికి చేరుకుంది. ఇరువురు ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకునే వరకు వెళ్లింది. చివరికి వైద్య ఆరోగ్య శాఖను ఓ కుదుపు కుదిపేసింది. అదృష్టవశాత్తు ఈ ట్రయల్స్‌లో ఎవరికీ ఏమీ కాకకపోవడంతో పెద్ద ముప్పు తప్పింది. ఇదిలా ఉంటే ఈ ఏడాది ఆస్పత్రిలో నవజాత శిశువుల మరణాల సంఖ్య రెట్టింపైంది.
వ్యాక్సినేషన్‌లో నిర్లక్ష్యం..శిశువు మృతి
జాతీయ వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో నాంపల్లి ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఓ శిశువు ప్రాణాలను మింగేసింది. మరో 32 మంది పిల్లల అస్వస్థతకు కారణమైంది. వ్యాక్సినేషన్ తర్వాత పారాసిటమాల్ టాబ్లెట్‌కు బదులు...సర్జరీ తర్వాత నొప్పి నివారణ కోసం వాడే ట్రెమడాల్ 300 ఎంజీ టాబ్లెట్ ఇవ్వడంతో కిషన్‌బాగ్‌కు చెందిన మూడున్నర నెలల లోపు శిశువు మృతి చెందగా, మరో ముగ్గురి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడం వివాదాస్పదమైంది. ఏరియా ఆస్పత్రి వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వల్ల శిశువు ప్రాణాలు కోల్పొవడం అప్పట్లో ఈ అంశంపె పెద్ద దుమారమే రేగింది. చివరకు ప్రభుత్వం స్పందించి ఏరియా ఆస్పత్రి ఇన్‌చార్జి డాక్టర్, ఫార్మసీ ఉద్యోగి, స్టాఫ్ నర్సులను సస్పెండ్ చేసింది.
షైన్ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం..
ఎల్బీ నగర్‌షైన్ ఆస్పత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఐసీయూలో అర్దరాత్రి మంటలు చెలరేగాయి. ఈఘటనలో ఓ శిశువు మృత్యువాత పడగా, మరో నలుగురు శిశువులు తీవ్ర గాయాలతో బయటపడ్డారు. ఈ ఘటనతో ఉలిక్కి పడిన ప్రభుత్వం..ఆస్పత్రి వైద్యులు సహా విధి నిర్వహణలో ఉన్న స్టాఫ్ నర్సులపై కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయించింది.
బోధనాసుపత్రుల్లోనూ వసతులు మృగ్యం..
⇔ ఉస్మానియా ఆస్పత్రి పాతభవనం పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో ప్రత్యామ్నాయంగా అదే ప్రాంగణంలో మరో రెండు బహుల అంతస్థుల భవనాలు
నిర్మించనున్నట్లు ఐదేళ్ల క్రితం ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఈ ఏడాది కూడా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రస్తుతం పునాదిరాయికి నోచుకోలేదు. ఆస్పత్రి చరిత్రలో వైద్యులు వంద రోజుల పాటు ఆందోళనలు చేసినా..అనేక విజ్ఞప్తులు చేసినా ఆలకించిన నాధుడే లేరు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా రోగులకు ఇబ్బందులు తప్పలేదు.
⇔ గాంధీ జనరల్ ఆస్పత్రిలో రూ.30 కోట్లలో 8 అత్యాధునిక ఆపరేషన్ థియేటర్లు నిర్మించనున్నట్లు ప్రకటించినా..ఇప్పటి వరకు ఒక్క థియేటర్ కూడా ప్రారంభం కాలేదు. సంతాన సాఫల్య కేంద్రం సహా అత్యవసర విభాగం ఆధునీకికరణ వంటి పనులు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.
⇔ ఈఎన్‌టీ ఆస్పత్రిలో రోగులకు కష్టాలు తప్పలేదు. రోగుల నిష్పత్తికి తగినంత మంది వైద్యులు, ఆపరేషన్ థియేటర్లు లేకపోవడంతో చికిత్సల కోసం మూడు నుంచి నాలుగు నెలలు ఎదురు చూడాల్సి వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment