కొత్త సంవత్సరంలో చేయాల్సిన పనులెన్నో.. | New Year Projects infront of GHMC hyderabad | Sakshi
Sakshi News home page

లక్ష్యాలెన్నో..

Published Tue, Dec 31 2019 12:09 PM | Last Updated on Tue, Dec 31 2019 12:09 PM

New Year Projects infront of GHMC hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: దాదాపు కోటి జనాభా ఉన్న హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో ప్రజల సదుపాయం కోసం రహదారులు, జంక్షన్లు, పార్కుల ఆధునీకరణలతోపాటు వివిధ కార్యక్రమాలకు జీహెచ్‌ఎంసీ సిద్ధమవుతోంది. ఇప్పటికే చేపట్టిన పనుల్ని  పూర్తిచేయడంతో పాటు కొత్త సంవత్సరం(2020)లో కొన్ని కొత్త కార్యక్రమాలకు సన్నద్ధమవుతోంది. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం దిశగా ఆయా కార్యక్రమాల అమలుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అందుకనుగుణంగా పాదచారుల  ఇబ్బందులు తొలగించేందుకు రూ.232 కోట్ల వ్యయంతో 52 ఎఫ్‌ఓబీలు, పలు స్కైవేల నిర్మాణ పనుల్ని త్వరలో ప్రారంభించనున్నారు. వీటితోపాటు 55 సమాంతర స్ట్రిప్‌రోడ్లు, 800 కి.మీ.ల మేర ఫుట్‌పాత్‌ల అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.

నగరంలోని 66 పార్కుల్లో ఓపెన్‌ జిమ్‌లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త సంవత్సరంలో 135 కి.మీ.ల మేర  వివిధ జంక్షన్లలో స్కైవేలు, 166 కి.మీ. పొడవున 11 మేజర్‌ కారిడార్స్, 348 కి.మీ. మేర 68 మేజర్‌ రోడ్స్‌తో పాటు 1400 కి.మీ.ల ఇతర రహదారులు, 54 చోట్ల గ్రేడ్‌ సెపరేటర్ల పనులు చేపట్టనున్నారు. ఈ సంవత్సరం రూ.24.74 కోట్లతో ఎల్‌బీనగర్‌ ఫ్లై ఓవర్, రూ.97.94 కోట్లతో కూకట్‌పల్లి రాజీవ్‌గాంధీ విగ్రహం వద్ద ఫ్లై ఓవర్, రూ. 69.47 కోట్లతో బయోడైవర్సిటీ పార్కువద్ద ఫ్లై ఓవర్‌లు జీహెచ్‌ఎంసీ చేపట్టిన పనుల్లో మైలురాళ్లుగా నిలిచాయని జీహెచ్‌ఎంసీ  పేర్కొంది. ఆయా జంక్షన్లలో ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించి ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగించేందుకు 155 జంక్షన్లలో ఆటోమేటిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. 

సంక్షేమం దిశగా.. మహిళలకు రుణాలు ..
జీహెచ్‌ఎంసీ పరిధిలోని 6,949 సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులకు ఈ సంవత్సరం రూ.287 కోట్ల బ్యాంకు రుణాలిప్పించడం ద్వారా ఆయా మహిళల కుటుంబాలు  ఆయా వృత్తివ్యాపారాల ద్వారా ఆర్థికంగా ఎదిగేందుకు అవకాశం ఏర్పడింది. గ్రేటర్‌ పరిధిలోని 1466 మురికివాడల్లో మొత్తం 51,051 సెల్ఫ్‌హెల్ప్‌ గ్రూపులున్నాయి. ఈ సంవత్సరం కొత్తగా 1942 గ్రూపులేర్పడ్డాయి. జీహెచ్‌ఎంసీ యూసీడీ విభాగం ఆధ్వర్యంలో ఇన్ని కుటుంబాలకు ఆర్థిక సహకారం అందడంతో కొత్త సంవత్సరంలో ఈ కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. చిరువ్యాపారాలు చేసుకుంటున్న 24,909 మందిని గుర్తించి వారిలో 24,811 మందికి గుర్తింపుకార్డులందజేశారు. చిరు వ్యాపారాలు చేసుకునే మిగతా వారందరినీ గుర్తించి, గుర్తింపుకార్డులివ్వడంతోపాటు వారికోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసే వెండింగ్‌జోన్లలోనే వ్యాపారాలు చేసుకునేలా చేయాలనేది కొత్త సంవత్సర లక్ష్యంగా ఉంది.  

గ్రేటర్‌లో ఇప్పటికే ఉన్న  దాదాపు 700 మీసేవా కేంద్రాలతోపాటు వచ్చే సంవత్సరంలో జీహెచ్‌ఎంసీలోని పౌరసేవాకేంద్రాల్లో కూడా మీసేవా కేంద్రాల సబ్‌సెంటర్లు ఏర్పాటుచేసి వాటిద్వారానే జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీ చేసే చర్యలకు శ్రీకారం చుట్టారు. పూర్తయిన 35 మోడల్‌మార్కెట్లలోని దుకాణాలను లబ్ధిదారులకు కేటాయించేపనిని పూర్తిచేసి కొత్తసంవత్సరం వాటిని వినియోగంలోకి తేనున్నారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఫంక్షన్‌హాళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి మూడేళ్లు దాటగా, ఇప్పటి వరకు 9 పూర్తిచేశారు. మిగతావి కొత్త సంవత్సరంలో పూర్తిచేసే లక్ష్యంతో ఉన్నారు.  

ఆస్తులన్నీ జియోట్యాగింగ్‌..
కాగితరహిత పాలన, ఈ–ఆఫీస్‌ నిర్వహణలో భాగంగా  6,29,000 పాత ఫైళ్లలోని  4కోట్ల 22లక్షల పేజీలను డిజిటలైజ్‌ చేసినట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.  ఆస్తిపన్ను విధింపులో అవకతవకల నివారణకు సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌(సీజీజీ) సహకారంతో, ‘ట్రాక్‌’ సాంకేతిక భాగస్వామ్యంతో ఇటీవల ప్రారంభించిన జీఐఎస్‌ సర్వే ద్వారా 21వేల ఆస్తుల జియోట్యాగింగ్‌తో  పాటు ఆస్తిపన్ను జాబితాలో లేని 545 ఆస్తులను గుర్తించారు. కొత్త సంవత్సరంలో మిగతా ఆస్తులన్నింటికీ జియోట్యాగింగ్‌ చేయనున్నారు.  పబ్లిక్‌పార్కులు, ప్రభుత్వ ఖాలీస్థలాల్లో 1500 పబ్లిక్‌ టాయ్‌లెట్స్‌ యూనిట్స్‌  నిర్మించనున్నట్లు జీహెచ్‌ఎంసీ పేర్కొంది.

చెత్త నుంచి విద్యుత్‌..
దేశంలోనే పెద్దదైన జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డు క్యాపింగ్‌ పనులతోపాటు చెత్తనుంచి విద్యుత్‌ఉత్పత్తికి 19.8మెగావాట్ల సామర్ధ్యం కలిగిన విద్యుత్‌ప్లాంట్‌ నిర్మాణం కూడా పూర్తి కావడంతో  విద్యుత్‌ రెగ్యులేటరీ అథారిటీ నుంచి యూనిట్‌ రేట్‌ ఖరారు కాగానే వాణిజ్యపరంగా విద్యుత్‌ ఉత్పత్తి జరగనుంది.  నగరానికి నాలుగువైపులా డెబ్రిస్‌ రీసైక్లింగ్‌ప్లాంట్ల ఏర్పాటు జరగనుండగా,  ఇప్పటికే పనులు పూర్తయిన జీడిమెట్ల ప్లాంట్‌ త్వరలో వినియోగంలోకి రానుంది. దీంతోపాటు చెంగిచెర్లలోని రెండరింగ్‌ప్లాంట్‌ కూడా వినియోగంలోకి రానుంది. 

ఇంకా..  
ఎల్‌ఈడీ బల్బుల ఏర్పాటుతో  2017 జూలై  నుండి ఇప్పటి వరకు 258.38 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఆదా కావడంతో రూ. 182.67 కోట్ల కరెంట్‌ బిల్లు తగ్గింది. విద్యుత్‌ ఖర్చును  మరింత తగ్గించేందుకు   జీహెచ్‌ఎంసీకి  చెందిన 34 కార్యాలయాల భవనాలపై 941 కిలో వాట్ల సౌర విద్యుత్‌  ఫలకాలు ఏర్పాటు చేశారు. వీటికైన వ్యయం రూ.  3.49 కోట్లు. u విపత్తు సమయాల్లో నగర ప్రజలు, ఆస్తులను కాపాడేందుకు మూడు షిప్టుల్లో పనిచేస్తున్న డీఆర్‌ఎఫ్‌ బృందాలతో నగర ప్రజలకు అండగా ఉన్న ఈవీడీఎం విభాగం కొత్త సంవత్సరంలో మరిన్ని హంగులతో సేవలను విస్తృతం చేయనుంది.   2019లో  ఫుట్‌పాత్‌లపై వెలసిన  15వేల ఆక్రమణల తొలగించడంతో పాటు ని»బంధనలను ఉల్లంఘించి  వాల్‌పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేసిన వారిపై, బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసిన వారిపై మొత్తం  3.48 లక్షల అతిక్రమణలకు  జరిమానాలు విధించారు. పది లక్షల ప్లాస్టిక్‌ కవర్లు సీజ్‌ చేశారు. u దోమల వ్యాప్తిని అరికట్టేందుకు ఎంటమాలజీ విభాగం ద్వారా 642 బృందాలతో యాంటీ లార్వా ఆపరేషన్లు..150 పోర్టబుల్, 13 వాహనాలకు అమర్చిన ఫాగింగ్‌ మిషన్ల ద్వారా ఫాగింగ్‌ కార్యక్రమాలు నిర్వహించారు.  15 చెరువుల్లో గుర్రపుడెక్క తొలగింపుతోపాటు  దోమల నివారణకు ఆయిల్‌బాల్స్‌ వదిలారు. మూసీతోపాటు కొన్ని చెరువుల్లో ప్రయోగాత్మకంగా డ్రోన్ల ద్వారా దోమల నివారణ మందు స్ప్రే చేశారు. వీటికి కొనసాగింపుగా కొత్త సంవత్సరం మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement