న్యూఢిల్లీ: అయోధ్యలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు రామమందిర నిర్మాణం కోసం ట్రస్ట్‌ను ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నాలను కేంద్రం ప్రారంభించింది. ట్రస్ట్ ఏర్పాటు చేసేందుకు, సభ్యుల నియామకంతో పాటు విధి విధానాలను నిర్ధారించేందుకు సుప్రీంకోర్టు తీర్పును ఒక అధికారుల బృందం అధ్యయనం చేస్తోంది. ఇందుకు న్యాయ శాఖ, అటార్నీ జనరల్ సలహాలను తీసుకోనున్నామని సంబంధిత అధికారులు వెల్లడించారు. ‘ట్రస్ట్ ఏర్పాటుకు సంబంధించిన కీలక విధివిధానాలను రూపొందించేందుకు ఒక అధికారుల బృందం ఏర్పాటైంది.
సుప్రీంకోర్టు తీర్పును ఆ బృందం కూలంకషంగా అధ్యయనం చేస్తోంది. సుప్రీంకోర్టు చెప్పిన విధంగా∙ట్రస్ట్‌ను ఏర్పాటు చేసేందుకు తీర్పులోని సాంకేతికాంశాలు, ఇతర కీలక భావనలను పరిగణనలోకి తీసుకుంటున్నారు’ అని వివరించారు. ఆ ట్రస్ట్‌కు నోడల్ కేంద్రంగా హోం శాఖ వ్యవహరిస్తుందా? లేక కేంద్ర సాంస్కృతిక శాఖ వ్యవహరిస్తుందా? అనే విషయంలోనూ స్పష్టత లేదు. అయోధ్యలోని వివాదాస్పద స్థలంలోనే రామమందిర నిర్మాణం జరగాలని, అందుకు ఒక ట్రస్ట్‌ను కేంద్రం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు శనివారం తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. మందిర నిర్మాణం, సంబంధిత కార్యక్రమాల నిర్వహణ.. మొదలైన అధికారాలు ట్రస్ట్‌కు ఉండాలని కోర్టు పేర్కొంది.
‘రివ్యూ’పై త్వరలో నిర్ణయం
వివాదాస్పద స్థలం రాముడిదేనంటూ శనివారం సుప్రీం ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేసే విషయంపై ఈ ఆదివారం నిర్ణయం తీసుకుంటామని సున్నీ వక్ఫ్ బోర్డ్ తరఫున సుప్రీంకోర్టులో వాదించిన న్యాయవాది జఫర్యాబ్ జిలానీ సోమవారం వెల్లడించారు. 17న జరిగే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ సమావేశంలో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలా? వద్దా అనేది నిర్ణయిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment