లక్నో: దశాబ్దాలుగా న్యాయస్థానాల్లో నలుగుతూ వస్తోన్న చారిత్రాత్మక అయోధ్య భూ వివాదంపై దేశ అత్యున్నత న్యాయస్థానం త్వరలోనే తన తీర్పును వెలువరించనుంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వినియోగదారులకు ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టమైన హెచ్చరికలు జారీచేశారు. అత్యంత సున్నితమైన, సమస్యాత్మకమైనదిగా భావిస్తోన్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదానికి సంబంధించిన తీర్పు వెలువడిన అనంతరం నెలకొనే పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది. కోట్లాది మంది హిందువులు, ముస్లింల మనోభావాలతో ముడిపడి ఉన్న విషయం కావడం వల్ల అత్యంత అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.
తీర్పు వెలువడిన తరువాత దానికి వ్యతిరేకంగా, సానుకూలంగా సోషల్ మీడియాలో పోస్టులు చేసే వారిపై కఠిన చర్యలను తీసుకోవడానికి రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని శాంతి భద్రతలను దెబ్బతీస్తే అలాంటివారిని ఉపేక్షించబోమని, జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేస్తామని ఉత్తరప్రదేశ్ డీజీ ఓపీ సింగ్ స్పష్టం చేశారు. ఈ నెల 17వ తేదీన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ పదవీ విరమణ నేపథ్యంలో ఆ లోపు రామజన్మభూమి-బాబ్రీ మసీదు కేసుపై తీర్పు వెలువడటం ఖాయంగా కనిపిస్తోంది. 17వ తేదీలోగా సుప్రీంకోర్టు పని దినాలు కూడా తక్కువగా ఉండడంతో ఏ రోజైనా సుప్రీంకోర్టు అయోధ్య భూ వివాదంపై తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment