న్యూఢిల్లీ: అయోధ్యలో రామమందిరం భూ వివాదం కేసుకు సంబంధించి మధ్యవర్తిత్వ కమిటీకి సుప్రీంకోర్టు ఆగస్టు 15 వరకు గడువు పొడిగించింది. ఈ కేసులో సామరస్య పరిష్కారానికి తమకు మరింత సమయం కావాలని మధ్యవర్తిత్వ కమిటీ చైర్మన్ జస్టిస్ కలీఫుల్లా కోర్టును కోరారు. దీనికి అంగీకరించిన బెంచ్ ఆగస్టు 15లోగా మధ్యవర్తిత్వ ప్రక్రియను పూర్తిచేయాలని కమిటీని ఆదేశించింది. ఏళ్లుగా అయోధ్య కేసు పెండింగ్‌లోనే ఉందని, సామరస్య పరిష్కారానికి మరింత సమయం ఇస్తే తప్పేముందని సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని బెంచ్ వ్యాఖ్యానించింది.
మధ్యవర్తిత్వ కమిటీ అయోధ్య కేసుకు సంబంధించిన నివేదికను తమకు అందించినట్లు తెలిపింది. అయితే ఈ నివేదికలో ఉన్న విషయాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వ కమిటీ కార్యకలాపాల్లో ఎవరూ జోక్యం చేసుకోరాదని పేర్కొంది. ఈ వ్యవహారంలో ఇరు వర్గాలకు ఏమైనా అభ్యంతరాలుంటే జూన్ 30లోగా వాటిని కమిటీ ముందుకు తీసుకొచ్చేందుకు అనుమతినిచ్చింది. అయోధ్య కేసులో సామరస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ముగ్గురు వ్యక్తులతో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ కమిటీ దాదాపు 8 వారాల పాటు విచారణ చేపట్టిన అనంతరం మే 7న తమ నివేదికను సుప్రీంకోర్టుకు అందించింది.
Comments
Please login to add a commentAdd a comment