సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ కురు వృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ (92) తన రాజకీయ జీవితంలో వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. జనతా పార్టీ బీజేపీగా మార్పు, ఎదుగుదలలో కీలకంగా వ్యవహరించి అయోధ్య రామందిరం కోసం చేసిన కృషి, పోరాటం ప్రతి ఒక్కరికీ తెలిసిందే. అయితే 1992 నాటి బాబ్రీ మసీదు విధ్వంసం కేసులో నిందితులుగా ఉన్న అద్వానీ.. ఆ కేసు నుంచి బయటపడేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన అనంతరం రాష్ట్రపతి పదవికి సీనియర్ నేతను నామినేట్ చేస్తారని అంతా ఊహించారు. కానీ మోదీ సర్కార్ మాత్రం ఆ సాహసం చేయలేకపోయింది. ఓ విధంగా అద్వానీకి ఊహించని షాక్‌గానే పలువురు వర్ణించారు. కేసుల కారణంగనే ఆయనకు ఆ పదవి దక్కలేదని కొందరు విశ్లేషించారు.
బాబ్రీ కేసులో వాంగ్మూలం..
అద్వానీ చిరకాల స్వప్నం అయోధ్య మందిర నిర్మాణ భూమి పూజ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 3 లేదా 5న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునాది రాయిని వేయనున్నారు. దీని కోసం ఆలయ ట్రస్ట్ ఇప్పటికే మోదీకి ప్రత్యేక ఆహ్వానాన్ని సైతం పంపింది. ఆయనతో మరో 50 మందిని సైతం ఆహ్వానించనున్నట్లు కమిటీ తెలిపింది. ఈ నేపథ్యంలోనే బాబ్రీ కుట్రలో కేసులో ఎల్‌కే అడ్వాణీ, మురళీ మనోహర్ జోషి తదితరుల వాంగ్మూలాల నమోదుకు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తేదీలను ఖరారు చేసింది. ఈనెల 23వ తేదీన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వినిపించే వాంగ్మూలాలను న్యాయస్థానం నమోదు చేయనుందని ప్రత్యేక న్యాయమూర్తి ఎస్.కె.యాదవ్ తెలిపారు. ఈ కేసుతో సంబంధమున్న మొత్తం 32 మంది తమ వాదనను వినిపించవచ్చన్నారు. (బాబ్రీ విధ్వంసం: విచారణ ఆపండి)
కేసు కొట్టేయండి..
ఈ క్రమంలో అద్వానీ, మురళి మనోహర్ జోషిపై నమోదైన బాబ్రీ మసీదు కేసును కొట్టేయాల్సిందిగా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కోరారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి భూమిపూజ చేసే సమయంలోపు ఈ కేసును కొట్టేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అద్వానీ, జోషి, ఇతర బీజేపీ నాయకులు బాబ్రీ మసీదును కూల్చారని కొంతమంది ఆరోపిస్తున్నారని, కానీ ఈ ఘటనతో వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. ఆలయ పునర్నిర్మానానికే పనిచేసినట్లు వెల్లడించారు. మరోవైపు అయోధ్యలోని బాబ్రీ మసీదు కూల్చివేత కేసు విచారణను మూసివేస్తే మంచిదని ‘రామ జన్మభూమి’ కేసులో ప్రధాన పిటిషనర్ అయిన ఇక్బాల్ అన్సారీ లక్నో సీబీఐ కోర్టుని కోరారు. అయోధ్య భూ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ఇప్పటికే తుది తీర్పును వెలువరించిందని, ఈ సమయంలో మళ్లీ బాబ్రీ మసీదు కూల్చివేతపై విచారణ చేపట్టడం అంత మంచిది కాదని అభిప్రాయపడ్డారు. సున్నితమైన అంశం కాబట్టి సీబీఐ తీర్పు దేశంలో మరోసారి రాజకీయ వైరుధ్యాలకు దారితీసే అవకాశం ఉందని పేర్కొన్నారు.
తుది తీర్పుకు గడువు..
మరోవైపు బాబ్రీ విధ్వంసం కేసు విచారణను వీలైనంత త్వరగా పూర్తి చేసి.. తుది తీర్పును వెలువరించాలని సుప్రీంకోర్టు ఇటీవల లక్నో సీబీఐ న్యాయస్థానాన్ని ఆదేశించిన విషయం తెలిసిందే. ఆగస్ట్ ఆగస్ట్ 31లోపు విచారణను పూర్తిచేయాలని గడువు విధించింది. ఈ నేపథ్యంలో సీబీఐ కోర్టు తీర్పుపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అద్వానీతో పాటు, సీనియర్ నేతలు మురళీ మనోహర్ జోషి, కళ్యాన్ సింగ్, ఉమా భారతి వంటి పలువురు నేతలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment