అయోధ్యలో మోహరించిన భద్రతా బలగాలు
అయోధ్య: అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరికొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. రామాలయ నిర్మాణం కోసం 1990 నుంచి అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కిస్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మొదటిసారిగా ఆ పనులను నిలిపివేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది.
ఫైజాబాద్ జిల్లాకు 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అయోధ్య వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో అంతా సవ్యంగానే జరిగిపోతుందని, 1992 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలోని రామమందిర్ కార్యశాలలో ఆలయం కోసం 1990 నుంచి రాతి చెక్కడం పనులు సాగిస్తున్న వీహెచ్‌పీ మొట్టమొదటి సారిగా పనులను నిలిపివేసింది.
బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం, యూపీలో ప్రభుత్వాలు మారినా..1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి, వీహెచ్‌పీ, ఆర్‌ఎస్‌ఎస్ తదితర హిందుత్వ సంస్థలపై 6 నెలలపాటు నిషేధం విధించినప్పుడు కూడా ఈ పనులు ఆగలేదు. తాజాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా తమ నాయకత్వం పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వీహెచ్‌పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ప్రతిపాదిత రామాలయం మొదటి అంతస్తుకు సరిపడా 1.25 లక్షల ఘనపుటడుగుల రాతి చెక్కడం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని ఆయన అన్నారు.
ముందు జాగ్రత్త చర్యలు
సుప్రీంకోర్టు తీర్పును పురస్కరించుకుని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు అనంతరం ఉత్సవాలు జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఫైజాబాద్ జిల్లా నాలుగు భద్రతా జోన్లను ఏర్పాటు చేసిన కేంద్రం 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. సామాజిక మాధ్యమాల్లో రామ జన్మభూమి తీర్పునకు సంబంధించి వ్యాఖ్యలపై నిషేధం విధించింది. రైల్వే శాఖ కూడా రైల్వే భద్రతా దళం(ఆర్‌పీఎఫ్) సెలవులను రద్దు చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది.
Comments
Please login to add a commentAdd a comment