Vishwa Hindu Parishad
-
ప్రతి హిందూ కుటుంబంలో ముగ్గురు పిల్లలుండాలి
మహాకుంభ్ నగర్: దేశంలో హిందువుల జననాల రేటు పడిపోతుండటంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబం కనీసం ముగ్గురు పిల్లల్ని కలిగి ఉండాలని పిలుపునిచ్చింది. మహాకుంభ్ నగర్లో శనివారం జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్‌లో వీహెచ్‌పీ సెంట్రల్ జనరల్ సెక్రటరీ బజ్రంగ్ లాల్ బాంగ్రా మాట్లాడారు. ‘హిందువుల జననాల రేటు పడిపోతుండటంతో దేశంలో హిందూ జనాభాలో అసమతూకం ఏర్పడుతోంది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలుండాలని హిందూ సమాజంలోని గౌరవనీయులైన సాధువులు కోరుతున్నారు’అని ఆయన అన్నారు. అనంతరం గోరక్షా పీఠా«దీశ్వర్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మాట్లాడారు. సనాతన భారత ధర్మం కుంభమేళాలో ప్రత్యక్షంగా కనిపిస్తోందని, యావత్తూ ప్రపంచమే దీన్ని చూస్తోందని అన్నారు. బంగ్లాదేశ్‌లో ప్రణాళిక ప్రకారం హిందువులపై దాడులు సాగడంపై సమావేశంలో చర్చించారని వీహెచ్‌పీ ఒక ప్రకటనలో తెలిపింది. కార్యక్రమానికి జగద్గురు శంకరాచార్య స్వామి వాసుదేవానంద అధ్యక్షత వహించారు. -
ఇది హిందుస్తాన్
ప్రయాగ్‌రాజ్: దేశంలో మెజారిటీ ప్రజల ఇష్టానుసారం పాలన కొనసాగాలని చెప్పేందుకు మాత్రం సంకోచించనని అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ డాక్టర్ శేఖర్ యాదవ్ వ్యాఖ్యా నించారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఆదివారం అలహాబాద్ హైకోర్టు లైబ్రెరీ హాల్లో విశ్వహిందూ పరిషత్ హైకోర్టు యూనిట్ లీగల్ సెల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఉమ్మడి పౌరస్మృతి(యూసీసీ) అంశంపై ఆయన మాట్లాడారు. ‘‘మెజారిటీ ప్రజల అభీష్టం మేరకే చట్టం నడుచుకోవాలి. కుటుంబంగా చూసినా, సమాజంగా చూసినా మెజారిటీ ప్రజల సంక్షేమం, సంతోషమే ముఖ్యం’’ అన్నారు. ముస్లింలలో ఉన్న బహుభార్యత్వం, త్రిపుల్ తలాఖ్, హలాలా వంటి విధానాలను జడ్జి పరోక్షంగా విమర్శించారు. ‘‘ మా పర్సనల్ లా వీటికి అంగీకరిస్తోందని అది ఏమాత్రం ఆమోదనీయం కాదు. మన శాస్త్రాలు, వేదాల్లో స్త్రీని శక్తిస్వరూపిణిగా భావించారు. నలుగురు భార్యలను కల్గి ఉంటాను, హలాలా, త్రిపుల్ తలాఖ్‌ను పాటిస్తానంటే కుదరదు. సామరస్యం, లింగ సమానత, సామ్యవాదమే యూసీసీ ధ్యేయం. అంతే తప్ప వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్, హిందూయిజాలను అది ప్రోత్సహించదు’’ అన్నారు. -
సిట్ కాదు సుప్రీంకోర్టు జడ్జి తో విచారణ చేయించండి.. విశ్వహిందూ పరిషత్ డిమాండ్
-
సీఎం రేవంత్‌కి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి విశ్వహిందూ పరిషత్ బహిరంగ లేఖ రాసింది. భద్రాచలం శ్రీరాముడి భూముల రక్షణకై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.శ్రీరాముడి దేవాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సరైన నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నాం’’ అని విశ్వహిందూ పరిషత్ లేఖలో పేర్కొంది. -
హిందువులకు అప్పగించండి: వీహెచ్‌పీ
న్యూఢిల్లీ: వారణాసిలోని జ్ఞానవాపి మసీదును అంతకుముందున్న ఆలయాన్ని ధ్వంసం చేసి నిర్మించినట్లు ఏఎస్ఐ సర్వే మరోసారి రూఢీ చేసినందున ఆ ప్రాంతాన్ని హిందువులకు అప్పగించాలని విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కోరింది. శివలింగం లభించిన వజూ ఖానాగా చెబుతున్న చోట హిందువులకు పూజలకు అనుమతులివ్వాలని డిమాండ్ చేసింది. మసీదును హిందూ ఆలయంగా ప్రకటించాలని వీహెచ్‌పీ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ ఒక ప్రకటనలో కోరారు. -
ఆ రోజు ప్రపంచ వ్యాప్తంగా ‘రామోత్సవం’
సాక్షి, న్యూఢిల్లీ: అయోధ్య రామాలయంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట రోజు ప్రపంచ వ్యాప్తంగా వేడుకలు జరగనున్నాయి. అమెరికా, బ్రిటన్ సహా 50కిపైగా దేశాల్లో ‘రామోత్సవం’నిర్వహించనున్నారు. ఆయా దేశాల్లో నివసిస్తున్న రామభక్తులు ఇప్పటికే కొన్ని దేశాల్లో శోభాయాత్రలకు కూడా శ్రీకారం చుట్టారు. విశ్వహిందూ పరిషత్ (విశ్వ విభాగం) ఆధ్వర్యంలో మరి కొన్ని దేశాల్లో భారీగా సన్నాహాలు జరుగుతున్నాయి. జనవరి 22న అమెరికాలో 300, జర్మనీలో 100, మారిషస్‌లో 100, కెనడా, ఆ్రస్టేలియాల్లో 30, బ్రిటన్‌లో 25 కార్యక్రమాలు నిర్వహించనున్నారు. హిందువులు తక్కువగా ఉన్న ఐర్లాండ్‌తో పాటు మరికొన్ని దేశాల్లో ఒక్కో కార్యక్రమం ఉంటుంది. ఇలా మొత్తం 50కి పైగా దేశాల్లో 500 పైగా ధారి్మక, వైదిక, సాంస్కృతిక పరమైన సామూహిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు విశ్వహిందూ పరిషత్ వర్గాలు తెలిపాయి. -
జనవరి 21న అయోధ్య రామాలయం ప్రారంభం
అయోధ్య: ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జనవరి 21 నుంచి మూడు రోజులపాటు ఈ వేడుకలు నిర్వహించనున్నట్లు విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ ఆదివారం చెప్పారు. ఈ కార్యక్రమానికి లక్ష మందికిపైగా మత ప్రముఖులను ఆహా్వనించనున్నట్లు తెలిపారు. అయోధ్యలో రామ మందిర ప్రారం¿ోత్సవానికి సన్నాహకంగా ఈ ఏడాది సెపె్టంబర్ 30 నుంచి అక్టోబర్ 15 దాకా లక్షలాది గ్రామాల్లో ‘శౌర్యయాత్ర’లు నిర్వహించేందుకు బజరంగ్ దళ్ ఏర్పాట్లు చేస్తోంది. -
చావో రేవో తేల్చుకోవాలి
గురుగ్రామ్: హరియాణా పల్వల్‌లో విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఆదివారం నిర్వహించిన మహా పంచాయత్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రను ఆగస్టు 28న పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. జులై 31న నూహ్‌లో దుండగుల దాడితో మత ఘర్షణలు చెలరేగి యాత్ర అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే. యాత్ర నిర్వహించి తీరాలని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మహాపంచాయత్‌లో హరియాణా గో రక్షక దళానికి చెందిన ఆచార్య ఆజాద్ శాస్త్రి అన్నారు. యాత్రలో అంతా ఆయుధాలు ధరించాలని పిలుపునిచ్చారు. మహాపంచాయత్‌లో విద్వేష ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ హిందూ నాయకులు పెడచెవిన పెట్టారు. కనీసం 100 రైఫిల్స్‌కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ముస్లింలతో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మరి కొందరు వక్తలు కూడా ఇదే తరహాలో ప్రసంగించారు. మీరు ఎవరైనా వేలెత్తి చూపిస్తే మీ చెయ్యినే నరికేస్తాం అని హెచ్చరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నూహ్ జిల్లానే రద్దు చేయాలని ఆ ప్రాంతంలో గోవధ ఉండకూదని వక్తలు డిమాండ్ చేశారు. నూహ్‌లో హిందువుల యాత్రపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఆందోళనలున్నాయి. -
హరియాణాలో ఆగని బుల్డోజర్ డ్రైవ్
గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం. నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. -
హర్యానాలో మత ఘర్షణలు.. ఢిల్లీ హై అలర్ట్
హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది. ఢిల్లీ పోలీసుల అప్రమత్తం గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు. నిరసనలకు పిలుపు మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు. నుహ్‌లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్‌లోని బాద్షాపూర్లో అల్లరి మూకల గుంపు బైక్‌లపై వచ్చి రెస్టారెంట్‌కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్షాపూర్ మార్కెట్‌ను మూసివేశారు. చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు? ఎందుకీ ఘర్షణలు హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది. మరో మణిపూర్ కాబోతున్న హర్యానా? గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్‌గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది. -
స్వరభాస్కర్ పెళ్లిపై సాధ్వి ప్రాచి వివాదాస్పద వ్యాఖ్యలు..
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటి స్వర భాస్కర్.. సమాజ్‌వాదీ పార్టీ నేత ఫాహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకోవడంపై పలువురు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. తాజాగా విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) నేత సాధ్వి ప్రాచి వీరి వివాహంపై తీవ్రంగా స్పందించారు. శ్రద్ధ వాకర్‌కు పట్టిన గతే స్వర భాస్కర్‌కు పడుతుందని హెచ్చరించారు. బాహుశా పెళ్లికి ముందు స్వర భాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 'శ్రద్ధవాకర్‌ను ఆమె ప్రియుడే 35 ముక్కలుగా నరికి ఫ్రిడ్జిలో దాచిన వార్తను స్వర భాస్కర్ ఎక్కువగా పట్టించుకోనట్లు ఉంది. పెళ్లి చేసుకోవాలనే పెద్ధ నిర్ణయం తీసుకునే ముందు స్వరభాస్కర్ ఒక్కసారైనా ఫ్రిడ్జ్‌ను చూడాల్సింది. ఇది ఆమె వ్యక్తిగత నిర్ణయం. నేనేమీ ఎక్కువగా చెప్పలేను. కానీ శ్రద్ధ వాకర్‌కు ఏం జరిగిందో స్వర భాస్కర్‌కు కూడా అదే జరుగుతుంది.' అని సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. ఫాహద్ అహ్మద్‌తో తన పెళ్లి విషయాన్ని ఫిబ్రవరి 16న ప్రకటించింది స్వరభాస్కర్. వీరి వివాహం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశమైంది. గతంలో అన్న అని పిలిచిన వ్యక్తిని ఎలా పెళ్లిచేసుకుంటున్నావ్ అంటూ స్వర భాస్కర్‌పై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ప్రత్యేక వివాహం చట్టం కింద వీరిద్దరూ కోర్టులో పెళ్లి చేసుకున్నారు. అయితే ఇస్లామిక్ చట్టం ప్రకారం ఈ పెళ్లి చెల్లదని మతపెద్దలు పేర్కొన్నారు. ఢిల్లీలో శ్రద్ధవాకర్ హత్య ఘటన దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. తనతో సహజీవనం చేసిన అఫ్తాబ్ పూనావాలానే ఆమెను దారుణంగా హత్య చేశాడు. మృతదేహాన్ని 35 ముక్కలు చేసి ఫ్రిడ్జ్‌లో దాచాడు. అనంతరం వాటిని తీసుకెళ్లి అడవిలో పడేశాడు. చదవండి: పెళ్లైన రెండో రోజే విగతజీవులైన నవ దంపతులు.. రిసెప్షన్‌కు ముందే.. -
లవ్ జిహాద్‌ను వ్యతిరేకిస్తూ వీహెచ్‌పీ పోరు
న్యూఢిల్లీ: అక్రమ మతమార్పిడి, లవ్ జిహాద్‌లను తీవ్రంగా ఖండిస్తూ విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) కొత్త ప్రజా కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. అనైతిక మత మార్పిడి, లవ్ జిహాద్‌లను అంతం చేసేందుకు మహిళలు, అమ్మాయిలు, యువతతో ‘శక్తివంత సేన’ ఏర్పాటే లక్ష్యంగా నెల రోజులపాటు దేశవ్యాప్తంగా ‘జన్ జాగ్రణ్ అభియాన్’ కార్యక్రమాన్ని గురువారం ప్రారంభించింది. ఇందులోభాగంగా వీహెచ్‌పీ యువజన విభాగమైన బజ్రంగ్ దళ్ పదో తేదీ దాకా బ్లాక్ స్థాయిలో ‘శౌర్య యాత్ర’ కొనసాగించనుందని వీహెచ్‌పీ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. వీహెచ్‌పీ ఆధ్వర్యంలో డిసెంబర్ 21 నుంచి 31 దాకా ధర్మ రక్షా అభియాన్ నిర్వహిస్తారు. మతమార్పిడి వలలో పడకుండా అవగాహన కల్పించేందుకు వీహెచ్‌పీ మహిళా విభాగం దుర్గావాహిని సైతం ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననుంది. ఈ సందర్భంగా జైన్ మాట్లాడారు. అక్రమ మతమార్పిడిని నిరోధించేలా కేంద్రం చట్టం తెచ్చేలా మద్దతు కూడగట్టేందుకు ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ ఉపయోగించుకోనుంది. -
మతం మారితే రిజర్వేషన్లు వద్దు: వీహెచ్‌పీ
ధన్తోలి: మతం మార్చుకున్న ఎస్సీలు, ఎస్టీలకు రిజర్వేషన్ ప్రయోజనాలు అందరాదని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అభిప్రాయపడింది. మతం మారిన వారు కుల ఆధారిత రిజర్వేషన్‌తోపాటు మైనారిటీ హోదాల్లోనూ ప్రయోజనం పొందుతున్నారని వీహెచ్‌పీ జాతీయ ప్రతినిధి విజయ్ శంకర్ తివారీ అన్నారు. శుక్రవారం నాగ్‌పూర్(మహారాష్ట్ర) ధన్తోలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. అయితే ఇలా రెండు ప్రయోజనాలు పొందటాన్ని తాము అడ్డుకుంటామని తివారీ చెప్పారు. ఈ ప్రయోజనాలను ఆశించే చాలా మంది మతం మారుతున్నారన్నారు. కేంద్రం కూడా ఈ దిశగా రిజర్వేషన్లు అందకుండా చూసే ప్రణాళిక రూపొందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మత మార్పిడుల కోసం పలు ప్రయత్నాలు ఊపందుకున్నాయని, అలాంటి కార్యకలాపాలను ఎదుర్కోవడానికి వీహెచ్‌పీ తరపున ఒక కార్యాచరణను రూపొందిస్తున్నామని ఆయన వెల్లడించారు. ఇదీ చదవండి: మత విద్వేష ప్రసంగాలపై సుప్రీం సీరియస్ -
భజరంగ్‌దళ్‌లోకి 50 లక్షల కొత్త సభ్యత్వాలు
న్యూఢిల్లీ: తమ యువజన విభాగం భజరంగ్‌దళ్‌లోకి కొత్తగా 50 లక్షల మందిని చేర్చుకునేందుకు విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఆన్లైన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. ‘జాతీయస్థాయిలో భజరంగ్ దళ్ అభియాన్‌ను ప్రారంభించాం. ఇందుకు 15–35 ఏళ్ల యువత అర్హులు. సభ్యత్వం కోసం మా వెబ్సైట్ లింక్‌లో అందుబాటులోకి తెచ్చిన దరఖాస్తును నింపాలి’ అని గురువారం వీహెచ్‌పీ సెక్రటరీ జనరల్ మిలింద్ పరాండే మీడియాతో అన్నారు. కనీసం 50 లక్షల మంది యువతను చేర్చుకోవాలన్నదే తమ లక్ష్యమని చెప్పారు. వీరందరికీ శిక్షణనిచ్చి, తమ సంస్థలో చేరుకుంటామన్నారు. ఈ కార్యకర్తలకు వ్యక్తిత్వ వికాసంతోపాటు మతం, చరిత్ర, సంస్కృతి, ఆత్మరక్షణ విధానాలు, యోగ నేర్పిస్తామని చెప్పారు. నవంబర్ 6వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా శ్రేయోభిలాషులు (హృత్‌చింతక్) పేరుతో మరో భారీ కార్యక్రమం చేపట్టనున్నట్లు చెప్పారు. -
వీహెచ్‌పీ నేత బాలస్వామికి బెదిరింపు కాల్స్.. ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు
సుల్తాన్‌బజార్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత బాలస్వామికి ఆదివారం బెదిరింపు కాల్స్ రావడంతో ఆయన ఈస్ట్‌జోన్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాలస్వామి మా ట్లాడుతూ బజరంగ్దళ్ నిరసన కార్యక్రమాలను నిలిపి వేయాలని విశ్వహిందూ పరిషత్ ప్రచార ప్రముఖ్ అయిన తనకు ఆదివారం అర్ధరాత్రి బెదిరింపు కాల్స్ వచ్చాయని తెలిపారు. ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ, మంత్రి కేటీఆర్‌లకు వ్యతిరేకంగా స్టేట్మెంట్లు ఇవ్వడంతో పాటు డీసీపీలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేయడాన్ని వారు సవాలు చేస్తున్నారన్నారు. రకరకాల పేర్లతో ఫోన్లు చేసి భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. బజరంగ్దళ్ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నిరసన కార్యక్రమాలను వెంటనే రద్దుచేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చ రించినట్లు బాలస్వామి వెల్లడించారు. వీహెచ్‌పీ విడుదల చేసిన ప్రెస్‌నోట్‌ను కొందరు మార్పిడి చేసి వైరల్ చేశారన్నారు. అందులో వివాదాస్పద వ్యాఖ్యలు జోడించారని ఆరోపించారు. తమ ఫిర్యాదుపై డీసీపీ సానుకూలంగా స్పందించారని చెప్పారు. -
వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షునిగా సురేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షునిగా వీరన్నగారి సురేందర్ రెడ్డి, కార్యదర్శిగా శాలివా హన పండరినాథ్ ఎన్నికయ్యారు. ప్రస్తుతం చెన్నైలో సాగుతున్న వీహెచ్‌పీ జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా దేశంలోని కొన్ని రాష్ట్రాల సంస్థాగత అంశాలకు సంబంధించి మార్పులు, చేర్పులు చేశారు. ఇందులో భాగంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకున్నట్టు వీహెచ్‌పీ తెలంగాణ అధికార ప్రతినిధి (ప్రచార సహ ప్రముఖ్) పగుడాకుల బాలస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వీరు మూడేళ్ల పా టు ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. గతంలో రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసిన రామరాజు తెలంగాణ ప్రాంత సలహా సభ్యునిగా, అఖిల భార త మఠ్ మందిర్ బాధ్యతలు నిర్వహిస్తారు. రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న బండారి రమేష్ ఇకపై బెంగళూరు క్షేత్ర సేవా ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహిస్తారని బాలస్వామి తెలియజేశారు. -
భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్‌గా శివరాం
సాక్షి, హైదరాబాద్: భజరంగ్‌దళ్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్‌గా శివరాం ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లో జరుగుతున్న విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలలో భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్‌ను వీహెచ్‌పీ రాష్ట్ర కార్యదర్శి బండారి రమేష్ సమక్షంలో ఎన్నుకున్నారు. కో–కన్వీనర్లుగా వెంకట్, జీవన్ ఎన్నికయ్యారు. భజరంగ్ దళ్ బెంగళూరు క్షేత్ర శారీరక ప్రముఖ్‌గా కుమారస్వామి, విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహ కార్యదర్శిగా పండరినాథ్, ధర్మ ప్రసాద్, రాష్ట్ర సహ కార్యదర్శిగా సుభాష్ చందర్‌లను ఎన్నుకున్నట్టు విశ్వహిందూ పరిషత్ ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి వెల్లడించారు. -
విశ్వానికి గొప్పకానుక భగవద్గీత
సాక్షి, హైదరాబాద్: వేల ఏళ్ల క్రితమే ప్రపంచానికి లభించిన గొప్ప బహుమతి భగవద్గీత అని, అది భారతీయుల వారసత్వ సంపదని పలువురు ప్రముఖులు ఉద్ఘాంటించారు. భగవద్గీత ఆవిర్భావ దినోత్సవం గీతాజయంతి సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో మంగళవారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన లక్ష యువ గళ గీతార్చన కన్నుల పండువగా జరిగింది. వేలాదిగా తరలి వచ్చిన భక్తులు, విశ్వహిందూ కార్యకర్తలు, పిల్లలు, పెద్దలు, మహిళలు, వివిధ రంగాల వారు భగవ ద్గీత ఫౌండేషన్ వ్యవస్థాపకుడు గంగాధర శాస్త్రి నేతృత్వంలో భగవద్గీతలోని 40 శ్లోకాలను పది నిమిషాల పాటు పారాయణం చేశారు. వేడుకలకు ముఖ్య అతిథిగా వచ్చిన శ్రీరామజన్మభూమి ట్రస్టు కోశాధికారి గోవింద్ దేవ్ మహారాజ్ మాట్లాడుతూ సంపూర్ణ విశ్వశాంతి కోసం భగవద్గీత ప్రవచించిన మార్గనిర్ధేశం ఒక్కటే పరిష్కారమన్నారు. ఇది ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప బహుమానం అని చెప్పారు. అనేక దేశాల్లో ప్రజలు భగవద్గీతను తమ జీవితానికి అన్వయించుకొని ఉత్తమ ఫలితాలను సాధిస్తున్నారని చెప్పారు. కార్యక్రమం లో చినజీయర్ స్వామి మాట్లాడుతూ భారతదేశంలో పుట్టి పెరిగిన ప్రతి ఒక్కరికి గొప్ప వారసత్వ సంపద భగవద్గీత, రామాయణ, మహాభారత, భాగవతాది గ్రంథాలని చెప్పారు. లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమంలో పాల్గొన్న భక్తులు విజ్ఞాన శాస్త్రానికి అందని ఎన్నో రహస్యాలను భారతీయ వైదికగ్రంథాలు, ఉపనిషత్తులు వివరించాయన్నారు. జీవితం, ఖగోళం, కాలం వంటి అనేక అంశాలపై ప్రపంచానికి అవగాహనను, జ్ఞానాన్ని ప్రబోధించిన మహోన్నతమైన భారతదేశం, భగవద్గీత విశ్వగురువులుగా నిలిచాయన్నారు. గీత సందేశం ఎప్పటికీ కొత్తగా, వైవిధ్యంగానే ఉంటుందన్నారు. అనేక చోట్ల ఆలయాలకు రక్షణ లేకుండా పోయిందని, ఆలయ భూములు అన్యాక్రాంతమయ్యాయని, వాటి పరిరక్షణకు ఉద్యమించాలన్నారు. ఉడుపి పెజావర్ పీఠాధిపతి విశ్వప్రసన్న తీర్థ స్వామి మాట్లాడుతూ అందరం అర్జునుడిలాగా కర్తవ్య నిర్వహణ చేస్తే సంపద, విజయం వరిస్తాయన్నారు. వీహెచ్‌పీ కేంద్రీయ ప్రధాన కార్యదర్శి మిళింద పరాండే, జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, లేజర్ షో, భక్తి నృత్య గీతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
‘రజా అకాడమీ’ని నిషేధించాలి
నాగపూర్/పుణే: మహారాష్ట్రలోని పలు నగరాలు, పట్టణాల్లో హింసాకాండ చోటుచేసుకోవడంపై విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. త్రిపురలో జరిగిన మత కలహాలను నిరసిస్తూ ఇస్లామిక్ సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ర్యాలీల సందర్భంగా అల్లరి మూకలు దుకాణాలపై రాళ్లు రువ్విన సంగతి తెలిసిందే. ఈ ఘటనలను వీహెచ్‌పీ జనరల్ సెక్రెటరీ మిలింద్ పరాండే ఆదివారం ఖండించారు. అల్లర్లకు కారణమైన ‘రజా అకాడమీ’ అనే ఇస్లామిక్ సంఘాన్ని రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అల్లరి మూకలపై తాము పలు పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశామని అన్నారు. రాళ్లు రువ్వినవారిని గుర్తించి, చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒకవేళ పోలీసులు స్పందించకపోతే తామే ఆ పని చేస్తామని హెచ్చరించారు. ఈ విషయంలో త్వరలో గవర్నర్ భగత్‌సింగ్ కోషియారీని కలుస్తామన్నారు. అల్లర్లలో నష్టపోయిన వారికి పరిహారం చెల్లించా లని మహారాష్ట్ర సర్కార్‌కి మిలింద్ పరాండే విజ్ఞప్తి చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వ్యాఖ్యలపైనా ఆయన మాట్లాడారు. భారత్ 2014లో సాంస్కృతిక స్వాతంత్య్రం పొందిందని చెప్పారు. -
లోక కల్యాణం కోరుకునేది హిందూధర్మమే
సాక్షి, హైదరాబాద్: యువతలో ఆత్మవిశ్వాసం నింపే భగవద్గీత వైభవాన్ని ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరముందని, లోకకల్యాణం కోరుకునే ఏకైక ధర్మం హిందూ ధర్మం అని సాధుసంతులు అన్నారు. శుక్రవారం విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ధర్మాచార్యుల సమావేశం హైదరాబాద్‌లోని రెడ్‌హిల్స్‌లో జరిగింది. సమావేశానికి 82 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరై ప్రసంగించారు. వచ్చే డిసెంబర్ 14న గీత జయంతి రోజు లక్ష మంది యువకులతో ‘లక్ష యువగళ గీతార్చన‘కార్యక్రమం నిర్వహిస్తున్న సందర్భంగా సాధు సంతులతో ధర్మాచార్యుల సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీలు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర దినోత్సవాలను పురస్కరించుకుని భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవం’ కార్యక్రమంలో భాగంగా విశ్వహిందూ పరిషత్ లక్ష యువగళ గీతార్చన వేడుక నిర్వహించనున్నట్లు తెలిపారు. యువతీ యువకులకు సంస్కార అమృతం అందించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రపంచ దేశాలకు గురు స్థానంలో ఉన్న భారత్.. భగవద్గీత ఆధారంగా జ్ఞానాన్ని అందించిందని పేర్కొన్నారు. విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సంఘటన కార్యదర్శి యాదిరెడ్డి మాట్లాడుతూ దేశంలో హిందుత్వం తగ్గితే మారణహోమం పెరుగుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ప్రతీ హిందువు తమ కర్తవ్యంగా ధర్మ రక్షణలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ జాతీయ నాయకుడు రాఘవులు, రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, లక్ష యువ గళ గీతార్చన కార్యక్రమ కన్వీనర్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో.. వినాయక విగ్రహాలను అనుమతించలేం
సాక్షి, అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, ప్రైవేటు స్థలాల్లోనే ఏర్పాటుచేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చునంటూ ప్రభుత్వ యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలందరికీ అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ప్రదేశాల్లో చవితి ఉత్సవాల నిర్వహణకు అధికారులు అనుమతివ్వలేదని, ఇందులో తప్పులేదని హైకోర్టు స్పష్టంచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించరాదంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనని తెలిపింది. వీటిని రద్దుచేయాలని కోరుతూ వీహెచ్‌పీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్‌పీ కృష్ణాజిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్య సాయిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. అసలు పిల్ ఎలా దాఖలు చేస్తారు? పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మత విశ్వాసాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేయరాదని సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు కదా? అని ప్రశ్నించింది. అసలు ఎలా పిల్ దాఖలు చేస్తారని, మీ హక్కులు ఉల్లంఘన జరిగిందని భావిస్తే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, ప్రజలందరి తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. పెళ్లిళ్లకు 150 మందిని అనుమతినిస్తున్నప్పుడు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో అనుమతినివ్వకపోవడం సరికాదన్నారు. వినాయక ఉత్సవాలపై ఆధారపడిన చిన్న వ్యాపారులకూ నష్టం చేకూరుతుందన్నారు. దీంతో.. వారెవ్వరూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది. జీవించే హక్కే ముఖ్యమని ‘సుప్రీం’ చెప్పింది... తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వినాయక ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరినీ అడ్డుకోవడంలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయడంపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల జీవించే హక్కే అత్యంత ముఖ్యమైనదన్న సుప్రీంకోర్టు తీర్పును సుమన్ వివరించారు. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఆంక్షలు విధించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే సింగిల్ జడ్జి ప్రైవేటు స్థలాల్లోనే విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఏ రకంగానూ జోక్యం అవసరంలేదు ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌పై ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని చెప్పింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాలకు పరమావధి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధించిందని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నట్లు బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిలువరించడం అసాధ్యమేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారన్న ధర్మాసనం.. వీహెచ్‌పీ దాఖలుచేసిన ఈ వ్యాజ్యా న్ని కొట్టేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది. -
‘జావేద్ అక్తర్ కుట్రపూరిత వ్యాఖలు చేస్తున్నారు’
ముంబై: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)ను తాలిబన్లతో పోల్చూతు ప్రముఖ బాలీవుడ్ రచయిత జావేద్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు దేశంలో వివాదాన్ని రాజేశాయి. జావేద్ వ్యాఖ్యలను విశ్వ హిందూ పరిషిత్ ఖండించింది. సమాజాన్ని తప్పుదోవ పట్టించేలా కుట్రపూరితమైన ఆరోపణలు చేస్తున్నారంటూ జావేద్‌పై వీహెచ్‌పీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాలిబన్లు.. మహిళల పట్ల వ్యతిరేక ధోరణి గలిగినవారు, హింసను ప్రేరింపించే ఒక ఉగ్రవాద సంస్థ. అటువంటి సంస్థలతో ఆర్ఎస్ఎస్, బజరంగ్దళ్, వీహెచ్‌పీలకు పోలికేమిటీ అంటూ దుయ్యబట్టారు. సమాజంలో ఒక ప్రముఖ స్థానంలో ఉన్నవాళ్లు ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఎద్దేవా చేశారు. జావేద్ అక్తర్‌పై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా వీహెచ్‌పీ నేతలు కోరారు. (చదవండి: సారీ చెప్పు లేదంటే! జావేద్ అక్తర్‌కు బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరిక) జావేద్ అక్తర్ ఆర్ఎస్ఎస్పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. తాలిబన్లు ఏవిధంగా ఇస్లామిక్ రాజ్యం కోసం పోరాడుతున్నారో.. అదే మాదిరి ‘హిందూ దేశ స్థాపన కోసం ఆర్ఎస్ఎస్ పని చేస్తోంది’ అని జావేద్ అక్తర్ ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. బీజేపీ నాయకులు ఆందోళనలు చేపట్టారు. జావేద్ అక్తర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆయన దిష్టిబొమ్మ దహనం కార్యక్రమాలు కూడా చేసిన సంగతి తెలిసిందే. చదవండి: బీజేపీ, ఆరెస్సెస్‌లతో భారత్‌కు ప్రమాదం -
వారిది తప్ప.. అందరి డీఎన్ఏ ఒక్కటే
న్యూఢిల్లీ: ఆవు మాంసం తినే వారిది తప్ప..దేశ ప్రజలందరి డీఎన్ఏ ఒక్కటేనంటూ విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ)నేత సాధ్వి ప్రాచి వ్యాఖ్యానించారు. శనివారం సాధ్వి ప్రాచి రాజస్తాన్‌లోని దౌసాలో జరిగిన ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ..‘ఆవు మాంసం తినేవారిది మినహా అందరి డీఎన్ఏ ఒక్కటే’అని పేర్కొన్నారు. దేశంలో జనాభా పెరుగుదలను ఆపేందుకు కఠిన చట్టాలు తీసుకురావాలన్నారు. ఇద్దరి కంటే ఎక్కువ మంది సంతానాన్ని కలిగిన వారికి ప్రభుత్వ సేవలు బంద్ చేయాలన్నారు. వారికి ఓటు హక్కు కూడా లేకుండా చేయాలని డిమాండ్ చేశారు. రాజస్తాన్‌లో లవ్ జిహాద్ ముసుగులో జరుగుతున్న మత మార్పిడులను ఆపేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఐక్యత లేకుండా అభివృద్ధి సాధ్యం కాదనీ, దేశంలోని అన్ని మతాల ప్రజల డీఎన్ఏ ఒక్కటేనని ఇటీవల జరిగిన ముస్లిం రాష్ట్రీయ మంచ్ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పేర్కొన్న విషయం తెలిసిందే. -
హైకోర్టు అనుమతిచ్చినా వీరహనుమాన్ విజయ యాత్రకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరగాల్సిన వీరహనుమాన్ విజయ యాత్రకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. హైకోర్టు యాత్రకు అనుమతిచ్చినా కూడా యాత్ర ఆగిపోయింది. అయితే యాత్రను తామే స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వాస్తవంగా హైదరాబాద్‌లో మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా పాతబస్తీ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. అయితే న్యాయస్థానాలు ఎన్నో ఆంక్షలతో వీరహనుమాన్ విజయ యాత్రకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు యాత్రపై సమాలోచనలు చేశాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యాత్ర విరమించుకుంటే మంచిదనే అభిప్రాయానికి ఆయా సంస్థలు వచ్చాయి. చివరకు వీరహనుమాన్ విజయ యాత్రను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు బండారి రమేశ్, రామరాజు, సుభాశ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కరోనా నియమాలు మత రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. చిరంజీవి చదవండి: గుడ్‌న్యూస్.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం -
బర్త్ డే పార్టీలో లొల్లి: బీజేపీ కార్యకర్త దారుణ హత్య
న్యూఢిల్లీ: జన్మదిన వేడుకలో చిన్నగా మొదలైన వివాదం చినికి చినికి గాలివానగా మారి ఓ యువకుడి హత్యకు దారి తీసింది. అతడి స్నేహితుడు తన మిత్రులతో కలిసి దారుణంగా హత్య చేశారు. అయితే అతడి హత్య రాజకీయ దుమారం రేపుతోంది. ఈ ఘటనపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అసలు పార్టీలో ఏం జరిగింది? ఎందుకు హత్య చేశారు? మధ్యలో హిందూ సంఘాలు ఎందుకొచ్చాయో చదవండి. న్యూఢిల్లీలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో రింకు శర్మ(25) టెక్నీషియన్‌గా పని చేస్తున్నాడు. మంగోల్‌పురిలో అతడు నివసిస్తున్నాడు. స్నేహితుడు డానిశ్‌తో కలిసి గురువారం రింకు రాత్రి ఓ బర్త్ డే పార్టీకి వెళ్లాడు. అయితే పార్టీలో ఇద్దరి మధ్య ఏదో విషయమై వివాదం ఏర్పడింది. ఇద్దరు గొడవ పడ్డారు. కోపంలో డానిశ్ పార్టీ అనంతరం ఇంటికి వెళ్తున్న రింకును అడ్డగించారు. డానిశ్ తన ముగ్గురు స్నేహితులను పిలిపించి అడ్డగించాడు. ఈ సమయంలో రింకు, డానిశ్ ఇద్దరు గొడవపడ్డారు. తీవ్ర ఆవేశంలో డానిశ్, అతడి స్నేహితులు రింకు శర్మను కత్తులతో పొడిచారు. తీవ్ర గాయాలపాలైన రింకు శర్మ సమీపంలోని ఓ ఆస్పత్రికి పరిగెత్తుకుంటూ వెళ్లాడు. అయితే కత్తితో తీవ్రంగా పొడవడంతో కొద్దిసేపటికే మృతి చెందాడు. ఇప్పటివరకు బాగానే ఉన్నా దీనిపై రాజకీయ దుమారం రేగింది. అతడి హత్యపై హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశాయి. దీనిపై హీరోయిన్ కంగనా రనౌత్ కూడా స్పందించింది. రింకు శర్మ కుటుంబసభ్యులు దీనిపై స్పందించారు. బీజేపీ యువ మోర్చ, విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ)లో రింకు క్రియాశీలకంగా ఉన్నాడని తెలిపారు. కొన్నిరోజులుగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం రింకు విరాళాలు వసూలు చేస్తున్నాడని చెప్పారు. అయితే బర్త్ డే పార్టీలో రింకు జై శ్రీరామ్ నినాదాలు చేయగా.. దాన్ని వ్యతిరేకిస్తూ అతడిపై కొంతమంది దాడికి పాల్పడి హత్య చేశారని కుటుంబసభ్యులు ఆరోపించారు. విశ్వ హిందూ పరిషత్ నాయకులు ఇవే విషయాలు చెబుతున్నారు. అయితే కుటుంబసభ్యులు, వీహెచ్‌పీ చేసిన ఆరోపణలను పోలీసులు ఖండించారు. హత్య జరిగిన విధానం అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సుధాన్షు వివరించారు. రింకు, డానిష్ ఒకే ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఢిల్లీలోని రోహిణి ప్రాంతంలో గతేడాది హోటల్ వ్యాపారం ప్రారంభించారు. అయితే నష్టాలు రావడంతో కొన్నాళకు మూసేశారు. ఈ విషయమై రింకు, డానిశ్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై బర్త్ డే పార్టీలో ప్రస్తావన రావడంతో ఇద్దరు గొడవపడ్డారు. ఇదే రింకు హత్యకు కారణమని పోలీసులు స్పష్టం చేశారు. హత్యకు పాల్పడిన నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ హత్యపై హీరోయిన్ కంగనా రనౌత్ స్పందించారు. ‘క్షమించు మేం ఓడిపోయాం’ అని సాథ్వి సాచి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసింది. రింకుశర్మకు న్యాయం జరగాలి అనే హ్యాష్‌ట్యాగ్‌తో కంగనా ట్వీట్ చేసింది. ఆ తండ్రి బాధ చూడండి.. అంటూ రింకుశర్మ మీడియాతో రోదిస్తూ మాట్లాడుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. A peaceful group walks into the house of #RinkuSharma & stabs him to death, his mistake is that he was collecting donations for #RamMandir. Does the lutyen ecosystem has courage to question this lynching? Will the award wapsi group condemn this brutality?#JusticeForRinkuSharma pic.twitter.com/YxsPN4D4Hq — Shobha Karandlaje (@ShobhaBJP) February 12, 2021 Sorry we failed you #JusticeForRinkuSharma https://t.co/H9AQ9xM1E1 — Kangana Ranaut (@KanganaTeam) February 11, 2021 -
అయోధ్య రామమందిరం: చరిత్రలో లిఖించదగ్గ రోజు
సాక్షి, విజయవాడ : అయోధ్యలో నేడు రామ మందిర నిర్మాణానికి భూమి పూజ చేసుకోవడం సంతోషదాయకమని మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు అన్నారు. ఈ రోజు రాత్రి 7 గంటలకు ప్రతి భారతీయ పౌరుడు కోవిడ్-19 నియమాలు పాటిస్తూ ఇంట్లో దీపాలు వెలిగించాలని పిలుపునిచ్చారు. బుధవారం అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణ భూమి పూజ నేపథ్యంలో విజయవాడ విశ్వహిందు పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 11.30 నుంచి 1 గంట వరకూ పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ మాట్లాడుతూ.. అయోధ్యలో రామమందిరం నిర్మించటం శుభపరిణామమన్నారు.(అయోధ్య అప్డేట్స్; హనుమాన్ గడీలో ప్రధాని) ‘రామమందిరం నిర్మాణం కోసం 7 సార్లు పోరాటాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా త్యాగాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా రామమందిరం నిర్మాణం కోసం ఈ రోజు భూమి పూజ చేసుకోవటం హర్షించదగ్గ విషయం. 1984లో విశ్వహిందు పరిషత్ రామమందిరం కోసం అనేక కార్యక్రమాలు చేపట్టింది. 1992 డిసెంబర్ 6వ తేదీన జరిపిన కర సేవ కార్యక్రమంలో దేశ, విదేశాల నుంచి లక్షలాది మందిగా కర సేవలో పాల్గొన్నారు. తాత్కాలిక రామమందిరం ఏర్పాటు చేసి బాలరాముడిని అందులో ప్రతిష్టించారు’. అని గోకరాజు గంగరాజు తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు) కాగా అయోధ్యలో రామ మందిర నిర్మాణం భూమి పూజ సందర్భంగా బీజేపీ శ్రేణులు విజయవాడలో సంబరాలు చేసుకుంటున్నారు. బీజేపీ కార్యాలయం వద్ద బాణాసంచా కాల్సి, స్వీట్లు పంచారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం భారత దేశ ప్రజల చిరకాల వాంఛ అని బీజేపీ అధికార ప్రతినిధి శ్రీనివాస్ రాజు అన్నారు. రాముని జన్మ స్థలంలో రామాలయం నిర్మించడం శుభపరిణామమని కొనియాడారు. ప్రధాని నరేంద్ర మోదీ రామ మందిరానికి శంకుస్థాపన చేయడం సంతోషకరమన్నారు. భారత సంస్కృతిని విదేశీయులు నాశనం చేశారని, ప్రపంచంలో అత్యంత పురాతనమైన సంస్కృతి భారతదేశానిదని పేర్కొన్నారు. (అయోధ్య చరిత్రలో దశాబ్దాల పోరాటం.) ‘ప్రపంచానికే భారత్ ఆచార్య వ్యవహారాలు, సంస్కృతి నేర్పిర్పించిన దేశం. భారతదేశంలో పురాతనమైన దేవాలయాలకు పునర్వైభవం ప్రధాని మోడీ తీసుకువస్తారు. అయోధ్యలో రామమందిరం నిర్మించాలని దేశ వ్యాప్తంగా పెద్ద ఉద్యమం జరిగింది. దేశ వ్యాప్తంగా ఉన్న పవిత్ర పుణ్య స్థలాలు నదుల నుంచి మట్టి నీరు తెచ్చి శంకుస్థాపన చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా పండగ వాతావరణం నెలకొంది. భరతదేశ చరిత్రలో ఈ రోజు లిఖించ దగ్గ రోజు’. అని శ్రీనివాస్ రాజు అన్నారు. -
‘1989లోనే మందిర నిర్మాణానికి శంకుస్థాపన’
సాక్షి, హైదరాబాద్ : చారిత్రక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కేవలం మత కార్యక్రమం కాదని, ఇదొక సాంస్కృతిక పునరుజ్జీవనమని విశ్వహిందూ పరిషత్ జాతీయ ప్రధాన కార్యదర్శి రాఘవులు తెలిపారు. మూడేళ్లలో మందిర నిర్మాణం పూర్తవుతుందని బుధవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తెలిపారు. రాముడి ఇతిహాసంతో పాటు వంశ చరిత్రతో 70 ఎకరాల్లో మందిర నిర్మాణం జరుగుతుందని, వీహెచ్‌పీ రూపొందించిన నమూనాతోనే నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మూడు అంతస్థులతో రామమందిర నిర్మిస్తున్నట్లు, మొదటి అంతస్తులో బాలరాముడు, రెండో అంతస్తులో దర్బార్, మూడో అంతస్తులో రాముడి గురువుల విగ్రహాలు ఉంటాయని తెలిపారు. 70 ఎకరాల ఆలయ ప్రాంగణంలో రాముడి వంశం ఇక్ష్వాకుల వంశ చరిత్ర మొత్తం ఉంటుందన్నారు. రాముడి ఆదర్శాలు ఈ కాలానికి కూడా ఆచరణీయమైనవన్నారు.(భూమిపూజకు అయోధ్య సిద్దం) రాముడి రాజ్యంలో విద్య, వైద్యం, అంగట్లో సరుకు కాదని, రామ రాజ్యం అంటే ఆదర్శవంతమైన పరిపాలన అని రాఘవులు పేర్కొన్నారు. పేదరికం లేనిదే రామ రాజ్యమని, రాముడి విగ్రహాలను పూజించడం అంటే ఆయన సద్గుణాలను ఆచరించడమేనని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి శంకుస్థాపన 1989లోనే జరిగిందని, 1989లో దళితుడితో రామాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిందని గుర్తుచేశారు. సాధు సంతుల సమక్షంలో కామేశ్వర్ చౌపాల్ అనే దళితుడు తొలి ఇటుక పెట్టినట్లు తెలిపారు. అయోధ్య రామాలయం ట్రస్ట్‌లో దళితుడు ఒక ట్రస్టీగా ప్రస్తుతం ఉన్నారన్నారు. ఇప్పుడు జరిగేది ఇది కేవలం రామమందిర నిర్మాణ పనుల ప్రారంభం కోసం జరిపే భూమి పూజ మాత్రమేనని, అయోధ్య భూమి పూజ రాజకీయ కార్యక్రమం కాదని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి హోదాలో నరేంద్ర మోదీ భూమిపూజ నిర్వహిస్తున్నారని తెలిపారు. (అయోధ్య రామాలయం: అద్వానీ ఆసక్తికర వ్యాఖ్యలు) ‘ఇఫ్తార్ లాంటి కార్యక్రమాలకు సైతం అనేక మంది ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు వెళ్లిన సంఘటనలు ఉన్నాయి. భూమి పూజ అంశాన్ని రాజకీయం చేయడం సరికాదు. కాశీ, మధురపై ఉద్యమం చేయాల్సిన అవసరం రాదు. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించుకోవడమే ఉత్తమం. ఒకరి ధర్మంపై మరొకరు దాడులు చేయడం సరి కాదన్నదే అయోధ్య రామమందిర నిర్మాణం సందేశం. హిందుత్వం అంటే సెక్యులర్ సర్వధర్మ సమభావన మన నరనరాల్లో ఉంది. భారత దేశంలోనే అత్యధిక మసీదులు, చర్చిలు ఉన్నాయి. అందరం సోదరుల్లా జీవిస్తున్నాం. విదేశీ దురాక్రమణ దారుడు బాబర్ రామజన్మభూమిలో ఉన్న మందిరాన్ని దురుద్దేశంతో పడగొట్టారు. వాటిని తిరిగి నిర్మించడం అంటే సంస్కృతిని పునరుద్ధరించడమే. ఈ రోజు అత్యంత ఆనందకరమైన రోజు. అయిదు శతాబ్దాల చరిత్రలో జరిగిన సంఘర్షణలో ప్రాణత్యాగం చేసిన వారి ఆత్మలు శాంతిస్తాయి’ అని రాఘవులు పేర్కొన్నారు. (సయోధ్యకు అంకురార్పణ) -
హత్య: ఆయుధాలతో, అనంతరం తుపాకులతో..
భోపాల్: విశ్వహిందూ పరిషత్ సభ్యుడొకరు దారుణ హత్యకు గురైన సంఘటన మధ్యప్రదేశ్‌లో చోటుచేసుకుంది. హోసంగాబాద్ జిల్లా వీహెచ్‌పీ గోరక్షక్ శాఖ ఇన్చార్జ్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రవి విశ్వకర్మ (35)ని కొందరు దుండగులు కాల్చి చంపారు. తన ఇద్దరు మిత్రులతో కలిసి ఆయన శుక్రవారం కారులో ఇంటికి వెళ్తుండగా పిపారియా పట్టణం వద్ద 10 మంది మూక వారిపై పదునైన ఆయుధాలతో దాడి చేసింది. అనంతరం కాల్పులు జరిపింది. ఛాతీలో బుల్లెట్ దిగడంతో రవి అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మిగతా ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పిపారియా పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేశామని, నిందితులను గుర్తించి పట్టుకుంటామని ఎస్ఐ సతీష్ అంధ్వాన్ తెలిపారు. పాత కక్షల నేపథ్యంలో ఈ హత్య జరిగినట్టు ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పథకం ప్రకారమే రవి విశ్వకర్మను దారుణంగా హత మార్చారని వీహెచ్‌పీ ప్రాంతీయ సహ మంత్రి గోపాల్ సోని అన్నారు. దీనిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. (చదవండి: కరోనాతో సీనియర్ వీడియో జర్నలిస్టు కన్నుమూత) -
నెహ్రూపై సాధ్వీ సంచలన వ్యాఖ్యలు..
భోపాల్: దేశతొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూపై విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నాయకురాలు సాధ్వీ ప్రాచీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో అందరికంటే నెహ్రూనే అతిపెద్ద రేపిస్ట్ అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన ప్రకటనపై సాధ్వీ ఈ విధంగా స్పందించారు. ‘భారత్ తొలినాళ్లలో మంచి దేశంగా గుర్తింపు పొందింది. ఈ దేశం రాముడు, కృష్ణుడు పుట్టిన దేశం. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాతనే అత్యాచార సంస్కృతిని తీసుకువచ్చారు. దానికి ప్రధాన కారణం తొలి ప్రధాని నెహ్రూనే. ఎందుకంటే ఆయనే పెద్ద రేపిస్ట్. టెరరిజం, నక్సలిజం, రేపిజం అన్నీ నెహ్రూ కుంటుంబం నుంచి వచ్చినవే. కాంగ్రెస్ నాయకులే దేశాన్ని సర్వనాశనం చేశారు’ అంటూ వివాదాస్పద రీతిలో మాట్లాడారు. కాగా ఉన్నావ్ ఘటనపై రాహుల్ తీవ్ర స్థాయిలో స్పందించిన విషయం తెలిసిందే. దేశంలో పెరుగుతున్న అత్యాచార కేసులను చూస్తుంటే ప్రపంచ ‘అత్యాచారాలకు రాజధాని’గా భారతదేశం మారిపోతోందని అయన అభిప్రాయపడ్డారు. ఈ పరిస్థితిని చూసి అంతర్జాతీయ సమాజం భారత్‌ను ఎగతాళి చేస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ అత్యాచారం కేసులో నిందితుడిగా ఉన్నా.. మోదీ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. రాహుల్ వ్యాఖ్యలపై పలువురు బీజేపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
అయోధ్యలో నిశ్శబ్దం
అయోధ్య: అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న నేపథ్యంలో మరికొన్ని కీలక పరిణామాలు సంభవించాయి. రామాలయ నిర్మాణం కోసం 1990 నుంచి అయోధ్యలో రాతి శిల్పాలను చెక్కిస్తున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) మొదటిసారిగా ఆ పనులను నిలిపివేసింది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన అన్ని ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలను కోరింది. ఫైజాబాద్ జిల్లాకు 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఇలా ఉండగా, సుప్రీంకోర్టు తీర్పుపై అయోధ్య వాసులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలతో అంతా సవ్యంగానే జరిగిపోతుందని, 1992 నాటి పరిస్థితులు పునరావృతం అయ్యే అవకాశం ఉండదని వారు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. అయోధ్యలోని రామమందిర్ కార్యశాలలో ఆలయం కోసం 1990 నుంచి రాతి చెక్కడం పనులు సాగిస్తున్న వీహెచ్‌పీ మొట్టమొదటి సారిగా పనులను నిలిపివేసింది. బాబ్రీ మసీదు స్థానంలో రామాలయం నిర్మించాలని వీహెచ్‌పీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. కేంద్రం, యూపీలో ప్రభుత్వాలు మారినా..1992లో బాబ్రీ మసీదు విధ్వంసం జరిగి, వీహెచ్‌పీ, ఆర్ఎస్ఎస్ తదితర హిందుత్వ సంస్థలపై 6 నెలలపాటు నిషేధం విధించినప్పుడు కూడా ఈ పనులు ఆగలేదు. తాజాగా, సుప్రీంకోర్టు తీర్పు వెలువడనున్న దృష్ట్యా తమ నాయకత్వం పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకుందని వీహెచ్‌పీ ప్రతినిధి శరత్ శర్మ తెలిపారు. ప్రతిపాదిత రామాలయం మొదటి అంతస్తుకు సరిపడా 1.25 లక్షల ఘనపుటడుగుల రాతి చెక్కడం పనులు ఇప్పటి వరకు పూర్తయ్యాయని ఆయన అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు సుప్రీంకోర్టు తీర్పును పురస్కరించుకుని సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరక్కుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభుత్వం కూడా సుప్రీం తీర్పు అనంతరం ఉత్సవాలు జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. డిసెంబర్ 28వ తేదీ వరకు అయోధ్యలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ఞలు విధించింది. ఫైజాబాద్ జిల్లా నాలుగు భద్రతా జోన్లను ఏర్పాటు చేసిన కేంద్రం 40 కంపెనీల పారా మిలటరీ బలగాలను తరలించింది. సామాజిక మాధ్యమాల్లో రామ జన్మభూమి తీర్పునకు సంబంధించి వ్యాఖ్యలపై నిషేధం విధించింది. రైల్వే శాఖ కూడా రైల్వే భద్రతా దళం(ఆర్పీఎఫ్) సెలవులను రద్దు చేసింది. వెంటనే విధుల్లో చేరాలని ఆదేశించింది. -
హిందువులను అవమానించారంటూ.. కేసీఆర్‌పై ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: హిందువులపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ ఎన్నికల సంఘానికి విశ్వహిందు పరిషత్(వీహెచ్‌పీ) ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ బహిరంగ సభలో హిందువులను అవమానించేలా మాట్లాడిన కేసీఆర్‌పై చర్యలు తీసుకోవాలని ప్రధాన ఎన్నికల అధికారి రజత్ కుమార్‌ను కోరింది. ఆ సభలో ‘హిందూ గాళ్లు, బొందు గాళ్లు.. దిక్కుమాలిన దరిద్రుల చేతిలో దేశం ఉంది’అంటూ హిందువులను కించపరిచేలా వ్యాఖ్యానించారని ఆ ఫిర్యాదులో పేర్కొంది. (16మంది ఎంపీలను గెలిపిస్తే అగ్గి రాజేస్త) అంతేకాకుండా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్డును కూడా కించపరిచారని, జాతీయ సమగ్రతకు భంగం కలిగేలే మాట్లాడిన కేసీఆర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ బృందం రజత్ కుమార్‌కు విజ్ఞప్తి చేసింది. లిఖితపూర్వ ఫిర్యాదుతో పాటు, కేసీఆర్ ప్రసంగానికి సంబంధించిన సీడీని కూడా సమర్పించింది. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు వీహెచ్‌పీ ఇచ్చిన ఫిర్యాదుపై రజత్ కుమార్ స్పందించారు. కరీంనగర్ జిల్లా ఎన్నికల అధికారులను నివేదిక కోరుతూ ఆదేశాలు జారీ చేశారు. నివేదిక రాగానే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వీహెచ్‌పీ బృందానికి హామీ ఇచ్చారు. రజత్ కుమార్‌ను కలిసిన బృందంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు, అధికార ప్రతినిధి రావినూతల శశిధర్, భజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సుభాష్ చందర్, ముఖేష్ సీనియర్ న్యాయవాది కరుణాసాగర్, గిరిధర్, వీహెచ్‌పీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
హిందువులను అవమానించారంటూ.. కేసీఆర్‌పై ఫిర్యాదు
-
కశ్మీరీలపై దాడి: మోదీ తీవ్ర ఆగ్రహం
లక్నో: ఉత్తరప్రదేశ్‌లో ఇద్దరు కశ్మీరీ యువకులపై విశ్వహిందూ దళ్ (వీహెచ్‌డీ)కి చెందిన సభ్యులు దాడికి పాల్పడిన ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం దేశం ఉన్న పరిస్థితుల్లో అందరూ ఐక్యంగా ఉండాలని, ఇలాంటి దాడులను తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవల్సిందిగా యూపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మోదీ ఆదేశించారు. డాలీగంజ్ ప్రాంతంలో డ్రై ఫ్రూట్స్ అమ్ముకుంటున్న ఇద్దరు కశ్మీరీ యువకులపై రెండు రోజుల క్రితం కాషాయ రంగు దుస్తుల్లో ఉన్న కొందరు వ్యక్తులు వారి వద్దకు వచ్చి కర్రలతో దాడికి పాల్పడ్డ విషయం తెలిసిందే. ఘటనపై యూపీ పోలీసులు ధర్యాప్తు చేయగా వారిలో ఒకరు విశ్వ హిందూ దళ్ అధ్యక్షుడిగా తేలింది. కశ్మీరీ యువకులపై వీహెచ్‌డీ దాడిచేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో మోదీ సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే ఘటన గురించి ఆరా తీసి.. దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. కాగా పూల్వామా ఉగ్రదాడి, మెరుపు దాడుల అనంతరం దేశ వ్యాప్తంగా కశ్మీరీ యువకులపై హిందూ సంఘాలు దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. ఇలాంటి దాడులను తీవ్రంగా ఖండించాలని ప్రధాని మోదీ ఆదేశించారు. -
ప్రేమించడమే నేరమా?
వికృత కలాపం ప్రపంచానికి సంస్కృతీ సంప్రదాయాలు, విలువలను నేర్పిన భారతదేశం నేడు కొన్ని వికృత చేష్టలకు బానిసగా మారుతోంది. ప్రపంచీకరణ ముసుగులో విదేశీ కల్తీ సంస్కృతికి వేదికగా మారుతోంది. కిస్ ఆఫ్ ది డే.. హగ్గింగ్ డే.. డార్లింగ్ నైట్.. హస్బెండ్ నైట్.. కాండిల్ లైట్.. వాలం టైన్స్ డే.. పేరెంట్స్ డే.. మదర్స్ డే.. ఫాదర్స్ డే.. చిల్డ్రన్స్ డే ఇలా రోజుకు ఒక డే పేరుతో విదేశీ సంస్కృతినీ భారతీయతపై బలవంతంగా రుద్దుతున్నారు. అనేక సంవత్సరాలు పరాయి పాలనలో మగ్గినా కూడా... మన భారతదేశం సంస్కృతి సంప్రదాయాలను వీడలేదు. ఈ క్రమంలో నేడు విదేశీ భావజాలాన్ని భారతీయ జీవన శైలితో కలుషితం చేసేందుకు మల్టీ నేషనల్ కంపెనీలు ధనార్జనే ధ్యేయంగా పబ్బులు, మాల్స్, రిసార్ట్స్, స్టార్ హోటల్లో ఆఫర్లు ప్రకటించి దోపిడీకి గురి చేస్తున్నాయి. అందులో భాగంగానే రోజుకు ఒక్క డే పేరుతో యువతను పెడదోవ పట్టిస్తున్నారు పాశ్చాత్య కంపెనీల పెద్దలు. ఫలితంగా నవ యువత నిర్వీర్యమై పోతోంది. భవిష్యత్తు చీకటి కమ్ముతోంది. దేశ ఔన్నత్యం దెబ్బతింటోంది. దీంతో వచ్చేతరం మన సంప్రదాయాలకు దూరమయ్యే ప్రమాదం నెలకొంది. అందుకే బజరంగ్ దళ్ విశ్వహిందూ పరిషత్ వంటి సంస్థలు ముందుకు వచ్చాయి. ధర్మాన్ని కాపాడేందుకు దేశ సంస్కృతిని రక్షిం చేందుకు తమకు తాము బాధ్యత తీసుకుంటున్నాయి. ప్రేమ పేరుతో వికృత కార్యకలాపాలకు పాల్పడే యువతకు భారతీయ విలువలను తెలియజేసేందుకు కంకణం కట్టాయి. ప్రేమ అంటే ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే మాత్రమే కాదు అది వ్యామోహానికి సంబంధించిన రోజు కాబట్టి అలాంటి డే పేరుతో భారత పరువును బజారు పాలు చేయొద్దు అని వివరించేందుకు ముందుకు కదిలారు. ప్రేమంటే శ్రీకృష్ణుడు, శ్రీరాముడు చూపించారని వివరిస్తున్నారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే లంక నుంచి వారధి కట్టి సీతమ్మను కాపాడుకున్న చరిత్ర శ్రీరామచంద్రుడు. అదే నిజమైన ప్రేమ. అలాంటి చరిత్రను మరుగున పడేసి పాశ్చాత్య వికృత చేష్టలకు దాసోహం కావడం సరికాదని తెలియజేసేందుకు హిందూ సంస్థలు కృషి చేయడం హర్షణీయం. దేశ సంస్కృతి సంప్రదాయాలను గౌరవించే భారతీయ విలువలను విశ్వానికి ఎత్తి చూపాలి తప్ప.. ప్రపంచం ముందు తలదించుకునేలా చేయరాదు. సంప్రదాయాలకు విఘాతం కలిగించే విడ్డూరమైన దినోత్సవాలు దూరంగా ఉండాలి. కోర్టులు కూడా విచ్చలవిడితనాన్ని ప్రోత్సహించడం భావ్యం కాదు. పెళ్ళయిన స్త్రీ తనకు నచ్చిన వ్యక్తితో లైంగికంగా కలిసి ఉండటం నేరం కాదు అని తీర్పు ఇవ్వడం ఎంత మాత్రం సరికాదు. ఇలాంటి తీర్పులను కూడా ప్రతిఘటించి విలువలను కాపాడేందుకు కొన్ని సంస్థలు ముందుకు రావడం అభినందనీయం. -పగుడాకుల బాలస్వామి, విశ్వహిందూ పరిషత్ సహ ప్రచార ప్రముఖ్ ప్రకృతి సహజం నేడు ప్రేమికుల దినం. ఆహ్లాదం కంటే వివాదానికి తెర తీస్తున్న కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రేమికుల రోజు ముందు పీఠిలో ఉంటోంది. ప్రేమ జంటలు రోడ్లపైకి రావద్దని, ప్రేమికులదినం ఒక వికృత కార్యకలాపాల సంస్కృతి అనీ, మన సంస్కృతి పరువును బజారుపాలు చేసే చర్య అని అంటున్నారు. భారతీయ విలువలను ధ్వంసం చేస్తున్న రోజుగా ప్రేమికుల దినాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈరోజు పెళ్లి కాని యువతీయువకులు ప్రేమజంటలై బయట తిరిగితే వారిని పట్టుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామంటున్నారు. వాలంటైన్స్ డే నిర్వహించే పబ్‌లు, రిసార్టులు, హోటళ్లు, మాల్స్‌పై దాడులకు కూడా వెనుకాడబోమని బజరంగ్ దళ్, వీహెచ్‌పీ వంటి హిందూ మత సంస్థల నేతలు హెచ్చరిస్తున్నారు. యువతీయువకులు బహిరంగ స్థలాల్లో తిరిగితే వారికి బలవంతంగా తాళి కట్టించి ఊరేగించే తరహా సంస్కృతిలో ఏ ఆచార సంప్రదాయాలు దాగి ఉన్నాయో ఎవరు చెప్పాలి? ప్రేమను బహిరంగంగా వ్యక్తపరిచే సంస్కృతి విదేశీయమైనది, మన సంస్కృతికి భిన్నమైంది అనే దృక్పథం ప్రజాస్వామికమైనదేనా? తన ఇష్టాఇష్టాలను, అభిప్రాయాలను బహిరంగంగా వ్యక్తపరచడం ఆధునిక నాగరికత మనిషికి అందించిన అతి గొప్ప అవకాశం. సంస్కృతిని మడికట్టు ఆచారంగా, మార్చడానికి వీలులేని జడపదార్థంగా భావిస్తే అలాంటి సంస్కృతి చరిత్రలో అంతర్ధానం కాక తప్పదు. సంస్కృతిని నిత్యం మార్పు చెందుతూ, కొత్తను స్వీకరిస్తూ, పరిణామం చెందుతూ ఉండే జీవన విధానంగా గుర్తించినప్పడు ఒకరికి ఇవ్వడం, ఒకరినుంచి తీసుకోవడం ప్రకృతి నియమంలాగా సాగిపోతూనే ఉంటుంది. గుండుసూది నుంచి విమానాల వరకు ప్రతిదీ విదేశాలనుంచి అరువు తెచ్చుకుంటూ, పబ్బం గడుపుకుంటూ, మరోవైపున మా సంస్కృతి చెక్కుచెదరదనీ, వెయ్యేళ్ల క్రితం ఎలా ఉండేవారిమో ఇప్పుడూ అలాగే బతుకుతాం అంటే ఇలాంటి సంస్కృతి చరిత్రలో నిలబడేది కాదు. నా అభిప్రాయాలకు, నేను విశ్వసిస్తున్న ఆలోచనలకు భిన్నమైన ప్రతి దాన్నీ వ్యతిరేకిస్తాననీ, బలవంతంగానైనా సరే నిలిపివేసే చర్యలు చేపడతానని భావించడమే హిట్లర్ నాజీ సిద్ధాంతాలు ఆధునిక రూపంలో దేశంలో చెలామణీ అవుతున్నాయనడానికి నిదర్శనం. యాసిడ్ దాడులు, వరకట్నహత్యలు, గృహ చిత్ర హింసలు, ఫ్యూడల్ అహంకారాలు రాజ్యమేలుతున్న దేశంలో ప్రేమను స్వచ్ఛంగా వ్యక్తపరిచే ఏ అలవాట్లనైనా, ఆచారాలనైనా ఆహ్వానిం చాలి. ‘మా జాతికి ప్రేమించడం నేర్పినందుకు కృతజ్ఞతలు’ అంటూ ఒక చిన్న దేశం ఒక మహాకవి ప్లాబో నెరూడాకు నీరాజనాలు పలికింది. అందుకే ప్రేమించడాన్ని, ప్రేమను పంచి పెట్టడాన్ని నేర్చుకుందాం. -ప్రత్యూష, ప్రేమ్‌నగర్, హైదరాబాద్ -
‘వాలంటైన్ డే’ను అడ్డుకుంటాం
సుల్తాన్‌బజార్: పాశ్చాత్య సంస్కృతిలో భాగమైన వాలెంటైన్ డేను విశ్వ హిందూ పరిషత్, భజరంగ్‌దళ్ వ్యతికిస్తున్నాయని, ఫిబ్రవరి 14న వాలంటైన్ డే పేరిట జరిగే అన్ని కార్యాక్రమాలను అడ్డుకుంటామని వీహెచ్‌పీ స్టేట్ కన్వీనర్ సుభాష్‌చందర్ తెలిపారు. బుధవారం కోఠిలోని వీహెచ్‌పీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వాలంటైన్ అనే వ్యక్తి రోమ్ రాజ్యానికి చెందిన దేశద్రోహి అని, అలాంటి వ్యక్తికి సంబంధించిన రోజున వారి దేశంలోనే ప్రేమికుల రోజు నిర్వహించడం లేదన్నారు. కానీ మన దేశంలో కొన్ని మల్టీనేషనల్ కంపెనీలు తమ వ్యాపారాలను పెంచుకునేందుకు ప్రేమికుల రోజు పేరిట సమాజాన్ని, యువతను తప్పు దోవ పట్టిస్తున్నాయన్నారు. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలు దెబ్బతీసే విధంగా పబ్‌లు, రిసార్ట్స్, హోటళ్లలో ఈ కార్యక్రమాలను నిర్వహించవద్దని వారు విజ్ఞప్తి చేశారు. తాము ప్రేమకు, ప్రేమికులకు వ్యతిరేకం కాదని, భజరంగ్‌దళ్ ప్రేమికుల దినోత్సవానికి మాత్రమే వ్యతిరేకంమన్నారు. ప్రేమికులు మల్టీనేషనల్ కంపెనీల ఉచ్చులో పడవద్దని సూచించారు. ఈ సందర్బంగా వాలంటైన్ డే వ్యతిరేక పోస్టర్‌ను ఆవిష్కరించారు. సమావేశంలో వీహెచ్‌పీ అధికార ప్రతినిధి వెంకటేశ్వర్లు, మహంకాళి విభాగ్ కన్వీనర్ జీవన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
అయోధ్యపై వీహెచ్‌పీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ: అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేపట్టిన ఉద్యమం తాత్కాలికంగా ఆగింది. ‘రామమందిర నిర్మాణ అంశం వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కేంద్రబిందువుగా మారకూడదనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. కేంద్రంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరాక మా భవిష్యత్ కార్యచరణను వెల్లడిస్తాం’ అని వీహెచ్‌పీ అంతర్జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి సురేంద్ర జైన్ చెప్పారు. అయోధ్యలో వివాదాస్పద స్థలంలో రామమందిరం నిర్మించేందుకు వీలుగా బీజేపీ సర్కారు పార్లమెంటులో చట్టం తేవాలనే డిమాండ్‌తో వీహెచ్‌పీ దేశవ్యాప్తంగా ‘రామజన్మభూమి ఉద్యమం’ను ఉధృతం చేయడం తెల్సిందే. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా ర్యాలీలు చేస్తూ, అన్ని పార్టీల ముఖ్యనాయకులను వీహెచ్‌పీ నేతలు కలుస్తున్నారు. నరేంద్ర మోదీ సర్కారుకు ఇబ్బందులు రాకూడన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వీహెచ్‌పీ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు. తమకు బీజేపీ మినహా ప్రత్యామ్నాయం లేదని వెల్లడించారు. -
లక్షమందితో రేపే ధర్మసభ
ముంబై/లక్నో/అయోధ్య: అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం హిందూ సంస్థలు ప్రయత్నాలు ముమ్మరం చేశాయి. ఆలయ నిర్మాణం ప్రారంభంపై చర్చించేందుకు విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ఆదివారం అయోధ్యలో భారీ ధర్మసభను నిర్వహించనుంది. 1992 డిసెంబర్ 6వ తేదీన వివాదాస్పద బాబ్రీ మసీదును కూల్చివేసిన సమయంలో హాజరైనంతమంది కరసేవకులు ధర్మసభకు వచ్చే వీలుంది. నేడు శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే తమ కార్యకర్తలతో కలిసి అయోధ్యకు రానున్నారు. నేతలకు చోటులేదు ధర్మసభకు దాదాపు లక్షమంది కరసేవకులు హాజరవుతారని వీహెచ్‌పీ తెలిపింది. ఇది కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమం మాత్రమే, రాజకీయ సభ కాదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ఇక్కడే రామమందిర నిర్మాణ తేదీని ఖరారు చేస్తాం. ధర్మసభతో ఆలయ నిర్మాణంలో ఆఖరి అడ్డంకి తొలగిపోతుంది. దీని తర్వాత ఎటువంటి సభలు, ర్యాలీలు, నిరసనలు, చర్చలు ఉండబోవు’ అని స్పష్టం చేసింది. వేదికపై రాజకీయ నేతలకు చోటులేదని వీహెచ్‌పీ తెలిపింది. ‘ధర్మసభ ప్రధాన వేదికపై కేవలం సాధువులు మాత్రమే కూర్చుంటారు. రాజకీయ నేతలెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపింది. ‘ధర్మసభ, ర్యాలీకి లక్షమందికిపైగా వస్తారని భావిస్తున్నాం. ఆర్డినెన్స్ లేదా పార్లమెంట్లో బిల్లు తేవడం ద్వారా మందిర నిర్మాణం చేపట్టేందుకు ఈ కార్యక్రమం ద్వారా కేంద్రానికి గట్టి సంకేతం పంపుతాం’ అని వీహెచ్‌పీ ప్రాంతీయ నిర్వాహక కార్యదర్శి చెప్పారు. 25న నాగ్‌పూర్, బెంగళూరుల్లో, డిసెంబర్ 9న ఢిల్లీలో ఇలాంటి ర్యాలీలు చేపట్టనున్నారు. 17 నిమిషాల్లో కూల్చేశాం.. 1992లో రామ భక్తులు అయోధ్యలో బాబ్రీ మసీదును 17 నిమిషాల్లోనే కూల్చివేశారు. గుడి కోసం ఆర్డినెన్స్ తెచ్చేందుకు ప్రభుత్వం ఇంకా ఎంత సమయం తీసుకుంటుందని శివసేన నిలదీసింది. ‘ ఆ మసీదును 17 నిమిషాల్లో కూల్చేశారు. అప్పటి నుంచి ఆ ఖాళీ అలాగే ఉంది. ఆర్డినెన్స్ పత్రాలు తయారు చేసేందుకు, రాష్ట్రపతి భవన్ నుంచి యూపీ అసెంబ్లీకి అవి చేరేందుకు ఎంత సమయం పడుతుంది. అక్కడా ఇక్కడా ఉన్నవి బీజేపీ ప్రభుత్వాలే కదా? అని శివసేన నేత సంజయ్ రౌత్ ప్రశ్నించారు. మందిరం కోసం ఆర్డినెన్స్ తేవాలనీ, నిర్మాణ తేదీని ఖరారు చేయాలని శివసేన పార్టీ అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో డిమాండ్ చేసింది. ‘అయోధ్యలో ప్రస్తుతం రామరాజ్యం లేదు. ఉన్నది సుప్రీంకోర్టు రాజ్యం. మా యాత్రపై పెడార్థాలు తీయడం మానేసి, గుడి కట్టే తేదీ తేల్చండి’ అని కేంద్రాన్ని కోరింది. -
రథయాత్రపై నిర్ణయం చెప్పండి
సాక్షి, హైదరాబాద్: విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) ఈనెల 31న హైదరాబాద్‌లో తలపెట్టిన శ్రీరామ రథయాత్రకు అనుమతినిచ్చే విషయంలో తగిన నిర్ణయం తెలుపాలని హైకోర్టు గురువారం హైదరాబాద్ సిటీ పోలీసులను ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. రథయాత్రకు పోలీసులు అనుమతిని నిరాకరించడాన్ని సవాలు చేస్తూ వీహెచ్‌పీ తెలంగాణ కార్యదర్శి ఎం.గాల్‌రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే అనుమతినివ్వాలని పోలీసులను ఆదేశించేందుకు నిరాకరిస్తూ సింగిల్‌జడ్జి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై గాల్‌రెడ్డి ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేశారు. దీనిపై గురువారం ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, శ్రీరామ రథయాత్రకు అనుమతి కోరుతూ తాజాగా దరఖాస్తు చేసుకుంటామని, అనుమతినిచ్చేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. -
వారి.. కాల్ రికార్డులు బయట పెట్టండి!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విశ్వహిందూ పరిషత్ నేత ప్రవీణ్ తొగాడియా సంచలన ఆరోపణలు చేశారు. ప్రధాని మోదీ తనకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ప్రధాని మోదీ, గుజరాత్ జాయింట్ కమిషనర్ జేకే భట్ల కాల్ రికార్డులను బయట పెట్టాలని ప్రవీణ్ తొగాడియా డిమాండ్ చేశారు. కాల్ రికార్డులు వెలుగులోకి వస్తే మరిన్ని వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని ఆయన అన్నారు. విశ్వహిందూ పరిషత్‌లోని కొన్ని వర్గాలు ఇదిలావుండగా.. తొగాడియా విషయాన్నిరెండుమూడు రకాలుగా ముందుకు తీసుకువెళ్లాలని భావిస్తున్నాయి. ఇప్పటికే తొగాడియా ఇష్యూను కొందరు వీహెచ్‌పీ నాయకులు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ దృష్టికి లేఖల ద్వారా తీసుకెళ్లారు. మరికొందరు ఈ విషయంపై రాష్ట్రీయ స్వయక్ సేవక్ సంఘ్ జోక్యం చేసుకోవాలని అభ్యర్థిస్తున్నారు. వీహెచ్‌పీలో ఒక వర్గం మాత్రం ఈ మొత్తం వ్యవహారానికి దూరంగా ఉంది. ఈ నెల 26ప అలహాబాద్‌లో జరగనున్న మార్గదర్శక్ మండల్, సంత్‌ల సమావేశంలో ప్రవీణ్ తొగాడియా విషయాన్ని చర్చించవద్దని మరో వర్గం తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పాల్గొంటున్న తొగాడియా కూడా.. ఈ విషయంపై మౌనంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. -
'అన్సారీ ఎందుకిలా చేస్తున్నారో తెలిసింది'
న్యూఢిల్లీ : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై విశ్వ హిందూ పరిషత్ నిప్పులు చెరిగింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎలా వెళ్లారని ప్రశ్నించింది. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని, ముస్లింలలో అసంతృప్తి ఉన్నదనే విషయాన్ని ఆయన చర్యల ద్వారా చూపించాలనుకుంటున్నారని మండిపడింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మహిళా విభాగం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఈ సంస్ధకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. దీనికే అన్సారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా ఆయన మరోసారి తన వైఖరిని వెల్లడించారు. ముస్లింలలో అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారు' అని ఆరోపించారు. పీఎఫ్ఐ అంటే మరేమిటో కాదని, సిమీనే పీఎఫ్ఐగా రూపాన్ని మార్చుకుందంటూ ఆరోపించారు. కేరళలలోని పలువురు దేశ భక్తుల మరణాల వెనుక పీఎఫ్ఐ హస్తం ఉందని కూడా ఆరోపించారు. -
‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోనూ అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమయాన్ని ఉపయోగించుకుని వీహెచ్‌పీ రామమందిర నిర్మాణం ప్రారంభించే యోచన చేస్తున్నట్లు సమాచారం. విశ్వహిందూ పరిషత్ అతర్జాతీయ జాయింట్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ ‘వేర్వేరు రాష్ట్రాల నుంచి రామమందిరం కోసం శిలలను తీసుకొచ్చిన సందర్భాలు మీరు చూశారు. అవన్నీ కూడా ఏదో ఒక చోట ఆయా రాష్ట్రాల సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి(ఉత్తరప్రదేశ్‌లోకి) రావాలి. కానీ, అవి వచ్చినప్పుడు పరిపాలనలో ఉన్న సమాజ్‌వాది ప్రభుత్వం వాటిని ప్రవేశించనీయకుండా నియంత్రణలు పెట్టింది. ఎందుకంటే అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి రామమందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే అప్పుడు రాళ్లను అడ్డుకుంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఉండటంతో ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయి మా పని తేలికైంది’ అని చెప్పారు. రామ శిలలు కూడా ఎక్కడి నుంచో తీసుకురావడం లేదని ఒక్క రాజస్థాన్ నుంచే తీసుకొస్తున్నామని, వాటిని తమ వర్క్ షాపుల్లోకి తీసుకొచ్చి సిద్ధం చేస్తామని అన్నారు. -
వారంలో రామ మందిరంపై నిర్ణయం: వీహెచ్‌పీ
మథుర: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై వారంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని విశ్వ హిందూ పరిషత్ నాయకుడు ప్రవీణ్ తొగాడియా శనివారం అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనలో తీసుకుంటున్న నిర్ణయాల వల్ల భారతీయులు ఇబ్బందులు పడుతుండటం దురదృష్టకరమని ఆయన పేర్కొన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న హిందువులను రక్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలూ చేయాలని ఆయన కోరారు. గోరక్షకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం తీసుకొచ్చిన నిషేధాలను వెనక్కు తీసుకోవాలని కూడా ఆయన డిమాండ్ చేశారు. గోవులను కోస్తున్న కసాయి వారికి శిక్ష వేయాలని గోరక్షకులు కేవలం ఆవులను రక్షిస్తున్నారని తొగాడియా అన్నారు. -
వీహెచ్‌పీ నేత హత్య
టీనగర్: హొసూరులో విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత దారుణ హత్యకు గురయ్యాడు. కృష్ణగిరి జిల్లా, హొసూర్ తాలూకా కార్యాలయం వీధికి చెందిన సూరి (40). తమిళనాడు వీహెచ్‌పీ జిల్లా కార్యదర్శి. ఇతనికి రాధిక అనే భార్య, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సూరిపై అనేక కేసులు ఉన్నాయి. ఇటీవల రాజకీయాల్లో నిమగ్నమైన ఈ యన రియల్ ఎస్టేట్ వ్యాపారం, కేబు ల్ బిజినెస్ చేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం హొసూర్ నెహ్రూనగర్‌లో ఇంటి స్థలాలను విక్రయించేందుకు ఒక ప్లాట్‌ను సిద్ధం చేశారు. ఇందుకోసం అక్కడ ఒక కార్యాలయం ప్రారంభించారు. ప్రతిరోజూ స్నేహితులతో కలిసి విక్రయాలు జరిపేవారు. సోమవారం ఉదయం ఎప్పటిలా సూరీ నెహ్రూ నగర్ కార్యాలయానికి వెళ్లా రు. అక్కడ పనులు ముగించుకుని రాత్రి ఎనిమిది గంటల సమయంలో స్నేహితులతో ఇంటికి వెళ్లేందుకు ఆఫీసు నుంచి బయటికి వచ్చారు. అతని స్నేహితులు వాహనాలు తీసుకునేందుకు వెళ్లగా చీకట్లో పొంచివున్న నలుగురు ముసుగులు ధరించిన వ్యక్తులు స్నేహితులకు కత్తులు చూపి బెదిరించి వెళ్లగొట్టారు. ఈ లోపున సూరి వారి బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించారు. అతన్ని వెంటాడిన ముఠా కార్యాలయం సమీపంలోనే అతనిపై దాడి చేసి హతమార్చింది. కొంత సేపటికి అక్కడికి వచ్చిన సూరి స్నేహితులు సూరి ప్రాణంతో వున్నట్లు భావించి వెంటనే హొసూరు ప్రభుత్వ ఆస్పత్రికి పంపారు. అయితే సూరి మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు. సూరి హత్యకు గురైన సంఘటన దావానలంలా హొసూరు అంతటా వ్యాపించింది. అక్కడికి వెళ్లిన అడిషనల్ ఎస్పీ రోహిత్ నాథన్ ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ జరిపారు. రియల్ ఎస్టేట్ బిజినెస్‌లో సూరికి పాత కక్షలు ఉన్నట్లు తెలిసింది. దుకాణాల బంద్: సూరి హత్య కారణంగా హొసూర్ నగరంలో మంగళవారం దుకాణాలు మూసివేశారు. సేలం సర్కిల్ డీఐజీ నాగరాజన్, కృష్ణగిరి ఎస్పీ మహేష్‌కుమార్ ఆరుగురు డీఎస్పీల ఆధ్వర్యంలో ఐదు వందల మందికి పైగా పోలీసులు భద్రతా పనుల్లో నిమగ్నమయ్యారు. హంతకులను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పడ్డాయి. దీనిగురించి తీవ్ర విచారణ జరుపుతున్నారు. -
'హిందువుల కలను మోదీ గుర్తుంచుకోవాలి'
భోపాల్: అయోధ్యలో రామమందిరం నిర్మాణమే హిందువుల కల అని ప్రధాని నరేంద్ర మోదీ గుర్తించాలని అంతర్జాతీయ విశ్వహిందూ పరిషత్ ప్రతినిధి ప్రవీణ్ తొగాడియా అన్నారు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గత లోకసభ ఎన్నికల సందర్భంగా బీజేపీ జాతీయ కార్యవర్గం ఇచ్చిన వాగ్దానం మేరకు అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. బాబ్రీ మసీదు కూల్చిన చోటే రామ మందిరం నిర్మాణం చేపడతారని తొగాడియా పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీపై తనకు నమ్మకం ఉందని.. గత లోక్‌సభ ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాన్ని నిలబెట్టుకుంటారని తొగాడియా వ్యాఖ్యానించారు. సర్దార్ పటేల్ సోమనాధ్ ఆలయాన్ని నిర్మించినట్లుగానే, లోక్‌సభలో తీర్మానం ద్వారా రామమందిరం నిర్మాణం కూడా జరుగుతుందన్నారు. రామాలయం నిర్మాణం కోసం హిందువులు ప్రతిఒక్కరూ సిద్ధంగా ఉండాలని వీహెచ్‌పీ నేత ప్రవీణ్ తొగాడియా పిలుపునిచ్చారు. -
రోడ్లపై జంటలు కనిపిస్తే పెళ్లిచేస్తాం: వీహెచ్‌పీ
సుల్తాన్‌బజార్: వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ నెల 14వ తేదీన రోడ్లు, పార్కులలో కనిపించే ప్రేమజంటలకు పెళ్లిళ్లు చేస్తామని విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ), బజరంగ్దళ్ నేతలు హెచ్చరించారు. సోమవారం హైదర్‌గూడ ఎన్ఎస్ఎస్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ వై.భానుప్రకాశ్, వీహెచ్‌పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు మాట్లాడారు. పాశ్చాత్య సంస్కృతికి అద్దం పట్టే వాలెంటైన్స్ డేను రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా నిషేధించాలని డిమాండ్ చేశారు. కొన్ని మల్టీనేషన ల్ సంస్థలు తమ వ్యాపారాభివృద్ధికి చేస్తున్న కుట్రలో భాగమేవాలెంటైన్స్ డే వేడుకలని అన్నారు. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందన్నారు. 14న జరిగే నిరసన కార్యక్రమాల్లో యువత పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. హోటళ్లు, పబ్‌లు, రిసార్ట్స్, ఎఫ్ఎం రేడియోలు, వ్యాపారులు దీనిని ప్రోత్సహించవద్దని కోరారు. ఈ కార్యక్రమాలను అడ్డుకునేందుకు ప్రత్యేక బృందాలను దింపనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో వీహెచ్‌పీ రాష్ట్ర అధికార ప్రతినిధి జి.వెంకటేశ్వరరాజు, మీడియా ఇన్చార్జి భరత్‌వంశీ, ఎం.సుభాష్‌చందర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం దీని కోసం రూపొందించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. -
'పీకే'పై ఆందోళన, థియేటర్లపై రాళ్లదాడి
న్యూఢిల్లీ : ఆమీర్ ఖాన్ నటించిన 'పీకే' చిత్రంపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. పీకే సినిమాపై ఉత్తరాది రాష్ట్రాల్లో నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తాయి. భోపాల్, అహ్మదాబాద్‌లోని "పీకే' సినిమా ఆడుతున్న పలు థియేటర్లను వీహెచ్‌పీ, బజరంగ్ దళ్ కార్యకర్తలు ముట్టడించారు. ఓ మతాన్ని కించపరచారంటూ వారు...సినిమా థియేటర్లపై రాళ్లదాడి చేశారు. ఈ సంఘటనల్లో థియేటర్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. మరోవైపు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ పలు హిందూ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. మరోవైపు ఈ చిత్రంపై వివాదం రేగినా అందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. -
'పీకే మూవీ నుంచి ఎటువంటి సీన్స్ తొలగించం'
ఢిల్లీ: బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ నటించిన పీకే చిత్రంలో అభ్యంతకరమైన సీన్స్ ఉన్నాయని.. వాటిని తక్షణమే తొలగించాలని నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో సెన్సార్ బోర్డు స్పందించింది. పీకే చిత్రంలోని ఎటువంటి సన్నివేశాలను తొలగించాల్సిన అవసరం లేదని సెన్సార్ బోర్డు స్పష్టం చేసింది. దీనిపై సెన్సార్ బోర్డ్ ఫిల్మ్ సర్టిఫికేషన్(సీబీఎఫ్సీ) చైర్ పర్సన్ లీలీ శాంసన్ మాట్లాడుతూ.. ఇప్పటికే చిత్రం విడుదలైన నేపథ్యంలో ఎటువంటి సీన్స్ లను తొలగించేందుకు బోర్డు సిద్ధంగా లేదని పేర్కొన్నారు. డిసెంబర్ 19వ తేదీన విడుదలైన 'పీకే' చిత్రంపై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంపై హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. -
ఆమిర్‌ఖాన్ 'పీకే'పై పెరుగుతున్న వివాదాలు!
న్యూఢిల్లీ/లక్నో: బాలీవుడ్ హీరో ఆమిర్‌ఖాన్ నటించిన తాజా చిత్రం 'పీకే'పై దేశ వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. హిందువులే కాకుండా ముస్లింలు కూడా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రాన్ని నిషేధం విధించాలంటూ ఆదివారం పలు హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. హిందూ దేవతలను, స్వామీజీలను ఎగతాళి చేసేలా ఈ చిత్రంలో సన్నివేశాలు ఉన్నాయని వీహెచ్‌పీ, బజ్రంగ్ దళ్, హిందూ జనజాగతి సమితి, అఖిల భారత మహాసభ ఆరోపించాయి. సినిమాపై నిషేధం విధించడంతోపాటు చిత్రంతో సంబంధం ఉన్న వారందరినీ సమాజం నుంచి వెలివేయాలని ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ డిమాండ్ చేశారు. హిందూ సంస్కతిని తక్కువ చేసి చూపే వారి చిత్రాలను ప్రజలు చూడరాదన్నారు. ఇస్లాం, క్రై స్తవ మతాల గురించి ఏదైనా మాట్లాడే ముందు వంద సార్లు ఆలోచించే వ్యక్తులు హిందూ మతం గురించి ఏమాత్రం ఆలోచించకుండా వారికి తోచిన విధంగా మాట్లాడటమో లేదా వారికి నచ్చినట్లుగా సినిమాల్లో చూపించడమో చేయడం మంచి పద్దతి కాదన్నారు. రాందేవ్ డిమాండ్‌కు అఖిల భారత ముస్లిం పర్సనల్ లా బోర్డు కూడా మద్దతు పలికింది. అత్యధికుల మనోభావాలు దెబ్బతినే సన్నివేశాలు చిత్రం నుంచి తొలగించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు (ఏఐఎంపిఎల్బీ) సభ్యుడు మౌలానా ఖలీద్ రషీద్ కోరారు. భావస్వేచ్చ అంటే ఇతరుల మనోభావాలు దెబ్బతీయడం కాదని అయన పేర్కొన్నారు. మత సామరస్యానికి హాని కలిగించే సన్నివేశాలను సెన్సార్ బోర్డు తొలగించాలని ఆయన అన్నారు. ఈ చిత్రంపై వివాదం రేగినా ఇందులోని సన్నివేశాలను తొలగించేందుకు మాత్రం సెన్సార్ బోర్డు నిరాకరించింది. మరోవైపు ఈ వివాదంపై ఆమిర్‌ఖాన్ స్పందిస్తూ అన్ని మతాలను తాము గౌరవిస్తామన్నారు. ఈ చిత్రాన్ని తన హిందూ స్నేహితులు చూశారని, వారెవరూ అటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదన్నారు. -
ఎంఐఎంకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
నాందేడ్, న్యూస్‌లైన్: ఎంఐఎం పార్టీని నిషేధించాలంటూ వివిధ పార్టీలు గురువారం భారీ ర్యాలీ నిర్వహించాయి. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, శివసేన, హిందూరక్ష, ఎమ్మెన్నెస్ తదితర పార్టీల ఆధ్వర్యంలో ఈ ర్యాలీ జరిగింది. పట్టణంలోని మహవీర్ చౌక్‌లోని పంచముఖి హనుమాన్ మందిరంలో తొలుత హారతి కార్యక్రమాన్ని నిర్వహించిన అనంతరం ఈ ర్యాలీ ప్రారంభించారు. ముందుగా నిర్దేశించిన ప్రకారం గాడిపురలోని మాతా రేణుకాదేవి మందిరం నుంచి ర్యాలీ ప్రారంభం కావాల్సి ఉంది.అయితే పోలీసు శాఖ అందుకు నిరాకరించడంతో మహావీర్ చౌక్ నుంచి చేపట్టారు. ముందుజాగ్రత్తగా అనేక మంది వ్యాపారులు తమ దుకాణాలను మూసివేశారు. డీఎస్పీ, ముగ్గురు పోలీసు ఇన్స్పెక్టర్లు, ఎనిమిది మంది సబ్ ఇన్స్పెక్టర్లు, 350 మంది పోలీసులతోపాటు ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్, ట్రాఫిక్ సిబ్బంది కూడా బందోబస్తు బాధ్యతల్లో పాలుపంచుకున్నారు. ర్యాలీ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకున్న అనంతరం ధర్నా చేశారు. ఈ సందర్భంగా పాకిస్థాన్‌తోపాటు ఎంఐఎం పార్టీకి వ్యతిరేకంగా నినదించారు. కాగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో హిందూ దేవతలను అవమానపరిచే విధంగా ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలు చేశారని, అందువల్ల ఆ పార్టీని నిషేధించాలని ఆందోళనకారులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. గతంలో ఎంఐఎం పార్టీ కార్యకర్తలు చేసిన అనేక దాడుల్లో హిందువులు గాయపడ్డారని, వివిధ హత్యలు, నేరాల్లో అరెస్టయిన వారిలో కూడా వారే ఉన్నారని ఆరోపించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ధీరజ్‌కుమార్‌కు ఓ వినతి పత్రం అందజేశారు. -
హిందువులపై దాడులు సహించం
కోహీర్: హిందువులపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని విశ్వ హిందూ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు రామరాజు స్పష్టం చేశారు. బుధవారం కోహీర్ మండలం కవేలి గిరిజా సంగమేశ్వర స్వామి ఆలయ మండపంలో ఏర్పాటు చేసిన హిందూ మత సంస్థల నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. హిందూ సంస్కృతి మహోన్నతమైందన్నారు. అనేక శతాబ్దాలుగా దాడులు, అవమానాలను భరిస్తూ వచ్చిందన్నారు. సహనానికి మారుపేరైన హిందువులపై ఇంకా ఇతర మతస్థులు దాడులకు పాల్పడడం దారుణమన్నారు. మండలంలోని గురుజువాడ గ్రామంలో ప్రచారం చేస్తున్న కార్యకర్తలపై ఇతర మతస్థులు దాడి చేసి గాయపరచడం సహించరాని విషయమన్నారు. నిందితులపై చర్య తీసుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారని మండిపడ్డారు. తాము అవమానానికి గురైన చోటి నుంచి రథయాత్రను తిరిగి ప్రారంభించడానికి ఆవకాశం ఇవ్వడం లేదన్నారు. ఈ విషయమై ఎస్పీకి ఫిర్యాదు చేస్తామన్నారు. దాడి చేసి గాయపరిచిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్ర మంలో వీహెచ్‌పీ రాష్ట్ర నాయకులు హేమంత్ సంగ్, భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బల్వంత్ రావు, వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు పన్యాల ప్రభాకర్, బజరంగ్ దళ్ విభాగ్ ప్రముఖ్ సుభాష్, ఓంకార్ ఎకాల్ విద్యాలయ ప్రముఖ్ శంకర్, నియోజకవర్గ ఇన్చార్జ్ మల్లికార్జున్ పాటిల్, నాయకులు సుధీర్ బండారీ, శివకుమార్, విశ్వనాథ్, మొగులయ్య, సిద్ధేశ్వర్, నరేష్ పాల్గొన్నారు. -
రచ్చకెక్కిన వివాదం
భద్రాచలం టౌన్ : నిత్యపూజలందుకునే రామయ్య సన్నిధి శనివారం వాద ప్రతివాదాలతో మార్మోగింది. పవిత్ర పూజలు, నిత్యకల్యాణాలు జరిగే బేడామండపం వద్ద ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కొందరు సాధువులు నిత్యకల్యాణం జరిగే సమయంలో చేసిన నిరసనల నినాదాలతో భక్తులు అయోమయానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. భద్రాద్రి ఆలయంలో కొన్ని రోజులుగా ‘రామ నారాయణ’ అనే పదం విషయంలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆలయ వేద పండితులను నిలదీసేందుకు ఉత్తరాంధ్ర సాధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస ఆనందస్వామి, హిందూ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గౌరయ్య తదితరులు శుక్రవారమే భద్రాచలం చేరుకున్నారు. రామ నారాయణ స్మరణ చేస్తే శనివారం జరిగే నిత్యకల్యాణాన్ని అడ్డుకుంటామని ముందే ప్రకటించారు. ఈ క్రమంలో ఉదయమే బేడా మండపానికి చేరుకున్న సాధువులు కల్యాణ తంతులో భాగంగా శ్రీసీతారాముల ప్రవర చదువుతుండగా.. ఒక్కసారిగా మండపం వైపునకు దూసుకొచ్చారు. శ్రీరామ క్షేత్రంలో నారాయణ, లక్ష్మి గోత్రాలతో ఎలా పూజలు చేస్తారంటూ ప్రశ్నించారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు సమాధానం చేప్పే క్రమంలో గందరగోళం నెలకొంది. అయితే కల్యాణాన్ని అడ్డుకుంటామని సాధువులు ముందుగానే ప్రకటించడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఆలయ, పట్టణ పోలీసులు సాధువులను సముదాయించారు. ఆలయ ప్రాంగణంలో నిరసనలు తగదని సర్దిచెప్పడంతో వారు వెనుదిరిగారు. కాగా, పవిత్ర పూజలు జరిగే శ్రీరామ సన్నిధిలో ఇలాంటి అలజడులు ఏంటని భక్తులు ఆవేదనకు గురయ్యారు. ‘రామ నారాయణ’ ఎప్పటినుంచో ఉంది... తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న రామాలయ పవితత్రను కాపాడాలన్నదే తమ తాపత్రయమని ఆలయ అధర్వణ వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు చెప్పారు. నిత్యకల్యాణంలో జరిగిన ఆందోళన అనంతరం దీక్షా శిబిరం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయంలో 1959, 1961, 1987 సంవత్సరాలలో జరిగిన మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ముద్రించిన పుస్తకాలలో రామక్షేత్రం ప్రాముఖ్య త, ఆ సందర్భంగా రామనారాయణ, వైకుంఠ రాముడు, ఓంకార రాముడు అనే నామాల ప్రస్తావన, పద్యాలు ఉన్నాయని వివరించారు. ‘రామ నారాయణుడు’ అనేది ఇప్పుడు తాము కావాలని పుట్టించిన పదం కాదని, ఎప్పటి నుంచే వస్తున్న నామస్మరణ అని తెలిపారు. ఆలయంలో రామనామస్మరణ తప్ప ఎలాంటి నినాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము చిత్రకూట మండపంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. మరోవైపున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర దేవస్థాన నామం తప్ప, ఆలయానికి మరే పేరు మార్చే ఉద్దేశం తమకు లేదని, ముమ్మాటికి భద్రాచలంలో ఉన్నది శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానమేనని, పత్రికాముఖంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలుపుతున్నామని అన్నారు. రామనారాయణ స్మరణలో తప్పేంటి : వీహెచ్‌పీ రాముడికి ఉన్న వెయ్యి పేర్లలో రామనారాయణ ఒకటని, ఆ పేరుతో పిలిస్తే తప్పేంటని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి జి. వెంకటేశ్వరరాజు అన్నారు. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు శనివారం ఆయన భద్రాచలం వచ్చి అర్చకులు, వేదపండితులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రామనారాయణ అనే పేరును అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. సీతారామ చంద్రస్వామి దేవస్థానం పేరును మార్చే ఉద్దేశం తమకు లేదని వేదపండితులు స్పష్టం చేశారని, అలా అని వారు కరపత్రాలు పంచినా ఇంకా ఆపోహలెందుకని ప్రశ్నించారు. కావాలనే ఎవరో బయటి వ్యక్తులు ఈ విషయాన్ని వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది 11 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అనంతరం ఈవోను కలిసి ఈ సమస్యలపై చర్చించగా, ఉద్యోగులపై ఉన్న మెమోలను ఉపసంహరించుకుంటానని, ఈ వివాదం ఉన్నతాధికారుల సమక్షంలో చర్చిస్తామని చెప్పారని వెంకటేశ్వరరాజు వివరించారు. కాగా, రామాలయ ఉద్యోగులు, అర్చకులు చేపట్టిన రిలే దీక్షలు శనివారం 7వ రోజుకు చేరుకున్నాయి. -
తొగాడియాపై ఎఫ్ఐఆర్
భావ్‌నగర్: భిన్న మతాల మధ్య విద్వేషానికి కారణమయ్యేలా వ్యాఖ్యలు చేసిన విశ్వహిందూ పరిష త్ నేత ప్రవీణ్ తొగాడియాపై గుజరాత్‌లోని భావ్‌నగర్ పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. హిందువులు అధికంగా ఉన్న ఓ ప్రాంతం లో ముస్లిం వ్యాపారి కొన్న ఇంటిని బలవంతంగా ఆక్రమించుకోవాలని తొగాడియా పిలుపునివ్వడంపై దుమారం రేగిన విషయం తెలిసిందే. 48 గంటల్లో ఇల్లు ఖాళీ చేయకుంటే బలవంతంగా స్వాధీనం చేసుకుని, భజరంగ్‌దళ్ పేరుతో బోర్డు తగిలించాలని తొగాడియా సూచించినట్లుగా ఆరోపణలు వచ్చాయి.దీంతో తొగాడియాపై సెక్షన్ 153 (ఎ), సెక్షన్ 153(బి)తోపాటు ఎన్నికల నిబంధనావళి ఉల్లంఘించినందున సెక్షన్ 188 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు భావ్‌నగర్ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి సోలంకి వెల్లడించారు. తొగాడియా వీడియోలను పరిశీలిస్తున్నామని... ప్రాథమిక ఆధారాలున్నాయని భావిస్తే షోకాజ్ నోటీసు జారీ చేస్తామని ఈసీ వర్గాలు తెలిపాయి. గిరిరాజ్‌పై నిషేధం: ఎన్నికల తర్వాత మోడీ వ్యతిరేకులు పాకిస్థాన్‌కు వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించిన బీజేపీ నేత గిరిరాజ్‌సింగ్‌పై ఈసీ నిషేధం విధించింది. బీహార్, జార్ఖండ్‌లలో ప్రచా రం నిర్వహించకుండా నిషేధం విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, తొగాడియా, గిరిరాజ్ వ్యాఖ్య లను ఖండిస్తున్నట్లు నరేంద్ర మోడీ ప్రకటించారు. బీజేపీ మేలు కోరేవారని చెప్పుకుంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. ప్రచారాన్ని పక్కదారి పట్టిస్తున్నాయన్నారు. -
అయోధ్యలో మళ్లీ ఉద్రిక్తత, పోలీసుల కఠిన ఆంక్షలు
విశ్వ హిందూ పరిషత్ శుక్రవారం అయోధ్యలో 'సంకల్ప సభ' నిర్వహించదలచిన నేపథ్యంలో ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది. ఈ సభను అడ్డుకునేందుకు ఉత్తరప్రదేశ్ భారీగా పోలీసు బలగాలను మోహరించడంతో పాటు అయోధ్య పరిసర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు విధించింది. ఎస్ఎమ్ఎస్లను నిషేధించింది. ముందు జాగ్రత్తగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 1200 మందికిపైగా వీహెచ్‌పీ కార్యకర్తలను అరెస్ట్ చేశారు. రాష్ట్ర రాజధాని లక్నోలో 366 మందిని అరెస్టు చేశారు. వీరిలో బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ సురేంద్ర మిశ్రా, అధికార ప్రతినిధి శరద్ శర్మ తదితరులున్నారు. అయోధ్యవైపు వెళ్లొద్దంటూ వీహెచ్‌పీ, దాని అనుబంధ సంస్థలను అధికారులు హెచ్చరించారు. లక్నో-గోరఖ్‌పూర్ మధ్య ట్రాఫిక్‌ను బారాబంకీ, గోండాబస్తీ, సుల్తాన్పూర్ మీదుగా మళ్లించారు. రాం విలాస్ వేదాంతి ఇప్పటికే అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, వీహెచ్‌పీ సీనియర్ నేత అశోక్ సింఘాల్ గురించిన సమాచారం ఏమీ లేదని శాంతిభద్రతల ఐజీ ఆర్కే విశ్వకర్మ తెలిపారు. సభకు ప్రజలు వెళ్లకుండా నివారించేందుకు అయోధ్యతో పాటు ఫైజాబాద్ పట్టణాలకు వెళ్లే అన్ని దారులను పోలీసులు దిగ్భందించారు. రామమందిర ఉద్యమ నాయకులు నాయకులు మహంత్ గోపాల్‌దాస్, మహంత్ సురేశ్ దాస్, బ్రిజ్మోహన్ దాస్, అభిషేక్ మిశ్రా సహా 42 మందిని పోలీసులు గృహనిర్భందం చేశారు. విహెచ్పీ నాయకులు, కార్తకర్యలు ఎవరూ అయోధ్య వెళ్లరాదంటూ పోలీసులు హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ డీజీపీ దేవ్‌రాజ్ నాగర్, హోం శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి అనిల్‌కుమార్ గుప్తా అయోధ్యలోనే మకాం వేసి భద్రతను సమీక్షిస్తున్నారు. -
శివమెత్తిన వీహెచ్‌పీ
లక్నో/న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన అయోధ్య యాత్రను భగ్నం చేసి 2,500 మందిని అరెస్ట్ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టు జోక్యంతో వీహెచ్‌పీ నేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలతో సహా 958 మందిని సోమవారం విడుదల చేసింది. యాత్ర భగ్నానికి నిరసనగా యూపీలోని వివిధ నగరాల్లో వీహెచ్‌పీ కార్యకర్తలు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అనేక చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన వందలాది వీహెచ్‌పీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు వాడాల్సి వచ్చింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతోపాటు బారికేడ్లను దాటుకొని వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. 84 కోసి అయోధ్య పరిక్రమ పేరిట ఆదివారం వీహెచ్‌పీ చేపట్టిన యాత్రను నిషేధించిన యూపీ ప్రభుత్వం వీహెచ్‌పీ కార్యకర్తలను భారీసంఖ్యలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశోక్ సింఘాల్ తదితరులను సీఆర్పీసీ 151(2) ప్రకారం అరెస్ట్ చేసినట్టయితే వారిని విడుదల చేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. దీంతో సింఘాల్ తదితరులను ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు, అయోధ్య యాత్రను యూపీ ప్రభుత్వం భగ్నం చేయడంపై బీజేపీ భగ్గుమంది. ముస్లిం మంత్రులు, మౌల్వీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం హిందువుల హక్కులను హరిస్తోందని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న దాడిలో భాగంగానే యూపీ ప్రభుత్వం యాత్రను ముందస్తు సమాచారం లేకుండా నిషేధించిందని అశోక్ సింఘాల్ ధ్వజమెత్తారు. ఇదొక రాజకీయ డ్రామా: అఖిలేశ్ యాదవ్ వీహెచ్‌పీ యాత్ర రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టిన యాత్రేనని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. మతపరమైన సంప్రదాయం ప్రకారం చేపట్టినది కానందువల్లే ప్రభుత్వం యాత్రను అడ్డుకున్నదని లక్నోలో విలేకరులతో చెప్పారు. ఈ యాత్రను గత ఏభయ్యేళ్లలో ఎప్పుడూ ఇప్పటి మాదిరిగా చాతుర్మాసంలో నిర్వహించలేదని, సాధారణంగా చైత్ర మాసం(ఏప్రిల్)లో నిర్వహిస్తుంటారన్నారు. వీహెచ్‌పీ యాత్రను భగ్నం చేయడం ద్వారా యూపీ ప్రభుత్వం మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని అలీగఢ్ ముస్లిం మేధావులు ధ్వజమెత్తారు. పార్లమెంటును కుదిపేసిన ‘యాత్ర’ న్యూఢిల్లీ: వీహెచ్‌పీ యాత్ర భగ్నం వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. యాత్రను యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, ఢిల్లీలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఆ పార్టీ సభ్యులు పదే పదే ప్రస్తావించడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తమ పార్టీ కార్యాలయంపై దాడి గురించి చర్చించాలని సమాజ్‌వాదీ లోక్‌సభలో నోటీసు ఇచ్చింది. స్పీకర్ మీరాకుమార్ అనుమతించకపోవడంతో ఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. ఎవరేమి మాట్లాడుతున్నారో తెలియని గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. -
వీహెచ్‌పీ యాత్ర కు బ్రేక్
అయోధ్య/న్యూఢిల్లీ/లక్నో: విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వివాదాస్పద అయోధ్య యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఆదివారం బ్రేక్ వేసింది. వీహెచ్‌పీ అగ్రనేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియా సహా దాదాపు 1,700 మందిని అరెస్టు చేసింది. వీహెచ్‌పీ సరయూ ఘాట్ నుంచి అయోధ్య వరకు ‘చౌరాసీ కోసీ పరిక్రమ యాత్ర’ పేరుతో 252 కి.మీ.(84 కోసులు) యాత్రను ప్రారంభించాలని నిర్ణయించడం తెలిసిందే. ఈ యాత్ర మతసామరస్యానికి విఘాతం కలిగిస్తుందంటూ యూపీ ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం అరెస్టులు, ఉద్రిక్తత మధ్యనే వీహెచ్‌పీ ఈ యాత్రను అయోధ్యలో ప్రారంభించింది. దీంతో అయోధ్యలో కర్ఫ్యూ వాతావరణం కనిపించింది. ఒక్క ఫైజాబాద్ జిల్లాలోనే 625 మందిని అరెస్టు చేశారు. అరెస్టయిన వారిని 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీలో ఉంచుతామని శాంతి భద్రతల ఐజీ ఆర్కే విశ్వకర్మ తెలిపారు. భారీ భద్రత, అరెస్టులపై నిరసన.. ఆరు నూరైనా యాత్ర చేసి తీరతామని వీహెచ్‌పీ స్పష్టం చేయడంతో ఆదివారం యూపీలోని సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతను పటిష్టం చేశారు. భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు. యాత్ర కోసం అయోధ్య చేరుకున్న తొగాడియాను గోలాఘాట్‌లో పోలీసులు అరెస్టు చేశారు. ఢిల్లీ నుంచి లక్నోకు చేరుకున్న సింఘాల్‌ను అక్కడి విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. సింఘాల్ అయోధ్యకు వెళ్తానని పట్టుబట్టడంతో అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. అరెస్టుపై సింఘాల్ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. యూపీలో మొఘల్ పాలన సాగుతోందని మండిపడ్డారు. యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి సాధువులు, సన్యాసులు అయోధ్యకు చేరుకోనున్నారని, నిషేధంపై పునరాలోచించుకోవాలని రాష్ట్ర సర్కారును డిమాండ్ చేశారు. సింఘాల్ అరెస్టుకు నిరసనగా విమానాశ్రయం వెలుపల బీజీపీ, వీహెచ్‌పీ కార్యకర్తలు ధర్నా చేశారు. అణచివేతకు నిరసనగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు తొగాడియా చెప్పారు. ‘ఇది రాజకీయ యాత్ర కాదు, మత యాత్ర. దీనిపై నిషేధాన్ని సహించే ప్రసక్తే లేదు’ అని విలేకర్లతో అన్నారు. మరోపక్క.. రామజన్మభూమి ట్రస్టుకు చెందిన నృత్య గోపాల్ దాస్ అయోధ్యలోని తమ ఆలయంలో పదడుగులు వేసి యాత్రను ప్రారంభించారు. తర్వాత పోలీసులు అయనను అదుపులోకి తీసుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి, యాత్ర కన్వీనర్ స్వామి చిన్మయానందను షాజహాన్పూర్లోగృహనిర్బంధంలో ఉంచారు. అరెస్టయిన వారి కోసం ప్రభుత్వం పలు ప్రాంతాల్లో తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేసింది. కాగా, అరెస్టులపై బీజేపీ మండిపడింది. రాష్ట్ర సర్కారు ఓటు బ్యాంకు రాజకీయాలకు పాల్పడుతోందని పార్టీ నేత వెంకయ్యనాయుడు హైదరాబాద్‌లో ఆరోపించారు. వీహెచ్‌పీ రాష్ట్రంలో అశాంతి రేపడానికి యాత్ర చేపట్టిందని సమాజ్‌వాదీ పార్టీ ఆరోపించింది. యాత్రపై నిషేధంతో తమకు సంబంధం లేదని కాంగ్రెస్ చెప్పింది. యాత్ర రాజకీయ ప్రేరే పితం... అయోధ్య ప్రధాన పూజారి: వీహెచ్‌పీ యాత్రకు సొంతవారినుంచే ఊహించని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఈ యాత్ర రాజకీయ ప్రేరేపితమని, సాధువులను స్వార్థప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని అయోధ్యలోని తాత్కాలిక రామాలయ ప్రధాన పూజారి ఆచార్య సతేంద్ర దాస్ విమర్శించారు. హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా వీహెచ్‌పీ యాత్ర ముహూర్తాన్ని నిర్ణయించిందన్నారు. శ్రీరాముడు కూడా ఈ సమయంలో (ఆగస్టు-డిసెంబర్) సీతాన్వేషణ యాత్రను వాయిదా వేసుకున్నారని ఉదహరించారు. వీహెచ్‌పీ యాత్రకు మత ప్రాధాన్యం లేదని, రామాలయ నిర్మాణం కోసం ప్రజల దగ్గరకు వెళ్లడమే దాని ఉద్దేశమని అన్నారు. సింఘాల్ ఇటీవల ములాయంను కలుసుకున్నారని, ఆ భేటీ వివరాలు ఇప్పటికీ బయటకు రాలేదని దాస్ ఆరోపించారు. దాస్ వాదనతో పలువురు పూజారులు ఏకీభవించడం గమనార్హం. -
అశోక్ సింఘాల్ గృహ నిర్బంధం
ఫైజాబాద్/లక్నో: విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) అధ్యక్షుడు అశోక్ సింఘాల్‌ను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం గృహ నిర్బంధంలో పెట్టింది. వీహెచ్‌పీ ఆదివారం అయోధ్యకు సాధు, సన్యాసులతో తలపెట్టిన 84 కిలోమీటర్ల పాదయాత్రపై నిషేధం అమలులో భాగంగా, 70 మంది వీహెచ్‌పీ నేతలపై అరెస్టు వారంట్లు జారీ చేసింది. అవాంఛనీయమైన సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా ఫైజాబాద్-అయోధ్య జంట పట్టణాల్లో భారీగా పోలీసు బలగాలను మోహరించి భద్రతను కట్టుదిట్టం చేసింది. మత కలహాలు రేకెత్తే అవకాశాలు ఉన్నందున వీహెచ్‌పీ యాత్రపై నిషేధం విధించిన యూపీ సర్కారు, పొరుగు రాష్ట్రాలను ఈ అంశంలో ఇంటెలిజెన్స్ సహాయం కోరింది. అయోధ్యకు దారితీసే జిల్లా సరిహద్దులన్నింటినీ ఫైజాబాద్ జిల్లా యంత్రాంగం మూసివేసింది. నిషేధాన్ని ఉల్లంఘించి అయోధ్య వైపు పాదయాత్రగా వచ్చే సాధువులను జిల్లా ప్రవేశ మార్గాల వద్దే అదుపులోకి తీసుకోనున్నట్లు ప్రకటించింది.