
రచ్చకెక్కిన వివాదం
భద్రాచలం టౌన్ : నిత్యపూజలందుకునే రామయ్య సన్నిధి శనివారం వాద ప్రతివాదాలతో మార్మోగింది. పవిత్ర పూజలు, నిత్యకల్యాణాలు జరిగే బేడామండపం వద్ద ఉద్రిక్త పరిస్తితి నెలకొంది. ఉత్తరాంధ్ర నుంచి వచ్చిన కొందరు సాధువులు నిత్యకల్యాణం జరిగే సమయంలో చేసిన నిరసనల నినాదాలతో భక్తులు అయోమయానికి గురయ్యారు. వివరాలిలా ఉన్నాయి.. భద్రాద్రి ఆలయంలో కొన్ని రోజులుగా ‘రామ నారాయణ’ అనే పదం విషయంలో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. దీనిపై ఆలయ వేద పండితులను నిలదీసేందుకు ఉత్తరాంధ్ర సాధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస ఆనందస్వామి, హిందూ పరిరక్షణ సమితి ఉపాధ్యక్షుడు గౌరయ్య తదితరులు శుక్రవారమే భద్రాచలం చేరుకున్నారు.
రామ నారాయణ స్మరణ చేస్తే శనివారం జరిగే నిత్యకల్యాణాన్ని అడ్డుకుంటామని ముందే ప్రకటించారు. ఈ క్రమంలో ఉదయమే బేడా మండపానికి చేరుకున్న సాధువులు కల్యాణ తంతులో భాగంగా శ్రీసీతారాముల ప్రవర చదువుతుండగా.. ఒక్కసారిగా మండపం వైపునకు దూసుకొచ్చారు. శ్రీరామ క్షేత్రంలో నారాయణ, లక్ష్మి గోత్రాలతో ఎలా పూజలు చేస్తారంటూ ప్రశ్నించారు. వీరికి ఆలయ అర్చకులు, వేదపండితులు సమాధానం చేప్పే క్రమంలో గందరగోళం నెలకొంది. అయితే కల్యాణాన్ని అడ్డుకుంటామని సాధువులు ముందుగానే ప్రకటించడంతో అప్పటికే అక్కడికి చేరుకున్న ఆలయ, పట్టణ పోలీసులు సాధువులను సముదాయించారు. ఆలయ ప్రాంగణంలో నిరసనలు తగదని సర్దిచెప్పడంతో వారు వెనుదిరిగారు. కాగా, పవిత్ర పూజలు జరిగే శ్రీరామ సన్నిధిలో ఇలాంటి అలజడులు ఏంటని భక్తులు ఆవేదనకు గురయ్యారు.
‘రామ నారాయణ’ ఎప్పటినుంచో ఉంది...
తరతరాలుగా సంప్రదాయబద్ధంగా వస్తున్న రామాలయ పవితత్రను కాపాడాలన్నదే తమ తాపత్రయమని ఆలయ అధర్వణ వేదపండితులు గుదిమెళ్ల మురళీ కృష్ణమాచార్యులు చెప్పారు. నిత్యకల్యాణంలో జరిగిన ఆందోళన అనంతరం దీక్షా శిబిరం వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆలయంలో 1959, 1961, 1987 సంవత్సరాలలో జరిగిన మహాసామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా ముద్రించిన పుస్తకాలలో రామక్షేత్రం ప్రాముఖ్య త, ఆ సందర్భంగా రామనారాయణ, వైకుంఠ రాముడు, ఓంకార రాముడు అనే నామాల ప్రస్తావన, పద్యాలు ఉన్నాయని వివరించారు. ‘రామ నారాయణుడు’ అనేది ఇప్పుడు తాము కావాలని పుట్టించిన పదం కాదని, ఎప్పటి నుంచే వస్తున్న నామస్మరణ అని తెలిపారు.
ఆలయంలో రామనామస్మరణ తప్ప ఎలాంటి నినాదాలు ఉండకూడదనే ఉద్దేశంతోనే తాము చిత్రకూట మండపంలో శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నామని చెప్పారు. మరోవైపున సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా విధులు నిర్వర్తిస్తున్నామని తెలిపారు. భద్రాచలంలో శ్రీసీతారామచంద్ర దేవస్థాన నామం తప్ప, ఆలయానికి మరే పేరు మార్చే ఉద్దేశం తమకు లేదని, ముమ్మాటికి భద్రాచలంలో ఉన్నది శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానమేనని, పత్రికాముఖంగా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు తెలుపుతున్నామని అన్నారు.
రామనారాయణ స్మరణలో తప్పేంటి : వీహెచ్‌పీ
రాముడికి ఉన్న వెయ్యి పేర్లలో రామనారాయణ ఒకటని, ఆ పేరుతో పిలిస్తే తప్పేంటని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర అధికార ప్రతినిధి జి. వెంకటేశ్వరరాజు అన్నారు. ఈ వివాదం గురించి తెలుసుకునేందుకు శనివారం ఆయన భద్రాచలం వచ్చి అర్చకులు, వేదపండితులతో చర్చించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రామనారాయణ అనే పేరును అనవసరంగా వివాదం చేస్తున్నారని అన్నారు. సీతారామ చంద్రస్వామి దేవస్థానం పేరును మార్చే ఉద్దేశం తమకు లేదని వేదపండితులు స్పష్టం చేశారని, అలా అని వారు కరపత్రాలు పంచినా ఇంకా ఆపోహలెందుకని ప్రశ్నించారు.
కావాలనే ఎవరో బయటి వ్యక్తులు ఈ విషయాన్ని వివాదం చేస్తున్నారని ఆరోపించారు. అర్చకులు, ఆలయ సిబ్బంది 11 రోజులుగా నిరసన తెలియజేస్తున్నా ప్రభుత్వం, ఉన్నతాధికారులు స్పందించకపోవడం శోచనీయమన్నారు. అనంతరం ఈవోను కలిసి ఈ సమస్యలపై చర్చించగా, ఉద్యోగులపై ఉన్న మెమోలను ఉపసంహరించుకుంటానని, ఈ వివాదం ఉన్నతాధికారుల సమక్షంలో చర్చిస్తామని చెప్పారని వెంకటేశ్వరరాజు వివరించారు. కాగా, రామాలయ ఉద్యోగులు, అర్చకులు చేపట్టిన రిలే దీక్షలు శనివారం 7వ రోజుకు చేరుకున్నాయి.