సాక్షి, అమరావతి: బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయరాదని, ప్రైవేటు స్థలాల్లోనే ఏర్పాటుచేసుకుని గణేష్ ఉత్సవాలు జరుపుకోవచ్చునంటూ ప్రభుత్వ యంత్రాంగం జారీచేసిన ఉత్తర్వులను హైకోర్టు ధర్మాసనం సైతం సమర్థించింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక చవితి ఉత్సవాలు జరుపుకునేందుకు ప్రజలందరికీ అనుమతినివ్వాలంటూ విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్‌పీ) చేసిన అభ్యర్థనను ధర్మాసనం తోసిపుచ్చింది. కోవిడ్ నేపథ్యంలో ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే బహిరంగ ప్రదేశాల్లో చవితి ఉత్సవాల నిర్వహణకు అధికారులు అనుమతివ్వలేదని, ఇందులో తప్పులేదని హైకోర్టు స్పష్టంచేసింది.
బహిరంగ ప్రదేశాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించరాదంటూ కృష్ణాజిల్లా కలెక్టర్ జారీచేసిన ప్రొసీడింగ్స్ సరైనవేనని తెలిపింది. వీటిని రద్దుచేయాలని కోరుతూ వీహెచ్‌పీ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) హైకోర్టు కొట్టేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ అరూప్‌కుమార్ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీచేసింది. బహిరంగ ప్రదేశాల్లో వినాయక మండపాలు, విగ్రహాల ఏర్పాటు చేసుకుని ఉత్సవాలు నిర్వహించుకునేందుకు అనుమతినిచ్చేలా అధికారులను ఆదేశించాలని కోరుతూ వీహెచ్‌పీ కృష్ణాజిల్లా కార్యదర్శి సిద్ధినేని శ్రీసత్య సాయిబాబు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై గురువారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.
అసలు పిల్ ఎలా దాఖలు చేస్తారు?
పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మత విశ్వాసాలకు అనుగుణంగా వేడుకలు జరుపుకునే హక్కు పౌరులందరికీ ఉందన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ, బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేయరాదని సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు ఇచ్చారు కదా? అని ప్రశ్నించింది. అసలు ఎలా పిల్ దాఖలు చేస్తారని, మీ హక్కులు ఉల్లంఘన జరిగిందని భావిస్తే రిట్ పిటిషన్ దాఖలు చేసుకోవాలి అని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఇందులో పిటిషనర్ వ్యక్తిగత ప్రయోజనాల్లేవని, ప్రజలందరి తరఫున ఈ వ్యాజ్యం దాఖలు చేశామని న్యాయవాది తెలిపారు. పెళ్లిళ్లకు 150 మందిని అనుమతినిస్తున్నప్పుడు ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయంలో అనుమతినివ్వకపోవడం సరికాదన్నారు. వినాయక ఉత్సవాలపై ఆధారపడిన చిన్న వ్యాపారులకూ నష్టం చేకూరుతుందన్నారు. దీంతో.. వారెవ్వరూ ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదని, అందువల్ల ఆ అంశం గురించి మాట్లాడాల్సిన అవసరంలేదని ధర్మాసనం తేల్చిచెప్పింది.
జీవించే హక్కే ముఖ్యమని ‘సుప్రీం’ చెప్పింది...
తరువాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ వాదనలు వినిపిస్తూ.. వినాయక ఉత్సవాలు జరుపుకోకుండా ఎవరినీ అడ్డుకోవడంలేదని, కేవలం బహిరంగ ప్రదేశాల్లో మండపాలు, విగ్రహాలు ఏర్పాటుచేయడంపైనే ఆంక్షలు విధించామని చెప్పారు. బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాలు ఏర్పాటుచేస్తే అక్కడికి ప్రజలు రాకుండా అడ్డుకోవడం అసాధ్యంగా మారుతుందన్నారు. ప్రజల జీవించే హక్కే అత్యంత ముఖ్యమైనదన్న సుప్రీంకోర్టు తీర్పును సుమన్ వివరించారు. కరోనా థర్డ్‌వేవ్ వచ్చే అవకాశముందని నిపుణులు చెబుతున్నారని, దీనిని పరిగణనలోకి తీసుకుని బహిరంగ ప్రదేశాల్లో విగ్రహాల ఏర్పాటుపై ఆంక్షలు విధించామన్నారు. క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకునే సింగిల్ జడ్జి ప్రైవేటు స్థలాల్లోనే విగ్రహాలు ఏర్పాటుచేసుకోవాలని ఉత్తర్వులిచ్చారని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు.
ఏ రకంగానూ జోక్యం అవసరంలేదు
ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, కలెక్టర్ ప్రొసీడింగ్స్‌పై ఏ రకంగానూ జోక్యం చేసుకోవాల్సిన అవసరం కనిపించడంలేదని చెప్పింది. ప్రజల ఆరోగ్యమే ప్రభుత్వాలకు పరమావధి అంటూ సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజల ప్రాణాలను దృష్టిలో పెట్టుకునే ఆంక్షలు విధించిందని తెలిపింది. ప్రభుత్వం చెబుతున్నట్లు బహిరంగ ప్రదేశాల్లో జన సమూహాలను నిలువరించడం అసాధ్యమేనని స్పష్టంచేసింది. ఈ విషయంలో సింగిల్ జడ్జి ఇప్పటికే ఉత్తర్వులు జారీచేశారన్న ధర్మాసనం.. వీహెచ్‌పీ దాఖలుచేసిన ఈ వ్యాజ్యా న్ని కొట్టేస్తున్నట్లు తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
బహిరంగ ప్రదేశాల్లో.. వినాయక విగ్రహాలను అనుమతించలేం
Published Fri, Sep 10 2021 5:36 AM | Last Updated on Fri, Sep 10 2021 5:36 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment