
న్యూఢిల్లీ : మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీపై విశ్వ హిందూ పరిషత్ నిప్పులు చెరిగింది. ఓ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయని అనుమానిస్తున్న సంస్థ నిర్వహించిన కార్యక్రమానికి ఎలా వెళ్లారని ప్రశ్నించింది. ఆయన కావాలనే ఇలా చేస్తున్నారని, ముస్లింలలో అసంతృప్తి ఉన్నదనే విషయాన్ని ఆయన చర్యల ద్వారా చూపించాలనుకుంటున్నారని మండిపడింది. పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా అనే సంస్థ మహిళా విభాగం ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. అయితే, ఈ సంస్ధకు ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి.
దీనికే అన్సారీ హాజరయ్యారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జాయింట్ జనరల్ సెక్రటరీ సురేంద్ర జైన్ మాట్లాడుతూ 'ఈ కార్యక్రమానికి వెళ్లడం ద్వారా ఆయన మరోసారి తన వైఖరిని వెల్లడించారు. ముస్లింలలో అసంతృప్తి ఉందనే విషయాన్ని ఆయన వ్యాపింపజేస్తున్నారు' అని ఆరోపించారు. పీఎఫ్‌ఐ అంటే మరేమిటో కాదని, సిమీనే పీఎఫ్‌ఐగా రూపాన్ని మార్చుకుందంటూ ఆరోపించారు. కేరళలలోని పలువురు దేశ భక్తుల మరణాల వెనుక పీఎఫ్‌ఐ హస్తం ఉందని కూడా ఆరోపించారు.