హర్యానాలో మతపరమైన ఊరేగింపు సందర్భంగా జరిగిన హింసలో ఇప్పటి వరకు పోలీసులు 116 మందిని అరెస్ట్ చేశారు. మంగళవారం నాటికి మొత్తం 26 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. ఈ మత ఘర్షణల్లో ఇద్దరు హోంగార్డులు, ఓ మతాధికారి సహా ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో 23 మంది క్షతగాత్రులు కాగా.. వీరిలో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ముగ్గురు ఇన్‌స్పెక్టర్లు సహా పది మంది పోలీసులు ఉన్నారు. హర్యానా అల్లర్లు మంగళవారం రాత్రి గురుగ్రామ్‌ను తాకడంతో తాజాగా ఢిల్లీ అప్రమత్తం అయ్యింది.
ఢిల్లీ పోలీసుల అప్రమత్తం
గురుగ్రామ్ పరిసర ప్రాంతాలలో మత ఘర్షణల నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు మంగళవారం దేశ రాజధానిలో పెట్రోలింగ్‌ను పెంచారు. ఎన్సీఆర్ పరిధిలో ఇలాంటి ఘటనలు జరగడంతో దేశ రాజధానిలో ఎలాంటి పరిస్థితులు తలెత్తినా స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీనియర్ పోలీసు అధికారి ఒకరు తెలిపారు. గురుగ్రామ్‌లోని సోహ్నా సబ్-డివిజన్‌లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలను బుధవారం (ఆగస్టు 2) మూసివేయాలని ఆదేశించినట్లు పేర్కొన్నారు.
నిరసనలకు పిలుపు
మేవాత్ ప్రాంతంలో జరిగిన ఘర్షణలకు వ్యతిరేకంగా విశ్వహిందూ పరిషత్ నేడు (బుధవారం) నిరసనకు పిలుపునిచ్చింది. వీహెచ్‌పీ, భజరంగ్ దళ్ కలిసి మనేసర్‌లోని భీసం దాస్ మందిర్‌లో బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాపంచాయత్ ఏర్పాటు చేయనున్నాయి. సెక్టార్ 21ఎలోని నోయిడా స్టేడియం నుంచి సెక్టార్ 16లోని రజనిగంధ చౌక్ వైపు నిరసన ప్రదర్శన ప్రారంభమవుతుందని, అక్కడ దిష్టిబొమ్మను దహనం చేస్తామని వీహెచ్‌పీ ప్రచార చీఫ్ రాహుల్ దూబే తెలిపారు.
నుహ్‌లో ఘర్షణలు జరిగిన మరుసటి రోజు(మంగళవారం) గురుగ్రామ్‌లోని బాద్షాపూర్‌లో అల్లరి మూకల గుంపు బైక్‌లపై వచ్చి రెస్టారెంట్‌కు నిప్పుపెట్టింది. పక్కనే ఉన్న దుకాణాలను సైతం ధ్వంసం చేసింది. మసీదు ముందు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ఓ కమ్యూనిటికీ చెందిన దుకాణాలపై దాడికి పాల్పడింది. ఈ హింసాకాండతో బాద్‌షాపూర్ మార్కెట్‌ను మూసివేశారు.
చదవండి: మణిపూర్ అల్లర్లు: వారంతా ఏమై పోయారు?
ఎందుకీ ఘర్షణలు
హరియాణాలోని నుహ్ జిల్లాలో సోమవారం అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. విశ్వహిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన మతపరమైన ఊరేగింపు సందర్భంగా మరో వర్గం వారు అడ్డుకోవడంతో అక్కడ మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు ఒకరిపై మరొకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారుఈ హింసలో ఇద్దరు హోంగార్డులతో సహా అయిదుగురు ప్రాణాలు కోల్పోయారు. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్ ఊరేగింపులో పాల్గొన్న నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.
మరో మణిపూర్ కాబోతున్న హర్యానా?
గత మూడు నెలలుగా బీజేపీ పాలిత మణిపూర్‌లో హింసాకాండ కొనసాగుతున్న విషయం తెలిసిందే. రెండు వర్గాల మధ్య మొదలైన అల్లర్లు రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. ఈ ఘర్షణల్లో ఇప్పటి వరకు వందలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీనిని మరవక ముందే మరో బీజేపీ పాలిత రాష్ట్రం హర్యానాలో మత ఘర్షణలు చెలరేగాయి. పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో 13 కంపెనీల పారామిలటరీ బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురుగ్రామ్, ఫరీదాబాద్, పల్వాల్ అంతటా 144 సెక్షన్ విధించారు. ఈ క్రమంలో మరో మణిపూర్‌గా హర్యానా మారబోతుందా అనే ఆందోళన వ్యక్తమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment