‘అఖిలేశ్’కు రామమందిర నిర్మాణం ఇష్టం లేదు’
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం తర్వాత విశ్వహిందూ పరిషత్ రామమందిర నిర్మాణం కోసం పనులు ప్రారంభించింది. అయోధ్యలో రామమందిరం నిర్మాణం కోసం ఆయా ప్రాంతాల నుంచి శిలలను సేకరిస్తోంది. ప్రస్తుతం దేశంలోనూ అయోధ్య ఉన్న ఉత్తరప్రదేశ్‌లోనూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ సమయాన్ని ఉపయోగించుకుని వీహెచ్‌పీ రామమందిర నిర్మాణం ప్రారంభించే యోచన చేస్తున్నట్లు సమాచారం.
విశ్వహిందూ పరిషత్ అతర్జాతీయ జాయింట్ సెక్రటరీ మీడియాతో మాట్లాడుతూ ‘వేర్వేరు రాష్ట్రాల నుంచి రామమందిరం కోసం శిలలను తీసుకొచ్చిన సందర్భాలు మీరు చూశారు. అవన్నీ కూడా ఏదో ఒక చోట ఆయా రాష్ట్రాల సరిహద్దులు దాటి రాష్ట్రంలోకి(ఉత్తరప్రదేశ్‌లోకి) రావాలి. కానీ, అవి వచ్చినప్పుడు పరిపాలనలో ఉన్న సమాజ్‌వాది ప్రభుత్వం వాటిని ప్రవేశించనీయకుండా నియంత్రణలు పెట్టింది.
ఎందుకంటే అఖిలేశ్ యాదవ్ ప్రభుత్వానికి రామమందిరం నిర్మించడం ఇష్టం లేదు. అందుకే అప్పుడు రాళ్లను అడ్డుకుంది. ప్రస్తుతం యోగి ఆదిత్యనాథ్ ఉండటంతో ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయి మా పని తేలికైంది’ అని చెప్పారు. రామ శిలలు కూడా ఎక్కడి నుంచో తీసుకురావడం లేదని ఒక్క రాజస్థాన్ నుంచే తీసుకొస్తున్నామని, వాటిని తమ వర్క్ షాపుల్లోకి తీసుకొచ్చి సిద్ధం చేస్తామని అన్నారు.