
గురుగ్రామ్: హరియాణా పల్వల్‌లో విశ్వ హిందూ పరిషత్ సహా పలు హిందూ సంస్థలు ఆదివారం నిర్వహించిన మహా పంచాయత్‌లో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రను ఆగస్టు 28న పునరుద్ధరిస్తున్నట్టు ప్రకటించారు. జులై 31న నూహ్‌లో దుండగుల దాడితో మత ఘర్షణలు చెలరేగి యాత్ర అర్థాంతరంగా ఆగిపోయిన విషయం తెలిసిందే.
యాత్ర నిర్వహించి తీరాలని, చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని మహాపంచాయత్‌లో హరియాణా గో రక్షక దళానికి చెందిన ఆచార్య ఆజాద్ శాస్త్రి అన్నారు. యాత్రలో అంతా ఆయుధాలు ధరించాలని పిలుపునిచ్చారు. మహాపంచాయత్‌లో విద్వేష ప్రసంగాలు చేయవద్దని పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ హిందూ నాయకులు పెడచెవిన పెట్టారు. కనీసం 100 రైఫిల్స్‌కు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ముస్లింలతో చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందంటూ ఆజాద్ శాస్త్రి రెచ్చగొట్టేలా ప్రసంగించారు. మరి కొందరు వక్తలు కూడా ఇదే తరహాలో ప్రసంగించారు. మీరు ఎవరైనా వేలెత్తి చూపిస్తే మీ చెయ్యినే నరికేస్తాం అని హెచ్చరించారు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న నూహ్ జిల్లానే రద్దు చేయాలని ఆ ప్రాంతంలో గోవధ ఉండకూదని వక్తలు డిమాండ్ చేశారు. నూహ్‌లో హిందువుల యాత్రపై తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీంతో మళ్లీ ఉద్రిక్తతలు నెలకొంటాయన్న ఆందోళనలున్నాయి.