గురుగ్రామ్: హరియాణాలోని నూహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అడ్డుకునేందుకు మరో వర్గం వ్యక్తులు చేసిన రాళ్లదాడి తదనంతర ఘటనల్లో పాల్గొన్న వ్యక్తులపై రాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్‌లతో సమాధానం చెబుతోంది. నూహ్ అల్లర్ల సంబంధ సీసీటీవీ వీడియోలో పోలీసులు గుర్తించిన నిందితులకు చెందిన దుకాణాలను అధికారులు బుల్డోజర్లతో నేలమట్టంచేశారు. మూడో రోజైన శనివారం సైతం ఈ బుల్డోజర్ డ్రైవ్ కొనసాగింది. అయితే, నల్హార్ వైద్య కళాశాలకు చెందిన 2.6 ఎకరాల భూమిలో కట్టిన అక్రమ నిర్మాణాలనే తాము కూల్చేశామని అధికారులు చెప్పడం గమనార్హం.
నూహ్ అల్లర్ల నిందితులను లక్ష్యంగా చేసుకునే ఈ కూల్చివేత ప్రక్రియ మొదలుపెట్టారన్న ఆరోపణలను అధికారులు కొట్టిపారేశారు. అయితే నూహ్ జిల్లాలో పరిస్థితి కాస్తంత అదుపులోకి వచ్చిన నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి మూడు గంటలదాకా కర్ఫ్యూను ఎత్తేస్తున్నట్లు జిల్లా మేజిస్ట్రేట్ ధీరేంద్ర చెప్పారు. భయంతో తరలిపోతున్న వలసకార్మికుల్లో భరోసా కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రయత్నించింది. డెప్యూటీ కమిషనర్ నిశాంత్ కుమార్ సెక్టార్ 58, 70 సమీపంలోని పలు మురికివాడల్లో పర్యటించి వలసకార్మికులతో మాట్లాడారు. ఎలాంటి భయం లేకుండా పనులకు వెళ్లొచ్చని హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment