
శివమెత్తిన వీహెచ్‌పీ
లక్నో/న్యూఢిల్లీ: విశ్వ హిందూ పరిషత్(వీహెచ్‌పీ) చేపట్టిన అయోధ్య యాత్రను భగ్నం చేసి 2,500 మందిని అరెస్ట్ చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కోర్టు జోక్యంతో వీహెచ్‌పీ నేతలు అశోక్ సింఘాల్, ప్రవీణ్ తొగాడియాలతో సహా 958 మందిని సోమవారం విడుదల చేసింది. యాత్ర భగ్నానికి నిరసనగా యూపీలోని వివిధ నగరాల్లో వీహెచ్‌పీ కార్యకర్తలు తీవ్ర నిరసన కార్యక్రమాలు చేపట్టడంతో అనేక చోట్ల ఉద్రిక్తత నెలకొంది. ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఆందోళనకు దిగిన వందలాది వీహెచ్‌పీ కార్యకర్తలు పోలీసులతో ఘర్షణకు దిగారు. వీరిని చెదరగొట్టేందుకు పోలీసులు వాటర్ కేనన్లు వాడాల్సి వచ్చింది. నిరసనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతోపాటు బారికేడ్లను దాటుకొని వెళ్లడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది.
84 కోసి అయోధ్య పరిక్రమ పేరిట ఆదివారం వీహెచ్‌పీ చేపట్టిన యాత్రను నిషేధించిన యూపీ ప్రభుత్వం వీహెచ్‌పీ కార్యకర్తలను భారీసంఖ్యలో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అశోక్ సింఘాల్ తదితరులను సీఆర్‌పీసీ 151(2) ప్రకారం అరెస్ట్ చేసినట్టయితే వారిని విడుదల చేయాల్సిందిగా అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఆదేశించింది. దీంతో సింఘాల్ తదితరులను ప్రభుత్వం విడుదల చేసింది. మరోవైపు, అయోధ్య యాత్రను యూపీ ప్రభుత్వం భగ్నం చేయడంపై బీజేపీ భగ్గుమంది. ముస్లిం మంత్రులు, మౌల్వీల ఒత్తిడి మేరకు ప్రభుత్వం హిందువుల హక్కులను హరిస్తోందని బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్ అన్నారు. భారతీయ సంస్కృతిని సర్వనాశనం చేయడానికి జరుగుతున్న దాడిలో భాగంగానే యూపీ ప్రభుత్వం యాత్రను ముందస్తు సమాచారం లేకుండా నిషేధించిందని అశోక్ సింఘాల్ ధ్వజమెత్తారు.
ఇదొక రాజకీయ డ్రామా: అఖిలేశ్ యాదవ్
వీహెచ్‌పీ యాత్ర రాజకీయ ప్రయోజనం కోసం చేపట్టిన యాత్రేనని యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ అన్నారు. మతపరమైన సంప్రదాయం ప్రకారం చేపట్టినది కానందువల్లే ప్రభుత్వం యాత్రను అడ్డుకున్నదని లక్నోలో విలేకరులతో చెప్పారు. ఈ యాత్రను గత ఏభయ్యేళ్లలో ఎప్పుడూ ఇప్పటి మాదిరిగా చాతుర్మాసంలో నిర్వహించలేదని, సాధారణంగా చైత్ర మాసం(ఏప్రిల్)లో నిర్వహిస్తుంటారన్నారు. వీహెచ్‌పీ యాత్రను భగ్నం చేయడం ద్వారా యూపీ ప్రభుత్వం మతసామరస్యానికి భంగం కలిగించే విధంగా వ్యవహరించిందని అలీగఢ్ ముస్లిం మేధావులు ధ్వజమెత్తారు.
పార్లమెంటును కుదిపేసిన ‘యాత్ర’
న్యూఢిల్లీ: వీహెచ్‌పీ యాత్ర భగ్నం వ్యవహారం సోమవారం పార్లమెంటును కుదిపేసింది. యాత్రను యూపీ ప్రభుత్వం అడ్డుకోవడంపై బీజేపీ సభ్యులు తీవ్ర నిరసన వ్యక్తం చేయడం, ఢిల్లీలోని సమాజ్‌వాదీ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిపై ఆ పార్టీ సభ్యులు పదే పదే ప్రస్తావించడంతో ఉభయ సభల్లో గందరగోళం నెలకొంది. ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి తమ పార్టీ కార్యాలయంపై దాడి గురించి చర్చించాలని సమాజ్‌వాదీ లోక్‌సభలో నోటీసు ఇచ్చింది. స్పీకర్ మీరాకుమార్ అనుమతించకపోవడంతో ఎస్పీ సభ్యులు నినాదాలు చేశారు. ఎవరేమి మాట్లాడుతున్నారో తెలియని గందరగోళం నెలకొనడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు.