రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే? | Ram temple construction may begin on Ram Navami | Sakshi
Sakshi News home page

రామమందిరానికి శంకుస్థాపన ఎప్పుడంటే?

Published Mon, Nov 11 2019 3:26 PM | Last Updated on Mon, Nov 11 2019 6:40 PM

Ram temple construction may begin on Ram Navami - Sakshi

న్యూఢిల్లీ: అయోధ్యలోని వివాదాస్పద స్థలం శ్రీరాముడిదేనన్న సుప్రీంకోర్టు  చరిత్రాత్మక తీర్పు నేపథ్యంలో రామమందిరం నిర్మాణం దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ క్రమంలో రామమందిర నిర్మాణం ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఆసక్తి రేపుతుండగా.. వచ్చే ఏడాది శ్రీరామనవమి సందర్భంగా లాంఛనంగా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయవచ్చునని తెలుస్తోంది.

శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్‌ 2న  ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య పట్టణంలో రామమందిర నిర్మాణం ప్రారంభమవుతుందని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. బాబ్రీ మసీదు-రామజన్మభూమి భూవివాదం కేసులో వివాదాస్పద 2.77 ఎకరాల భూమి బాలరాముడి (రామ్‌ లల్లా విరాజమాన్‌)కి చెందుతుందని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. దీంతో అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మార్గం సుగమం అయింది. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా మందిర నిర్మాణానికి ట్రస్ట్‌ ఏర్పాటయ్యాక వీహెచ్‌పీ.. రామ జన్మభూమి న్యాస్‌తో కలసి వీలైనంత వేగంగా నిర్మాణం ప్రారంభించే ఆలోచనలో ఉంది. వీహెచ్‌పీ అనేక ప్రణాళికలు సిద్ధం చేసినా.. అందులో అత్యధికుల మనోభావాలు, విశ్వాసాలకు అనుగుణంగా ఉండే నిర్మాణ బ్లూ ప్రింట్‌పైనే దృష్టి కేంద్రీకరించింది.  

రామ మందిరం నిర్మాణానికి కనిష్టంగా నాలుగేళ్లు
ఆలయ నిర్మాణాన్ని మొత్తం రెండంతస్తుల్లో చేపట్టేలా ప్లాన్‌ సిద్ధంగా ఉంది. మొదటి అంతస్తులోనే శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ఇక ఆలయ పైభాగాన శిఖరం ఉండనుంది. గుడి ఎత్తు 128 అడుగులు, వెడల్పు 140 అడుగులు, పొడవు 270 అడుగులతో నిర్మించనున్నారు. రెండంతస్తుల్లో మొత్తం 212 స్తంభాలు ఉంటాయి. ప్రతీ అంతస్తులో 106 స్తంభాలుంటాయి. ఏళ్లుగా గుడి నిర్మాణానికి అవసరమైన స్తంభాలు, ద్వారాలను శిల్పులు చెక్కుతున్నారు. ఆలయ పునాదిలో ఎక్కడా స్టీల్‌ వినియోగం లేకుండా చేపట్టనున్నారు. మొత్తం ఆలయ నిర్మాణానికి 1.75 లక్షల ఘనపు అడుగుల ఇసుకరాతి అవసరమవుతుందని భావిస్తున్నారు. ఆలయానికి సింగ్‌ ద్వార్, నృత్య మండపం, రంగ మండపం, పూజా మండపం, గర్భగుడితో కలిపి మొత్తం ఐదు ప్రవేశ ద్వారాలు ఉండనున్నాయి. మొత్తం ఆలయ నిర్మాణానికి తక్కువలో తక్కువగా నాలుగేళ్లు పడుతుందని నిపుణులు అంటున్నారు. ‘ఇంత సమయంలోనే నిర్మాణం పూర్తవుతుందని నేను హామీ ఇవ్వలేను. కానీ న్యాయ సంబంధిత పనులన్నీ పూర్తవగానే నిర్మాణం ప్రారంభమవుతుందని భావిస్తున్నా’అని అంతర్జాతీయ వీహెచ్‌పీ(ఐవీహెచ్‌పీ) అధ్యక్షుడు అలోక్‌కుమార్‌ వెల్లడించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement