‘అయోధ్య’ తీర్పు నేడే | Supreme Court To Pronounce Verdict In Ayodhya Title Dispute Today | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’ తీర్పు నేడే

Published Sat, Nov 9 2019 2:15 AM | Last Updated on Sat, Nov 9 2019 8:02 AM

Supreme Court To Pronounce Verdict In Ayodhya Title Dispute Today - Sakshi

న్యూఢిల్లీ: దశాబ్దాల వివాదానికి నేడు తెరపడనుంది. దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు నేడు పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో నేడు తేలనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది. దీనికి సంబంధించిన నోటీసును శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది. అక్టోబర్‌ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే, జస్టిస్‌ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ అశోక్‌భూషణ్, జస్టిస్‌ ఎస్‌ఏ నజీర్‌ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు.  

యూపీ ఉన్నతాధికారులతో సీజేఐ భేటీ 
తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ గొగోయ్‌ ఉత్తరప్రదేశ్‌ చీఫ్‌ సెక్రటరీ రాజేంద్ర కుమార్‌ తివారీ, ఆ రాష్ట్ర డీజీపీ ఓం ప్రకాశ్‌ సింగ్‌ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితిని, తీర్పు నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు వర్గాలు సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచుతూ అలహాబాద్‌ హైకోర్టు 2010లో తీర్పునిచి్చన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. 

అయోధ్యలోని రామజన్మభూమి న్యాస్‌ కార్యశాల వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తురాలు  

1950 నుంచీ..   
అంతకుముందు, మొదట 1950లో గోపాల్‌ సింగ్‌ విశారద్‌ అనే రామ్‌లల్లా భక్తుడు స్థానిక కోర్టులో వ్యాజ్యం వేశారు. వివాదాస్పద ప్రదేశంలో కొలువైన చిన్నారి రాముడి విగ్రహానికి పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని కోరుతూ ఆయన పిటిషన్‌ వేశారు. అదే సంవత్సరం బాబ్రీ మసీదు ప్రధాన గుమ్మటం కిందనే విగ్రహాలను ఉంచి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని పరమహంస రామచంద్ర దాస్‌ అనే వ్యక్తి పిటిషన్‌ దాఖలు చేశారు. అయితే, ఆ తరువాత ఆ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. 1959లో రామ్‌లల్లాకు భక్తులుగా పూజాదికాలు నిర్వహించేందుకు హక్కులు కోరుతూ నిర్మోహి అఖాడా అదే కోర్టులో వ్యాజ్యం వేసింది. ఆ తరువాత మొత్తం వివాదాస్పద ప్రదేశంపై పూర్తి హక్కులు కోరుతూ 1961లో సున్నీ సెంట్రల్‌ వక్ఫ్‌ బోర్డు కేసు వేసింది. అనంతరం, అక్కడి రామ్‌లల్లా విరాజ్‌మాన్‌ విగ్రహం, రామ జన్మభూమి తరఫున అలహాబాద్‌ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దియెకి నందన్‌ అగర్వాల్‌ 1989లో ఈ వ్యాజ్యంలో పాలుపంచుకున్నారు. మొత్తం వివాదాస్పద ప్రాంతంపై తమకు(రామ్‌లల్లాకు) యాజమాన్య హక్కులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం 1992 డిసెంబర్‌ 6వ తేదీన కూల్చివేతకు గురైంది. దాంతో, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో మతకలహాలు చోటు చేసుకున్నాయి. 

ముగ్గురికి 3 భాగాలు.. 
ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన్న వ్యాజ్యాలన్నీ అలహాబాద్‌ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం అలహాబాద్‌ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్‌ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ఆధ్యాత్మిక గురు, ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు పండిట్‌ శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్‌ కలీఫుల్లా, సీనియర్‌ న్యాయవాది శ్రీరామ్‌ పంచు సభ్యులుగా ఒక మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పడింది. వివిధ వర్గాలతో నాలుగు నెలల పాటు ఆ కమిటీ సంప్రదింపులు జరిపింది. అయినా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. అనంతరం, తమ అభిప్రాయాలతో కూడిన ఒక నివేదికను ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందజేసింది. ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణను ప్రారంభించింది. అత్యధిక కాలం విచారణ సాగిన కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ కేసు విచారణను చివరకు జస్టిస్‌ రంజన్‌ గొగోయ్‌ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్‌ 16న ముగించింది. మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్‌ 17 వ తేదీన జస్టిస్‌ గొగోయ్‌ పదవీ విరమణ చేయనుండటంతో.. ఆ లోపే తీర్పును ప్రకటిస్తారని అంతా భావించారు. చివరకు, నేడు ఆ చరిత్రాత్మక తీర్పు వెలువడనుంది.
 
కాంగ్రెస్‌ అధిష్టానం భేటీ 
అయోధ్య తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్‌ అధిష్టానం నేడు భేటీ కానుంది. ఆదివారం ఉదయం ఈ భేటీ జరగాల్సి ఉండగా తాజా పరిణామాలతో శనివారమే నిర్వహించనున్నట్లు కాంగ్రెస్‌ పార్టీ తెలిపింది. ఉదయం 9:45 గంటలకు 10 జనపథ్‌లో ఈ సమావేశం జరగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ తెలిపారు. ఇందులో కాంగ్రెస్‌ కీలక నేతలు సహా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. తీర్పుపై కాంగ్రెస్‌ వైఖరి నిర్ణయించుకునేందుకే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు సీజేఐ రంజన్‌ గొగోయ్‌కి జడ్‌ప్లస్‌ కేటగిరీ భద్రత కలి్పస్తున్నారు. కాగా ‘కోర్టు తీర్పును మనమంతా గౌరవించాలి. సంయమనం పాటించాలి. మత నమ్మకాలను కించపరచవద్దు’ అని లక్నో ఈద్గా ఇమాం మౌలానా ఖలీద్‌ రషీద్‌ ఫిరంగి మహాలీ సూచించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అయోధ్య కేసు అతి పెద్దది, సున్నితమైనదని, తీర్పును గౌరవించి శాంతిని కాపాడాల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు.

డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ 
అయోధ్యలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 60 కంపెనీల పారా మిలటరీ బలగాలు (ఒక్కో కంపెనీలో 90 – 125 మంది), ఇతర సిబ్బందిని అక్కడ మోహరించారు. పరిస్థితిని డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం సమీక్షిస్తున్నారు. రామజన్మభూమి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేస్తున్నారు.  

శాంతి సమావేశాలు.. 
శాంతిని పరిరక్షించాలని కోరుతూ మీరట్‌ డివిజనల్‌ కమిషనర్‌ అనితా మెష్రామ్‌ హిందు, ముస్లిం వర్గాల మత పెద్దలతో కలెక్టరేట్‌లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవద్దని, రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేయవద్దని కోరారు. నవంబర్‌ 30వ తేదీ వరకు నిరంతరం పనిచేసేలా కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని పాటించాలని పశి్చమ బెంగాల్‌ గవర్నర్‌ జగ్‌దీప్‌ ధంకార్‌ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 

‘అయోధ్య’పై ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టిన వ్యక్తి అరెస్ట్‌
ముంబై: రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనుండగా, దీనిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్‌ను పెట్టిన మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. శ్రీరామ జన్మభూమిపై న్యాయం జరిగిన తర్వాత తాను దీపావళి చేసుకుంటానని, చరిత్రలో నల్లటి మచ్చను ఇది తొలగిస్తుందంటూ ఆగ్రారోడ్డుకు చెందిన సంజయ్‌ రామేశ్వర్‌ శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. భిన్న మతాల మధ్య సామరస్యానికి విఘాతం కలిగించే చర్యగా పరిగణించి సెక్షన్‌ 153 (1), సెక్షన్‌ 188 కింద పోలీసులు అతడ్ని అరెస్ట్‌ చేశారు.  


అయోధ్యను సందర్శించే భక్తులపై నిషేధం లేదు... 
తాత్కాలిక ఆలయం వద్ద బారికేడ్లను పటి ష్టం చేశామని, అయోధ్యను 31 సెక్టార్లు, 35 సబ్‌ సెక్టార్లుగా విభజించి కట్టుదిట్టమైన భద్రత కలి్పంచినట్లు యూపీ ప్రాసిక్యూషన్‌ అదనపు డీజీ అశుతోష్‌ పాండే తెలిపారు. శ్రీరాముడి దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తే బ్యాచ్‌ల వారీగా అనుమతిస్తామని చెప్పారు. అయోధ్యలో భక్తులపై ఎలాంటి నిషేధం లేదన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీస్‌ వర్గాలు వెల్లడించాయి.  

సోషల్‌ మీడియాపై పోలీస్‌ నిఘా 
అయోధ్యపై తుదితీర్పు నేపథ్యంలో మతపరమైన ప్రాంతాల భద్రతకు చర్యలు చేపట్టామని, సోషల్‌ మీడియా పోస్టులు, వాట్సాప్‌లో మత విద్వేషాలను రగిల్చేలా ప్రచారానికి పాల్పడితే జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్‌ వర్గాలు హెచ్చరించాయి. జాతీయ భద్రతా చట్టం(ఎన్‌ఎస్‌ఏ), గ్యాంగ్‌స్టర్‌ చట్టం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని నోయిడా గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లా మేజి్రస్టేట్‌ బీఎన్‌ సింగ్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా నిందితుల ఆస్తులను కూడా స్వాదీనం చేసుకునే వీలుందన్నారు. విభిన్న రకాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో శాంతి సమావేశాలు నిర్వహించి ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించినట్లు చెప్పారు.     

లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లు 
అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఇదే తరహాలో కేంద్ర హోంశాఖ సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించారు. యూపీలో పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు లక్నోలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

హైదరాబాద్‌లో బలగాల మోహరింపు..
గతంలో అయోధ్య ఘటన సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్‌ వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమలుకానున్నాయి. నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా చర్యలు తీసుకోనున్నారు. శనివారమే ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్‌ సైతం ఉండటంతో 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పాక్షికంగా, శనివారం తెల్లవారుజాము నుంచి పూర్తి స్థాయిలో అదనపు బలగాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర హోంశాఖ ఇచి్చన ఆదేశాల ప్రకారం.. ఎక్కడా ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా పోలీసులు పకడ్బందీగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే.. రాష్ట్ర పోలీసు బలగాలకు తోడుగా.. కేంద్రం నుంచి అదనపు బలగాలను తెప్పించే యోచనలో ఉన్నారు.  

తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, వైఫల్యంగానో చూడొద్దు : మోదీ
అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, మరో వర్గం అపజయం గానో పరిగణించవద్దని ప్రధాని మోదీ సూచించారు. శాంతి, సంయమనం పాటించాలని వరుస ట్వీట్లతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఈ తీర్పు ఎలా ఉన్నా.. భారతదేశ ఔన్నత్య ప్రతీకలైన శాంతి, ఐకమత్యం, సద్భావం బలోపేతం కావడమే మన ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఈ తీర్పు ఆ భావనలను మరింత దృఢపర్చాలి’ అని ఆకాంక్షించారు. తీర్పు నేపథ్యంలో సానుకూల, సుహృద్భావ వాతావరణం ఏర్పడేలా పౌరులు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement