Ayodhya Ram temple dispute
-
‘అయోధ్య’ రామయ్యదే..!
-
‘అయోధ్య’ రామయ్యదే..!
న్యాయం, సౌభ్రాతృత్వం, మత విశ్వాసాలపై సమాన గౌరవం తదితర రాజ్యాంగ విలువలు ప్రతిఫలించేలా తీర్పును లిఖించామని భావిస్తున్నాం. 1949, డిసెంబర్ 22 అర్ధరాత్రి రాముడి విగ్రహాలు ఉంచడం, 1992లో మసీదును కూల్చడం.. రెండూ తప్పులే.. ఆ తప్పులను సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అన్ని మత విశ్వాసాలను భారత రాజ్యాంగం సమంగా గౌరవిస్తుంది. సహనం, పరస్పర గౌరవంతో కలిసి మెలిసి జీవించడం ద్వారా భారత లౌకిక భావన మరింత బలోపేతమవుతుంది.-తీర్పు వెలువరించినన్యాయమూర్తులు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా తీర్పు ఎలా ఉంటుందనే ఉత్కంఠ ఒకవంక.. తదనంతర పరిణామాలపై ఆందోళన మరోవంక ఉన్న నేపథ్యంలో... కిక్కిరిసిన కోర్టు హాల్లో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తుది తీర్పును వెలువరించారు. జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ సభ్యులుగా ఉన్న ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ తీర్పును ఏకగ్రీవంగా ప్రకటించింది. 1045 పేజీల తీర్పులోని కీలకాంశాలను జస్టిస్ గొగోయ్ చదివి విన్పించారు. వివాదాస్పద స్థలం శ్రీరాముడి జన్మస్థలమేనన్న హిందువుల అచంచల విశ్వాసాన్ని కొట్టిపారేయలేమని, అలాగే, బాబ్రీ మసీదు కూల్చివేత ద్వారా జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. ‘జరిగిన తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. న్యాయపాలన సాగే లౌకిక దేశంలో మసీదును కోల్పోయిన నష్టానికి ముస్లింలకు తగిన పరిహారం ఇవ్వడాన్ని కోర్టు పట్టించుకోకపోతే న్యాయం జయించినట్లు కాదు’ అని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘ఆ తప్పుకు పరిహారంగా.. అయోధ్యలోనే మసీదు నిర్మాణం కోసం ఐదేకరాల స్థలాన్ని ముస్లింలకు కేటాయించాలి’ అని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆ స్థలాన్ని 1993 నాటి అయోధ్య చట్టం ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ సున్నీ వక్ఫ్ బోర్డ్‌కు అప్పగించాలని సూచించింది. ‘వివాదాస్పద 2.77 ఎకరాల స్థలం కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అ«దీనంలో ఉంటుంది. అనంతరం కేంద్రం నియమించిన ట్రస్ట్‌కు ఆ భూమిని అప్పగిస్తారు. రామ మందిర నిర్మాణాన్ని ఆ ట్రస్ట్ పర్యవేక్షిస్తుంది’ అని ధర్మాసనం వివరించింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు తప్పు వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని నిర్మోహీ అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్, రామ్ లల్లాలకు సమానంగా పంచుతూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పును రాజ్యాంగ ధర్మాసనం తప్పుబట్టింది. ఆ వివాదాస్పద భూమి రెవెన్యూ రికార్డుల్లో ప్రభుత్వ భూమిగా నమోదై ఉందని గుర్తు చేసింది. ‘కూలి్చవేతకు గురైన బాబ్రీమసీదుకు అడుగున తమ తవ్వకాల్లో ఒక హిందూ నిర్మాణ శైలితో ఉన్న నిర్మాణం బయటపడిందని పురావస్తు శాఖ పేర్కొంది. అది ఇస్లామిక్ నిర్మాణంలా లేదు అని కూడా చెప్పింది’ అని వివరించింది. ఐదుగురు జడ్జీలు.. 40 రోజులు 2010నాటి అలహాబాద్ హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకుడు శ్రీశ్రీ రవిశంకర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరాం పంచుల మధ్యవర్తిత్వ కమిటీ కూడా ఈ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. చివరగా, సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం 40 రోజుల పాటు ఏకబిగిన విచారణ జరిపి ఈ అక్టోబర్ 16న తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. తుది తీర్పును శనివారం ప్రకటించింది. ‘హిందూ’ ఆధారాలు మెరుగ్గా ఉన్నాయి.. వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందు వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరు గ్గా ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. ‘1857 లో కంచెను నిర్మించినప్పటికీ.. మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అ«దీనంలో ఉందనేందు కు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో అవధ్ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు’ అని తీర్పులో పేర్కొంది. సివిల్ దావాగానే.. ‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా విచారించలేదు. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు అనే మూడు పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్ వివాదంగానే దీన్ని పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనే విషయాన్నే ప్రాతిపదికగా తీసుకున్నాం. ప్రజల భక్తివిశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పును ఇవ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధారంగానే తీర్పు ప్రకటిస్తున్నాం’ అని ధర్మాసనం తేలి్చచెప్పింది. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమేనని వ్యాఖ్యానించింది. కీలకంగా ‘పురావస్తు’ ఆధారాలు! తీర్పులో భారత పురావస్తు శాఖ (ఏఎస్ఐ) అందించిన ఆధారాలను పరిగణనలోకి తీసుకున్నామని కోర్టు తెలిపింది. ‘పురావస్తు శాఖ అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూల్చివేసి నిర్మించారని ఏఎస్ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఆ నిర్మాణం క్రీ.శ 12వ శతాబ్దంలో నిర్మితమైందని పేర్కొంది. క్రీ.శ 8–10 శతాబ్దాల కాలానికి చెందిన హిందూ పూజా విధానాన్ని చూపే శిథిలాలు గుర్తించింది. అయితే, ఆ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించలేదు’ అని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పు ఇదీ.. ►2.77 ఎకరాల వివాదాస్పద స్థలం మొత్తం రామ మందిర నిర్మాణానికే. ►‘ఈ కేసును నమ్మకం, విశ్వాసాల ప్రాతిపదికగా కాదు.. రామ్‌లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డు అనే 3 పార్టీల మధ్య స్థిరాస్తికి సంబంధించిన సివిల్ వివాదంగా పరిగణించాం. 2.77 ఎకరాల వివాదాస్పద భూమికి వాస్తవ యజమాని ఎవరనేదే ప్రాతిపదికగా తీసుకున్నాం. భక్తి విశ్వాసాలు, నమ్మకాల ఆధారంగా తీర్పునివ్వడం లేదు. సాక్ష్యాధారాలను పరిశీలించి, వాటి ఆధా రంగానే తీర్పు ప్రకటిస్తున్నాం. మసీదు ప్రధాన గుమ్మటం ఉన్న ప్రదేశమే రాముని జన్మస్థలమన్న హిందువుల అచంచల విశ్వాసం నిర్వివాదాంశమే.. ►మసీదు నిర్మాణం కోసం అయోధ్యలోని ప్రముఖ ప్రాంతంలో 5 ఎకరాల స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డుకు అప్పగించాలి. ఆ భూమిని అయోధ్య చట్టం, 1993 ద్వారా సేకరించిన భూమి నుంచి కేంద్ర ప్రభుత్వం కానీ.. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ పరస్పర సంప్రదింపుల ద్వారా అప్పగించాలి. ఈ ఆదేశాలను ఈ కోర్టుకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 142 ద్వారా లభించిన అధికారాల ద్వారా ఇస్తున్నాం. ►రామ జన్మభూమిగా విశ్వసిస్తున్న ప్రదేశంలో రామ మందిర నిర్మాణ బాధ్యతలను చూసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్‌ను ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ సభ్యులను కేంద్రం ఎంపిక చేయాలి. ఇందుకు కేంద్రానికి 3 నెలల గడువు ఇస్తున్నాం. ట్రస్ట్‌లో నిర్మోహి అఖాడాకు సముచిత ప్రాధాన్యత ఇవ్వాలి. ►1857లో కంచెను నిర్మించినప్పటికీ మసీదు బయటి ప్రాంగణంలో హిందువుల పూజలు నిరంతరాయంగా కొనసాగాయని నిర్ధారణ అయింది. ఆ ప్రాంతం హిందువుల అధీనంలో ఉందనేందుకు సాక్ష్యాధారాలున్నాయి. 1857లో ఔధ్ రాజ్యాన్ని బ్రిటిషర్లు స్వా«దీనం చేసుకున్న నాటి ముందు నుంచి ఆ నిర్మాణం లోపలి ప్రాంగణంలోనూ హిందువులు పూజలు చేశారనేందుకే ఎక్కువ ఆధారాలున్నాయి. కాగా, 16వ శతాబ్దంలో నిర్మాణం జరుపుకున్నప్పటి నుంచి 1857 వరకు ఆ మసీదు అంతర్భాగం పూర్తిగా తమ అధీనంలోనే ఉందనేందుకు సరైన ఆధారాలను ముస్లింలు చూపలేకపోయారు. ►ముస్లింలకు ప్రత్యామ్నాయ భూమిని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వివాదాస్పద భూమి తమకే చెందుతుందనేందుకు హిందూ వర్గాలు చూపిన ఆధారాలు.. ముస్లిం వర్గాలు చూపిన ఆధారాల కన్నా మెరుగ్గా ఉన్నాయి. ►పురావస్తు శాఖ(ఏఎస్ఐ) అందించిన ఆధారాలను తేలిగ్గా, కేవలం అభిప్రాయాలుగా కొట్టిపారేయలేం. బాబ్రీ మసీదును ఖాళీ ప్రదేశంలో నిర్మించలేదని, అప్పటికే ఉన్న ఒక హిందూ నిర్మాణాన్ని కూలగొట్టి నిర్మించారని ఏఎస్ఐ చూపిన ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. అయితే, ఆ హిందూ నిర్మాణం హిందువుల దేవాలయమేనని ఆ ఆధారాలు నిర్ధారించడం లేదు. ►వివాదాస్పద ప్రదేశాన్ని మూడు సమాన భాగాలుగా విభజించి, రామ్ లల్లా, నిర్మోహి అఖాడా, సున్నీ వక్ఫ్ బోర్డ్‌లకు అప్పగిస్తూ 2010లో అలహాబాద్ హైకోర్టు ఇచి్చన తీర్పు సరైంది కాదు. భూ యాజమాన్య హక్కులను నిర్ధారించడంలో హైకోర్టు పొరపాటు చేసింది. వివాదాస్పద స్థలంలోని ప్రధాన భాగం 1500 గజాలు. దాన్ని మూడు భాగాలుగా విభజించడం ఆచరణ సాధ్యం కాదు. దీని వల్ల శాంతీ నెలకొనదు. గెలుపోటముల కోణంలో చూడొద్దు.. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పును ఏ ఒక్క వర్గం గెలుపు లేదా ఓటమిగా భావించరాదు. దేశ ప్రజలంతా శాంతి సామరస్యాలతో మైత్రీభావంతో మెలగాలి. రాముడు లేదా రహీం ఎవరిని పూజించే వారైనా సరే అంతకు మించి ప్రతి ఒక్కరూ దేశభక్తి భావాన్ని పెంపొందించుకోవాలి. దశాబ్దాలుగా పరిష్కారం కాని సమస్యకు సుప్రీంకోర్టు సామరస్యపూర్వక పరిష్కారం చూపింది. – ట్విట్టర్లో ప్రధాని మోదీ తీర్పును స్వాగతిస్తున్నాం.. సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం. దీనిపై మరోసారి కోర్టుకు వెళ్లం. ప్రస్తుతానికి తీర్పును క్షుణ్ణంగా పరిశీలిస్తు న్నాం. త్వరలోనే దీనిపై స్పష్టమైన ప్రకటన చేస్తాం. లాయర్ ఎవరైనా తీర్పుపై సవాల్ చేస్తామని చెప్పినప్పటికీ అది సరైంది కాదు. – సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ ఫరూఖీ సుప్రీం తీర్పును గౌరవిస్తాం.. ‘అయోధ్యలో రామాలయం నిర్మాణంపై సానుకూలంగా ఉన్నాం. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తాం. ఈ విషయంతో సంబంధం ఉన్న అన్ని వర్గాలు, వ్యక్తులు తీర్పునకు కట్టుబడి లౌకిక విలువలను పరిరక్షించాలి. రాజ్యాంగంలో పొందుపరిచిన సౌభ్రాతృత్వ భావనకు కట్టుబడి ఉండాలి. ప్రజలంతా శాంతి సామరస్యాలను కాపాడాలి. పరస్పర గౌరవించుకోవడం, ఐకమత్యంతో ఉండటం వంటి మన సంప్రదాయ విలువలను గౌరవిద్దాం’ అని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ అధ్యక్షతన సమావేశమైన పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. కాగా, ‘తీర్పును గౌరవిస్తున్నాం. భారతీయుల సోదరభావానికి, నమ్మకానికి, ప్రేమకు ఇదే సరైన సమయం’ అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. తీర్పును సవాల్ చేయబోం.. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు సంతృప్తి కలిగించింది. ఎన్నో ఏళ్లుగా నలుగుతున్న వివాదానికి సుప్రీంకోర్టు ముగింపు పలకడం సంతోషదాయకం. దీనిని సవాల్ చేస్తూ మళ్లీ కోర్టులో పిటిషన్ వేయబోము. కోర్టు తీర్పు ఏదైనా సరే సరైందేనని మేం నమ్ముతున్నాం. – కక్షిదారు ఇక్బాల్ అన్సారీ -
‘టీవీ డిబేట్లకు దూరంగా ఉండండి’
సాక్షి, న్యూఢిల్లీ : వివాదాస్పద రామజన్మభూమి- బాబ్రీ మసీదు కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో టీవీ డిబేట్లు, బైట్లకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అధికార ప్రతినిధులు, నాయకులకు ఆదేశాలు జారీ చేసింది. అయోధ్య తీర్పుపై ఎటువంటి వ్యాఖ్యలు చేయరాదని సూచించింది. ఇక సున్నిత అంశమైన ఈ తీర్పుపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాతే తాము స్పందిస్తామని ఆ పార్టీ సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. మరోవైపు బీజేపీ అధిష్టానం సైతం టీవీ డిబేట్లకు దూరంగా ఉండాలంటూ అధికార ప్రతినిధులకు ఆదేశాలు జారీచేసింది. ఈ క్రమంలో కేంద్ర హోం మంత్రి, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా పార్టీ అధికార ప్రతినిధులతో అత్యవసరంగా సమావేశమయ్యారు. ఇదిలా ఉండగా అయోధ్య తీర్పు నేపథ్యంలో బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆంధ్రప్రదేశ్ పర్యటనను వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన ఆదివారం రాష్ట్ర పర్యటనకు రానున్నారు. -
‘అయోధ్య’ తీర్పు నేడే
న్యూఢిల్లీ: దశాబ్దాల వివాదానికి నేడు తెరపడనుంది. దేశ రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు కారణమైన జటిల సమస్యకు నేడు పరిష్కారం లభించనుంది. అయోధ్యలోని వివాదాస్పద భూభాగంపై యాజమాన్య హక్కులు ఎవరికి లభిస్తాయో నేడు తేలనుంది. రాజకీయంగా అత్యంత సున్నితమైన అయోధ్యలోని రామ జన్మభూమి– బాబ్రీ మసీదు భూ యాజమాన్య వివాదంపై నేడు తుది తీర్పు వెలువడనుంది. ఉదయం పదిన్నర గంటలకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించనుంది. దీనికి సంబంధించిన నోటీసును శుక్రవారం రాత్రి సుప్రీంకోర్టు వెబ్సైట్లో అప్లోడ్ చేశారు. సుప్రీంకోర్టు చరిత్రలో రికార్డు స్థాయిలో దాదాపు 40 రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ కేసు విచారణ కొనసాగింది. అక్టోబర్ 16న వాదనలు వినడం ముగించిన జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్ఏ నజీర్ కూడా సభ్యులుగా ఉన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని సున్నిత ప్రాంతాల్లో భద్రతా బలగాలను మోహరించారు. యూపీ ఉన్నతాధికారులతో సీజేఐ భేటీ తీర్పు ప్రకటించనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గొగోయ్ ఉత్తరప్రదేశ్ చీఫ్ సెక్రటరీ రాజేంద్ర కుమార్ తివారీ, ఆ రాష్ట్ర డీజీపీ ఓం ప్రకాశ్ సింగ్ లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితిని, తీర్పు నేపథ్యంలో చేపట్టిన భద్రతా చర్యలను వారిని అడిగి తెలుసుకున్నారు. అయోధ్యలోని వివాదాస్పద 2.77 ఎకరాల భూమిని మూడు వర్గాలు సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్‌లల్లాలకు సమానంగా పంచుతూ అలహాబాద్ హైకోర్టు 2010లో తీర్పునిచి్చన విషయం తెలిసిందే. ఆ తీర్పును సవాలు చేస్తూ 14 పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. అయోధ్యలోని రామజన్మభూమి న్యాస్ కార్యశాల వద్ద ప్రార్థనలు చేస్తున్న భక్తురాలు 1950 నుంచీ.. అంతకుముందు, మొదట 1950లో గోపాల్ సింగ్ విశారద్ అనే రామ్‌లల్లా భక్తుడు స్థానిక కోర్టులో వ్యాజ్యం వేశారు. వివాదాస్పద ప్రదేశంలో కొలువైన చిన్నారి రాముడి విగ్రహానికి పూజలు చేసుకునేందుకు హిందువులను అనుమతించాలని కోరుతూ ఆయన పిటిషన్ వేశారు. అదే సంవత్సరం బాబ్రీ మసీదు ప్రధాన గుమ్మటం కిందనే విగ్రహాలను ఉంచి పూజలు చేసుకునేందుకు అనుమతించాలని పరమహంస రామచంద్ర దాస్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అయితే, ఆ తరువాత ఆ పిటిషన్‌ను ఆయన ఉపసంహరించుకున్నారు. 1959లో రామ్‌లల్లాకు భక్తులుగా పూజాదికాలు నిర్వహించేందుకు హక్కులు కోరుతూ నిర్మోహి అఖాడా అదే కోర్టులో వ్యాజ్యం వేసింది. ఆ తరువాత మొత్తం వివాదాస్పద ప్రదేశంపై పూర్తి హక్కులు కోరుతూ 1961లో సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డు కేసు వేసింది. అనంతరం, అక్కడి రామ్‌లల్లా విరాజ్మాన్ విగ్రహం, రామ జన్మభూమి తరఫున అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి దియెకి నందన్ అగర్వాల్ 1989లో ఈ వ్యాజ్యంలో పాలుపంచుకున్నారు. మొత్తం వివాదాస్పద ప్రాంతంపై తమకు(రామ్‌లల్లాకు) యాజమాన్య హక్కులు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. తదనంతర రాజకీయ పరిణామాల నేపథ్యంలో బాబ్రీ మసీదు నిర్మాణం 1992 డిసెంబర్ 6వ తేదీన కూల్చివేతకు గురైంది. దాంతో, దేశవ్యాప్తంగా తీవ్రస్థాయిలో మతకలహాలు చోటు చేసుకున్నాయి. ముగ్గురికి 3 భాగాలు.. ఈ పరిస్థితుల్లో పైన పేర్కొన్న వ్యాజ్యాలన్నీ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యాయి. సుదీర్ఘ వాదనల అనంతరం అలహాబాద్ హైకోర్టు వివాదాస్పద 2.77 ఎకరాల స్థలాన్ని రామ్‌లల్లా, సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడాలకు సమానంగా పంచుతూ 2010లో తీర్పును ప్రకటించింది. ఆ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ తరువాత ఈ సమస్య పరిష్కారానికి ఆధ్యాత్మిక గురు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు పండిట్ శ్రీశ్రీ రవిశంకర్, జస్టిస్ కలీఫుల్లా, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచు సభ్యులుగా ఒక మధ్యవర్తిత్వ కమిటీ ఏర్పడింది. వివిధ వర్గాలతో నాలుగు నెలల పాటు ఆ కమిటీ సంప్రదింపులు జరిపింది. అయినా, అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని కనుగొనలేకపోయింది. అనంతరం, తమ అభిప్రాయాలతో కూడిన ఒక నివేదికను ఈ కేసును విచారిస్తున్న సుప్రీంకోర్టు ధర్మాసనానికి అందజేసింది. ఈ వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ సంవత్సరం ఆగస్టు 6వ తేదీ నుంచి రోజువారీ విచారణను ప్రారంభించింది. అత్యధిక కాలం విచారణ సాగిన కేసుల్లో ఒకటిగా నిలిచిన ఈ కేసు విచారణను చివరకు జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని రాజ్యాంగ ధర్మాసనం అక్టోబర్ 16న ముగించింది. మధ్యవర్తిత్వ కమిటీ ఇచ్చిన నివేదికను సైతం పరిగణనలోకి తీసుకుంది. నవంబర్ 17 వ తేదీన జస్టిస్ గొగోయ్ పదవీ విరమణ చేయనుండటంతో.. ఆ లోపే తీర్పును ప్రకటిస్తారని అంతా భావించారు. చివరకు, నేడు ఆ చరిత్రాత్మక తీర్పు వెలువడనుంది. కాంగ్రెస్ అధిష్టానం భేటీ అయోధ్య తీర్పు నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానం నేడు భేటీ కానుంది. ఆదివారం ఉదయం ఈ భేటీ జరగాల్సి ఉండగా తాజా పరిణామాలతో శనివారమే నిర్వహించనున్నట్లు కాంగ్రెస్ పార్టీ తెలిపింది. ఉదయం 9:45 గంటలకు 10 జనపథ్‌లో ఈ సమావేశం జరగనుందని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. ఇందులో కాంగ్రెస్ కీలక నేతలు సహా ప్రత్యేక ఆహ్వానితులు కూడా ఉన్నారు. తీర్పుపై కాంగ్రెస్ వైఖరి నిర్ణయించుకునేందుకే ఈ భేటీ జరగనున్నట్లు సమాచారం. మరోవైపు సీజేఐ రంజన్ గొగోయ్‌కి జడ్‌ప్లస్ కేటగిరీ భద్రత కలి్పస్తున్నారు. కాగా ‘కోర్టు తీర్పును మనమంతా గౌరవించాలి. సంయమనం పాటించాలి. మత నమ్మకాలను కించపరచవద్దు’ అని లక్నో ఈద్గా ఇమాం మౌలానా ఖలీద్ రషీద్ ఫిరంగి మహాలీ సూచించారు. స్వతంత్ర భారత దేశ చరిత్రలో అయోధ్య కేసు అతి పెద్దది, సున్నితమైనదని, తీర్పును గౌరవించి శాంతిని కాపాడాల్సి బాధ్యత అందరిపైనా ఉందన్నారు. డ్రోన్లు, సీసీ కెమెరాలతో పర్యవేక్షణ అయోధ్యలో బహుళ అంచెల భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశారు. 60 కంపెనీల పారా మిలటరీ బలగాలు (ఒక్కో కంపెనీలో 90 – 125 మంది), ఇతర సిబ్బందిని అక్కడ మోహరించారు. పరిస్థితిని డ్రోన్లు, సీసీ టీవీ కెమెరాల ద్వారా నిరంతరం సమీక్షిస్తున్నారు. రామజన్మభూమి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతి వాహనాన్ని అణువణువూ తనిఖీ చేస్తున్నారు. శాంతి సమావేశాలు.. శాంతిని పరిరక్షించాలని కోరుతూ మీరట్ డివిజనల్ కమిషనర్ అనితా మెష్రామ్ హిందు, ముస్లిం వర్గాల మత పెద్దలతో కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ఎలాంటి నిరసనలు, ప్రదర్శనలు నిర్వహించవద్దని, రెచ్చగొట్టే సందేశాలు ప్రచారం చేయవద్దని కోరారు. నవంబర్ 30వ తేదీ వరకు నిరంతరం పనిచేసేలా కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మత సామరస్యాన్ని పాటించాలని పశి్చమ బెంగాల్ గవర్నర్ జగ్దీప్ ధంకార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘అయోధ్య’పై ఫేస్బుక్లో పోస్ట్ పెట్టిన వ్యక్తి అరెస్ట్ ముంబై: రామ జన్మభూమి, బాబ్రీ మసీదు వివాదంపై సుప్రీంకోర్టు శనివారం తీర్పు వెలువరించనుండగా, దీనిపై ఫేస్బుక్లో అభ్యంతరకర పోస్ట్‌ను పెట్టిన మహారాష్ట్రలోని ధూలే జిల్లాకు చెందిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీరామ జన్మభూమిపై న్యాయం జరిగిన తర్వాత తాను దీపావళి చేసుకుంటానని, చరిత్రలో నల్లటి మచ్చను ఇది తొలగిస్తుందంటూ ఆగ్రారోడ్డుకు చెందిన సంజయ్ రామేశ్వర్ శర్మ తన పోస్ట్‌లో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. భిన్న మతాల మధ్య సామరస్యానికి విఘాతం కలిగించే చర్యగా పరిగణించి సెక్షన్ 153 (1), సెక్షన్ 188 కింద పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు. అయోధ్యను సందర్శించే భక్తులపై నిషేధం లేదు... తాత్కాలిక ఆలయం వద్ద బారికేడ్లను పటి ష్టం చేశామని, అయోధ్యను 31 సెక్టార్లు, 35 సబ్ సెక్టార్లుగా విభజించి కట్టుదిట్టమైన భద్రత కలి్పంచినట్లు యూపీ ప్రాసిక్యూషన్ అదనపు డీజీ అశుతోష్ పాండే తెలిపారు. శ్రీరాముడి దర్శనం కోసం పెద్ద ఎత్తున ప్రజలు తరలివస్తే బ్యాచ్‌ల వారీగా అనుమతిస్తామని చెప్పారు. అయోధ్యలో భక్తులపై ఎలాంటి నిషేధం లేదన్నారు. సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించనున్నట్లు ఢిల్లీ పోలీస్ వర్గాలు వెల్లడించాయి. సోషల్ మీడియాపై పోలీస్ నిఘా అయోధ్యపై తుదితీర్పు నేపథ్యంలో మతపరమైన ప్రాంతాల భద్రతకు చర్యలు చేపట్టామని, సోషల్ మీడియా పోస్టులు, వాట్సాప్‌లో మత విద్వేషాలను రగిల్చేలా ప్రచారానికి పాల్పడితే జైలు శిక్షతోపాటు కఠిన చర్యలు తీసుకుంటామని పోలీస్ వర్గాలు హెచ్చరించాయి. జాతీయ భద్రతా చట్టం(ఎన్ఎస్ఏ), గ్యాంగ్‌స్టర్ చట్టం కింద అరెస్టు చేసి చర్యలు తీసుకుంటామని నోయిడా గౌతమ్‌బుద్ధ నగర్ జిల్లా మేజి్రస్టేట్ బీఎన్ సింగ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ చట్టాల ద్వారా నిందితుల ఆస్తులను కూడా స్వాదీనం చేసుకునే వీలుందన్నారు. విభిన్న రకాల ప్రజలు నివసించే ప్రాంతాల్లో శాంతి సమావేశాలు నిర్వహించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు చెప్పారు. లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లు అత్యవసర సమయాల్లో వినియోగించేందుకు లక్నో, అయోధ్యలో రెండు హెలికాప్టర్లను సిద్ధంగా ఉంచినట్లు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. గురువారం అర్ధరాత్రి సమయంలో ఉన్నతాధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇదే తరహాలో కేంద్ర హోంశాఖ సూచనల నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో సమీక్షలు నిర్వహించారు. యూపీలో పరిస్థితిని నిరంతరం పరిశీలించేందుకు లక్నోలో కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. హైదరాబాద్‌లో బలగాల మోహరింపు.. గతంలో అయోధ్య ఘటన సమయంలో తలెత్తిన పరిస్థితుల దృష్ట్యా హైదరాబాద్ వ్యాప్తంగా నిఘా, గస్తీ ముమ్మరం చేశారు. పాతబస్తీ, పరిసర ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. రాజధానిలోని మూడు కమిషనరేట్ల పరిధిలో అప్రకటిత నిషేధాజ్ఞలు అమలుకానున్నాయి. నలుగురి కంటే ఎక్కువ మంది ఒకచోట గుమికూడకుండా చర్యలు తీసుకోనున్నారు. శనివారమే ఆర్టీసీ జేఏసీ చలో ట్యాంక్‌బండ్ సైతం ఉండటంతో 20 వేల మందితో బందోబస్తు ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. శుక్రవారం రాత్రి నుంచి పాక్షికంగా, శనివారం తెల్లవారుజాము నుంచి పూర్తి స్థాయిలో అదనపు బలగాలు అందుబాటులోకి వస్తాయి. కేంద్ర నిఘా సంస్థలు, కేంద్ర హోంశాఖ ఇచి్చన ఆదేశాల ప్రకారం.. ఎక్కడా ఎలాంటి చిన్న ఘటన కూడా జరగకుండా పోలీసులు పకడ్బందీగా, కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. అవసరమైతే.. రాష్ట్ర పోలీసు బలగాలకు తోడుగా.. కేంద్రం నుంచి అదనపు బలగాలను తెప్పించే యోచనలో ఉన్నారు. తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, వైఫల్యంగానో చూడొద్దు : మోదీ అయోధ్య వివాదంపై సుప్రీంకోర్టు తీర్పును ఏ ఒక్క వర్గం విజయంగానో, మరో వర్గం అపజయం గానో పరిగణించవద్దని ప్రధాని మోదీ సూచించారు. శాంతి, సంయమనం పాటించాలని వరుస ట్వీట్లతో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఈ తీర్పు ఎలా ఉన్నా.. భారతదేశ ఔన్నత్య ప్రతీకలైన శాంతి, ఐకమత్యం, సద్భావం బలోపేతం కావడమే మన ప్రథమ ప్రాధాన్యం కావాలి. ఈ తీర్పు ఆ భావనలను మరింత దృఢపర్చాలి’ అని ఆకాంక్షించారు. తీర్పు నేపథ్యంలో సానుకూల, సుహృద్భావ వాతావరణం ఏర్పడేలా పౌరులు, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కొన్ని రోజులుగా కృషి చేస్తున్నాయని ప్రశంసించారు. -
యూపీ అధికారులతో సమావేశం కానున్న సీజేఐ
న్యూఢిల్లీ : అయోధ్య వివాదంపై త్వరలో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనున్న నేపథ్యంలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే అన్నివర్గాలు అయోధ్య తీర్పుపై ఎలాంటి వివాదస్పద వ్యాఖ్యలు చేయరాదని తమ శ్రేణులను ఆదేశించాయి. అలాగే యూపీ ప్రభుత్వం కూడా అయోధ్యలో భారీగా భద్రత చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్.. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజేంద్రకుమార్ తివారీ, డీజీపీ ఓం ప్రకాశ్‌సింగ్‌లతో శుక్రవారం సమావేశం కానున్నట్టుగా సమాచారం. అయోధ్యపై సుప్రీం తీర్పు నేపథ్యంలో యూపీలోని శాంతి భద్రతలపై ఆయన వారితో సమీక్ష చేపట్టనున్నారు. సీజేఐ చాంబర్లో ఈ సమావేశం జరగనున్నట్టుగా తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా గత రాత్రి పోలీసు ఉన్నతాధికారులు, జిల్లా న్యాయమూర్తులు, ఇతర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో శాంతి భద్రతలపై సమీక్ష నిర్వహించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు లక్నో, అయోధ్యలలో హెలికాఫ్టర్లు అందుబాటులో ఉండనున్నట్టు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. మరోవైపు కేంద్రం కూడా.. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో భద్రతను పెంచాలని, అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది. అదేవిధంగా, యూపీ ప్రభ్తుత్వం కూడా తీర్పు అనంతరం ఉత్సవాలను జరుపుకోవడం, నిరసన తెలపడం వంటి వాటిపై నిషేధం విధించింది. కాగా, అయోధ్య కేసుకు సంబంధించి సీజేఐ జస్టిస్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ముందు హిందు, ముస్లిం వర్గాల తరఫు లాయర్లు 40 రోజులు వరుసగా తమ వాదనలు వినిపించారు. అక్టోబర్ 16వ తేదీన తుది వాదనలు వినడం ముగించిన రాజ్యాంగ ధర్మాసనం.. తీర్పును రిజర్వులో ఉంచింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ కేసులో తీర్పును జస్టిస్ గొగొయ్ పదవీ విరమణ చేయనున్న నవంబర్ 17లోపు ప్రకటించే అవకాశముంది. -
‘నవంబర్ 17నాటికి మందిర నిర్మాణం పూర్తి’
జైపూర్: అయోధ్య రామ జన్మభూమి వివాదం ఏళ్లుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాజస్తాన్ బీజేపీ ఎమ్మెల్యే జ్ఞాన్‌చంద్ పరాఖ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది నవంబర్ 17నాటికి రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని ఆయన పేర్కొన్నారు. పాలిలో నిర్వహించిన రామ్‌లీలా కార్యక్రమానికి జ్ఞాన్‌చంద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అయోధ్య వివాదంలో అక్టోబర్ 17నాటికి సుప్రీం కోర్టు తన తీర్పును వెల్లడిస్తుంది. ఆ వెంటనే మందిర నిర్మాణం పనులు ప్రారంభమవుతాయి. నవంబర్ 17నాటికి రామజన్మభూమిలో మందిర నిర్మాణం పూర్తవుతుంది. దాంతో ఈ ఏడాది చాలా అద్భుతంగా ముగుస్తుంది’ అన్నారు. జ్ఞాన్‌చంద్ వ్యాఖ్యలు ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి. ఏళ్లుగా నడుస్తున్న అయోధ్య స్థల వివాదం విచారణను ఈ నెల 17నాటి కల్లా ముగించేయనున్నట్లు సుప్రీం కోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా అయోధ్య వివాదంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రామ జన్మభూమి వివాదంలో త్వరలోనే శుభవార్త వినబోతామని పేర్కొన్నారు. ‘మనం రాముడి భక్తులము. భక్తికి ఎంతో శక్తి ఉంది. రాముడికి సంబంధించి త్వరలోనే శుభవార్త వింటామని’ ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. అయితే యోగి వ్యాఖ్యలపై విపక్షాలు మండి పడ్డాయి. ఈ క్రమంలో అఖిలేష్ యాదవ్ కోర్టు పరిధిలో ఉన్న అంశం మీద ఎలాంటి తీర్పు రాబోతుందో యోగికి ముందే ఎలా తెలిసింది అని ఆయన ప్రశ్నించారు. -
‘నవంబర్ నుంచి మందిర్ నిర్మాణం’
లక్నో : అయోధ్యలో రామ మందిర నిర్మాణం నవంబర్ నుంచి ప్రారంభమవుతుందని బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి పేర్కొన్నారు. సుప్రీం కోర్టులో సాగుతున్న రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదంలో రామాలయానికి అనుగుణంగా సర్వోన్నత న్యాయస్ధానం నిర్ణయం వెలువడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రార్ధించే హక్కు పౌరులకు రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కన్న స్వామి దీన్ని నిరాకరించే అధికారం ఎవరికీ లేదన్నారు. రామజన్మభూమిలో రామ మందిరాన్ని ఎవరూ తొలగించలేరని స్పష్టం చేశారు. సుబ్రహ్మణ్యస్వామి తన జన్మదినం సందర్భంగా శనివారం అయోధ్యకు చేరుకున్నారు. కాగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అయోధ్యలో మందిర నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఎన్డీఏ భాగస్వామ్య పక్షం శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే కోరిన నేపథ్యంలో బీజేపీ నేత ఈ వ్యాఖ్యలు చేయడంగమనార్హం. ఆర్టికల్ 370 రద్దు అనంతరం రామ మందిర నిర్మాణానికి సమయం ఆసన్నమైందని, ఉమ్మడి పౌరస్మృతిపైనా ఓ నిర్ణయం తీసుకోవాలని ఉద్ధవ్ థాకరే కేంద్రాన్ని కోరారు. -
‘అయోధ్య’ పరిష్కారానికి మధ్యవర్తిత్వం
అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదం కేసు మరో కీలక మలుపు తిరిగింది. ఈ అంశంపై మార్చి 5న తుది నిర్ణయం వెలువరించనున్నట్లు పేర్కొంది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూవివాదంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదం కేసు మరో కీలక మలుపు తిరిగింది. రాజకీయంగా అత్యంత సున్నితమైన ఈ అంశాన్ని మధ్యవర్తిత్వం ద్వారా సామరస్య పూర్వకంగా పరిష్కరించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. దీనిపై మార్చి 5వ తేదీ న తుది నిర్ణయం వెలువరించనున్నట్లు పేర్కొం ది. రామజన్మభూమి– బాబ్రీ మసీదు భూ వివాదంపై దాఖలైన పిటిషన్లపై మంగళవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. ‘ఈ సమస్యకు మధ్యవర్తిత్వంతో పరిష్కారం దొరికే అవకాశం ఒక్క శాతం మేర ఉన్నా ఆ పని చేసేందుకు సిద్ధంగా ఉన్నాం. ఈ వివాదానికి ముగింపు పలకడం ద్వారా సమాజంలో సంబంధాలు మెరుగవుతాయని ఆశిస్తున్నాం. ఈ కేసుకు సం బంధించిన అన్ని పత్రాలను ఆరు వారాల్లోగా తర్జుమా చేయాలని రిజిస్ట్రీని ఆదేశిస్తున్నాం. 8 వారాల తర్వాత ఈ అంశంపై వాదనలు ప్రారంభిస్తాం’అని ధర్మాసనం పేర్కొంది. ఆలోగా ఇరుపక్షాల వారు తర్జుమా చేసిన పత్రాలను క్షుణ్నంగా పరిశీలించి, అవసరమైతే అభ్యంతరాలను వ్యక్తపరచవచ్చని తెలిపింది. ఈ ఎనిమిది వారాల సమయంలో మధ్యవర్తిని నియమించేందుకు గల అవకాశాలను పరిశీలిస్తామని వివరించింది. అయితే, మధ్యవర్తిత్వా న్ని కొన్ని ముస్లిం సంస్థలు సానుకూలత తెలుపగా రామ్‌లల్లా సంస్థ వ్యతిరేకించింది. తర్జుమాకు కనీసం నాలుగు నెలలు ఈ సందర్భంగా సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ అయోధ్య భూ వివాదానికి సంబంధించిన పత్రాలపై ధర్మాసనానికి ఒక నివేదిక సమర్పించారు. దీని ప్రకారం.. అయోధ్య భూ వివాదంపై అలహాబాద్ హైకోర్టు తీర్పుతోపాటు ఇతర దస్త్రాలన్నీ కలిపి 15 ట్రంకుపెట్టెల్లో భద్రపరిచి ఉన్నాయి. ఇవి మొత్తం 38,147 పేజీలు కాగా, అందులో 12,814 పేజీలు హిందీలోను, 18,607 పేజీలు ఇంగ్లిష్‌లో, 501 పేజీలు ఉర్దూ, 97 పేజీలు పంజాబీ, 21 పేజీలు సంస్కృతం, 86 పేజీలు ఇతర భాషల్లో ఉన్నాయి. 14 పేజీల్లో చిత్రాలు, 1,729 పేజీల్లో ఒకటి కంటే ఎక్కువ భాషలున్నాయి. ఇందులో ఇంగ్లిష్‌లోని 11,479 పేజీలను 16 భాషల్లోకి తర్జుమా చేయాల్సి ఉండగా వీటి కోసం అందుబాటులో ఉన్న 8 మంది అనువాదకులను పురమాయించినా పని పూర్తయ్యేందుకు 120 రోజుల సమయం పడుతుందని సెక్రటరీ జనరల్ వివరించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే మొదలైందని, వాటిపై ఇరుపక్షాలు ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని పేర్కొన్నారు. అయితే, తాము యూపీ ప్రభుత్వం సమర్పించిన పత్రాలను చదవలేదని వాస్తవ కక్షిదారు ఎం.సిద్దిఖి తరఫు న్యాయవాది రాజీవ్ ధావన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన ధర్మాసనం.. దస్త్రౠల తర్జుమాపై అన్ని పక్షాలు సానుకూలత వ్యక్తం చేస్తేనే విచారణ ప్రారంభిస్తామని తెలిపింది. ఒకసారి విచారణ మొదలయ్యాక తర్జుమాపై అభ్యంతరాలు వ్యక్తం చేయడం కుదరదని పేర్కొంది. మధ్యవర్తిత్వంపై భిన్నాభిప్రాయం అయోధ్య వివాద పరిష్కారానికి మధ్యవర్తిని నియమించాలన్న అత్యున్నత న్యాయస్థానం నిర్ణయంపై కొన్ని ముస్లిం సంస్థలు సానుకూలంగా స్పందించాయి. అయితే, గతంలో ఇలాంటివి విఫలమయ్యాయని, మళ్లీ మధ్యవర్తిత్వం వద్దంటూ రామ్‌లల్లా విరాజమాన్ సంస్థ అభ్యంతరం వ్యక్తం చేసింది. అత్యంత సున్నితమైన ఈ అంశం తాము నియ మించే మధ్యవర్తి సాయంతో పరిష్కారమయ్యే ఒక్క శాతం అవకాశమున్నా వదులుకోబోమని తెలిపిన ధర్మాసనం..అందుకు గల అవకాశాలుంటే తెలపాలని ఆయా పక్షాలను కోరింది. ‘ఇన్నేళ్లుగా నలుగుతున్న ఈ వ్యవహారం కేవలం ఆస్తి తగాదాయేనని మీరు నిజంగా అనుకుంటున్నారా? ఆ ఆస్తిపై ఎవరికి హక్కులుంటాయనేది నిర్ణయించడంతోపాటు ఆ సమస్యకు సామరస్యపూర్వక పరిష్కారం చూపేందుకు గల అవకాశాలను కూడా పరిశీలిస్తున్నాం’అని ధర్మాసనం వివరించింది. ఈ రాజ్యాంగ ధర్మాసనంలో ప్రధాన న్యాయమూర్తితోపాటు జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్‌భూషణ్, జస్టిస్ ఎస్.అబ్దుల్ నజీర్‌లు సభ్యులుగా ఉన్నారు. అయోధ్యలో 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహి అఖాడా, రామ్ లల్లా సంస్థలకు సమానంగా పంచాలంటూ 2010లో అలహాబాద్ హైకోర్టు వెలువరించిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి. -
‘బాబర్నేందుకు పూజించాలి..?’
లక్నో : రామ జన్మభూమి వివాదం పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా సుప్రీంకోర్టును కోరతనంటున్నారు కేంద్ర మంత్రి రవి శంకర్ ప్రసాద్. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అయోధ్య వివాదం ఎప్పటినుంచో కొనసాగుతుంది. ఈ సమస్యను త్వరగా పరిష్కరించాలి. ఇందుకుగాను నేను సుప్రీం కోర్టును కలిశి.. సమస్య పరిష్కారం కోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాల్సిందిగా కోరతానని తెలిపారు. శబరిమల ఆలయం కేసులో సుప్రీం కోర్టు చాలా త్వరగా తీర్పు చెప్పింది. మరి 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న రామ జన్మభూమి కేసు విషయంలో మాత్రం ఎందుకు ఆలస్యం చేస్తోందని ప్రశ్నించారు. ఈ సందర్భంగా రాజ్యాంగాన్ని చూపిస్తూ.. దీనిలో రాముని గురించి ఉంది, కృష్ణుని గురించి ఉంది ఆఖరుకి అక్బర్ గురించి కూడా ఉంది. కానీ బాబర్ గురించి మాత్రం ఎక్కడా చెప్పలేదు. అలాంటప్పుడు మేమేందుకు బాబర్‌ను పూజించాలని ప్రశ్నించారు. అయితే ఇలాంటి విషయాలు మాట్లాడితే.. వేరే రకమైన వివాదాలు తలెత్తుతాయన్నారు. -
మందిర్ వివాదం: బీజేపీకి సేన అల్టిమేటం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌తో ముందుకు రావాలని, మందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని శివసేన శుక్రవారం బీజేపీని డిమాండ్ చేసింది. రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన శివసైనికులను చూసి పాలకులు గర్వపడాలని బీజేపీని దుయ్యబడుతూ వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో రాముడి పేరిట తాము ఓట్లను అభ్యర్ధించమని సామ్నా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కోరుతూ నవంబర్ 25న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తమకు తాము హిందుత్వ ప్రతినిధులమని చెప్పుకునే వారు తాము అయోధ్య యాత్రను చేపడుతున్నామని ప్రకటిస్తే ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారని శివసేన ప్రశ్నించింది. తాము రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లడం లేదని సంపాదకీయంలో పేర్కొంది. తమ పార్టీ ‘ఛలో అయోధ్య’ పిలుపు ఇవ్వలేదని, అయితే రాముడి దర్శనం కోసం శివసైనికులు వెళుతున్నారని, అయోధ్య ఏ ఒక్కరి ప్రైవేటు ప్రాంతం కాదని స్పష్టం చేసింది. మందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటనతో ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమవుతుందని, ప్రగల్బాలు పలికిన నేతలు నాలుకలు కోల్పోతారని సామ్నా సంపాదకీయం హెచ్చరించింది. -
అసలు లక్ష్యం అయోధ్యేనా?
ప్రజలను మతపరంగా చీల్చే సాంప్రదాయిక ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని రగుల్కొల్పే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ’అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని, ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడద’ని అమిత్ షా చేసిన ప్రకటన కేరళకే పరిమితం అవుతుందా? అమిత్ షా సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు సుప్రీంకోర్టు తుది తీర్పు ఇవ్వబోతున్న అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. రాజ్యసభ సభ్యుడిగా 2017 ఆగస్టు నెలలో తన ప్రమాణస్వీకారోత్సవంలో భాగంగా అమిత్ షా చేసిన ప్రమాణంలో ఇది కొంత భాగం: ‘అమిత్ షా అనే నేను.. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని’. కానీ గత శనివారం కేరళలోని కన్నూర్‌లో, శబరిమలలో కొనసాగుతున్న ఆందోళనల నేపథ్యంలో అమిత్ షానే మాట్లాడుతూ, ప్రభుత్వాలు, న్యాయస్థానాలు ‘అమలు చేయదగిన తీర్పులనే ఇవ్వాలని’ సూచిస్తూ మరికాస్త జోడించారు. అదేమిటంటే, ‘ప్రజల విశ్వాసాలను వమ్ము చేసే తీర్పులను, ఆదేశాలను అవి జారీ చేయకూడదు’. బీజేపీ అధ్యక్షుడు ఈ భిన్న ప్రకటనల ద్వారా తన్ను తాను ఖండించుకుంటున్నారా? విశ్వాసాలతో, మతంతో ముడిపడివున్న సున్నితమైన అంశాలకు సంబంధించి భారత రాజ్యాంగం విధించిన శాసనాలకు కోర్టులు పూర్తిగా కట్టుబడకూడదని ఆయన సూచిస్తున్నారా? మనుషులందరినీ లింగ భేదం లేకుండా సమాన దృష్టితో చూడటానికి బదులుగా, శబరిమల ఉదంతంలో ప్రజల విశ్వాసం, సున్నితమైన మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాలన్నదే అమిత్ షా అభిమతమా? శబరిమల ఆందోళనకారులకు పూర్తి మద్దతు ఇస్తూ, బీజేపీ కార్యకర్తలు వారికి అన్ని విధాలా అండదండలుగా ఉంటున్న వైనం గమనిస్తే ఈ అంశంలో బీజేపీ వైఖరి ఆశ్చర్యం కలిగించదు. అక్టోబర్‌లో అయిదురోజులపాటు అయ్యప్ప మందిరాన్ని తెరిచి ఉంచినప్పుడు, 10 నుంచి 50 సంవత్సరాలలోపు వయసున్న మహిళలను ఆలయ సందర్శనకు అనుమతించబోమని బీజేపీ కార్యకర్తలు తేల్చిచెప్పారు. వయసు, లింగభేదంతో పనిలేకుండా ప్రతి భక్తుడిని, భక్తురాలినీ అయ్యప్ప ఆలయ సందర్శనకు అనుమతించాలంటూ సెప్టెంబర్ 28న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినప్పటికీ బీజేపీ కార్యకర్తలు దానికి తలొగ్గలేదు. శబరిమలలో అయ్యప్ప స్వామి నైష్టిక బ్రహ్మచారి అని పేర్కొంటూ, శతాబ్దాలుగా అయ్యప్పను సందర్శించడానికి రుతుక్రమంలోకి వచ్చిన ఆడవారిని అనుమతించడం లేదు. కానీ మహిళా ఉద్యమ కార్యకర్తలు మాత్రం దీన్ని వివక్షాపూరితమైనదిగానూ, పితృస్వామిక చర్యగానూ చూస్తున్నారు. ఈ అంశంలో బీజేపీ చేస్తున్నదేమిటంటే, అయిదుగురు జడ్జీలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కంటే అయ్యప్ప స్వామిని అత్యున్నతంగా భావిస్తున్న భక్తులకు బాసటగా నిలబడటమే. అయ్యప్ప ఎలాంటి శాసనాధికారానికైనా అతీతమైనవాడని వీరు చెబుతున్నారు. అమిత్ షా కూడా దీనికి వంతపాడుతూ ‘తమ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలని చూస్తున్న’ భక్తుల పక్షాన తమ పార్టీ గట్టిగా నిలబడుతుందని చెప్పారు. కేరళలో రాజకీయ పునాదిని బలపర్చుకునే లక్ష్యంతోనే బీజేపీ–ఆరెస్సెస్ శక్తులు అయ్యప్ప ఉదంతంపై అలాంటి వైఖరిని ప్రదర్శిస్తున్నాయన్నది జగమెరిగిన సత్యమే. బీజేపీని ఆదరించి, అక్కున చేర్చుకోవడానికి కేరళ ఓటర్లు ఇంతవరకు అవకాశం ఇవ్వలేదు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంత అధికంగా 5,000 ఆరెస్సెస్ శాఖలు కేరళలో ఉన్నప్పటికీ కేరళ అసెంబ్లీలో బీజేపీ ఇంతవరకు ఒక్క స్థానం మాత్రమే గెల్చుకుంది. ఆ పార్టీ అభ్యర్థి ఒ. రాజగోపాల్ 2016 శాసనసభ ఎన్నికల్లో గెలుపొందారు. ఆ రాష్ట్రం నుంచి బీజేపీ ఇంతవరకు ఒక్క ఎంపీ స్థానాన్నీ గెలుపొందలేదు. ఎల్డీఎఫ్ వర్సెస్ యూడీఎఫ్ కూటముల మధ్య చీలిపోయిన కేరళలో రాజకీయాల్లో, బలమైన మూడో పక్షంగా బీజేపీ ఇంతవరకు ఆవిర్భ వించలేకపోయింది. కేరళలో రాజకీయంగా బలపడటానికి ప్రస్తుత మార్గమే సరైనదని బీజేపీ పసిగట్టింది. ఇంతవరకు ఎల్డీఎఫ్ కూటమికి సాంప్రదాయికంగా ఓటేస్తున్న అధిక సంఖ్యాకులైన హిందూ ఓటర్లకు బీజేపీ ఇప్పుడు చెబుతున్నది ఏమిటంటే, హిందువుల లక్ష్యసాధనకు, ఆగ్రహ ప్రదర్శనకు, ఆందోళనలకు బీజేపీ శిబిరం ఇప్పుడు అందుబాటులో ఉన్నదనే. గొడ్డు మాంసం వాడకం, లవ్ జిహాద్, మహాబలి చక్రవర్తి జయంతికి బదులుగా ఓనమ్ పండుగ రోజున వామన జయంతి గురించి మాట్లాడటం వంటి అంశాలపై ఆరెస్సెస్ శాఖలు.. ప్రజలను మతపరంగా చీల్చే ధోరణి నుంచి బయటకు వచ్చి.. భక్తి, విశ్వాసాలకు సంబంధించిన మరింత ప్రాథమిక ప్రశ్నలను లేవనెత్తి వాటిని ప్రేరేపించే అవకాశాన్ని శబరిమల ఉదంతం బీజేపీకి చక్కగా అందించింది. శబరిమల సమస్య కేరళ రాష్ట్ర వ్యాప్త సమస్యగా మారనుందని బీజేపీ సరిగ్గానే గుర్తించింది. అందుకే హిందూ మలయాళీ ఓటు బ్యాంకును ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. అదే సమయంలో దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా శబరిమలకు అయ్యప్ప భక్తులు పోటెత్తుతున్న నేపథ్యంలో కేరళ సరిహద్దులకు అవతల కూడా తనకు తలుపులు తెరుచుకునే అవకాశం ఉన్నట్లు బీజేపీకి స్పష్టమైంది. లడ్డులాగా దొరికిన ఈ అవకాశాన్ని బీజేపీ వదులుకోవడానికి సిద్ధపడదు కూడా. కానీ కేరళపై, భారత రాజకీయాలపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? బీజేపీ వ్యూహాన్ని పసిగట్టిన కేరళ కాంగ్రెస్.. సుప్రీంకోర్టు తీర్పును ఆహ్వాని స్తున్న తమ జాతీయ నాయకత్వం పం«థాకు కట్టుబడితే హిందూ ఓటును కొల్లగొట్టనున్న బీజేపీ ముందు తాను ప్రేక్షకుడిలా చూస్తుండిపోవలసిం దేనని గ్రహించింది. వామపక్ష కూటమి పట్టులో ఉన్న హిందూ నియోజకవర్గాలను తన గుప్పిట్లోకి తీసుకోవాలని కూడా కేరళ కాంగ్రెస్ ఆలోచిస్తోంది. దీన్ని అవకాశవాద బేరసారాలుగా విమర్శలు వస్తున్నప్పటికీ అది లెక్కచేయడం లేదు. ఇక కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ మాత్రం కోర్టు తీర్పును అమలుచేయడమే తన ప్రభుత్వ ధర్మమనే వైఖరిని చేపట్టారు. పైగా, ఆలయంలోకి మహిళలందరినీ అనుమతించాలని ఆయన ప్రభుత్వం తొలినుంచి వాదిస్తోంది. అయితే మహిళా భక్తులను ప్రభుత్వ, ప్రైవేట్ వాహనాల నుంచి దింపేయడం, నిషిద్ధ వయస్సులోని ఆడవారు అయ్యప్ప ఆలయంవైపు పయనిస్తుంటే వారిని వెదికి మరీ దింపేయడం వంటి ఘటనలతో వామపక్ష కూటమిలోనే కొంతమందిలో సందేహాలు నెలకొన్నాయి. దేవాదాయ మంత్రి కె సురేంద్రన్ సైతం డైలమాలో పడ్డారు. ఆలయం అనేది కార్యకర్తల బలప్రయోగ వేదిక కాదని కూడా ఆయన ప్రకటించారు. మరోవైపున రాజకీయాలతో సంబంధం లేని హిందూ మలయాళీలు అయితే శబరిమలపై జరుగుతున్న దాడిని చూసి అసౌకర్యంగా భావిస్తున్నారు. ఆలయ సందర్శనకు వస్తున్న మహిళలకు వేలాది పోలీసులు రక్షణగా రావడం చాలామంది సాంప్రదాయిక భక్తులను బాధించింది. ఇక అయ్యప్ప భక్తుల విషయానికి వస్తే ఆచారాన్ని అతిక్రమించి ఆలయ సందర్శనకు వచ్చే ప్రతి మహిళా అయ్యప్ప స్ఫూర్తిని ధిక్కరిస్తున్నట్లే భావిస్తున్నారు. అయితే ప్రదర్శనకారులు హింసకు దిగడం మాత్రం నిస్సందేహంగానే తప్పు. 3,500 మంది నిరసనకారులు ఇంతవరకు అరెస్టయ్యారు. కోర్టు తీర్పుపై వ్యతిరేకతను సహించబోనని, నవంబర్ మధ్యలో తిరిగి తెరుచుకునే అయప్ప ఆలయాన్ని హింసకు దూరంగా ఉంచుతానని ప్రభుత్వం ప్రకటిస్తోంది. మరోవైపున ఈ తరహా అరెస్టులు బీజేపీకి ఊపిరి పోస్తున్నాయి. అయ్యప్ప భక్తుల విశ్వాసాలను అణచివేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగిస్తోందంటూ అమిత్ షా నిందించారు. ఒకవైపున ధర్మానికీ, విశ్వాసానికీ, భక్తికీ మరోవైపున కేరళ ప్రభుత్వ అణచివేతకు మధ్య పోరాటంగా శబరిమల ఉదంతాన్ని వర్ణిస్తూ షా ట్వీట్ చేశారు కూడా. వామపక్ష ప్రభుత్వాన్ని అయ్యప్ప, హిందూ వ్యతిరేక సంఘటనగా చిత్రించడమే దీని లక్ష్యం. నవంబర్‌లో అమిత్ షా స్వయంగా శబరిమల యాత్రను చేపట్టే అవకాశం కనిపిస్తుండటంతో ఇది కేరళలో మరిన్ని ఘర్షణలకు తావీయవచ్చు కూడా. నిస్సందేహంగానే, 2019లో కేరళ ఎన్నికల్లో శబరిమల అత్యంత ప్రధాన సమస్యగా మారనుంది. ఇటీవలి కేరళ వరదలను నివారించడంలో పినరయి విజయన్ సమర్థత పక్కకు వెళ్లి, ఎన్నికల నాటికి మతం, విశ్వాసం కీలక పాత్ర వహించనున్నాయి. బీజేపీ రాజకీయ క్రీడను గ్రహించిన వామపక్ష కూటమి ఎదురుదెబ్బ తీయడం మొదలెట్టింది. శబరిమలలో జరిగిన గొడవలన్నింటికీ స్వార్థ రాజకీయ ప్రయోజనాలే కారణమని ఎల్డీఎఫ్ విశ్వసిస్తోంది. అయ్యప్ప ఆలయం సమీపంలోకి నవంబర్‌లో మహిళలను అనుమతించడం సాధ్యపడగానే పరిణామాలు కుదురుకుంటాయని కూటమి భావిస్తోంది. శబరిమల పేరిట సమాజంలో చీలికలకు నారాయణ గురు వంటి సాంఘిక సంస్కర్తలు పుట్టిన కేరళ గడ్డ అనుమతించదని ప్రభుత్వం నమ్ముతోంది. శబరిమలలో విశ్వాసాలను ముందుకు తెస్తున్న బీజేపీ ట్రిఫుల్ తలాక్‌ని కూడా విశ్వాసాలకు సంబంధించిన సమస్యగా ఎందుకు చూడదని ప్రశ్న. లైంగిక సమానత్వం పేరిట ముస్లిం మహిళల గురించి మోదీ, షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు, అయ్యప్ప భక్తులైన హిందూ మహిళల విషయంలో ఆ మద్దతును వారు ఎందుకు ఇవ్వరు అనే ప్రశ్న తలెత్తకమానదు. రాజకీయ ప్రయోజనాల ప్రాతిపదికనే బీజేపీ లైంగిక న్యాయం ప్రదర్శితమవుతుందన్న వాదన కూడా ఇప్పటికే మొదలైంది. అయోధ్యపై తీర్పు కూడా తమకు వ్యతిరేకంగా వస్తే మత ఛాందస వాదులు ఎలా స్పందిస్తారు అనేందుకు షా ప్రస్తుత వైఖరిని ఉదాహరణగా చాలామంది చూస్తున్నారు. ముస్లిం సంస్థలు ఇప్పటికే ఈ కేసుపై పోరాడుతుండగా, అయోధ్యలో రాముడు జన్మించాడు అనే విశ్వాసం ప్రాతిపదికన హిందూ ప్రజానీకం వివాదాన్ని ప్రేరేపించక మానదు. దక్షిణ భారతదేశం మొత్తంలో బీజేపీకి శబరిమల ఒక ఆలయ సమస్యను నిక్షేపంగా అందించనుంది. అయితే ప్రజల విశ్వాసాన్ని వమ్ముచేసే చట్టపరమైన తీర్పులను కోర్టులు ఇవ్వకూడదంటూ అమిత్ షా చేస్తున్న సూచన శబరిమల విషయంలోనే కాకుండా రేపు అయోధ్య విషయంలోనూ వర్తించబోతున్నదా? అన్నదే అన్నిటికంటే పెద్ద ప్రశ్న. వ్యాసకర్త: టీఎస్ సుధీర్, సీనియర్ జర్నలిస్టు, tssmedia10@gmail.com -
‘వారిద్దరు కలియుగ కైకేయిలాంటి వారు’
న్యూఢిల్లీ : బీజేపీ, ఆర్ఎస్ఎస్ రెండు కలియుగ కైకేయిలాంటి వారు. కేవలం ఎలక్షన్ల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు అంటూ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాన్‌దీప్ సుర్జేవాలా మండిపడ్డారు. ఇందుకు కారణం రెండు రోజుల క్రితం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ‘ఆర్ఎస్ఎస్, బీజేపీ రెండు కూడా అయెధ్యలో రామ మందిర నిర్మాణానికి కట్టుబడి ఉన్నాయని.. దీన్ని ప్రతిపక్ష పార్టీలు కూడా దీన్ని వ్యతిరేకించలేరం’టూ పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత సుర్జేవాలా స్పందిస్తూ.. ‘సత్య యుగంలో కైకేయి కేవలం 14 సంవత్సరాలు మాత్రమే రామున్ని రాజ్య బహిష్కరణ చేసింది. కానీ నేటి కలియుగ కైకేయి అయిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు మాత్రం 30 ఏళ్ల పాటు రామున్ని బహిష్కరించారు. ఎన్నికలకు నాలుగ నెలల ముందు మాత్రమే వారికి శ్రీరాముడు గుర్తుకు వస్తాడు. ఎన్నికలయిపోగానే రామున్ని వదిలేస్తారు. వీరంతా కేవలం వానాకాలంలో మాత్రమే అరిచే కప్పల వంటి వారు. కేవలం బెకబెకమంటారు తప్ప చేతల్లో ఏం ఉండదం’టూ విమర్శించారు. అంతేకాక ప్రస్తుతం రామజన్మభూమి - బాబ్రీ మసీద్ వివాదం సుప్రీంకోర్ట్‌లో పెండింగ్‌లో ఉంది. కోర్టు ఏలాంటి తీర్పు వెలువరించిన దాన్ని అందరూ పాటించాలి అని తెలిపారు. -
మందిర్ కోసం ముస్లింలు ఆ స్ధలం ఇవ్వాలి : రవిశంకర్
సాక్షి, న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి మధ్యవర్తిత్వం నెరపుతానన్న ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్ధాపకులు శ్రీశ్రీ రవిశంకర్ పలు ప్రకటనలు చేస్తున్నారు. తాజాగా అయోధ్యలో రామాలయ నిర్మాణానికి ముస్లింలు భూమిని బహుమతిగా ఇవ్వాలని ఆయన కోరారు. ‘అయోధ్య రాముడి జన్మభూమి అయినందున ఈ ప్రదేశంపై హిందువులకు గట్టి సెంటిమెంట్ ముడిపడిఉందని, ముస్లింలకు ఇది కీలక ప్రాంతం కానందున ఇక్కడ నమాజ్ చేసుకోవడం ఆమోదయోగ్యం కాద’ని రవిశంకర్ వ్యాఖ్యానించారు. ముస్లింలకు అయోధ్య ముఖ్యమైన ప్రదేశం కానందున సదరు స్థలాన్ని హిందువులకు బహుమతిగా ఇవ్వాలని ఆయన సూచించారు. కోర్టు వెలుపల సమస్య పరిష్కారానికి ఈ ప్రతిపాదన ద్వారా మార్గం సుగమమవుతుందన్నారు.సున్నీ, షియా ముస్లిం నేతలను ఇటీవల కలుసుకున్న రవిశంకర్ తాను అయోధ్య వివాద పరిష్కారంపై ప్రభుత్వంతో సంప్రదించడం లేదని, తన ప్రయత్నాలతో అధికార యంత్రాంగానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అయోధ్య వ్యవహారంలో సుప్రీం కోర్టు ఓ వర్గానికి అనుకూలంగా తీర్పు వెలువరిస్తే రక్తపాతం జరుగుతుందని తాను వ్యాఖ్యానించలేదని ఆయన స్పష్టం చేశారు. -
అయోధ్య వివాదంలో సీనియర్ ఐపీఎస్..
సాక్షి, లక్నో : సీనియర్ ఐపీఎస్ అధికారి ఆవేశంలో నోరుజారి ఆ తర్వాత నాలికకరుచుకున్నారు. అయోధ్యలో రామమందిర నిర్మాణం చేపడతామని ప్రతిన బూనిన యూపీ హోంగార్డ్ డైరెక్టర్ జనరల్ సూర్యకుమార్ శుక్లా వివాదానికి కేంద్రబిందువయ్యారు. లక్నోయూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో కొందరు ముస్లిం నేతలతో కలిసి ఆయన ఈ మేరకు ప్రతిజ్ఞ చేశారు. ముస్లిం కార్య సేవా మంచ్ అధ్యక్షుడు ఆజం ఖాన్ సహా పలువురు ముస్లిం నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ శుక్లా దిద్దుబాటు వ్యాఖ్యలు చేశారు. ఏకాభిప్రాయంతోనే రామాలయ నిర్మాణం చేపట్టాలన్నారు. అన్ని మతాల వారి సమ్మతితో ప్రశాంత వాతావరణంలో మందిర నిర్మాణం జరగాలన్న సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా నడుచుకోవాలన్నారు. 1982 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన శుక్లా యూపీ డీజీపీ రేసులో ఉండటం గమనార్హం. మరోవైపు రామజన్మభూమి వివాదంపై సుప్రీం కోర్టు తుది విచారణను ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
కపిల్‌ను టార్గెట్ చేసిన మోదీ
సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్ పార్టీపై ప్రధాని నరేంద్రమోదీ మరోసారి విమర్శలు ఎక్కుపెట్టారు. సుప్రీంకోర్టులో అయోధ్య వ్యవహారాన్ని మరింత ముందుకు జరపాలని కోరిన కపిల్ సిబల్పై ఎందుకు చర్యలు తీసుకోరని ప్రశ్నించారు. మణిశంకర్ అయ్యర్‌ను తొలగించినట్లుగా కపిల్ సిబల్‌ను ఎందుకు తొలగించరని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనను తొలగించిన విషయం తెలిసిందే. అయితే, సుప్రీంకోర్టులో రామ్ మందిర్ విషయం విచారణ జరుగుతున్న సందర్భంలో ఆ కేసును 2019 సాధారణ ఎన్నికలు పూర్తయ్యే వరకు వాయిదా వేయాలంటూ విజ్ఞప్తి చేశారు. దీంతో ఇరుకున పడిన కాంగ్రెస్ ఆయనను గుజరాత్ ఎన్నికల ప్రచారానికి దూరం పెట్టింది. ఈ నేపథ్యంలో గుజరాత్‌లోని కలోల్ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న మోదీ ఎందుకు సిబల్ ఎన్నికలకు రామ్‌మందిర్‌కు ముడిపెట్టారని ప్రశ్నించారు. మణిశంకర్ మీద తీసుకున్న చర్యలే సిబల్పై ఎందుకు కాంగ్రెస్ పార్టీ తీసుకోలేదని ప్రశ్నించారు. -
అయోధ్య వివాదంపై సుప్రీం కీలక సూచన
-
సుప్రీం వ్యాఖ్యలను స్వాగతించిన ఉమాభారతి
న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు కేసు విచారణలో సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర మంత్రి ఉమా భారతి స్వాగతించారు. అయోధ్య వివాదం కోర్టు బయటే పరిష్కారం అవుతుందనే నమ్మకం ఉందని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరిపింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని న్యాయస్థానం సూచనలు చేసింది. అయితే చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. మరోవైపు సుప్రీం వ్యాఖ్యలను షాహి ఇమామ్ బుఖారీ స్వాగతించారు. కాగా అయోధ్యలో రామమందిరం వివాదాన్ని 2019 ఎన్నికలలోపే.. కేంద్ర ప్రభుత్వంతో పాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పరిష్కరించాలని శివసేన నేత సంజయ్ కాంత్ డిమాండ్ చేశారు. -
‘రామమందిరం కోసం మళ్లీ కొత్త ఉద్యమం’
న్యూఢిల్లీ: మధ్యవర్తిత్వం ద్వారా రామ జన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు చేసిన సూచనను బీజేపీ స్వాగతించగా విశ్వహిందూ పరిషత్ మాత్రం తాము మరో సమరానికి సిద్ధమని ప్రకటించింది. మరో కొత్త ఉద్యమాన్ని రామాలయ నిర్మాణం కోసం ప్రారంభిస్తామని స్పష్టం చేసింది. దేశ వ్యాప్తంగా రెండు లక్షల గ్రామాల్లో, ఉత్తరప్రదేశ్‌లోని 70 వేల గ్రామాల్లో రామ మహోత్సవం నిర్వహిస్తామని కూడా విశ్వహిందూ పరిషత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్ జోనల్ అధ్యక్షుడు ఈశ్వరీ ప్రసాద్ చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రాముడు జన్మించిన భూమిలోనే రామమందిరం నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు. రాముడి జీవిత చరిత్రను ప్రజలే చెబుతారని, ఆయోధ్యలో రామమందిరం జరగాల్సిందేననే డిమాండ్‌ను తాము లేవనెత్తుతామని స్పష్టం చేశారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 16 వరకు రామమహోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. జల్లికట్టును ఆర్డినెన్స్ రక్షించగా లేనిది.. అదే ఆర్డినెన్స్‌తో రామమందిరాన్ని ఎందుకు నిర్మించి రక్షించకూడదని ఆయన ప్రశ్నించారు. సంబంధిత మరిన్ని కథనాలకోసం చదవండి.. బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు -
బాబ్రీ మసీదు కేసు: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: వివాదస్పద బాబ్రీ మసీదు కేసు విచారణలో సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. కోర్టు బయట పరిష్కారానికి ఇరుపక్షాలు అంగీకరించాలని కోరింది. బాబ్రీ మసీదు వివాదం మతానికి, సెంటిమెంటుకు సంబంధించిన అంశమని పేర్కొంది. నమ్మకాలకు సంబంధించిన విషయాల్లో కోర్టు బయట పరిష్కారమే శ్రేయస్కరమని తెలిపింది. అవసరమైతే మధ్యవర్తిత్వానికి సిద్ధమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖెహర్ తెలిపారు. బాబ్రీ మసీదు వివాదంపై అత్యవసరంగా విచారణ జరపాలని బీజేపీ సుబ్రమణ్యస్వామి వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు స్పందించింది. పిటిషనర్లు, ప్రతివాదులతో చర్చించి కోర్టు బయట వివాదాన్ని పరిష్కరించుకోవాలని స్వామికి న్యాయస్థానం సూచించింది. చర్చల ద్వారా పరిష్కారం దొరక్కపోతే తాము కల్పించుకుంటామని తెలిపింది. వివాదం పరిష్కారానికి మధ్యవర్తిని నియమిస్తామని ప్రకటించింది. సుప్రీంకోర్టు వ్యాఖ్యలను కేంద్ర ప్రభుత్వం స్వాగతించింది. చర్చల ద్వారా బాబ్రీ మసీదు వివాదం పరిష్కారానికి సిద్ధమని తెలిపింది.