సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌తో ముందుకు రావాలని, మందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని శివసేన శుక్రవారం బీజేపీని డిమాండ్ చేసింది. రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన శివసైనికులను చూసి పాలకులు గర్వపడాలని బీజేపీని దుయ్యబడుతూ వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో రాముడి పేరిట తాము ఓట్లను అభ్యర్ధించమని సామ్నా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది.
అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కోరుతూ నవంబర్ 25న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తమకు తాము హిందుత్వ ప్రతినిధులమని చెప్పుకునే వారు తాము అయోధ్య యాత్రను చేపడుతున్నామని ప్రకటిస్తే ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారని శివసేన ప్రశ్నించింది. తాము రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లడం లేదని సంపాదకీయంలో పేర్కొంది.
తమ పార్టీ ‘ఛలో అయోధ్య’ పిలుపు ఇవ్వలేదని, అయితే రాముడి దర్శనం కోసం శివసైనికులు వెళుతున్నారని, అయోధ్య ఏ ఒక్కరి ప్రైవేటు ప్రాంతం కాదని స్పష్టం చేసింది. మందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటనతో ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమవుతుందని, ప్రగల్బాలు పలికిన నేతలు నాలుకలు కోల్పోతారని సామ్నా సంపాదకీయం హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment