ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేకపోతున్నారు. వచ్చే నెలలో జరగనున్న అంధేరీ(తూర్పు) నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ థాక్రే, షిండే నేతృత్వంలోని బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందని అంతా భావించారు. అయితే.. కీలక ఉప ఎన్నిక నుంచి బీజేపీ తప్పుకుంటున్నట్లు ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. మరోవైపు.. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి అయ్యాక తొలిసారి జరుగుతున్న ఎన్నికలు కావటం గమనార్హం.
పోటీ నుంచి తప్పుకోవాలని మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేనా(ఎంఎన్‌ఎస్) చీఫ్ రాజ్ థాక్రే కోరిన మరుసటి రోజునే ఈ మేరకు ప్రకటన చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రశేఖర్ బవన్‌కులే. ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ సైతం బీజేపీని తప్పుకోవాలని సూచించారు. అలాగే.. ఉద్ధవ్ థాక్రే వర్గం అభ్యర్థికి మద్దతు తెలపాలని ఎన్‌ఎన్‌ఎస్ చీఫ్ కోరారు.
నాగ్‌పూర్‌లో చంద్రశేఖర్ బవన్‌కులే అంధేరీ ఉప ఎన్నిక పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణించినప్పుడు ఆ స్థానంలో వారి బంధువులపై ఎవరూ పోటీ చేయకూడదనే రాష్ట్ర సంప్రదాయం ప్రకారం తమ అభ్యర్థి ముర్జి పటేల్ తప్పుకుంటున్నట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో ఉద్ధవ్ థాక్రే వర్గం ఉప ఎన్నికలో గెలిచేందుకు మార్గం సుగమమైంది. శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే కొన్ని నెలల క్రితం మరణించటంతో ఉప ఎన్నికలు వచ్చాయి. అంధేరీ తూర్పు నియోజకవర్గంలో ఆయన భార్య రుతుజా లాట్కే పోటీ చేస్తున్నారు.
ఇదీ చదవండి: Shiv Sena Symbol: గుర్తులపై కొత్త వివాదం.. అయోమయంలో ఉద్ధవ్, శిండే వర్గాలు
Comments
Please login to add a commentAdd a comment