శిండే వర్గానికి కేటాయించిన గుర్తుపై శనివారం థాణేలో సిక్కుల నిరసన ప్రదర్శన
సాక్షి, ముంబై: శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి, ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిండేకు ఎన్నికల సంఘం కేటాయించిన గుర్తులు కొత్త వివాదానికి కారణమయ్యాయి. దీంతో ఇరువర్గాల అభ్యర్థుల్లో గందరగోళ వాతావరణం నెలకొంది. ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ గుర్తుపై సమతా పార్టీ, శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తుపై సిక్కులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాటిని రద్దు చేయాలని ఎన్నికల సంఘానికి సిఫార్సు చేయడానికి సిద్ధమవుతున్నారు. దీంతో అంధేరీ ఉప ఎన్నిక వివాదాస్పదంగా మారే ప్రమాదం ఏర్పడింది.
అభ్యర్థులకు కొత్త చిక్కులు...
ఠాక్రే వర్గం తరఫున పోటీ చేస్తున్న రుతుజా లట్కే, బీజేపీ తరఫున పోటీచేస్తున్న మూర్జీ పటేల్ శుక్రవారం మధ్యాహ్నం నామినేషన్ వేశారు. శనివారం నుంచి ప్రచారం చేయడం ప్రారంభించారు. కాని గుర్తుల కేటాయింపుపై కొత్త వివాదం తెరమీదకు రావడంతో ఇరు పార్టీల అభ్యర్ధులు అయోమయ స్ధితిలో ఉన్నారు. నవంబర్ మూడో తేదీన తూర్పు అంధేరీ అసెంబ్లీ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగనుంది. అంతకు ముందు నుంచే శివసేన తమదేనంటూ ఉద్ధవ్ వర్గం, కాదు అసలైన వారసులం మేమేనని, మాకే మెజార్టీ ఉందని ఇటు శిండే వర్గం మధ్య వాగ్వాదం మొదలైన సంగతి తెలిసింది. చివరకు ఈ వివాదం సుప్రీం కోర్టుకు వెళ్లింది. కాని సుప్రీం కోర్టు ఈ వివాదం పరిష్కరించే బాధ్యతలు ఎన్నికల సంఘానికే కట్టబెట్టింది. దీంతో తదుపరి ఆదేశాలు జారీ అయ్యేంత వరకు శివసేన పేరు గాని, విల్లు–బాణం (ధనుశ్య–బాణ్) గుర్తుగాని ఎవరూ, ఎక్కడా వినియోగించరాదని ఎన్నికల సంఘం హెచ్చరించింది.
అంతేగాకుండా మూడు గుర్తులు, మూడు పార్టీ పేర్లు మీరే సూచించాలని ఎన్నికల సంఘం పేర్కొంది. ఆ మేరకు ఉద్ధవ్, శిండే వర్గాలు మూడు పార్టీ గుర్తులు, మూడు పార్టీ పేర్ల చొప్పున సూచించడంతో అందులోంచి ఠాక్రే వర్గానికి కాగడ, శిండే వర్గానికి కత్తులు–డాలు (తల్వార్–డాల్) కేటాయించిన విషయం తెలిసిందే. కాని మత సామరస్యాలకు సంబంధించిన గుర్తులు కేటాయించరాదని ఎన్నికల సంఘానికి నియమాలున్నాయి. ఆ ప్రకారం శిండే వర్గానికి కేటాయించిన కత్తులు–డాలు గుర్తు సిక్కు సమాజానికి ప్రతీకగా ఉన్నాయి. అదేవిధంగా ఉద్ధవ్ వర్గానికి కేటాయించిన కాగడ (మషాల్) గుర్తు 1996 నుంచి తమ వద్దే ఉందని సమతా పార్టీ పేర్కొంది. దీంతో మా పార్టీ గుర్తును మరో పార్టీకి ఎలా కేటాయిస్తారంటూ రద్దు చేయాలని డిమాండ్ చేస్తోంది.
చదవండి: మనీష్ సిసోడియాను రేపు సీబీఐ అరెస్ట్ చేస్తుంది: ఆప్ సీనియర్ నేత
మరోపక్క అప్పట్లో శిండే సూచించిన త్రిశూలం గుర్తు మత సామరస్యానికి సంబంధించినదంటూ కేటాయించలేదు. సిక్కులకు ప్రతీకగా ఉన్న కత్తులు–డాలు గుర్తు కూడా అదే కోవకు చెందినదంటూ, దీంతో ఆ గర్తును రద్దు చేయాలని సచ్‌ఖండ్ గురుద్వార్‌కు చెందిన మాజీ సభ్యుడు రంజీత్ కామ్‌టేకర్ ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అంతేగాకుండా కాగడ గుర్తు రద్దు చేయడమేగాకుండా దీనిపై స్పష్టమైన ఆదేశాలివ్వలంటూ సమతా పార్టీ ఢిల్లీలోని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయనుంది. దీనిపై కోర్టు ఏం నిర్ణయం తీసుకుంటుందనేది వేచిచూడాల్సిందే. మరోపక్క రంజీత్ కామ్‌టేకర్ రాసిన లేఖపై ఎన్నికల సంఘం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది కూడా ఆసక్తిగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment