
ముంబై: మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతూ ఏక్‌నాథ్ షిండే వర్గం తిరుగుబాటు చేసిన తర్వాత తొలి విజయాన్ని అందుకుంది ఉద్ధవ్ థాక్రే వర్గం. ముందునుంచి ఊహించినట్లు అంధేరీ నియోజకవర్గాన్ని థాక్రే నేతృత్వంలోని శివసేన కైవసం చేసుకుంది. ముంబైలోని అంధేరీ(ఈస్ట్) నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో శివసేన అభ్యర్థి రుతుజా లాట్కే 66వేల భారీ మెజారిటీతో విజయ ఢంకా మోగించారు.
రుతుజా లాట్కేకు మద్దతుగా పలు పార్టీల అభ్యర్థనతో ఈ పోటీ నుంచి బీజేపీ తప్పుకుంది. దీంతో లాట్కే విజయం లాంఛనప్రాయంగానే మారింది. ఊహించినట్లుగానే ఆమెకు భారీ మెజారిటీ కట్టబెట్టారు ఓటర్లు. అయితే, ఇక్కడ ఓటర్లు ఓ సర్‌ప్రైజ్ ఇచ్చారు. రుతుజా లాట్కేపై పోటీ చేసిన ఆరుగురు అభ్యర్థులకు వచ్చిన మొత్తం ఓట్లకన్నా నోటా(NOTA)కే ఎక్కువ ఓట్లురావటమే సర్‌ప్రైజ్‌గా చెప్పాలి.
శివసేన ఎమ్మెల్యే రమేశ్ లాట్కే ఈ ఏడాది మే నెలలో మరణించారు. దీంతో అంధేరీ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అనివార్యమయ్యాయి. ముందుగా ఇక్కడ బీజేపీ పోటీ చేయాలని భావించింది. అయితే, ఎన్‌సీపీ సహా పలు పార్టీలు పోటీ నుంచి తప్పుకోవాలని, రమేశ్ లాట్కే భార్యకు అవకాశం ఇవ్వాలని కోరాయి. దీంతో బీజేపీ తప్పుకుంది. బీఎంసీలో క్లర్క్‌గా పని చేస్తున్న లాట్కే.. ఆమె రాజీనామాను ఆమెదించిన తర్వాతే నామినేషన్ వేసేందుకు కోర్టు అంగీకరించింది.
ఇదీ చదవండి: క్రైమ్ షోల ఎఫెక్ట్.. కుటుంబాన్ని గొడ్డలితో నరికి చంపిన బాలుడు
Comments
Please login to add a commentAdd a comment