Shiv Sena chief
-
ఉద్ధవ్ ఠాక్రేతో ప్రశాంత్ కిశోర్ భేటీ
ముంబై: జనతాదళ్(యు) ఉపాధ్యక్షుడు, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రేతో భేటీ అయ్యారు. సేన– బీజేపీ సంబంధాలు దిగజారిన నేపథ్యంలో ఈ ఎన్డీఏ కూటమి పార్టీల నేతల సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. అయితే, ఈ సమావేశంలో చర్చించిన వివరాలను వెల్లడించేందుకు శివసేన నిరాకరించింది. ‘ఎన్డీఏలో భాగంగానే, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు మహారాష్ట్రలో మీతో కలిసి పనిచేయాలని ఉంది’ అంటూ ప్రశాంత్ కిశోర్ అంతకుముందు ట్విట్టర్లో పేర్కొనగా ఆయన్ను ముంబైలోని శివసేన కార్యాలయం ‘మాతోశ్రీ’కి ఆహ్వానిస్తూ శివసేన యువజన విభాగం అధ్యక్షుడు ఆదిత్య థాకరే బదులిచ్చారు. ఉద్ధవ్, ప్రశాంత్ కిశోర్‌ల భేటీ ఫొటోలను ఆదిత్య థాకరే ట్విట్టర్లో ఉంచారు. శివసేన మహారాష్ట్రలోని బీజేపీ ప్రభుత్వంతోపాటు కేంద్రంలోనూ భాగస్వామిగా ఉంది. -
మందిర్ వివాదం: బీజేపీకి సేన అల్టిమేటం
సాక్షి, ముంబై : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ఆర్డినెన్స్‌తో ముందుకు రావాలని, మందిర నిర్మాణ తేదీని ప్రకటించాలని శివసేన శుక్రవారం బీజేపీని డిమాండ్ చేసింది. రామ జన్మభూమిలో బాబ్రీ మసీదును ధ్వంసం చేసిన శివసైనికులను చూసి పాలకులు గర్వపడాలని బీజేపీని దుయ్యబడుతూ వ్యాఖ్యానించింది. ఎన్నికల్లో రాముడి పేరిట తాము ఓట్లను అభ్యర్ధించమని సామ్నా సంపాదకీయంలో శివసేన స్పష్టం చేసింది. అయోధ్యలో రామ మందిర నిర్మాణం చేపట్టాలని కోరుతూ నవంబర్ 25న శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అయోధ్యను సందర్శిస్తున్న సంగతి తెలిసిందే. తమకు తాము హిందుత్వ ప్రతినిధులమని చెప్పుకునే వారు తాము అయోధ్య యాత్రను చేపడుతున్నామని ప్రకటిస్తే ఎందుకు కలవరపాటుకు గురవుతున్నారని శివసేన ప్రశ్నించింది. తాము రాజకీయ ప్రయోజనాల కోసం అక్కడికి వెళ్లడం లేదని సంపాదకీయంలో పేర్కొంది. తమ పార్టీ ‘ఛలో అయోధ్య’ పిలుపు ఇవ్వలేదని, అయితే రాముడి దర్శనం కోసం శివసైనికులు వెళుతున్నారని, అయోధ్య ఏ ఒక్కరి ప్రైవేటు ప్రాంతం కాదని స్పష్టం చేసింది. మందిర నిర్మాణంపై స్పష్టమైన ప్రకటనతో ముందుకు రాకపోతే 2019 ఎన్నికల్లో బీజేపీ అధికారానికి దూరమవుతుందని, ప్రగల్బాలు పలికిన నేతలు నాలుకలు కోల్పోతారని సామ్నా సంపాదకీయం హెచ్చరించింది. -
బాల్థాకరేగా నవాజుద్దీన్ సిద్ధిఖీ
సాక్షి, న్యూఢిల్లీ: బాల్‌థాకరే బయోపిక్‌లో ప్రముఖ బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ టైటిల్ రోల్ పోషించనున్నారు. నిర్మాణ దశలో ఉన్న ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ను ఈనెల 21న విడుదల చేయనున్నారు. ఫస్ట్‌లుక్ లాంఛ్ సందర్భంగా మూవీకి సంబంధించిన ఆసక్తికర అంశాలు వెలుగుచూడనున్నాయి. అత్యంత ఆర్భాటంగా జరగనున్న ఫస్ట్‌లుక్ లాంఛ్‌కు బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ముఖ్యఅతిధిగా హాజరవనున్నారు. ఈ బయోపిక్కు రాజ్యసభ ఎంపీ, శివసేన అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ స్ర్కిప్ట్ సమకూర్చుతున్నారు. నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్టుపై సంజయ్ రౌత్ పనిచేస్తున్నారు. బాల్ థాకరేతో తనకున్న సుదీర్ఘ అనుబంధంతో ఆయనకు సంబంధించిన విషయాలన్నీ తనకు తెలుసని, వీటిని ప్రజారంజకంగా తెరకెక్కిస్తానని రౌత్ చెప్పారు. బాల్ థాకరే కుటుంబ సభ్యులు సహా ఏ ఒక్కరి జోక్యం లేకుండా మూవీని వాస్తవాల ఆధారంగా తెరకెక్కించేందుకు ప్రయత్నించానని చెప్పుకొచ్చారు. -
‘పాక్‌ను ముక్కలు ముక్కలు చేయండి’
ముంబై: భారత సైనికుల తలలు నరికిన పాకిస్తాన్‌ను ముక్కలుగా చేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోదీని కోరారు. బీజేపీ కేవలం తమ పార్టీనే కాకుండా దేశాన్ని కూడా పటిష్టం చేసేందుకు పనిచేయాలని సూచించారు. ‘పాకిస్తాన్లోకి వెళ్లి వాళ్లను ముక్కలు ముక్కలు చేయండి. శివసేన ప్రధానికి మద్దతుగా ఉంటుంద’ ని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్ధవ్ అన్నారు. మే 1న ఇద్దరు భారత సైనికులను పాకిస్తాన్ సైన్యం అత్యంత పాశవికంగా హత్య చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమేనని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉంటే, మహారాష్ట్ర నిరుపయోగి(పనికి రాని) ప్రభుత్వం ఉందని సొంత కూటమిపైనే నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ... ఎవరైనా రైతులకు అనుకూలంగా మాట్లాడితే వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు. -
ఆస్పత్రిలో శివసేన చీఫ్
ముంబై: శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే బుధవారం ఆస్పత్రిలో చేరారు. సాధారణ వైద్య పరీక్షల కోసమే బాంద్రాలోని లీలావతి ఆస్పత్రిలో ఆయన చేరారని, ఈరోజే డిశ్చార్జ్ చేసే అవకాశముందని శివసేన అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. కార్యకర్తలు, అభిమానులు ఆందోళన పడొద్దని కోరారు. ఆయనకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని వైద్యులు తెలిపారు. థాకరేకు గుండె, కాలేయ సంబంధ పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. కొన్నేళ్ల క్రితం ఇదే ఆస్పత్రిలో ఆయన యాంజియోప్లాస్టీ చేయించుకున్నారు. ఈ సాయంత్రం ఆయనను డిశ్చార్జ్ చేస్తామని లీలావతి ఆస్పత్రి ఆపరేషన్స్ అండ్ సప్లై డైరెక్టర్ అజయ్ కుమార్ పాండే తెలిపారు. -
15 ఏళ్లలో ఏం చేశారు?
♦ ప్రతిపక్షాలకు ఉద్ధవ్ సూటి ప్రశ్న ♦ అధికారంలో ఉన్నప్పుడు రుణమాఫీ చేయలేదేం? ♦ రైతుల తరఫున తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం ముంబై : రైతు రుణాలు మాఫీ చేయలేదని అసెంబ్లీ సమావేశాలు జరగకుండా అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు, గత 15 ఏళ్లలో ఏం చేశాయని శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మండిపడ్డారు. శాసనమండలి సమావేశాలను విపక్షాలు అడ్డుకుంటుండటంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉద్ధవ్, రైతు రుణమాఫీ చేయాలని డిమాండు చేస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో ఉన్నపుడు ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ‘గత 15 ఏళ్లుగా మీరు అధికారంలో ఉన్నారు. మరి మీరెందుకు రుణమాఫీ చేయలేదు? ఎందుకీ నాటకాలు?’ అని నిలదీశారు. ‘ప్రతిపక్షాల పాఠాలు మాకు అవసరం లేదు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే రైతు రుణాల కోసం పోరాటాలు చేశాం. ప్రభుత్వాన్ని ఎలా నడపాలా మీ నుంచి నేర్చుకోవాల్సిన గత్యంతరం మాకు పట్టలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షం ప్రతిపక్షంలా ప్రవర్తిస్తే మంచిదని సూచించారు. రైతుల పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోందని నాసిక్‌లో ఉద్ధవ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. -
వారసులదే రాజ్యం!
కీలక పదవులు చేపట్టింది నేతలు, వారి కుటుంబసభ్యులే తాజా లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురి పోటీ సాక్షి, ముంబై: రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలే రాజ్యమేలుతున్నాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు 30కి పైగా కుటుంబాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి, ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్‌తో పాటు దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే, మాజీ సీఎం అశోక్ చవాన్, బీజేపీ నాయకుడు గోపీనాథ్ ముండే, దివంగత నేత ప్రమోద్ మహాజన్ తదితర నేతల వారసులు రాజకీయ రంగంలోకి అడుగిడారు. వీరిలో కొందరైతే తండ్రి, కుమారులు కూడా ముఖ్యమంత్రితో పాటు కీలక మంత్రి పదవులను చేపట్టినవారు ఉన్నారు. ఇప్పుడు జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లోనూ పలువురు నేతలు, వారి వారసులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ‘పవర్’ ఫుల్... రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో పవార్ కుటుంబం కీలకపాత్ర పోషిస్తోంది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ దేశంలోని ప్రముఖ నాయకులలో ఒకరిగా గుర్తింపు పొందారు. ఈయనకు తల్లి నుంచి రాజకీయ వారసత్వం లభించింది. ఆయన ప్రస్తుతం యూపీఏ ప్రభుత్వంలో వ్యవసాయశాఖ మంత్రిగా ఉండగా, ఆయన సోదరుని కుమారుడు అజిత్ పవార్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం బారామతి లోక్‌సభ నియోజకవర్గం ఎంపీగా ఉన్న ఆయన కూతురు సుప్రియా సూలే మళ్లీ ఈసారి ఎన్నికల బరిలో దిగారు. తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రులుగా... రాష్ట్ర రాజకీయాలలో తండ్రి కుమారులిద్దరు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనత చవాన్ కుటుంబీకులకు దక్కింది. దివంగత శంకర్రావ్ చవాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. కేంద్రంలో రక్షణమంత్రిగా కూడా విధులు నిర్వహించారు. ఆయన వారసుడైన అశోక్ చవాన్ కూడా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు. ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటన అనంతరం రాష్ట్రంలో మంత్రి పదవులతో పాటు పలు కీలక బాధ్యతలు నిర్వహించిన అశోక్ చవాన్‌కు ముఖ్యమంత్రి పదవి వరించింది. అయితే ఆదర్శ్ కుంభకోణంలో ఆయన పేరు రావడంతో పదవికి రాజీనామా చేశారు. ప్రస్తుతం నాందేడ్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. రాష్ట్రంలో హవా ఠాక్రే లదే... శివసేన పార్టీ ఠాక్రే కుటుంబీకులకే వారసత్వంగా లభించింది. ఠాక్రే కుటుంబీకులు ఇంత వరకు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు. అయితే పార్టీతో పాటు రాష్ట్ర రాజకీయాలను తెరవెనుక నుంచే నడిపిస్తున్నారు. దివంగత శివసేన అధినేత బాల్‌ఠాక్రే శివసేన పార్టీ స్థాపించారు. ఆయన తర్వాత ఉద్ధవ్ ఠాక్రేను వారసుడుగా ప్రకటించడంతో బాల్‌ఠాక్రే సోదరుని కుమారుడైన రాజ్ ఠాక్రే శివసేన నుంచి బయటకు వెళ్లి మహారాష్ట్ర నవనిర్మాణ సేన పార్టీని ఏర్పాటు చేశారు. మరోవైపు బాల్‌ఠాక్రే మనుమడు, ఉద్ధవ్‌ఠాక్రే కుమారుడైన ఆదిత్య ఠాక్రే కూడా రాజకీయాల్లో రంగప్రవేశం చేశారు. ఈసారి ఎన్నికల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తున్నారు. దేశ్‌ముఖ్ కుటుంబీకులు... దివంగత మాజీ ముఖ్యమంత్రి విలాస్‌రావ్ దేశ్‌ముఖ్ వారసులు కూడా రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎనిమిదన్నరేళ్లు ముఖ్యమంత్రిగా కొనసాగిన విలాస్‌రావ్, ముంబై 26/11 ఉగ్రవాదుల దాడుల ఘటనతో పదవికి రాజీనామా చేశారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆయనకు కేంద్రమంత్రి పదవిని అప్పగించింది. ఆయ న మరణించిన తర్వాత కుమారుడు అమిత్ దేశ్‌ముఖ్, సోదరుని కుమారుడు దిలీప్ దేశ్‌ముఖ్ రాజకీయాల్లో రాణిస్తున్నారు. ముండే కుటుంబీకులు.. బీజేపీ సీనియర్ నాయకుడైన గోపీనాథ్ ముండే కూడా రాష్ట్రంతోపాటు దేశ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. సోదరుని కుమారుడు ధనంజయ్ ముండేతోపాటు ఆయన కుమార్తె పంకజా ముండేలు ప్రస్తుతం రాష్ట్రంలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు. అయితే గోపీనాథ్ ముండేతో వచ్చిన విభేదాల వల్ల ధనంజయ్ ముండే ఎన్సీపీలో చేరారు. మరోవైపు దివంగత ప్రమోద్ మహా జన్ కుమార్తె పూనమ్ మహాజన్ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో వాయవ్య ముంబై నుంచి మహాకూటమి అభ్యర్థినిగా పోటీ చేస్తున్నారు. దివంగత మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ కుటుంబీకులలో ఆయన భార్య శాలినీతాయి పాటిల్, కుమారుడు ప్రతీక్, మనుమడు మదన్ పాటిల్‌కు మంత్రి పదవులు లభించాయి. ప్రస్తుత అటవీశాఖ మంత్రి పతంగ్‌రావ్ కదం కుమారుడు విశ్వజీత్ కదంను పుణే లోక్‌సభ నుంచి బరిలో ఉన్నారు. రాష్ట్ర మంత్రి నారాయణ రాణే, ఆయన కుమారుడు నీలేష్ రాణే రాజకీయాల్లో రాణిస్తున్నారు. ఎన్సీపీ సీనియర్ నాయకుడు గణేష్ నాయక్‌తోపాటు ఆయన కుమారులు సంజీవ్ నాయక్, సందీప్ నాయక్‌లతోపాటు ఆయన సోదరుని కుమారుడు సాగర్ నాయక్‌లు రాజకీయాల్లో రాణిస్తున్నారు. సందీప్ నాయక్ ఎమ్మెల్యేగా, సంజీవ్ నాయక్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఈసారి కూడా సంజీవ్ లోక్‌సభ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. మొత్తంగా చూస్తే రాష్ట్రంలో వారసత్వ రాజకీయాలు జోరుగానే సాగుతున్నట్టు కనబడుతోంది.