‘పాక్‌ను ముక్కలు ముక్కలు చేయండి’
ముంబై: భారత సైనికుల తలలు నరికిన పాకిస్తాన్‌ను ముక్కలుగా చేయాలని శివసేన అధినేత ఉద్ధవ్ థాక్రే ప్రధాని మోదీని కోరారు. బీజేపీ కేవలం తమ పార్టీనే కాకుండా దేశాన్ని కూడా పటిష్టం చేసేందుకు పనిచేయాలని సూచించారు. ‘పాకిస్తాన్‌లోకి వెళ్లి వాళ్లను ముక్కలు ముక్కలు చేయండి. శివసేన ప్రధానికి మద్దతుగా ఉంటుంద’ ని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉద్ధవ్ అన్నారు. మే 1న ఇద్దరు భారత సైనికులను పాకిస్తాన్ సైన్యం అత్యంత పాశవికంగా హత్య చేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
మధ్యంతర ఎన్నికలకు తమ పార్టీ సిద్ధమేనని ఉద్ధవ్ థాక్రే తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లో యోగి ప్రభుత్వం ఉంటే, మహారాష్ట్ర నిరుపయోగి(పనికి రాని) ప్రభుత్వం ఉందని సొంత కూటమిపైనే నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో వ్యవసాయ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ... ఎవరైనా రైతులకు అనుకూలంగా మాట్లాడితే వారిని ప్రభుత్వ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నారని అన్నారు.